మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
గ్రామ స్వరాజ్యం సాధ్యపడినప్పుడే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బోధించిన మహాత్ముని వారసులు, గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెగబడటంలోని ఔచిత్యం ఏ ప్రజాస్వామిక విధాన స్ఫూర్తి?
కొన్నాళ్ళ క్రితమే, పర్యావరణ అనుమతులు అందించిన కేంద్ర పర్యావరణ శాఖ, ఈరోజు ఆ అనుమతులను వెనక్కు తీసుకున్నదని వార్తలు. అసలు, తప్పుడు సమాచారంతో పర్యావరణ అనుమతులు అధికారులు ఎలా సంపాదించారు? ఆయా అధికారులను ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇవేవీ ఇప్పుడు చర్చకు రావు. ప్రస్తుతానికి, ప్రజల గద్దింపులను సర్దిచేప్పే ప్రయత్నాలలో ఇదో భాగం మాత్రమే.
పార్టీల కతీతంగా ఆయా గ్రామాల ప్రజలు సోంపేటలో చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వాలని, తద్వారా దేశాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో భావ చైతన్యం పెరగాలి. మునుపెవ్వరో ఏదో బ్లాగులో కామెంటు చేసినట్లు, రోజుకు 24 గంటల కరెంటుతో, 24 గంటల కేబుల్ టీవీ ప్రసారాలతో, రోజుకోసారి మునిసిపాలిటీ వారిచ్చే మంచినీటితో సంతృప్తి చెందే స్థాయి నుంచి దాటి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మన కళ్ళకు కడుతున్న గంతలు తీసి నిజాలు నిర్ధారించుకునే స్థాయిలో విప్లవాత్మకమైన చైతన్య స్ఫూర్తి మనలో కలగాలి.
ఆ స్ఫూర్తే, మరిన్ని సోంపేటలు పునరావృతం కాకుండా ఆపగలుగుతుంది. ఆ స్ఫూర్తే అంతరాల భేషజాలు లేని ప్రజా ఐక్యతకు పునాదౌతుంది.
well said
ReplyDeletechaalaa correct ga chepparu Kiran ju
ReplyDeleteనమస్కారమండీ...నేను మీ బ్లాగుకి ఎప్పట్నుంచో ఫాలోయర్ ని...ఇప్పటికి కామెంటు పెట్టే అవకాశం,ధైర్యం రెండూ వచ్చాయి....వాడిగా,వేడిగా మీరు సంధించే పదాల అస్త్రాలు నాకు చాలా బాగా అనిపిస్తుంటాయి..ఏ విషయాన్నైనా సూటిగా,నిర్భయంగా చెప్పే మీ శైలి నన్ను మరీ మరీ చదివిస్తుంది...ఇలానే మరిన్ని భావాలు మీనుంచి చదువుకోవాలని కోరుకుంటూ..
ReplyDeleteమధ్య తరగతి మనిషికి మనసు ఎక్కడ వుంది సార్! తన కడుపు నిండిందా లేదా! తన బతుకు నడుస్తుందా లేదా! పక్కోడు ఎలా పోయినా మనకెందుకులే అని నిస్తేజం.. మహా అయితే మనమందరిలా కొంత బాధపడి ఒక నిట్టూర్పు వదులుతాము.. కడుపు తరుక్కుపోతుంది.. ఏమి చేయలేని మన నిస్సహాయతకి.. ఎందుకు నా బతుకు ?
ReplyDelete