Wednesday, August 26, 2009

భారతీయ జనతా పార్టీ - ఓ ప్రహసనం

మహాత్ముని అభీష్టానికి వ్యతిరేకంగా, ఎన్నికల రాజకీయాల్లో దిగాలనే నెహ్రూ తలంపుకు తలొగ్గిన కాంగ్రెస్, స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయాలను దాదాపు మూడు దశాబ్దాలపాటు అడ్డు లేకుండా శాసించింది. నామమాత్రపు ప్రతిపక్షాలతో కాంగ్రెస్ చెప్పిందే వేదమయ్యింది. పార్టీని బలోపేతం చేయాలనే తలంపుతో, ఉన్న వైరిపక్షాలను కూడా అణగదొక్కే ప్రక్రియలు కూడా ఆనాటి నుంచే కాంగ్రెస్ ప్రారంభించింది.

దేశంలోనే మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేయగలిగిన నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేసేంతవరకూ నెహ్రూ నిద్రపోలేదంటే నమ్మటానికి కష్టమే. కానీ, అది చారిత్రక సత్యం. ఆ పెడధోరణుల వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ దాదాపుగా కొనసాగించింది. ఈ రాజకీయ వికృతత్వం చివరికి దేశంలో అత్యవసర పరిస్థితికి కూడా దారి తీసింది. దాదాపుగా ప్రతిపక్షమనే మాటే వినబడకుండా దేశాన్ని ఏలాలనే ఇందిర నిరంకుశత్వ ధోరణి ఆ అత్యవసర పరిస్థితికి మూలకారణం.

సరే, ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీ ఏర్పాటు కావటం జరిగింది. అప్పటి జనసంఘ్ ఆ క్రమంలోనే జనతా పార్టీలో భాగమయ్యింది. అప్పటి ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసిన జనతా పార్టీ, సద్దుమణగని అంతర్గత వివాదాల, నేతల అధికార దాహాల మధ్య ఒక ప్రయోగంగానే విఫలమైంది. ఎవరు తెచ్చుకున్న కుంపట్లు వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ సొంత కాపురాలు పెట్టుకోవటం కూడా జరిగింది. అనాటి జనసంఘ్, అవే ఆదర్శాలతో ఇప్పటి 'భారతీయ జనతా పార్టీగా' రూపాంతరం చెందింది.

అరువు తెచ్చుకున్న ఆదర్శాలతో, వామపక్షాలు కూడా ఒకటి రెండు రాష్ట్రాలు మినహా కాంగ్రెస్ కు సరి అయిన ప్రత్యామ్నాయం కాలేకపోయారు. దానికితోడు వామపక్షాల మధ్య ఉన్న విభేదాలు కాంగ్రెస్ అనుకూలంగా మలచుకోవటంలోనూ కృతకృత్యమయ్యింది. నైతికవిలువలతో, నైతికాదర్శాలతో రాజకీయాల్లో దూసుకెళదామని వచ్చిన భా.జ.పా. కూడా ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.

జన్ సంఘ్ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న హిందువులను 'లౌకిక ఆదర్శాల' పేరుతో వంచిస్తున్న కాంగ్రెస్ కు ధీటైన ప్రతిపక్షంగా నిలవాలంటే, మెజారిటీ అభిప్రాయాలను గౌరవించాలని భా.జ.పా. గ్రహించేటప్పటికే దాదాపుగా ఒక దశాబ్దం పట్టింది. ఆ సమయంలో పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న అద్వాని హిందుత్వ ఏజెండాతో మొదలు పెట్టిన 'రామ్ రథ్ యాత్ర' కు దేశప్రజలు నీరాజనాలు అర్పించారు. అప్పటివరకూ నామమాత్రపు పార్టీగా ఉన్న భా.జ.పా. కొన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టటమే కాక, 1991 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది.

ఇక అసలు ప్రహసనం మొదలయ్యింది 1996 ఎన్నికల తర్వాత. పదమూడు రోజుల ప్రధాని పదవి అనుభవించిన వాజ్ పేయి తదితర నాయకులు, ఆ స్థాయికి చేర్చిన హిందువులను మరచిపోయింది ఆ సమయంలోనే. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని పదవి పగ్గాలే ధ్యేయంగా అవకాశవాద పార్టీలతో అవకాశవాద పొత్తులు పెట్టుకొని మూల సిద్ధాంతాలను కాలదన్నింది 1998 ఎన్నికల సమయంలో.

