Friday, March 26, 2010

అపానకళ

"ఎమ్.ఎఫ్. హుస్సేన్ దోహాలో ఉంటే ఎవరికేంటి నష్టం" అని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ప్రశ్నించిన తీరు అద్భుతంగా అనిపించింది.

"భారతదేశం గర్వించదగ్గ కలాకారుడైన హుస్సేను"పై దాఖలైన వందకు పైగా కేసుల్ని ఎత్తివేయాలని ఎవడో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ మొట్టికాయవేసి మోకాలితో తోసి తన్ని అవతల పారేసింది.

ఇంతా జరిగాక ఘనత వహించుకొన్న కొంతమంది మేతావులు విమర్శల గడ్డిపోచల్ని నెమరేయడం ఖాయం. సదరు మేతావుల తోకాత్మలు కొన్ని గిలగిలా కొట్టుకోవడమూ సంభవనీయమే! ఏది ఏమైనా "కామెడీ కేతిగాళ్ళ" సందడి మళ్లీ మొదలౌతుంది.

మిగతా "ఆవకాయలో"

Saturday, March 13, 2010

జిహాదీల కన్నా, నక్సల్స్ తోనే ప్రమాదమా!

"జిహాదీ ఉగ్రవాదం కన్నా, నక్సలిజంతోనే దేశానికి అధిక ముప్పు"!

ఎవరో అల్లాటప్పాగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, దులుపుకొని వెళ్ళిపోవొచ్చు. తొమ్మిదవ ఇండియా టుడే సదస్సులో సాక్షాత్తు దేశ గృహ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఇది.

నక్సలైట్ల హింసాకాండను నేను సమర్ధించనూ లేను, నిరసించనూ లేను. సమర్ధించలేకపోవటానికి ప్రధాన కారణం - వీరి వల్ల అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం. నిరసించలేకపోవటానికి కారణం -  ప్రజాస్వామ్యం మీద ఏమాత్రమూ నమ్మకంలేని వీరు తమ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆయుధాలు చేపట్టటం. మహాత్ముని వారసులమైనా, హింసలేని ఏ పోరాటమూ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించలేదని నమ్ముతాను కనుక.

ఘనత వహించిన మన ప్రజాస్వామ్య దేశంలోని అసమానతలను రూపుమాపటానికి, అన్నిటినీ వొదులుకొని, ఆయుధాలు చేపట్టిన మహామహుల చరిత్ర నక్సల్ ఉద్యమంతో పెనవేసుకుంది. వీరి ప్రధాన శత్రువు రాజ్యం అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. వీరి దృష్టిలో వీరి పోరాటపు ఉద్దేశ్యం మన దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం.

మరి జిహాదో! ఇస్లాం పేరిట పరాయి దేశమైన పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న సంక్షోభం. పాకిస్తాన్ కుట్రలో పాలు పంచుకుంటున్న దేశ విదేశి మతోన్మాదులు - అల్ ఖాయిదా, జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి. దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, ప్రజల ప్రాణాలకు విలువలేకుండా చేసిన ఈ దుర్మార్గులు మాత్రం మన ప్రభుత్వాలకు మానసపుత్రులు.!

పట్టుబడిన నక్సలైట్లను మాత్రం ఎన్ కౌంటర్ పేరిట చంపేసే దమ్మున్న ప్రజాస్వామ్యం మనది. పట్టుబడ్డ తీవ్రవాదులకు, ఉరిశిక్ష పడ్డ తీవ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ, శిక్షించాలా వద్దా అని ఏళ్ళ తరబడి తాత్సారం చేసే ప్రజాస్వామ్యం కూడా మనదే!

మతం పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జిహాదీ ఉగ్రవాదులతో పోలిస్తే, ప్రజల కోసం అన్నిటినీ వదులుకొని, ప్రాణాలు కూడా పణం పెట్టే నక్సలైట్లు దైవ సమానులు.

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు.
 
గుత్తికొండ బిలం
 
మట్టిలో కాదు
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.

ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.

మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.

సమాజసేద్యానికి
పేగులు తెంచుకొని
పిడికిలి బిగించిన
కొమరయ్యలు, మజుందార్లు
కామ్రెడ్లు, ఆశయాలు

చదును చేయని గతం పొరలు
చీల్చుకొచ్చిన కలుపు మొక్కలు
మంత్రులు, భూస్వాములు
అధికారాలు, అవకాశాలు

ఆకాశానికి, పాతాళానికి
మధ్యనున్న అగాథాలు...

