Monday, November 30, 2009

ఉద్యమాన్ని నీరుగార్చిన కె.సి.ఆర్.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి తెలంగాణా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తమయ్యింది. "నీ బాంచన్ దొర" అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనలా పోటెత్తి, నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతావనిలో తెలంగాణాను భాగం చేసారు.

ఆనాడు, స్వతంత్ర భారతంలో పరాధీనగా మిగిలిన "కోటి రతనాల వీణ" చేసిన ఆ సాయుధపోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, ఈరోజు కె.సి.ఆర్. వలన బూడిదలో పోసిన పన్నీరైనాయి. అంతకు మించిన ఆవేదన ఏమిటంటే, ఈ రోజు "ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం కే.సి.ఆర్. లాంటి నేత వలన ఓ జోక్ గా మిగిలిపోయింది.

ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు విరుద్ధంగా "విశాలాంధ్ర" ఏర్పడిందనేది సత్యం. ప్రస్తుతానికి ఆ విషయం జోలికి పోకుండా, ఒక ఉద్యమాన్ని కె.సి.ఆర్. తన స్వార్ధ రాజకీయాల కోసం, ఎలా పక్కదోవ పట్టించింది ఓసారి నెమరువేసుకుందాం.

పోరాటంతో సాధించాల్సిన తెలంగాణాను, అడుక్కుని, దేబిరించే స్థాయికి దిగజార్చిన ఘనుడు కె.సి.ఆర్. ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తె.రా.స., కె.సి.ఆర్. నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తప్పటడుగులు వేస్తూనే వచ్చింది.

చెన్నారెడ్డి నేతృత్వంలో కొనసాగిన తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎలా నీరుకార్చిందో తెలిసినా, ఏ నమ్మకంతో కె.సి.ఆర్., ముందుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్ధం కాదు. అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షించుకోకుండా ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవుల కోసం సాగిలపడ్డ విషయం ఇంకా మరచిపోలేదు.

ఏ విభాగమూ లేకపోయినా మంత్రి పదవిలో కొనసాగిన కే.సి.ఆర్. ఆనాటి కేంద్రప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా చేర్చాలని ఎందుకు పోరాడలేదు?

ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్న, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పింది ఏమాశించి?

తెలంగాణా పై నిజాయితీ నిరూపించుకుంటానని, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న నేత, అర పూట కూడా ఉపవాసం ఉండలేక, అప్పటి లోక్ సభ స్పీకర్ మొహమాటానికి అన్నదే తడవుగా దీక్ష విరమించుకోలేదా? చిత్తశుద్ధి లేకుండా చేసే చండీ యాగాల వలనా తెలంగాణా వచ్చేది?

తెలంగాణా ప్రజలు, నిజంగానే తనను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమాదరిస్తారనుకుని ఉంటే, నిరుటి ఎన్నికలలో తె.దే.పా., కమ్యూనిస్టులతో చేతులు ఎందుకు కలపటం? ఒంటరి పోరు ఎందుకని సాగించలేదు. తన నిజాయితీని తెలంగాణా ప్రజలు అంతకు మునుపు జరిగిన ఉప ఎన్నికల్లో శంకించారని తెలుసు కాబట్టే, ఇతర పార్టీలతో జట్టు కట్టింది అనే విషయం అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు తెలంగాణా ప్రజలు.

తన నిజాయితీ మీద, తెలంగాణాపై తన నిబద్ధత మీద ప్రజలకు నమ్మకం లేదని గ్రహించబట్టే, గ్రేటర్ ఎన్నికల్లో తె.రా.స. పోటీ చేయకుండా కె.సి.ఆర్. అడ్డుపడ్డాడనేది వాస్తవం కాదా?

తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్. సచ్చుడో అన్న నాయకుడు, నెల రోజుల ముందరే ఆర్భాటంగా ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్షకి ఇప్పుడు కూడా అదే గతి పట్టటం ఆశ్చర్యం కాదు.

చేవలేని నాయకుడు చేసే పోరాటం వల్ల, ఆ ఉద్యమమే భ్రష్టు పట్టే అవకాశం ఉంటుందని కె.సి.ఆర్. నిరూపించాడు. కె.సి.ఆర్. చేత బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించి, పొట్టి శ్రీరాములు లాంటి మరో నిస్వార్ధ నాయకుడిని ఎన్నుకోవటం వలన మాత్రమే, ప్రత్యేక తెలంగాణా సాధ్యమౌతుందని తెలంగాణా ప్రజలు గ్రహించాలి.

