Tuesday, December 22, 2009

ఆమరణ దీక్షలు - ఆరంభ శూరులు

ఆంధ్రులకి (తెలంగాణా కలుపుకొనే చెబుతున్నాను) ఆమరణ నిరాహార దీక్షలు ఇప్పుడు వెన్నతోపెట్టిన విద్యలయ్యాయి. అసలీ ఆమరణ నిరాహార దీక్షల్లో విప్లవాత్మకమైన విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కె.సి.ఆర్.కు దక్కితే, ఆ విధానాన్ని మరో మెట్టుపైకి చేరుస్తున్న ఘనత మాత్రం లగడపాటికే చెందుతుంది.

నెల రోజుల ముందు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా నంటూ ఊరించి ఊరించి చివరికి దీక్ష మొదలేయక మునుపే అరెస్టు చేయించుకోబడ్డాడు కె.సి.ఆర్. అరెస్టు కావడమే తరువాయి, అయ్యవారి ఆరోగ్యం గాలిలో దీపమయ్యిందని అటు డాక్టర్లు సెలైనులు, జ్యూసులు పట్టించారు. ఒక్కరోజు కూడా నలుగురిలో కూర్చోకుండానే, పదకొండు రోజులపాటు అసుపత్రి బెడ్డుపై పడుకునే ఆమరణ నిరాహార దీక్ష చేసిన కె.సి.ఆర్. తెలంగాణా గాంధీ అట!

ఇటు విజయవాడలో మరో పెద్దమనిషి సమైక్యాంధ్ర కోసం దాదాపు ఓ ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయ్యవారి ఆరోగ్యం బాగోలేదని అక్కడి ఆసుపత్రిలో చేరిస్తే, కాదని పారిపోయి హైద్రాబాదు ఎన్.ఐ.ఎం.ఎస్.లో చేరారు. నిన్నటి ఈ టీవీ వార్తల్లో లగడపాటి పరుగెత్తుకెళ్ళటం చూసాక ఆయన ఎనిమిది రోజులుగా చేసిన నిరాహార దీక్ష గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

అటు ఆ తెలంగాణా పెద్దమనిషి ఒక్క పూటకే డంగైపోతే, ఇక్కడ సమైక్యాంధ్ర పెద్దమనిషి ఎనిమిది రోజుల దీక్ష తర్వాత కూడా పి.టి.ఉష కన్నా ఉత్సాహంగా ఉన్నారు.

ఓ రెండు రోజులు దీక్షలో కూర్చోటం ఆలస్యం - డాక్టర్ల కోసం వెంపర్లాడటం మొదలు. చావటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తులు డాక్టర్ల కోసం దేబిరించటంలోనే తెలుస్తుంది వారి త్యాగనిరతి. సందుకో సత్రకాయ తయారయ్యి చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షలు చూస్తుంటే, ప్చ్! ఆమరణ నిరాహార దీక్షలంటే అందరికీ ఎంత అలుసైపోయాయో అనిపిస్తుంది.

ఈ దీక్షలో కిటుకులు తెలియని మరికొందరు సత్రకాయలు మాత్రం ఇంకా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చానని సంబరపడి పోతున్నారు. 80ల్లో ఎంటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన రిజర్వేషనుల వ్యతిరేకోద్యమంలో గుంటూరులో మేము చేసాం ఈ రిలే నిరాహార దీక్షలు. అప్పట్లో, రోజుకు ఇద్దరు ముగ్గురం చొప్పున దీక్ష చేసి, ఆ మర్నాడు మాత్రమే విరమించేవాళ్ళం. ఇప్పుడు పూటకొకళ్ళు రిలే నిరహార దీక్షలు చేస్తున్నట్లున్నారు.

ఏమైనా అపరగాంధీలకు అసలైన బానిసలం కాబట్టి, నిరాహార దీక్షల్లో ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని నిరూపిస్తూనే ఉందాం, సిగ్గు పడకుండా!