అవి పూడ్చేటందుకు
అధికారిక చర్చలు!!

విప్లవానికి జోలపాటలా?
ఉక్కుశాసనాల
కరకు మోసమా??

నిదురపోని గతం నాది
నిదురలేని స్వప్నం నాది
ఎదిరించే నైజం నాది
ఎదురులేని నిజం నాది
మట్టిలో కలిసిపోని
ఒకేఒక్క ఇజం నాది
నెత్తురులో ఈదుతున్న
నక్సలిజం నాది.
 

Wednesday, March 10, 2010

కామెడీ స్వాములు-బూతు బొమ్మలు

చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.

నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.

ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.

నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!

అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?

ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.

Monday, March 8, 2010

అనామిక డైరీలో ప్రతిరోజూ...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో.... మహిళల కోసం నా పాత కవిత....

యవ్వనం పొలిమేరల్లో ఉన్నప్పుడే
నాలుగు అక్షింతలు వేసి
ఆంజనేయులుకు కట్టబెట్టారు
ఉత్తేజంతో యవ్వనాన్ని
ఏతమేసి తోడేసరికి
రెండు ఇష్యూలు
ఆపైన, కరీనాలాంటిదాన్ని
కొక్కిరాయినైపోయాను
ఈ అమీర్ ఖాన్ కళ్ళకు!


పేస్టు బాలేదని మారిస్తే,
నా టేస్టు బాగుందన్నవాడే
ఇప్పుడు గీచి గీచి
ట్యూబు కోసిమరీ వాడమంటుంటే
తాజ్ మహల్ గుర్తుకొచ్చి
నవ్వొస్తుంది.
తాజ్ మహలంటే గుర్తొచ్చింది,
టీ పొడి తెమ్మని గుర్తుచేయాలి.


ఎదురెదురు గోడలకి
మేకులు కొట్టి
మంగళసూత్రాన్ని
దండెంగా కట్టి
నా జీవితాన్ని ఎండగట్టిన
పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
ఇద్దరాడపిల్లలను చూసి
గమ్మునుండాల్సి వస్తున్నది.


ఏంటో, నాకోసం నేను గడిపే
ఈ పావుగంటలోనూ
ఎన్నెన్నో ఆలోచనలు
సబ్బు కూడా అయిపోయింది
తెమ్మంటే ఏం తెగులో
ఈరోజుకు ఇలా తెమిలేస్తా.

Friday, March 5, 2010

"చివరకు మిగిలేది" - ఓ ఆక్రోశం


"చివరకు మిగిలేది" పురాణమూ కాదు, ఇతిహాసమూ కాదు. కాకమ్మ కథ, పిచ్చుకమ్మ కథ లాంటి బుచ్చిబాబు వ్రాసిన కథ. జీవితంలో ప్రేమించలేకపోవడమే ఒక విషాదంగా నమ్మి, దానికి తను నమ్మిన ఇతర తాత్వికచింతనలు జోడించి నలుగురితో తన బాధను పంచుకుందామని "బుచ్చిబాబు" చేసిన ప్రయత్నం "చివరికి మిగిలేది". 1952 లో జరిగిన మొదటి ముద్రణ నుంచి, 2006 వరకు జరిగిన ఆరవ ముద్రణ వరకు, యాభైనాలుగేళ్ళల్లో ఆరు ముద్రణలు పూర్తి చేసుకున్నదంటే నవల ఖచ్చితంగా క్లాసిక్కే. క్లాసిక్ కాకపోయినా, యాభై ఏళ్ళ తర్వాత కూడా పాఠకులు ఆదరిస్తున్నారు కాబట్టి, తెలుగు సాహిత్యంలో నవలకు, నవలకున్న అగ్రస్థాయికి వచ్చిన ఢోకా ఏమీలేదు.