Tuesday, November 24, 2009

ముంబాయి మృతవీరులకు శ్రద్ధాంజలి

రేపటికి ముంబాయి దాడులు జరిగి సరిగ్గా సంవత్సరం. సంవత్సరం క్రితం మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. దాడులలో పట్టుబడ్డ "కసబ్" అలానే ఉన్నాడు. పాకిస్తాన్ అప్పుడు ప్రకటించినట్లుగానే, మరిన్ని సాక్ష్యాలు కావాలని ఇప్పటికీ అంటున్నది. పాకిస్తాన్ కు ఇచ్చిన సాక్ష్యాలు సరిపోతాయన్న మాటే, మన ప్రభుత్వమూ ఇప్పటికీ అంటున్నది. తీవ్రవాదుల మీద పాకిస్తాన్ సత్వరమే చర్యలు తీసుకోవాలని అమెరికా ఇప్పటికీ హూంకరిస్తుంటే, అలా బెదిరించమని ఇండియా ఇంకా దేబిరిస్తూనే ఉంది.


ఈ కేసుకు సంబంధించి, పోలీసుల, కోర్టుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని చాటిచెబుతూ భారత ప్రభుత్వం విడుదల చేసిన సాక్ష్యాలు, కసబ్ ను దోషిగా నిర్ధారించటంలో ఎందుకు ఉపయోగపడటంలేదో మనకు అర్ధం కాదు.


సంవత్సరకాలంగా మారని ఈ పరిస్థితుల మధ్య, మారింది ఒక్క పౌరుడే. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగిన ఈ పౌరుడే, ఇప్పుడు బితుకు బితుకు మంటూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు, ప్రతి తీవ్రవాద ఘాతుకం తర్వాత, పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసిన పౌరుడు, ఇప్పుడు నిస్సత్తువగా ఉన్నాడు.


ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాల కింద అణచివేస్తామన్న ఆనాటి ప్రధాని, తన గుండెకు పడిన గాయానికి చికిత్స చేయించుకొని మళ్ళీ ప్రధాని అయ్యాడు. దేశానికి తూట్లుపొడుస్తున్న తీవ్రవాదాన్ని అంతమొందించటానికి తీసుకున్న చర్య మాత్రం ఒక్కటీ లేదు.


తీవ్రవాదుల దాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ ను వేలెత్తి చూపించి సరిపెట్టేసే ప్రభుత్వం, దేశద్రోహులకు, వారి మతానికి లంకె పెట్టి పార్లమెంటు దాడి కేసులో ఉరిశిక్షపడిన "అఫ్జల్ గురుకు" ఇంత వరకూ శిక్ష అమలు పరచని ప్రభుత్వం, "కసబ్" విషయంలో ఎలా రాజకీయాలు ఆడగలదో ఊహించుకోటానికే సిగ్గు వేస్తుంది. మైనారిటీ దేశద్రోహులను, వారికి వంతపాడే రాజకీయాలను చేష్టలుడిగి ఇంకా అలా చూస్తూనే ఉన్నారు మెజారిటీ దేశభక్తులు! దేశభక్తుల సహనాన్ని దేశప్రభుత్వమే పరీక్షించటం మన లౌకిక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం!


మతాన్ని రాజకీయాలతోను, దేశంతోను ముడిపెట్టిన జిన్నా వారసులు జాతీయ చిహ్నాలను అవమానించటం మొదలేసినప్పుడే వాటిని ఆపే ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చి ఉండేవి కావు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల దారుణ ఊచకోతకు స్పందించని, హిందువుల ఓట్ల కోసం అయోధ్యలో శిలాన్యాసం చేసి తదనంతర పరిణామాలలో బాబ్రీ మసీదు కుప్పకూలిపోవటానికి పరోక్ష కారకుడైన రాజీవ్ గాంధీ సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మన దేశంలో మతవిద్వేషాలు ఈ తీరుగా చెలరేగేవే కావు.