అధికార దాహం, పదవీ లాలసత ఎంతటివారినైనా దుర్బలులని చేస్తుంది అనటానికి ప్రత్యక్ష తార్కాణం వాజ్ పేయి, అద్వానీ తదితర నేతలు. హిందుత్వ ఏజెండాతో అద్వానీ చేపట్టిన రామ్ రథ్ యాత్రకు అడ్డు చెప్పని వాజ్ పేయి ఆ తర్వాత అయోధ్య విషయంలోను, గోథ్రా మారణకాండ నేపథ్యంలోనూ కొనసాగించిన రాజకీయాలు కేవలం పదవిని నిలుపుకోటానికి పడిన తాపత్రయంగానే కనిపిస్తుంది. అటువంటి రాజకీయాలు చేసి 'లౌకికవాది'గా ముద్ర వేయించుకోవాలనే తపనే కనిపిస్తుంది.

అత్యధిక స్థానాలు గెలిపించిన హిందువులను కాదని, కొసరు పార్టీల సహకారంతో అధికారపు అందలం ఎక్కిన భా.జ.పా., హిందువులకు చేసింది శూన్యం. 1998లో తాకట్టు పెట్టిన సిద్ధాంతాలను 2004 ఎన్నికలకు బయటకు తీసినా హిందువులు నమ్మలేదు. హిందువులు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలనుకున్నారే కానీ, కాంగ్రెస్ కు కాంగ్రెస్ లాంటి పార్టీనే ప్రత్యామ్నాయం కావాలనుకోలేదు.

ఈ నీచ రాజకీయాలను ఛీత్కరిస్తూ తదుపరి ఎన్నికలలో కూడా హిందువులు భా.జ.పా.కు బానే బుద్ధి చెప్పారు. రక్తాన్ని మరిగిన పులిలా, అధికారానికి అయిదేళ్ళు అలవాటుపడ్డ భా.జ.పా. నేతలు ఆ అధికారం చేజిక్కించుకోటానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలలో భాగంగానే సిద్ధాంతాల రాద్ధాంతం మొదలయ్యింది. ఇదంతా ముసుగులో గుద్దులాటగానే సాగింది గత అయిదేళ్ళల్లో. ఇప్పుడు మాత్రం తెరపైనే ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ జన్మకోసారైనా ప్రధాని కావాలనుకునే అద్వాని, తన కోరిక తీర్చుకోటానికి తాను తీర్చిదిద్దిన పార్టీని, తనను తీర్చిదిద్దిన సిద్ధాంతాలనే రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వెన్నుదన్నుగా ఉన్న హిందువులను, కార్యకర్తలను కూడా బలిపశువులుగా చేసేందుకు వెనుకాడటంలేదు.

కాంగ్రెస్ బాపతు లౌకిక పార్టీలకు మన దేశంలో కొరతలేదు. ఉన్న పార్టీలన్నీ దాదాపుగా ఆ తాను గుడ్డలే. మైనారిటీల ప్రాపకం కోసం, భా.జ.పా.ను కూడా ఆ తానులో భాగంగా చేర్చే ప్రయత్నంలో, భా.జ.పా. నేతలు ఆ పార్టీకే సమాధి కడుతున్నామని గ్రహించలేకపోవటం విచారకరం. రంగు మార్పిడి రాజకీయాలను ప్రజలు, ముఖ్యంగా హిందువులు హర్షించలేదనటానికి గత రెండు సార్వత్రిక ఎన్నికలు ఉదాహరణ.

గోథ్రా దారుణానికి ప్రతిచర్యగా కొనసాగిన గుజరాత్ మారణహోమానికి నరేంద్ర మోడిని సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వాజ్ పేయ్ బాధ్యుడిని చేయటం హిందువులనే కాదు, అందరినీ నివ్వెరపరచింది. ఆ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెత్తుమాట అనని వాజ్ పేయి ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రంగుమార్చిన వైనం ఆ పార్టీ నాయకత్వపు సందిగ్ధస్థితినే తెలుపుతుంది.