విషయం పక్కనపెట్టి, స్థూలంగా "చివరికి మిగిలేది" ఒక కథలా మాత్రమే పరిగణించి పరికిస్తే, కథనంలో కవిత్వాత్మక వచనం, ఆత్మ సంశోధనా, సంవేదన భరితమైన కొన్ని రసవత్తర ఘట్టాలు తప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటి రచనలతో పోలిస్తే, అక్కడక్కడ స్త్రీస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించటం తప్పించి, ప్రత్యేకించి ఎన్నదగ్గ సామాజిక విలువలు కూడా లేవు.

చెప్పుకోదగ్గంతగా లేని సామాజిక విలువల కారణంగా పుస్తకానికి పట్టం కట్టలేని పరిస్థితి ఒకవైపైతే, పేలవమైన కథ కారణంగా, కథనంలోని అద్భుతమైన సాహితీ విలువలకు పట్టం కట్టలేని దుస్థితి మరో వైపు. నా ఆక్రోశం కూడా అదే!

* * *

సామాజిక ధృక్కోణాలు మారుతున్నాయి. అలానే, సామాజిక, సాహితీ విలువలు కూడా మారుతున్నాయి. ఆలోచనా పరిధుల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో గమనిస్తే, పుస్తకం.నెట్ లోని "హేలి" గారి సమీక్ష నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, నెత్తి నోరు బాదుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. "

శరత్ సాహిత్యంలో తలమానికమై భాసించే "దేవదాస్" కు పట్టిన దుర్గతితో పోలిస్తే, హేలీ గారి వ్యాసం పెద్ద లెక్కలోది కూడా కాదు. ఈ రోజుల్లో కొద్దిగా గడ్డం పెంచితే, అమ్మాయిగాని హాండిచ్చిందా, దేవదాసయ్యావని పరామర్శించే మిత్రులకు కొదవలేదు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో "దేవదాస్" ను ఆదరించి ఉండవచ్చు. పరిస్థితులు ప్రస్తుతమైతే లేవు.

అదేవిధంగా, తెలుగులో అభ్యుదయ రచనలకు ఆద్యుడుగా గురజాడ అప్పారావుగారికి ఉన్న గౌరవం మరెవ్వరికీ లేదు. కానీ, ఆరోజుల్లో ఆయన వ్రాసినట్లుగా "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని ఈరోజుల్లో వ్రాస్తే, సందేశాలాపి కవిత్వం చూపించమంటారు నేటితరం కవులు, విమర్శకులు.

మారుతున్న సామాజిక ధోరణికి అనుగుణంగా ప్రజలూ మారుతున్నారు. మారుతున్న ప్రజల ప్రామాణికాల కనుగుణంగా, ఆయా రచనలను బేరీజు వేస్తున్నారు. పురాణేతిహాసాలకే దిక్కులేని పరిస్థితుల్లో, అటువంటి సమీక్షలకు, విమర్శలకు ఆక్రోశించాల్సిన అవసరం లేదు.

* * *

పుస్తకంలోని పాత్రలు కల్పితమో కావో ఇతమిద్ధంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రచయితగా బుచ్చిబాబు చేసే తత్వ విచారణ మాత్రం, ఆయనని రచయితకన్నా కూడా తాత్వికునిగా మరో మెట్టుపైన నిలబెడుతుంది. నా వరకూ ఇందులో కథ ముఖ్యం కానేకాదు. ఆయా పాత్రల నేపథ్యంలో రచయిత వ్యక్తపరుస్తున్న తాత్విక చింతన ముఖ్యం. కోణంలో ఆలోచిస్తే, అద్భుతమైన వాక్యాలు గుట్టలు గుట్టలుగా ఇందులో కనిపిస్తాయి.

సాథారణమైన కథకు అసాథారణతను చేకూర్చింది రచయితలోని అభివ్యక్తే. అద్భుతమైన కవిత్వాత్మక వాక్యాలవల్లనే, పేలవమైన కథ కూడా చదివింపజేస్తుంది. అద్భుతమైన వాక్యాలతో, కావ్య సృష్టి జరిగుంటే, మన జ్ఞానపీఠాలకు ఖచ్చితంగా గౌరవం దక్కి ఉండేదని నా నిశ్చితాభిప్రాయం.

ఓ రెండు ఆణిముత్యాల్లాంటి పంక్తులు చూద్దాం : 

* * *

గడ్డిపోచ విలువెంత?