అఫ్జల్ గురు ను విడుదల చేయకపోతే, కాశ్మీరులో హింసాకాండ చెలరేగుతుందని భయపెట్టే గులాంనబీ అజాద్ లాంటి ముఖ్యమంత్రులు, రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించమనే షాబుద్దీన్ లు, వందేమాతరాన్ని పాడము అని తేల్చి చెప్పే ఉలేమాలు - రేపు జాతీయ గీతాన్ని, జాతీయ జండాను కూడా అవమానించినా లౌకిక ప్రజాస్వామ్య దేశంలో అవి మైనారిటీ హక్కుల కిందే జమ చేసే నీతిలేని రాజకీయ జాతులున్న ఈ దేశంలో ఆ విషయాలు వేలెత్తి చూపినా తప్పే.


అపి స్వర్ణమయి లంకానాం నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి


మాతృదేశం కన్నా, మతానికి విలువనిచ్చే ప్రతి దౌర్భాగ్యుడూ దేశద్రోహే. వాళ్ళని తరిమి కొట్టనంతవరకూ ముంబాయి తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.


ముంబాయి మృతవీరులకు శ్రద్ధాంజలులతో...

Thursday, November 19, 2009

కవిత్వమంటే "మాటలా"?

మొన్న ఒకానొక చర్చలో బొల్లోజు బాబా గారు కొన్ని ఆసక్తికరమైన సందేహాలు లేవనెత్తారు. ఆయనకు సమాధానమైతే కాదు కానీ, ఆ సందేహాల ప్రేరణే ఈ వ్యాసం.

బాబా గారు లేవనెత్తిన సందేహాల్లో మొదటిది "కవిత్వం అర్ధం కావాలా అఖ్ఖరలేదా?" దీనికి సమాధానం చాలా సరళం. అర్ధం కావాల్సిందే. మరి, కవిత్వం అర్ధం కాకపోవటానికి కారణమేమిటి? నేనాలోచించే పరిధిలో దీనికి కారణాలు రెండు. ఒకటి కవిలో లోపం. రెండు పాఠకుడిలో లోపం. చెప్పాలనుకున్న భావాన్ని, చెప్పాల్సిన భాషలో చెప్పలేకపోవటం కవి పరంగా లోపం. వ్రాసిన కవి విడమరిచి చెబితే కానీ, అర్ధం చేసుకోలేకపోవటం పాఠకుడి లోపం.

అంటే, భాష సరళంగా ఉన్నంత మాత్రాన కవిత్వం అర్ధమౌతుందా అనడిగితే, కాదనే చెప్పాలి. సరళమైన భాష ఉన్నా, మితి మీరిన సంక్లిష్టత కవిత్వానికి అర్ధం లేకుండా చేస్తుంది. సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి, సరళమైన భాషలోనే ప్రజలు మెచ్చిన కవి "శివారెడ్డి" వ్రాసిన ఈ కవితనోసారి చదువుదాం.

నేనొక బర్రె పక్కలో

నేనొక బర్రెపక్కలో పడుకోగలను
దాని పొదుగులో తలదూర్చి నిద్రించగలను
దాని శరీరం నుంచి వచ్చే నులివెచ్చని కాంతిలో
నన్ను నేను శుద్ధి చేసుకోగలను

ఒక జీవి
ఇంకొక జీవి
ఒక జీవి ఇంకొక జీవిని
ముట్టుకోవటం
స్పర్శోపాధిని వెతుక్కోవటం
ఒకదానికొకటి తోడు
అదొక ధైర్యం, అదొక ఆనందం, అదొక అప్యాయత
నేనుగాక
మరొకరున్నారనే ఒక భద్రత
సహజీవనం, సహచరత్వం
ఆనందమేమిటి
నాకు దగ్గరగా మరొకరుండటం
నాలాగ మరొకటి బతికుండటం
ఒక నది
నాలోనూ, దాన్లోనూ కదలాడటం

నా బర్రెని నేను ప్రేమిస్తాను
నా కుక్కని నేను ప్రేమిస్తాను
నేను, నా దొడ్లో లావణ్యంగా, నేర్పుగా
చెట్లమీద తిరిగే
అందాల పసికర పాముని ప్రేమిస్తాను
నా కాళ్ళకు చుట్టేసుకుని
నా మీదకు ఎగబాకే నా కుక్కపిల్ల కంటే
ఈ ప్రపంచంలో మరొకటి గొప్పదని
నే భావించటం లేదు
నేను దాన్ని వింటున్నా, చూస్తున్నా
అది నన్ను వింటుంది, చూస్తుంది