ఓటు బ్యాంకు రాజకీయాలాడే కాంగ్రెస్ కే పాఠాలు చెప్పే విధంగా భా.జ.పా. నేతలు ప్రవర్తించిన తీరు ఆ పార్టీపై హిందువులకున్న సానుభూతిని కూడా కోల్పోయేలా చేసింది. అందుకు జిన్నాపై అద్వాని చేసిన ప్రకటనలు ప్రబల సాక్ష్యం. ఇప్పుడు జస్వంత్ సింగ్.

ఏదేమైనా, అధికారం కోసం అర్రులు చాస్తున్న భా.జ.పా. నేతలు తమ మూలాలు మళ్ళీ వెతుక్కోవటం అవసరం. అధికారం కావాలంటే, మెజారిటీ ప్రజల మనసులు గెలుచుకోవటం అవసరం అని గ్రహించాలి. వస్తాయో రావో తెలీని మైనారిటీ ఓట్లకు వెంపర్లాడుతూ ఉన్నవి ఊడబెరుక్కునే వెర్రి నేతల తతంగానికి ఇకనైనా ముగింపు పలకాలి. అసలు ఇప్పటి పార్టీ స్వరూపస్వభావాలనే సంపూర్తిగా మార్చాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.

70 పైన వయసు పడ్డ నేతలను నిర్మొహమాటంగా తొలగించాలి. మూల సిద్ధాంతాలకు మసిపూస్తున్న నేతలను కూడా నిష్కర్షగా తొలగించాలి. అవసరమైతే, ఆరెస్సెస్సె ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలి.

Friday, August 21, 2009

లౌకికవాదిగా జిన్నా - ఓ 'కామెడీ' అవగాహన

"వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదు. ఆరంభంలో తన ఉద్దేశం ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం. హిందూ-ముస్లిం ఐక్యత. కానీ అతివాదం, ఎమోషనలిజం తప్ప మరెటువంటి విధానమూ పనికిరాని వ్యవస్థ నైరాశ్యంలో తన రాజకీయ మనుగడకోసం, లేని మతం రంగును ఆపాదించుకుని మొండివైఖరి అవలంభించిన ఫలాయనవాద "బలవంతపు మతవాది"గా మారిన రాజకీయనాయకుడు జిన్నా. "

జిన్నా మతవాది అవునా కాదా అనే విషయంలో చాలానే అపోహలు ఉన్నాయి. మతాల ప్రామాణికంగా రెండు దేశాల సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడిన జిన్నా, తన వ్యక్తిగత జీవితంలో 'మతాన్ని ఏనాడు పాటించలేదు' అంటూ 'జిన్నా భూతం' గురించి వ్రాయబడ్డ 'కామెడీ పోస్టులో' అయ్యవారు తన అభిప్రాయాన్ని అలా ఆపాదించారు.

తమ వాదనను వెలిబుచ్చే ఇతరులకు చరిత్ర పుస్తకాలు చదవమని సలహాలిచ్చే అయ్యవారు, తన విషయం వచ్చేసరికి, తనో చరిత్రను తిరగేసిన మేధావిగా ఎందుకు ఫీలవుతారో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదేమైనా, అయ్యవారి పోస్టులు 'కామెడీ పోస్టులే' గాని 'చారిత్రక పోస్టులు' కావు కాబట్టి, కాసేపు నవ్వుకొని వదిలేద్దాం.

ఆ మాటకొస్తే, అసలు జిన్నా వ్యక్తిగతంగా 'లౌకికవాదా' అనే విషయం మనకు అనవసరం. రాజకీయంగా ఆయన ఏ పరిమితుల మధ్య తన అభిప్రాయాలు వ్యక్తం చేసాడు, ఏ ఆశయాలతో పని చేసాడు అనేదే ముఖ్యం. తన రాజకీయ లబ్దికి జిన్నా మతాన్ని వాడుకున్నాడనే విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. చివరాఖరుకు 'కామెడీ అయ్యవారి కమ్యూనిస్టు హిస్టారియన్లతో సహా'. కావాలంటే, కామెడీ పోస్టులో చివరి పేరాలో మొదటి లైను చదవండి.

"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం."

