Tuesday, July 27, 2010

బాబ్లీ రాజకీయాల్లో పిడకల వేట

ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం రాజకీయాలు నడిపే మన నేతలు మొదటిసారి ప్రజల కోసం రాజకీయాలు నడపటం ముదావహం. ఈ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ప్రజల కోసం ఉద్యమించినప్పుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకులే ఒళ్ళు హూనమయ్యేలా కుళ్ళబొడుస్తారనే ఓ నగ్న సత్యాన్ని అనుభవంతో గ్రహించారు మన తెలుగుదేశం నేతలు. అరకొర వసతుల మధ్య, మరాఠీ లాఠీ దెబ్బలతో దినదిన గండంగా అయిదురోజులు వెళ్ళబుచ్చామని చంద్రబాబు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. 

ఒక్కసారి లాఠీ ఝలిపించేటప్పటికే, వాతలు తేలిన వీపు చూపిస్తు ఒక నేత, స్పృహ తప్పిన మరో మహిళా నేత, కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాయకుడు.... ప్రజా ఉద్యమంలో లోతుపాతులు చవిచూడటం మంచి పరిణామమే కదా!

అధికారంలో ఉన్నప్పుడు, స్త్రీలని, విద్యార్ధులని, బడుగు రైతులనీ లేకుండా అనేకానేక ఉద్యమాలను ఆయనే ఎలా అణచివేసారో కూడా ఆ అయిదు రోజుల్లో ఒక్కసారైనా ఆయనకు గుర్తుకొచ్చి ఉంటుందనే ఆశిస్తాను. అరకొర ఏంటి, అసలు వసతులే లేని ఆంధ్ర లాకప్పుల్లో ఎంతమంది మగ్గిపోతున్నారో కూడా ఆయనకు ఓ అంచనా వచ్చి ఉంటుందనే ఆశిస్తాను.

ప్రజా ఉద్యమాల లోటుపాట్లు బానే అర్ధం చేసుకున్న కాంగ్రెసీయులకు, ఎలాగూ తమ పీఠాల కింద పదవీ పీఠాలు కాపాడుకోటానికే తీరిక లేదు కాబట్టి, ఇలాంటి రాజకీయ ఉద్యమాలు నడిపే తీరిక మాత్రం ఇంకెక్కడిది? కాబట్టి కాంగ్రెస్ నేతలు బతికి బట్ట కట్టేసినట్లే.

చంద్రబాబు రాజకీయ పాచిక ఈ తెలంగాణా ఉప ఎన్నికల్లో పారిందో, వచ్చే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ళు తమ వీపులు రెడీ చేసుకోవాల్సిందే. కర్ణాటక, తమిళ్నాడు పోలీసు లాఠీలకు కూడా త్వరలోనే బోల్డు పని దొరకబోతుంది.

Friday, July 16, 2010

సోంపేట స్ఫూర్తి


మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?

కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.

తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.

గ్రామ స్వరాజ్యం సాధ్యపడినప్పుడే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బోధించిన మహాత్ముని వారసులు, గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెగబడటంలోని ఔచిత్యం ఏ ప్రజాస్వామిక విధాన స్ఫూర్తి?

కొన్నాళ్ళ క్రితమే, పర్యావరణ అనుమతులు అందించిన కేంద్ర పర్యావరణ శాఖ, ఈరోజు ఆ అనుమతులను వెనక్కు తీసుకున్నదని వార్తలు. అసలు, తప్పుడు సమాచారంతో పర్యావరణ అనుమతులు అధికారులు ఎలా సంపాదించారు? ఆయా అధికారులను ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇవేవీ ఇప్పుడు చర్చకు రావు. ప్రస్తుతానికి, ప్రజల గద్దింపులను సర్దిచేప్పే ప్రయత్నాలలో ఇదో భాగం మాత్రమే.

పార్టీల కతీతంగా ఆయా గ్రామాల ప్రజలు సోంపేటలో చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వాలని, తద్వారా దేశాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో భావ చైతన్యం పెరగాలి. మునుపెవ్వరో ఏదో బ్లాగులో కామెంటు చేసినట్లు, రోజుకు 24 గంటల కరెంటుతో, 24 గంటల కేబుల్ టీవీ ప్రసారాలతో, రోజుకోసారి మునిసిపాలిటీ వారిచ్చే మంచినీటితో సంతృప్తి చెందే స్థాయి నుంచి దాటి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మన కళ్ళకు కడుతున్న గంతలు తీసి నిజాలు నిర్ధారించుకునే స్థాయిలో విప్లవాత్మకమైన చైతన్య స్ఫూర్తి మనలో కలగాలి.

ఆ స్ఫూర్తే, మరిన్ని సోంపేటలు పునరావృతం కాకుండా ఆపగలుగుతుంది. ఆ స్ఫూర్తే అంతరాల భేషజాలు లేని ప్రజా ఐక్యతకు పునాదౌతుంది.

Sunday, July 4, 2010

అధ్యాయం- 1 పల్నాటి వీరభారతం

తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే - తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, "జిట్టగామాలపాడు" ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.

సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు వినిపించింది.

అతను ఛటక్కున ఆగిపోయాడు.

అరక దున్నే దాపలిగిత్త "అంబా" అన్నది.

రామిరెడ్డి చుట్టుపక్కల కలయజూసాడు.

పచ్చటి వెలుగు వ్యాపించుకుంటున్న పల్లెల మీద పడి మెరుస్తున్న నీరెండ.

మళ్ళా "కేర్ ... కేర్ .."మన్న రోదన.

మిగతా ఆవకాయ.కామ్ లో...