నేనొక బర్రె పక్కలో పడుకుని
దాని పొదుగులో తలదూర్చి నిద్రిస్తూ -
తెల్లని మేఘాల మీద
వెచ్చని లోకాల్లో నిర్భీతిగా విహరిస్తున్నా

కవితగా చలామణి అయిన పై రచనలో, భాష సరళమే. కానీ భావ సంక్లిష్టత గమనించండి. కవి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇది కవిత్వమా? లేక బర్రె మీది వ్యాసమా? మహామహులనుకుంటున్న కవులే ఈరకంగా వ్రాసి కవిత్వమని మభ్య పెడుతుంటే, ఇక మన బ్లాగుల్లో వచ్చే సోకాల్డ్ కవిత్వం గురించి బాధపడటం అవసరమా?

* * *

అర్ధంకానిదల్లా అద్భుతమైన కవిత్వం అని ఎలాగైతే చెప్పలేమో, అర్ధమైన ప్రతిదీ అద్భుతమని కూడా చెప్పలేం. మన శివారెడ్డిగారి మరో ఉదాహరణ చూడండి.

ఇది నాకూ నా కుక్కకి సంబంధించిన పద్యం

ఎవడి కుక్కను వాడు ప్రేమించవచ్చు, ఎవడి పెళ్ళాన్ని -
వాడు ప్రేమించినట్టుగానే
లేదు ఎవడి కుక్క వాణ్ణి ప్రేమిస్తుంది
ఎవడి పెళ్ళాం వాణ్ణి - ప్రేమించినట్టుగా -
కానీ చాలాచోట్ల పెళ్ళాం పిల్లలు ప్రేమించకపోయినా
కుక్క మాత్రం తప్పక ప్రేమిస్తుంది -
ఒక్క ముద్దేస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ గుర్తు పెట్టుకోకపోవచ్చు
కానీ, కుక్క మాత్రం గుర్తు పెట్టుకుంటుంది
ఎన్నిరకాలుగా, ఎన్ని భంగిమలతో, ఎన్ని శబ్దాలతో
దాని ప్రేమనీ, కౄతజ్ౙతనీ వ్యక్తపరుస్తుంది !
తప్పకుండా నువ్వు మేలుచేసినవాళ్ళు నీకు శత్రువులుగా మారొచ్చు
కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్క మాత్రం శత్రువవదు
కౄతఘ్నత అంతకన్నా చూపదు
ఇక్కడే కదా అది చనిపోయింది, క్షణంలో అందకుండా వెళ్ళిపోయింది
క్షణం ముందు దాకా నా భుజాలదాకా ఎగిరి,
నన్నల్లరి పెట్టి గొడవ చేసిన కుక్క విచిత్రంగా చనిపోయింది.
ఇక ఇప్పుడు మీరు నిర్భయంగా, నిస్సంకోచంగా గేటు తీయవచ్చు
నేను కూడా ఏ మూలనుంచో ఎగబడుతుందనే బెరుకు లేకుండా
గేటు తీయవచ్చు -
బహుశా అన్ని చావులకి అలవాటు పడిన మీకు కుక్క చావు
గొప్ప కాకపోవచ్చు
కళ్ళ ముందు మనిషిని మాయం చేస్తే పట్టించుకోని మీకు
ఒక కుక్క చావు గొప్ప కాకపోవచ్చు
అన్నింటికీ అన్ని కదలికలకీ మొద్దుబారిపోతున్న మీకు
కుక్క చావు గొప్ప విషయం కాకపోవచ్చు
కుక్కే కాదు ఏదీ కూడా మనల్ని కదిలించలేకపోవచ్చు
కంటనీరు పెట్టించకపోవచ్చు
యంత్రాలస్థితికి మనల్ని తెచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు
చెబుతూ నా కుక్క గురించి చెబుతా -
ఓ పొద్దుటి ఆ పూట నాలుగు చినుకులు పడేటప్పుడు
ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమో ఓ మూల మునగ తీసుక్కూర్చుంది
అంతే అప్పటి నుంచి మొదలైంది మా స్నేహానుబంధం
ఓ ముద్దకి నిష్కల్మషంగా ప్రేమించే కుక్కపోతే
దు:ఖపడనివాడు జీవితంలో దేనికి మాత్రం దు:ఖపడతాడు ?
చనిపోయి పదిరోజులైనా దాని తాలూకు స్పౄహ నన్ను వీడడం లేదు
అన్నింటికంటే ముఖ్యంగా చావెంత తేలికైపోయిందోనన్న భయం
ఎక్కడైనా, ఎవణ్ణయినా నిరభ్యంతరంగా వాళ్ళు చంపేయవచ్చు
పేపర్లలో చూస్తాం, ఓ క్షణం ఆగి అలాగా అని వెళ్ళిపోతాం
చావును అలవాటు చేస్తున్న వ్యవస్థకు జోహార్లు
సవాలక్ష సామాన్య విషయాల్లో చావు కూడా ఒకటని
మనకి ఎక్కిస్తున్న రాజ్యానికి జోహార్లు
అది సహజమరణమైతే, పండి రాలిపోవడమైతే నాకు బాధ లేదు,
పేచీ లేదు
ఎదుగుతున్న మొక్క మధ్యలోనే తుంచబడుతుంది
ఇప్పుడే కళ్ళ ముందు కదలాడినవాడు అంతర్థానమౌతాడు
చలనంలేని స్థితికి మనల్ని తెస్తున్న ప్రభుత్వానికి జోహార్లు
ఏ స్పందనా లేని మామూలు రాతి జీవితానికి మనని అలవాటు చేస్తున్న
క్రమబద్ధ విషప్రయోగ స్వాములకీ జోహార్లు


