మొన్నామధ్య "బుడుగోయ్" గారి బ్లాగులో అనుకుంటాను, ద్వా.నా.శాస్త్రి గారు కవులను, కవిత్వాన్ని నిబద్ధ-అనిబద్ధ అని రెండు రకాలుగా వర్గీకరించినట్లు బొల్లోజు బాబాగారు చెప్పారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ వ్రాసిన కవులను, వారి కవిత్వాన్ని "నిబద్ధం" గాను, తద్విరుద్ధమైన కవులను, కవిత్వాన్ని "అనిబద్ధం"గాను వర్గీకరించినట్లుగా నాకర్ధమయ్యింది.
సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి, అసంబద్ధమైన ఇటువంటి వర్గీకరణలకు పాల్పడే మన విమర్శకులనోసారి ఖండించటం కూడా అవసరమే. ఆ చేత్తోనే మరో మొట్టికాయ మన "కవులకు" కూడా. స్వచ్చమైన కవిత్వం దాదాపు మృగ్యమయ్యింది ఈరోజు. అటు ఛందోబద్ధ కవిత్వమైనా, ఛందోబద్ధం కాని కవిత్వమైనా ఇదే ధోరణి. కవిత్వాన్ని భ్రష్టుపట్టించటంలో ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. అక్కడక్కడ "సుప్రభ" గారి లాంటివారు తప్పించి, ఆటవెలది, తేటగీతులు తెలిసినంత మాత్రానే పండితులుగా పరిగణించబడుతున్నారు. ఇటు, మహాప్రస్థానమో, అమృతం కురిసిన రాత్రో చదివి కలం పట్టేసుకొని కవులమనుకునే ప్రబుద్ధులకూ కొదవలేదు.
అసలు నిబద్ధత అంటే ఏమిటి? ఏసీ గదిలో కూర్చొన్నా, కవిత్వం వ్రాయని రోజు చెమటలు పట్టినట్లుంటుంది అని ప్రకటించే సినారె గారు అదే ఏసీ గదిలో రిక్షావాడి మీదో, రైతు కూలీ మీదనో నాలుగైదు పేజీలు గిలికితే, ఆయన నిబద్ధ కవి కింద చలామణి అయినట్లేనా? ఆ నాలుగైదు పేజీల మీద ఓ నలభై పేజీల "తందనాతానా"లు వ్రాసే డి.ఎన్ శాస్త్రులు నిబద్ధత కలిగిన విమర్శకులుగా పరిగణించబడతారా?
సమాజాన్ని గాలికొదిలేసి, అదే గాలిలో మమేకమై, రాత్రి వచ్చిన రహస్యపు వానలో కప్పల నిశ్శబ్దాన్ని మనకు చూపించే ఇస్మాయిల్ కవిత్వంలో నిబద్ధత లేదా! నినాదాలకే పరిమితమయ్యే నిబద్ధత, కవిత్వం కాగలుగుతుందా? ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి. ఆ సందేహాల మధ్య మళ్ళీ ఇస్మాయిల్ కవిత్వాన్ని చదివితే, నిజమైన మహాకవి - ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించిన శ్రీశ్రీని మించిన నిబద్ధుడైన కవిగా నాకు ఇస్మాయిల్ కనిపించారు. కావాలంటే, ఇస్మాయిల్ వ్రాసిన కొన్ని పద్యాలు చూడండి.
కప్పల నిశ్శ్బదం నుండి :
కాలువ బలిసింది
తన విధులు మరిచింది
వంతెనకి నీడ చూపించటంలేదు
కీచు రాయి చప్పుడుతో
గదంతా నిండిపోయింది
గదిలో నాకు చోటు లేదు
పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది
మళ్ళీ ఎన్ని వందల కాళ్ళవసరమో!
ఊరు నిద్దరోయాక
చెరువు మేల్కొంది.
అర్వాత ఎవరికీ నిద్ర లేదు
ముందు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరించింది చీకటి
చెరువు.
చెరువులో ప్రతిబింబాలు
వాటిని అనుకరిస్తూ గట్టుపై చెట్లు
చెరువు లేకపోతే
చెట్ల నీడల్ని
ఎవరు చేరదీస్తారు?
ఇవి చాలా కొన్ని మాత్రమే. అన్వయించుకోగలిగిన తెలివితేటలు ఉంటే, పైన చెప్పిన ఒక్కో పద్యము సామాజికతనే చెబుతున్నది, చెంప ఛెళ్ళుమని మోగిస్తున్నది.