సరే, అసలు జిన్నా మతవాది అవునా కాదా అనేది ఆయన వ్యక్తం చేసిన ఈక్రింది అభిప్రాయాల్లోనే అర్ధమౌతుంది. కాబట్టి, 'కామెడీ వారి' అభిప్రాయాలని బుట్ట దాఖలు చేసి, పాఠకులు వారి వారి అభిప్రాయాలు ఏర్పరచుకోండి. ఇక్కడ కోట్ చేయబడుతున్న జిన్నా ప్రసంగ పాఠాలు, నేను వ్రాసినవి కాదు. అవి రికార్డు చేయబడిన చారిత్రక సత్యాలు.

ముందుగా 'ముస్లీంలీగ్' అధ్యక్షుడుగా మార్చి 22-23, 1940లో లాహోరులో ఆయన చేసిన ప్రసంగం :

It is extremely difficult to appreciate why our Hindu friends fail to understand the real nature of Islam and Hinduism. They are not religions in the strict sense of the word, but are, in fact, different and distinct social orders, and it is a dream that the Hindus and Muslims can ever evolve a common nationality, and this misconception of one Indian nation has troubles and will lead India to destruction if we fail to revise our notions in time. The Hindus and Muslims belong to two different religious philosophies, social customs, litterateurs. They neither intermarry nor interdine together and, indeed, they belong to two different civilizations which are based mainly on conflicting ideas and conceptions. Their aspect on life and of life are different. It is quite clear that Hindus and Mussalmans derive their inspiration from different sources of history. They have different epics, different heroes, and different episodes. Very often the hero of one is a foe of the other and, likewise, their victories and defeats overlap. To yoke together two such nations under a single state, one as a numerical minority and the other as a majority, must lead to growing discontent and final destruction of any fabric that may be so built for the government of such a state.

ఇక, సెప్టెంబరు 1945లో ఈద్ పండుగ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం :

In the message of Eid to the Muslims in September 1945 he said, "Every Mussalman knows that the injunctions of the Holy Quran are not confined to religious and moral duties. From the Atlantic to the Ganges, says Gibbon, the Holy Quran is acknowledged as the fundamental code, not only of theology, but of civil and criminal jurisprudence, and the laws which regulate the action and the property of mankind are governed by immutable sanctions of the will of God". Everyone, except those who are ignorant, knows the Holy Quran is the general code of the Muslims".

11 ఆగస్టు, 1947 పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగం :

"You may belong to any religion or caste or creed -- that has nothing to do with the business of the state ...... We are starting with this fundamental principle that we are all citizens and citizens of one state....... in the course of time Hindus would cease to be Hindus and Muslims would cease to be Muslims, not in the religious sense, because that is the personal faith of each individual, but in the political sense as citizens of the state".

పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగానికి, జిన్నా ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన అప్పటి జాతీయోద్యమ నాయకులు చెప్పినదానికి ఏమైనా తేడా ఉందా? దీన్నిబట్టి, మతాన్ని తన స్వార్దపూరిత రాజకీయ ఆకాంక్షలకు జిన్నా ఉపయోగించుకున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది కదా! మరి అలాంటి వ్యక్తి 'లౌకికవాది' ఎలా అయ్యాడు?

అయ్యవారి ఆర్టికిల్లోని చివరిపేరాలోని 'కామెడీ కారుకూతలు' మరోసారి.

"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం. ముఖ్యంగా అది బిజేపీ చెయ్యడం వారి తెలియనితనాన్నే సూచిస్తోంది."

Nation Building Process లో భాగంగా జిన్నాను విలన్ గా చిత్రీకరించారా! ఇప్పుడు జిన్నాను 'సరిగ్గా' అర్ధం చేసుకోవాలా!! సరిగా అర్ధం చేసుకోకుండా చరిత్రకు కామ్రేడ్లు ఎర్ర అద్దాలు కప్పేసారని ఈ అయ్యవారు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లేనా? మొత్తానికి 'కామెడీవారు' 'కామ్రెడ్లని' కూడా వెంగళప్పలు చేసేస్తున్నారు.

Wednesday, August 19, 2009

జిన్నా - జస్వంత్ - అద్వాని - కిక్ దెమ్ ఆల్

ఆనాడు దేశ విభజనకు ప్రధాన కారకుడైన జిన్నాను ఆకాశానికి ఎత్తేస్తూ, ఈనాడు 'జిన్నా - ఇండియా - పార్టీషన్ - ఇండిపెండెన్స్' అనే శీర్షికతో జస్వంత్ సింగ్ పుస్తకం వ్రాయటంలోని అసలు మర్మమేమిటి? ఇది నిజంగానే, జిన్నాపై తన అభిప్రాయాలు ప్రకటిస్తూ జస్వంత్ వ్రాసిన పుస్తకమా? లేక జవహర్ లాల్ నెహ్రూ తదితర నేతల చేతకానితనాన్ని చర్చనీయాంశం చేయాలన్న ప్రయత్నమా?