పాదాల దగ్గర మొదలై క్రమక్రమంగా ప్రతి అవయవం
చచ్చిపోతున్న స్థితిలో
నేను నా కుక్కని గురించి మాట్లాడడం నేరమే
మాట్లాడడమే దేశద్రోహమయ్యే స్థితిలో
నేను ఏ కుక్కను గురించి మాట్లాడినా నేరమౌతుంది
ఒక అప్రాణితత్వం మనలో పాదుకొంటున్న సమయంలో
ఒక అచేతనత్వం ఒక అమానుష్త్వం జీవితానికి
పర్యాయపదమయ్యే సన్నివేశంలో
కంటనీరు పెట్టడం నేరమే, ఆఫ్ట్రాల్ ఒక జాగిలం కోసం
విలవిల్లాడ్డం ఘోరమైన నేరమే
నాకు తెలియక అడుగుతాను -
కుక్కకీ, మనిషికీ ఏమిటీ తేడా ఇక్కడ?

* * *

అయ్యా ఇదీ సంగతి. భాషా సరళమే, భావమూ సరళమే. కానీ ఇది అద్భుతమైన కవిత్వమా లేక కుక్కపైని మొదటి సగం వ్యాసమా?

సరిగ్గా ఇలాంటి సమయంలోనే "అనంతం"లో శ్రీశ్రీ వ్రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తాయి.

తెలుగువాడి జాతీయగుణం ఓర్వలేనితనం. తెలుగువాడి జాతీయ కార్యక్రమం కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెట్టడం. కానీ, తెలుగుదేశంలో ఒక గొప్పతనం కూడా ఉంది. అదేమంటే, తెలుగుదేశంలో అందరూ కవులే.

ఏ చండశాసనుడికీ లేని శక్తి భాషకి ఉంది. భాషలో కూడా రాజులు, బానిసలు ఉన్నారు.

ఉద్రేకాలను రెచ్చగొట్టడం ఒకటే కవితాధర్మం కాదు. మనిషి ఆలోచించే జంతువు కాబట్టి, అతని కవిత కూడా ఆలోచనలు రేకెత్తించాలంటాను నేను. (శ్రీశ్రీ)

ఈనాడు కుటుంబ నియంత్రణకన్నా ముఖ్యం కవిత్వ నియంత్రణ అని నాకనిపిస్తుంది. (శ్రీశ్రీ)

మాటలకి సొంత విలువ లేదు. వాటిని పేర్చినప్పుడు కొంత విలువ వస్తుంది. పేర్చినంత మాత్రానే కవిత్వం కాదు. పేర్పు పేర్పులోంచి బయలుదేరే ఒకానొక వేడి - అదే మాటలను క్రియలుగా మార్చగలిగేది. అదే కావాలి. మాటలు మిగలకు. పొయెట్స్ ఆర్ ద ఇంజనీర్స్ ఆఫ్ ఎమోషన్, నాట్ ఇట్స్ విక్టింస్. కవిత్వం అంటే మాటలా?