చివరికి మిగలడం! పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్ఛిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు  భయంతో మెరుస్తున్నాయి. కాలవ తోకని త్రిప్పుకుంటున్న నల్లత్రాచులా వంకర తిరిగి అంతర్ధానమైంది. ఆకాశం కేసి చూస్తూ ఒడ్డున గడ్డిపోచల మధ్య దయానిధి నవ్వుకున్నాడు.

అంత భయపడాల్సిన అవసరం ఏమిటన్నట్లు దయానిధి నవ్వినట్లు అనిపిస్తుంది. అవసరం లేదంటూ, బుచ్చిబాబు తర్వాతి పంక్తుల్లో చెప్పే వాక్యాలు అనితరసాధ్యం.

శరీరాన్ని ఆవరించుకున్న గాలి అందమైన అల్పానుభవం. శరీరం దాహంతో వికసిస్తుంది. ...... కళ్ళు చూడడంమానుకుని దర్శిస్తాయి. పడమటి ఆకాశంలో పూడుకుంటున్న పుండు రాత్రి వెదకటం విరమించుకున్న మేఘాలు, భయం లేకుండా మెరుస్తున్న నక్షత్రాలు, ........ కదులుతున్న గడ్డిపోచలు, మూగ భక్తితో ప్రశాంతం చెందిన ప్రకృతి, తనూ - అన్నీ ఏకమైపోయి ఒక్కసారి చైతన్యం పోగొట్టుకొని, ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఉండిపోయాయి.

* * *

అలలు మెల్లగా గట్టు మీద ఊపిరి తీసుకుంటున్నాయి. మట్టిలో వేడిగాలి పైకి వెళ్ళలేక భూమినే ఆవరించుకుంది. పొడుస్తున్న చుక్కల ప్రతిబింబాలు చెరువులో పడ్డాయి.

* * *

చెప్పుకుంటూ పోతే, దాదాపు సగం పుస్తకాన్ని వ్రాయాల్సి ఉంటుంది. పేలవమైన కథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైన సాహితీ విలువలు ఎలా నిరుపయోగమయ్యాయో అనేదే నా ఆక్రోశం.

బుచ్చిబాబు మాటల్లోనే నా ఆక్రోశం చెప్పాలంటే "పరిమళం బరువుకీ రంగు వొత్తిడికీ తట్టుకోలేక వూడి పడిపోయిన అడవి పువ్వు; పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచు ముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్నమంటలో నడిజ్వాల అర్ధరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగ బాధ."

Wednesday, March 3, 2010

కామెడీ హుస్సేన్ కోసం కన్నీళ్ళు దేనికి?


కాటికి పోవాల్సిన కామెడీ హుస్సేన్, కతర్ కు పోయాడట. మొత్తానికి ముంబాయిలో తంతే, కతర్ లో వెళ్ళి పడ్డాడు - భారతదేశ లౌకిక ప్రజా"స్వాముల" కళా సామ్రాట్ - మక్బూల్ ఫిదా హుస్సేన్. 95 సంవత్సరాల పండు వయసులో అష్టకష్టాలు పడుతూ దేశంకాని దేశంలో తలదాచుకోవాల్సి రావటం సామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నదట! అంతర్జాతీయంగా భారత్ కు అప్రదిష్ట కలిగించిన పరిణామంగా కూడా పేర్కొన్నారు సంభాషణ అనే బ్లాగు రచయిత.

"ఒకరు ఒక రచయితను, మరొకరు మరో రచయితను నిషేధించడమో, ప్రవాసంలోకో, నిర్బంధంలోకో పంపడం చేస్తూ పోతే - చివరకు సమాజంలో భావ ప్రకటనే ఉండదు" అంటారు ఈ బ్లాగరు.

మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజలు (ముఖ్యంగా హిందువులు) కట్టుబడి ఉన్న కారణంగానే, నిన్న మొన్నటి వరకు ఎమ్మెఫ్ హుస్సేన్ భారత్ లో ఉండ గలిగాడు. హద్దులు మీరిన స్వాతంత్ర్యం, అడ్డగోలు స్వేచ్ఛ పుచ్చుకోవాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్నది హుస్సేనే. దేశంలోని మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఛీత్కరిస్తూ, హిందు దేవతల, దేవుళ్ళ చిత్రాలను నగ్నంగా చిత్రించటమే కాకుండా, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ఇటువంటి దేశద్రోహులు పరాయిదేశంలో స్థిరపడితే, హిందు దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు.