మన పరిణతికి అనుగుణంగా మనం కవిత్వాన్ని చదివి ఊరుకుంటే బానే ఉంటుంది. అంతేకానీ, అర్ధంపర్ధంలేని వర్గీకరణలతో కవుల గుంపులు తయారు చేయటం వలన ఉపయోగం ఉండదు. కేవలం, పరిమితమైన అవగాహన వల్ల, ఆలోచనా పరిమితుల వలన మాత్రమే ఇలాంటి వర్గీకరణలు చేయటం జరుగుతుంది. వీరి ఆలోచనలో, నినాదాలు గుప్పించి వ్రాసే ప్రతిదీ "నిబద్ధ కవిత్వమనే"!
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అంటే, ఎక్కడికా పోయేది అన్న ఆలోచనే కలుగుతుంది.
ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అంటే, ఆలోచన అక్కడే ముగిసిపోతుంది.
మూల పడి ఉంది గొడుగు
వానలొస్తే కానీ
ఇది వికసించదు
అన్న పై వాక్యాల్లో ఆలోచిస్తున్న కొద్దీ అనేక అర్ధాలు స్ఫురిస్తాయి. ఇదీ నిబద్ధమైన కవిత్వం అంటే. చదువుకునేవాడికి ఆహ్లాదం కావాలంటే అంతవరకే కలిగిస్తుంది. ఆలోచించే వాడికి, సామాజిక అవసరాన్ని కూడా పై కవిత్వం గుర్తు చేస్తుంది. ఇస్మాయిల్ శ్రీశ్రీలా "నిబద్ధ కవి" కాదంటారా?
Friday, October 30, 2009
ఇస్మాయిల్ నిబద్ధ కవి కాదా?
Friday, October 9, 2009
ఒబామా కాదు, మన్మోహన్ సింగే నిజంగా అర్హుడు
మొన్న మన రాష్ట్రస్థాయిలో, కడప జిల్లా పేరు వైయస్సార్ గా మార్చినందుకే చాలా ఆశ్చర్యమేసిందనుకుంటే, ఇప్పుడు ఒబామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించటం అంతకు మించిన ఆశ్చర్యాన్ని కలిగించింది. యుద్ధకాముకుడైన బుష్ నుంచి పగ్గాలు స్వీకరించిన ఒబామా ఈ సంవత్సర కాలంలో ప్రపంచ శాంతికి ఏరకంగా దోహదపడ్డాడో నాకైతే అర్ధం కాలేదు.
ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ల పరిస్థితుల్లో మార్పు లేదు. నిన్నటికి మొన్న, పాకిస్తాన్ పూర్వ రాష్ట్రపతి ముషర్రాఫ్ తన హయాంలో ఏవిధంగా అమెరికా సహాయాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించారో చెప్పినా, రెండు రోజుల తర్వాతే పాకిస్తాన్ కు మరింత సహాయాన్ని ప్రకటించిన ఒబామా ప్రభుత్వం ప్రపంచ శాంతిని ఏరకంగా ఉద్ధరించిందో!
మహాత్మా గాంధిని, మార్టిన్ లూథర్ కింగ్ ను మాటిమాటికి జ్ఞప్తికి తెచ్చుకోవటమే ప్రపంచశాంతికి దోహదపడటమైతే, మన దేశంలో ఇంతకు వందింతలమందికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే, ఒబామా కన్నా, మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు.
ఇటు సరిహద్దుల్లో పాకిస్తాన్ సాగిస్తున్న కాల్పులపై నోరు మెదపడు. అటు, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాటుపై పెదవి విప్పడు. దేశం నడిమధ్యలో తీవ్రవాదుల ఘాతుకంపై అడిగినా అదే చూపు, పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్షపడ్డ అఫ్జల్ గురు గురించి అడిగినా అదే చూపు. చివరాఖరికి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు బెదిరించే పోకడలు పోతున్నా కిమ్మనడు. ఏంతో శాంతికాముకుడైతే తప్ప, సామాన్యులు అలా స్థితప్రజ్ఞత చూపలేరు.
మన కాంగ్రెస్ పార్టీ, అణు ఒప్పందం విషయంలో ఎలాగైతే లాబీయింగ్ నడిపిందో, అలానే, మన ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి కోసం లాబీయింగ్ చేస్తే బాగుంటుంది.

Subscribe to:
Posts (Atom)