Monday, November 2, 2009

కవిత్వం - నిబద్ధత

ఇస్మాయిల్ నిబద్ధ కవి కాదా? అనే వ్యాసానికి కొనసాగింపుగా ఇది వ్రాయటం జరుగుతున్నది. దీనికి ముందుగా కొన్ని వివరణలు, సంజాయిషీలు.


బొల్లోజుబాబా గారు అనని విషయాలని అన్నట్లుగా నేను వ్రాసినట్లు ఆయన అభియోగం చేసారు. ఇది కొంతవరకు సహేతుకమైన అభియోగమే. అయినప్పటికి, నా వివరణ ఇది.


బుడుగోయ్ గారి బ్లాగులో "నిబద్ధ, అనిబద్ధ" అన్న వర్గీకరణలు ప్రస్తావిస్తూ శ్రీశ్రీ, ఇస్మాయిల్ లకు అన్వయింపచేసింది ముందుగా బాబా గారే. దానికి సమర్ధింపుగా, అలా విమర్శకులు కూడా అన్నారని చెప్పడమే కాకుండా, ద్వా.నా.శాస్త్రి గారు కూడా వాడారు అని చెప్పింది బాబాగారే. ఆ విషయాన్నే, పరోక్షంగా ప్రస్తావించానని నా సంజాయిషి.


ఇక, భైరవభట్ల గారు ఇస్మాయిల్ కవిత్వంలోని సిద్ధాంతం మీద నేనో వ్యాసం వ్రాస్తే చదివిపెడతానన్నారు, ఏం పొడుస్తావో చూస్తాం అన్నట్లుగా :)) (సరదాకేలేండి). ప్రస్తుతానికి కాకపోయినా, "పొడి"చేస్తాననే హామీ ఇస్తున్నా.


* * *


సరే అసలు విషయానికి వద్దాం :


పాయింట్ నెం. ౧


నలుగురు అర్ధం చేసుకునే ఆంగ్ల భాషలో "నిబద్ధత" అన్న పదానికి అర్ధం కమిట్మెంట్ . ఇస్మాయిల్ అనిబద్ధ కవి అంటే, కమిట్మెంట్ లేని కవి అని అర్ధం! అంటే, "నిబద్ధత" అనే పదం ఎలా పెడార్ధాలు ఇస్తుందో కూడా తెలియకుండానే, మన విమర్శకులు, సమీక్షకులు ఇటువంటి పదప్రయోగంతో కవులను, కవిత్వాన్ని వర్గీకరించారన్న మాట!


ఆ దిక్కుమాలిన పద ప్రయోగాన్ని సమర్ధించుకుంటూ, "నిబద్ధతకు", "అనిబద్ధతకు" వాళ్ళిచ్చే తాత్పర్యం మరింత సిగ్గుచేటు. ఒక సిద్ధాంతానికో, లేదంటే ఒక వాదనకో కట్టుబడి వ్రాసే కవులందరూ నిబద్ధ కవులట. అలా ఏ సిద్ధాంతానికీ, వాదనకూ కట్టుబడని కవులందరూ అనిబద్ధ కవులట. తెలుగు పదాలకు అర్ధమే తెలుసుకోని ప్రబుద్ధులు చేసే వర్గీకరణకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ చేసే సమర్ధింపులు కూడా. ఆపైన, "నిబద్ధత-అనిబద్ధత"లకు కొత్త పదాలు కనిపెట్టమని మనవి కూడా!