జిన్నాపై నిజంగానే ఆయనకు మక్కువ ఉండి ఉన్నట్లైతే, ఇదివరలో అద్వానికి జిన్నా విషయంలోనే శృంగభంగం జరిగినప్పుడు జస్వంత్ ఎందుకని మాట్లాడలేదు? నెహ్రూ తదితర నేతల చేతకానితనాన్ని దునుమాడే ప్రయత్నమే అయితే, ఈ విషయాన్ని ఎన్నికల ముందు ఎందుకని లేవనెత్తలేదు?


ఇదంతా భా.జ.పా. వేస్తున్న ప్రమాదకరమైన రాజకీయ పాచికలు. భా.జ.పా. అస్తిత్వాన్నే రూపుమాపే వెర్రి ఎత్తుగడలు. మొన్నటి ఎన్నికలలో అటు హిందువుల ఓట్లకు దూరమై, ఇటు ముస్లీములకు చేరువ కాలేక, నెత్తిన పెట్టుకున్న 'జిన్నా కుంపటిని' దించుకునే అద్వానీ ప్రయత్నమే ఈ పుస్తకం. కేవలం మితవాద, అతివాద హిందువులను మభ్యపెట్టటానికి అద్వాని నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలే ఇవి.


ఇప్పుడు జిన్నా గురించి జస్వంత్ చెప్పిన విషయాలు ఖండిస్తున్న భా.జ.పా. అధినాయకత్వం ఆయన్ని బహిష్కరించటం కూడా జరిగింది. మరి అద్వానీని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? నిజానికి ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ కు ఏమాత్రమూ సంబంధం కనిపించట్లేదు. ఇప్పుడు ఏ స్థాయిలో ఆరెస్సెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందో, అప్పుడు అద్వానిపై కూడా అదే స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా, అద్వానీపై ఈగ కూడా వాలనీయలేదు అప్పటి భా.జ.పా. అధినాయకత్వం.


అప్పటి తప్పును కప్పిపుచ్చి, ఇప్పుడు కావాలని తప్పు చేయించి శిక్షించినందువల్ల హిందువులు మురిసిపోతారనుకోవటం భ్రమ. పార్టీకి, పార్టీ మనుగడకు ముఖ్యమైన మూడు మూల సిద్ధాంతాలను (అయోధ్య రామ మందిరం, ఆర్టికిల్ 370, ఉమ్మడి పౌరసత్వ చట్టం) పణం పెట్టిన అద్వానీ తదితర నేతల నాయకత్వాన్ని ఊడబెరికి, మలితరం నేతలకు పగ్గాలిచ్చినప్పుడే, కనీసమాత్రంగానైనా ఆ పార్టీని నమ్మవచ్చు.

Monday, August 17, 2009

నా పేరు ఖాన్, షారూఖ్ ఖాన్ - ఐతే ఏంటి?

మనదేశంలో వి.వి.ఐ.పి.లు చాలా ఎక్కువే. ప్రభుత్వం ప్రకటించిన వి.వి.ఐ.పి.లే కాకుండా, ఆ ప్రత్యేకత అంటగట్టబడే వాళ్ళూ, అంటగట్టించుకునేవాళ్ళు చాలా ఎక్కువే. ఈ రకంలో ఎక్కువగా లభించే వి.వి.ఐ.పి.లు రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రికెట్ క్రీడాకారులు, వారి వారి కుటుంబసభ్యులు. వాళ్ళు ఎక్కేదాకా విమానాలను, రైళ్ళను ఆపుచేయిస్తారు. వాళ్ళు దర్శనం చేసుకునే దాకా గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ అందరి దర్శనం ఆపుచేయిస్తారు. ఆఖరికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న రోడ్లు కూడా భద్రతా నెపం మీద మిగతా జనాలకు మూసివేస్తారు.

