Wednesday, October 13, 2010

నాకు నచ్చిన తెలుగు పాటలు - 01

చాలా రోజుల నుండి నాకు ఇష్టమైన కొన్ని సినిమా, సినిమాయేతర పాటలు ప్రస్తావిస్తూ వ్రాద్దామనుకుంటూనే బద్ధకిస్తున్నాను. ఈమధ్యనే, మలక్, జ్యోతి గారు తదితరులు వారికి ఇష్టమైన పాటలతో వ్రాసిన పోస్టులు చదివి, ప్రేరణ పొంది, బద్ధకానికి స్వస్తి చెబుదామని నిశ్చయించుకున్నాను. నాకు సినిమా పరిజ్ఞానం ఏమాత్రమూ లేదు. నాకు నచ్చే సినిమాలు, పాటలు కూడా చాలా తక్కువే. నావరకు అద్భుతంగా తోచిన, నచ్చిన పాటల తోరణాలు ఇవి :

* * *

సంగీత, సాహిత్యాలకి తెలుగు సంస్కృతితో విడదీయలేని సంబంధం ఉన్నదనేది కాదనలేని సత్యం. విశేషమేమిటంటే, సినిమాలకు సంబంధించిన కొందరు అమరగాయకులు, సంగీత దర్శకులు, చివరికి కొన్ని పాటలు కూడా తెలుగు సంస్కృతిలో భాగమయ్యారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఓ ఘంటశాల చాలు. ఆయన పాట తెలియని వ్యక్తి ఖచ్చితంగా తెలుగువాడై ఉండడు. కుల, మత, ప్రాంతీయ విబేధాలకు అతీతమైన స్వరమాధుర్యంతో తెలుగు సంస్కృతితో మమేకమైన గాయకుడు ఆయన. అలానే, కొన్ని సినిమా పాటలు కూడా.

ఇప్పుడు నేను చెప్పబోయే పాట విశేషం కూడా ఇదే. ఈ పాట మారుమోగని శ్రీరామనవమి పందిరి ఉండదు. ఈ పాట లేకుండా పెళ్ళిళ్ళు జరిగే తెలుగు గడప ఉండదు. శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలోని "సీతా రాముల కళ్యాణము చూతము రారండి..." పాటే ఇది. సీతారాముల కళ్యాణం బహుశా ఇలానే జరిగి ఉంటుందనేలా ఆ పాటను చిత్రీకరించిన తీరు నిజంగా అద్భుతం. ఒక పరిపూర్ణమైన నటుడిగానే కాక, ఓ దర్శకుడిగా కూడా ఎన్ టి రామారావు ప్రతిభకు నిదర్శనం ఈ పాట చిత్రీకరించిన తీరు. అలానే సంగీత దర్శకుడు గాలిపెంచల గారు -  తెలుగు పెళ్ళిళ్ళల్లో చిరస్మరణీయుడైనాడు. నాకు అమితంగా నచ్చిన పాటల్లో మొట్టమొదటిది ఈ పాట.

ఈ పాటలో చివరిలో సీతా రాములు తలంబ్రాలు వేసుకునే సన్నివేశం ముఖ్యంగా గమనించండి. ఆ సన్నివేశంలో విశ్వామిత్రుడుగా గుమ్మడి కనబరచిన హావభావాలు ఆయన మహానటుడు ఎందుకనేదానికి సమాధానంగా ఉంటుంది. కేవలం రెండు మూడు సెకండ్ల క్లోజప్ షాట్ లో... ఓ దేవకార్యాన్ని పూర్తి చేయగలిగానన్న సంతృప్తి, విశ్వామిత్రుడుగా ఆయన వెలిబుచ్చిన తీరు అనితరసాధ్యం.