Wednesday, December 16, 2009

తెలంగాణా - శేష ప్రశ్నలు

మొత్తానికి ప్రత్యేక తెలంగాణా అంశాన్ని ప్రస్తుతానికైతే దాదాపుగా అటక ఎక్కించేసినట్లే. గత మూడు నాలుగు వారాలుగా కాలుతున్న రాజకీయ రావణకాష్టంతో రాజకీయ పార్టీలు మాత్రం చలి కాచుకుంటున్నాయి. ఈ మూడు నాలుగు వారాల రాజకీయ కోలాహలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే, జవాబులు దొరకని ఎన్నెన్నో ప్రశ్నలు.

దీక్ష కూడ మొదలు కాకుండానే, ఆసుపత్రికి తరలించబడ్డ కె.సి.ఆర్., ఆసుపత్రిలోనే చేసిన పదకొండు రోజుల "సెలైన్ నిరాహారదీక్ష" కు కేంద్ర ప్రభుత్వం నిజంగానే కదిలిపోయి దిగివచ్చిందా? గత అయిదు సంవత్సరాలు తాత్సారం చేస్తూ వచ్చిన అంశంపై పదిరోజుల్లోనే ఓ అవగాహనకు వచ్చి, రాత్రికి రాత్రి ప్రకటించటంలోని విశేషం ఏమై ఉంటుంది?

ఛీ పొమ్మన్నా, పదవులకి, అధికారానికి అంటిపెట్టుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణా ప్రకటన వెలువడిన తెల్లవారుఝామునే, సమైక్య ఆంధ్రకు అనుకూలంగా రాజీనామాల పర్వం మొదలేయటమేమిటి? రాజ్యాంగ సంక్షోభం కలిగించటం ఏమిటి?

కేంద్ర మంత్రిపదవుల్లోను, కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతున్నా పెదవి విప్పని కాంగ్రెస్ నాయకులు, అధినేత్రికే వ్యతిరేకంగా రాజీనామాలు చేసారంటే నమ్మశక్యం కాదు. తనకు, తన తమ్ముడికి, తన కొడుక్కి పదవులు ఇవ్వలేదని గుక్కలు పట్టిన రాయపాటి లాంటి నేత రాజీనామా చేయటం, అనవసరమైన ప్రతిసారీ వీర విధేయత ప్రకటించే లగడపాటి అధిష్టానానికి కాకుండా స్పీకర్ కే రాజీనామా సమర్పించటం అస్సలు నమ్మలేం.

కాంగ్రెస్ బాటలోనే తెలుగుదేశానికి, ప్రజారాజ్యంకు చెందిన ఆంధ్ర రాయల సీమ ఎమ్మెల్యేలు కూడా హడావుడిగా రాజీనామాలు చేయటం కూడా అంతే ఆశ్చర్యకరం, అంతకు మించిన అసహజ పరిణామం. దానికితోడు, తెలంగాణా తెలుగుదేశం కావాలని చంద్రబాబుపై వత్తిడి కూడా తెస్తున్నట్లు కొందరు నాయకులు ప్రకటించటం కూడా విస్మయం కలిగిస్తున్నది. పరాకుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వేసిన పాచికలకు, ఎదురు వేస్తున్న చంద్రబాబు ఎత్తుగడా ఈ డబుల్ గేం?

ఎప్పుడూ నోరు పారేసుకునే తెలంగాణా కాంగ్రెస్ నేతలు, ఈ మొత్తం వ్యవహారంలొ ఎక్కువ చడీచప్పుడు లేకుండా ఉండటం కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

నిరాహార దీక్షకు నెల రోజుల ముందు నుంచే కె.సి.ఆర్. చేసిన ప్రకటనలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు, నిరాహార దీక్షను నెల రోజుల ముందే ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? ఆనక, రోజు విడిచి రోజు నిరాహార దీక్షలో ఉండే తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోమని ఉరమటం, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే ఆత్మహత్య చేస్తుకుంటానని బెదిరించటం... ఇవన్నీ నెల రోజుల ముందు నుంచే ఎందుకు చేయాల్సి వచ్చింది?