ఈ దరిద్రాన్నంతా భరిస్తాం కాబట్టే మనం 'భారతీయులం' అయ్యాం. ప్రపంచమంతటా 'భరించేవారే' ఉండాలనుకోవటం 'ఖాన్' గారి మూర్ఖత్వం కాక ఇంకేమిటి? నీ దేశంలో నువ్వో మహాలింగానివి కావొచ్చు. ఇక్కడకొస్తే శతకోటి లింగాల్లో ఓ 'బోడిలింగానివే' అని అమెరికా అధికారులు చెప్పారని ఏడిస్తే ఎలా? ఇష్టం కాకపోతే అమెరికా వెళ్ళటం మానేయ్. అక్కడా అయ్యవారికి 'వి.వి.ఐ.పి.' అనే రిజర్వేషన్లు కావలంటే ఎలా?

ఈ వ్యవహారంలో అమెరికాను తప్పుపడుతూ సాగుతున్న వాదన ఎలా ఉందంటే, 'పేరులో ఖాన్ ఉంది కాబట్టి' ఆపేసారు అని. ఇంకా 'జాత్యహంకారం' ప్రదర్శిస్తున్నదని. భయ్యా, 'భరించే వాళ్ళ దేశం' కాబట్టే, సుప్రీంకోర్టు ఉరి శిక్ష వేసినా, పార్లమెంటు దాడి కేసులోని నిందితుడు, ముస్లీము కావటం వలన మాత్రమే మనదేశంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ముస్లీములు ఇబ్బందులకు గురౌతారని 'పోటా'ను మూసేసే మన నేతల సంకల్పానికి మన దేశంలో బలౌతున్నది వేలమంది ముస్లీమేతరులే.

అమెరికా తరహా పటిష్టమైన భద్రత లేదు కాబట్టే, విమానాలని హైజాక్ చేసి కరడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకెళతారు. కాశ్మీరుకు చెందిన ఒకానొక కేంద్రమంత్రి కూతురుని కిడ్నాప్ చేసి (?) తీవ్రవాదులను విడిపించుకెళతారు. ఛోటా రాజన్ లకు, దావూద్ ఇబ్రహీంలకు పదుల సంఖ్యలో పాస్ పోర్టులు జారీ చేస్తారు. ఎమ్మేల్యేల నుంచి మంత్రుల దాకా దొంగ పాస్ పోర్టుల మీద జనాలని దొంగతనంగా విదేశాలకు తరలిస్తారు.

మనలా కుహానా లౌకికరాజ్యం కాదు కాబట్టే, కఠిన చర్యలు తీసుకునే సత్తా అమెరికా కలిగి ఉంది. శిక్ష పడ్డ వెధవ ఏ కులంవాడనో, మతంవాడనో ఆలోచించదు కాబట్టే, ఇంతవరకూ మరో టెర్రరిస్టుల దాడి అమెరికాపై జరగలేదు. అమెరికా స్ఫూర్తిగా దేశభద్రత కోసం మనమూ ఇటువంటి చర్యలు చేపట్టాలి.

శ్రావణమేఘాలు 2

అమ్మా నాన్న

పిట్టలు ఎగిరిపోతాయి.
బరువును మోసిన చెట్టే
భారంగా నిలబడుతుంది.


పిట్టలు ఎగురుకుంటూ వస్తాయి.
భారంగా నిలబడిన చెట్టే
సంబరంగా నవ్వుతుంది.


* * *

బెస్ట్ హాఫ్

ఒత్తి మీద
ఒద్దికగా కూర్చొని
మౌనంగా
నన్ను స్పృశిస్తూ

వెలుగు

మత్తుగా పెనవేసుకుంటూ
జ్ఞాపకాలు పలకరిస్తుంటే
మౌనానికి మరోవైపు
నాలో నేను

నీ నీడలో నేను

Tuesday, August 11, 2009

నీలిపువ్వు

నిన్నటి కలలు
రేపటి ఆశల మధ్య
ఆగిపోయిన ఓ రాత్రి

నిన్న వాడిన పూవును
పలకరిస్తూ
పల్లవిస్తున్న మరో పూవు

రెండు పగళ్ళ మధ్య
ఓ చీకటి అంతరం!
రాలిపడిన
మరో నక్షత్రం!!