* * *


పాయింట్ నెం. ౨


సరే, మాట వరసకు "నిబద్ధ, అనిబద్ధ" కవిత్వాలను ఒప్పుకుందాం. అంటే, విమర్శకుల, సమీక్షకుల ప్రకారం కవిత్వం "నిబద్ధమైనా" అయ్యుండాలి, లేదంటే "అనిబద్ధమైనా" అయ్యుండాలి. ఈ రెంటిని మించిన "సర్వబద్ధ కవిత్వం" వ్రాసిన మొనగాడైన కవి తెలుగులో లేడన్న మాట. అలా లేడని ఎలా తీర్మానించారు అని అడగకూడదేమో! అడిగితే, మరో వ్యాసం వ్రాయమంటారు "సర్వబద్ధ కవిత్వం" అనే వర్గీకరణ గురించి :))

* * *


పాయింట్ నెం. ౩


వైయుక్తికమైన భావనను అక్షరరూపంలో పెట్టి సార్వత్రికం చేయగలగటం కవిత్వమనే విషయంలో బహుశా ఎవరికీ ఎట్టి విపత్తు లేదనే అనుకుంటాను. అటు శ్రీశ్రీ వ్రాసిన కవితలైనా, ఇటు ఇస్మాయిల్ వ్రాసిన కవితలైనా ఆ కోవకు చెందినవే అనటంలోనూ ఎటువంటి సందేహాలకూ తావు లేదనుకుంటాను. మరి, తన వైయుక్తికమైన భావనను ప్రకటించిన శ్రీశ్రీ కమ్యూనిజం అనే సిద్ధాంతం లేదా వాదనకు చెందిన కవిత్వమే వ్రాసారని ఎలా తీర్మానిస్తాం?


దారి పొడవునా గుండె నెత్తురులు "తర్పణ" చేస్తూ పదండి ముందుకు అన్నాడే కానీ, దారి పొడవునా గుండె నెత్తురుల "ధారలు" పోస్తూ అని అనలేదే? హరోం హర హర హరోం హర హర హరోం హరా అని అరవమన్నాడే. "తర్పణలు", "హరోం హర"లు, జగన్నాధ రథచక్రాలు, కలకత్తా కాళిక నాలుకలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలేం కావు కదా?


వైయుక్తికమైన భావనను సార్వత్రికం చేయటానికే శ్రీశ్రీ కూడా ప్రయత్నించాడు కానీ కమ్యూనిజం అనే సామూహిక భావనను కాదు.


* * *


పాయింట్ నెం. ౪


మన విమర్శకులకు, సమీక్షకులకు ఉన్న ఓ దురలవాటు ఏమిటంటే, కవిత్వాన్ని కవిత్వంతో బేరీజు వేయటం కాకుండా, బైటి లక్షణాలను బట్టి విలువ కడతారు. అందుకు ఉదాహరణలుగా భావ కవిత్వమని, అనుభూతి కవిత్వమని, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వమని ఇలా నానా రకాలుగా ఆయా కవిత్వాలకు విలువలు కట్టేసారు. నిజానికి, కవిత్వానికి భావం, అనుభూతి ప్రధానం. భావానుభూతులు లేకుండానే శ్రీశ్రీ కవిత్వం వ్రాసాడంటారా? మరి శ్రీశ్రీ విప్లవ కవి ఎందుకయ్యాడు?


దానికి బాబాగారు ఇచ్చే వివరణ కూడా హాస్యాస్పదం. శ్రీశ్రీ వ్రాసిన కవితల్లో అధిక శాతం విప్లవానికో, కమ్యూనిజానికో సంబంధించినవి కాబట్టి, ఆయన్ని ఆ గాటనే కట్టేయాలట! వీరి అభిప్రాయం ప్రకారం, శ్రీశ్రీ కవిత్వంలో భావం కన్నా, నినాదాలే ఉన్నాయని తీర్మానించేయొచ్చా? ఆ మాటకొస్తే, శ్రీశ్రీని "అభావ" కవి అని కూడా అనేయొచ్చేమో!


* * *


అలోక్ వాస్తవ్ గారు చెప్పినట్లు "కవిత్వమంటే ఇలా గుండ్రాయిలా ఉంటుంది" అని చెప్పలేం కదా అనేనెపంతో, ఇష్టం వచ్చింది వ్రాసి అదే కవిత్వమని మభ్యపెట్టటం ఎలా తప్పో, బాధ్యతారాహిత్యంతో, అవగాహనలేమితో, అకడమిక్ విశ్లేషణ పేరుతో చేసే దండుగమారి వర్గీకరణలు కూడా తప్పే. మహాకవులను కూడా గాటన కట్టేద్దామనే సంకుచిత ధోరణి తెలుగు సాహిత్యానికి హానికరం .