తన నిరాహార దీక్షకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ప్రకటించిందని భావిస్తుంటే, సోనియమ్మకు సాగిలబడి ప్రణామాలు చేస్తానని కె.సి.ఆర్. చేసే ప్రకటనల్లోని మర్మం ఏమిటి?

ప్రత్యేక తెలంగాణాపై తమ చిత్తశుద్ధిని ప్రదర్శించటానికి (ప్రకటించటానికి కాదు) కాంగ్రెస్ ఆడిన నాటకమా? లేక, రాజకీయంగా బోర్లపడ్డ తె.రా.స.ను కాంగ్రెస్ గూటికి చేర్చాలని చేసిన ప్రయత్నమా ఇది? లేక, ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని, తెలుగుదేశం పార్టీని గుక్క తిప్పుకోకుండా చీల్చివేయాలని వేసిన పన్నాగమా ఇది? ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి, ఎన్నికల లబ్ది కోసం చేసింది మాత్రం కాదని స్పష్టమౌతుంది.

ఏది ఏమైనా, అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కేంద్రం తీసుకున్న హఠాత్ నిర్ణయం మాత్రం కాదు. ఆచి తూచి వేసిన పాచికలే ప్రత్యేక తెలంగాణా ప్రకటన, ఆపైని మొదలేసిన సమైక్యవాద ఉద్యమపు డ్రామా. ఏమి ఆశించి అన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ శేష ప్రశ్నే.

Friday, December 11, 2009

భంగపడ్డ తెలంగాణా

నా క్రిందటి వ్యాసం 'తెలంగాణా - మరోసారి మోసపోవద్దు'లో నేను అనుకున్నదే అయ్యింది.

"రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమే కాకుండా, ఆ బిల్లును ఆమోదించిన తర్వాతనే కె.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం."

పదకొండు రోజులు ఆపసోపాలు పడి, అమ్మవారి హామీ కోసం పరితపించి, చివరాఖరికి హడావుడీగా, బ్రతుకు జీవుడా అనుకుంటూ కె.సి.ఆర్. ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. గొంతులో ముద్ద కూడా దిగకుండానే, అమ్మవారి హామిలోని పితలాటకాలు ఒక్కటొక్కటిగా ఇప్పుడు బైటపడుతుంటే, ఖంగు తినటం తప్పనిసరయ్యింది ఈయనకు.

కె.సి.ఆర్. పుణ్యమా అని, వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకులు కూడా సోనియాకు అవిధేయత ప్రకటించటం ఆశ్చర్యకరం. కేంద్ర మంత్రి పదవుల పందేరంలోను, జనరల్, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి మొండి చేయి చూపించినప్పుడు, కరువు, వరదల బీభత్సానికి అతలాకుతలమైన రాష్ట్రానికి చేయూతనందించటంలో తిథి, వార, నక్షత్రాలు లెక్కపెట్టిన కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించని నాయకులు, ఈరోజు ప్రజాభీష్టం మేరకే తమతమ పదవులకు రాజీనామాలు ఇచ్చారంటే ఆశ్చర్యంగానూ ఉంది, అసహజంగానూ ఉంది.

గత ఆరు సంవత్సరాలకు పైగా నలుగుతున్న తెలంగాణా విషయంపై, ఆయా పార్టీల నాయకత్వం ఆయా పార్టీల సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని ఎలా చెబుతున్నారో అర్ధం కావటంలేదు. ఒకప్పుడు, దొరికిన అవకాశాన్నే కాక, దొరకని అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని తెలంగాణాపై సోనియా నిర్ణయమే శిరోధార్యమన్న నాయకులే వీళ్ళు.

విచిత్రమేమిటంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదపటంలేదు. ఇదంతా చూస్తుంటే, గూడుపుఠానీలా అనిపిస్తున్నది. కోస్తా సీమ నాయకుల నుంచి పార్టీల కతీతంగా ఐకమత్యంగా ఉండటం కనీసమాత్రంగానైనా తెలంగాణా నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో?