Friday, August 7, 2009

శ్రావణ మేఘాలు

జ్ఞాపకాలు

అవసరానికో
రంగు మార్చే ఆకాశంలో
ఎదురుపడ్డ
రెండు మబ్బులు

కళ్ళ మెరుపుల మధ్య
కురుస్తున్న వర్షం

విడివడిన
కొసలు బిగిస్తూ
జ్ఞాపకాల హరివిల్లు


తడి

వాకిట్లో
వర్షం చొరబడితే
ఇల్లంతా వాకిలి చేస్తూ
నిన్నటి చినుకుల్లో
నిలువెల్లా తడిసింది
నాలాంటి పాపే!

అర్ధంతరంగా
ఆగిన వర్షాన్ని
కాగితం పడవలతో
పిలుస్తూ
మళ్ళీ ఈరోజు..


అయినా నిశ్శబ్దం

ఆకాశం చూస్తూ
ఒంటరి పూవు
వెన్నెల పరుస్తూ
ఒంటరి చంద్రుడు
దొంగలా తచ్చాడుతూ
ఒంటరి మబ్బు


అనేక ఏకాంతాలపై
సామూహికంగా
చినుకుల దాడి


అసలు సిసలు వర్షం

చిందిపడ్డ
వాన చినుకు
భళ్ళుమన్న
చీమల పుట్టలా
జ్ఞాపకాలు

అందమైన ఆకాశానికి
ఎందుకిన్ని అడ్డుతెరలు

హాయిగా ఏడ్చేసా.

Tuesday, August 4, 2009

కా. కిం.లు - తత్వ విచారణ

మతానికి ఆధ్యాత్మిక సాధనకు సంబంధం ఎంతవరకు? అసలు సంబంధం ఉందా, లేదా? ఇటువంటి ప్రశ్నలతో కా.కింగుల తత్వవిచారణ చదవటం తటస్థించింది. అనుకున్నట్లుగానే, విలువైన విషయం ఒక్కటీ లేకుండా, ఆద్యంతం హాస్యాస్పదంగా వ్రాయగలిగిన కా.కిం.గారికి ముందుగా అభినందనలు.

మనిషికి నచ్చినా, నచ్చకపోయినా, కావాలనుకున్నా, వద్దనుకున్నా పుట్టుకతోనే సహజంగా అంటగట్టబడేది మతం. కాలక్రమంలో, ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఆ మతాన్నే ఆసరాగా తీసుకోవటం కూడా అంతే సహజం. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి చేరుతున్నకొద్దీ మతాన్ని పట్టించుకోకపోవటం జరుగుతుందే కానీ, మతాన్ని తృణీకరించటం ఎన్నటికీ జరగదు. ప్రతి మతానికీ స్వాభావికమైన కొన్ని సంప్రదాయాలను అనుసరించి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించటం జరుగుతుంది. అంతే కానీ, ఆధ్యాత్మిక పురోగతికి మతం అవసరమే లేదు అంటే కుదరదు.

మీ మతంలో ముక్కు మూసుకు తపస్సు చేస్తే ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందన్నారు. అది అహేతుకం, ఎందుకంటే ముక్కు మూసుకుంటే చచ్చిపోతారు కనుక. నేను ఏ మతవాదినీ కాను, 'నవతా' వాదిని. కాబట్టి, ముక్కులో వేలు పెట్టుకుని తపస్సు చేస్తానంటే, మనం అనేదేమీ ఉండదు. వేలెక్కడ పెట్టుకున్నా, చేస్తానంటున్నది తపస్సే కాబట్టి.

మతపరమైన అవగాహనా రాహిత్యంతో ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకోలేం. గౌతమ బుద్ధుడైనా పతంజలి ప్రస్తావించిన యోగసూత్రాలలోని 'ధ్యానయోగ మార్గాన్ని' అనుసరించి మాత్రమే బుద్ధత్వం సాధించగలిగాడు. పతంజలి యోగసూత్రాలకు హిందూమతానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి వేరే ఏమీ చెప్పనక్కరలేదు.

ఉదాహరణకు గురువు దీక్ష నివ్వటం, జప, తప హోమాది అంశాలు అధ్యాత్మికపరమైనవైనా, అవి హిందూ మతానికి మాత్రమే వర్తించే విషయాలు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు మతానికి సంబంధం లేదని చెప్పటం కుదరదు. ఇస్లాం లోనో, క్రిస్టియానిటీలోనో హోమాలు యాగాలు చేయమని చెప్పరు. కాబట్టి, ఈ సాధనలు హిందూ మతపరమైనవే. అలానే, తదితర మతాలలో కూడా వారికి మాత్రమే ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి.