హిందువుల సహనానికి పరీక్ష పెట్టే, కుహానా లౌకికవాదులు హిందు దేవతలను నగ్నంగా చిత్రించినప్పుడు హుస్సేన్ ను అధిక్షేపించలేదే? ఆ పని చేసిన హిందువులను మాత్రం మతవాదులుగా చిత్రీకరించటంలోని ఔచిత్యం ఏమిటి? మహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన భార్యల పొందులో కేరింతలు కొట్టే మహమ్మద్ ప్రవక్త కేళీ విలాసాన్ని నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన మతానికో రూలు, పక్క మతానికో రూలూనా? ఇకపైగా, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛా! చదువుకున్నవాళ్ళే, కళ్ళు మూసుకొని కబోదులుగా నటిస్తూ, తమను తాము లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా పరిగణించుకోవటం "మహా కామెడీ". అది ఈ దేశంలోనే సాధ్యం.

మన పురాణాలను, పురాణ పాత్రలను "సి" గ్రేడు స్థాయికి దిగజార్చి చేసే రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తాం. వావి వరసలు లేకుండా దేవుళ్ళను, దేవతలను నగ్నంగాను, అనౌచిత్యంగాను చిత్రించే వాడికోసం కన్నీళ్ళు కారుస్తాం. ఓ కమర్షియల్ పెయింటరుకు, దలైలామాకు పోలిక పెట్టి, మన మీద మనం ఉమ్మేసుకుంటాం. పడ్డవాడికి లౌకిక స్ఫూర్తి లేదంటాం, చెడ్డవాడిని నెత్తిన పెట్టుకుంటాం. ఒక్కసారి, అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకుంటూ, తమను తాము నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ "లౌకిక ప్రజాస్వామ్యవాదులకు" ఉంది.

ఆ బ్లాగు రచయిత ఇంకా అంటారు "భావప్రకటనాస్వేచ్ఛ అంటే ఎవరైనా ఏదైనా రాయవచ్చునని కాదు. కానీ, రచనారంగంలో ఉన్నవారిని కట్టడి చేయడానికి మంచి మార్గంలో పెట్టడానికి రచనారంగానికి సంబంధించిన పోరాటరూపాలనే ఎంచుకోవాలి. విమర్శను విమర్శతో ఎదుర్కొనాలి. రచయితలు కూడా సందర్భాన్ని గుర్తెరిగి, సున్నితత్వాలను పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలి. ఎవరైనా హద్దు మీరిన ట్టు భావిస్తే, దాన్ని అదే పాఠకుల మధ్య ఎంతటి తీవ్రమైన విమర్శ ద్వారానైనా పూర్వపక్షం చేయవచ్చు. ఆరోగ్యకరమైన, పరిణతి చెందిన ప్రజాస్వా మ్యం లక్షణం అది.”

అయ్యా, మీరు చెప్పిన ప్రజాస్వామ్య లక్షణాలలో భాగంగానే, హుస్సేన్ మీద కేసులు వేయటం జరిగింది. ఆ కేసులు ఇంకా నడుస్తుండగానే, దేశం విడిచి పారిపోయిన వ్యక్తిని మీరు వెనకేసుకు రావటంలో అర్ధం లేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించే వ్యక్తి అయితే, ఆ కేసులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండేవాడు. కనీసం, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేవాడు. ఇవేమీ చేయకుండా, దుబాయికి పారిపోయాడంటేనే తెలుస్తుంది వాడు ఎంత క్రిమినల్ అనే విషయం.

పక్కవాడి స్వేచ్ఛకు విఘాతం కలిగించనంతవరకు మాత్రమే, మన స్వేచ్ఛ ఉంటుందని గ్రహించలేని వ్యక్తి కోసం మీరు అన్నేసి కన్నీళ్ళు పారబోసుకోవాల్సిన అవసరం లేదు. విమర్శనాత్మక విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని ఆదేశ సూత్రాలలో చెప్పిన విషయాన్ని తుంగలో తొక్కే హుస్సేన్ లాంటి దుర్మార్గులకు నిజానికి దేశంలోనే ఉరిశిక్ష పడి ఉండాల్సింది. కనీసం ఈరకంగా బహిష్కరింపబడినందుకు సంతోషం.