కోస్తా, సీమల ఎమ్మెల్యేలు మెజారిటీగా ఉన్న శాసనసభలో తెలంగాణా బిల్లు ఏరకంగా ఆమోదింపబడుతుందని తెలంగాణా మేథావులు విశ్లేషించారు? సోనియా హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో, చిదంబరాలు, మన్మోహన్లు చేసే హామీల విలువ ఏపాటిది? మొన్నటిదాకా, తెలంగాణాపై నాంచుడు ధోరణితో ఆరేళ్ళు లాక్కొచ్చిన కాంగ్రెస్, "చిదంబర హామీతో" మరో అరేళ్ళు లాక్కొస్తుందనటంలో ఎటువంటి అనుమానము లేదు.

చేవలేని చవటల నాయకత్వంలో 'ప్రత్యేక తెలంగాణా'కు మరోమారు భంగపాటు తప్పదు.

Wednesday, December 9, 2009

తెలంగాణా - మరోసారి మోసపోవద్దు

కె.సి.ఆర్. నిరాహార దీక్ష దరిమిలా మొదలైన "తెలంగాణా ప్రజా ఉద్యమం" ఊపందుకుంటున్న వేళలో, ఉద్యమాన్నినిలువరించటానికి రాజకీయ కుతంత్రాలు మొదలైనాయి. "ప్రత్యేక తెలంగాణా వాదం" తెరపైకి వచ్చినప్పుడే, "ప్రత్యేకరాయలసీమ", "ప్రత్యేక ఆంధ్ర" ఉద్యమాలు తిరగదోయడానికి పలువురు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకంటే, వారి లక్ష్యం ప్రత్యేక ఆంధ్రానో, ప్రత్యేక రాయలసీమో కాదు. వారి లక్ష్యమల్లా, ప్రత్యేక తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కదోవ పట్టించటమే.

ఇప్పటి వరకూ, ఒక్క కాంగ్రెస్ తప్ప, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని దాదాపు అన్ని పార్టీలు "తెలంగాణ" పై తమ తమ అభిప్రాయలను ప్రకటించాయి. అయినా, మెజారిటీ అభిప్రాయాన్ని తోసిరాజని, ఏకాభిప్రాయ సాధన కోసం కృషిచేస్తున్నామని ..సి.సి. ప్రకటించటం ఎవరిని మోసగించాలని చేసే ప్రయత్నం? ఎంతమంది ప్రజల ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ ప్రధాని దేశాన్ని, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు?

రాష్ట్ర కాంగ్రెస్ లో తెలంగాణా అంశంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయని రోశయ్య ప్రకటించారు. అందుకని తీర్మానమూ కుదరదట! ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయే మరి! అయినా, ముఖ్యమంత్రి పదవి ఆయన అధిష్టించలేదా?

తాడో పేడో తేల్చుకోవాలసిన దశలో ఉన్న పోరాటాన్ని తె.రా.. అర్ధంపర్ధంలేని షరతులతో ఆపేయదనే ఆశిద్దాం. ఎందుకంటే, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినా, సోనియా గాంధి హామీ ఇచ్చినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా దీక్షవిరమిస్తానని కె.సి.ఆర్. ప్రకటించటం మరో తప్పటడుగు.

రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమేకాకుండా, బిల్లును ఆమోదించిన తర్వాతనే కే.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం.

కాదు కూడదు, ఇక దీక్ష కొనసాగించటం వల్ల కాదు అనుకుంటే, రాజకీయ సన్యాసం తీసుకొని, నేతృత్వాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే నాయకుడి చేతుల్లో పెట్టటం తెలంగాణా ఉద్యమానికి మంచిది. తెలంగాణా మేథావులు సరైన దిశగా, స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుని మరోసారి మోసపోరనే
ఆశిద్దాం.