అంతేకానీ, మతపరమైన ఆధ్యాత్మిక సాధనలకు, నియో హిందూత్వ రాజకీయ భావజాలానికి సంబంధం అంటగట్టి హిందువులను రెచ్చగొట్టాలని కామెడీ కింగులు చేసె అసందర్భ ప్రలాపాలను గర్హించి తీరాలి. చార్వాకుడు, బుద్ధుడు, జీనుడు ఇంకా అరిస్టాటిల్, సోక్రటీసులు తత్వ విచారణ చేసారని ప్రకటించే పెద్దమనిషికి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ప్రతిపాదించిన జగద్గురువులు తత్వవిచారణ చేసినట్లు ఎందుకు అనిపించలేదో! ఇక్కడి హిందూ తత్వాన్ని అర్ధం చేసుకోలేని వెంగళప్పలకు, అరిస్టాటిల్, సోక్రటీస్ మాటల్లోనే 'ఈజిప్టు తత్వం' తెలిసిందట!

అయ్యా, అరిస్టాటిల్, సోక్రటీస్ లు చెప్పిన 'ఆ మాటలేవో' మాకూ చెబితే 'ఈజిప్టు తత్వాన్ని' తెలుసుకుంటాం. అలాగే, పాకిస్తాన్ తత్వం, శ్రీలంక తత్వం, అమెరికా తత్వం, గట్రా గట్రాలకు ఎవరెవరి మాటలు వినాలో కూడా తమరు చెబితే ఆనందిస్తాం.

అయ్యవారి మరిన్ని 'జ్ఞాన శకలాలు' చూడండి.

"ఆధ్యాత్మిక తత్వచింతనకు మూలం మనిషి". ప్రాధమికమైన ఆలోచనలోనే తప్పు! అయ్యా, ఆధ్యాత్మిక తత్వచింతనకు మూలం మనిషి కాదు. ఆ మూలం ఓ శక్తి / ఓ ప్రకృతి / ఓ దేవుడు.

"అది మనిషి జీవితానికి సంబంధించినది". మరో తప్పు. అది మనిషి లౌకికమైన జీవితానికి సంబంధించినది కాదు, పారలౌకికమైన జీవితానికి సంబంధించిన విషయం.

ఊసరవెల్లిలా, తన వ్యాసంలోని మొదటి పేరాలో 'నియో హిందుత్వ రాజకీయ భావజాలాన్ని" విమర్శించిన పెద్దమనిషి, చివారఖరుకు తన రంగు ఎలా మార్చారో చూడండి. "మానవత్వాన్ని మంటగలుపుతున్న మతం పోకడల మధ్య...." అంటూ హిందూ మతాన్ని అధిక్షేపించటమేమిటి? ఇక్కడ మతం చేసిన తప్పేమిటి? తప్పు చేస్తున్నారనుకున్న 'నియో హిందుత్వ రాజకీయ వాదులనే' ఇక్కడ కూడా అనొచ్చుగా!

మూలభావాల్లోనే తప్పులు పెట్టుకొని, మరొకరి అభిప్రాయాల విలువను ప్రశ్నించే పెద్దమనుషులు మరోసారి కా.కిం.లుగా నిర్ధారింపబడుతున్నారని గ్రహించకపోవటం విచారకరం.

Monday, August 3, 2009

మరిన్ని సంగతులు

బొమ్మకు రంగులేస్తూ
కదిలొచ్చే రంగుల బొమ్మలా
సీసాతో పాప

* * *

చేతిలో సీసా
రంగులో పాప
ఒకేసారి గొల్లుమన్నాయి

* * *

ఇల్లంతా నిశ్శబ్దం
ముసుగుతన్ని పడుకుంది
ఇంట్లో సందడి

* * *

ఎప్పుడూ ఎక్కే మెట్లే
ఎవరెస్టులా అనిపిస్తున్నాయి
చీకట్లో

* * *

గాలివాటుకు
మెరిసిన మేనికాంతి
కనికరంలేని కంటి నలుసు

* * *

కంటిలో నీళ్ళు
చూరులో నీళ్ళు
మబ్బు వెలిసేదాకానే!