Friday, December 26, 2008

బాధ్యత ఎవరిది?

'వయం పంచాధికం శతం' అనే మహాభారత శ్లోకాన్ని ఉదహరిస్తూ కడప రఘోత్తమరావు గారు 'ఆవకాయలో' వ్రాసినవ్యాసంలో ముంబయి పై తీవ్రవాదుల దాడి తర్వాత సమైక్యరాగాన్ని ఆలపించిన మన రాజకీయ పార్టీలను, నాయకులనుచూసి ముచ్చటపడిపోయారు. నిజానికి పార్లమెంటులో మన రాజకీయ నాయకుల 'రాగాలాపన' కొసరు కథే! అసలు కథఅంతకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు పరికిస్తే అర్ధమౌతుంది

అద్వాని మొదలుకొని సోనియా వరకు, బుల్లి నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకూ తీవ్రవాదుల చర్యను వారి వారిసామర్ధ్యాన్ని బట్టి ఖండించారు. అదే సమైక్యత 'అఫ్జల్ గురు' కు సుప్రీంకోర్టు విధించిన ఉరి శిక్ష అమలులోకనిపించదెందుకని? విషయంపై తాత్సారం ఎందుకని సోనియా ప్రశ్నించదే?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, తీవ్రవాదుల దాడి జరిగిన దాదాపు నెలరోజులకు 'అంతూలే'లకు నోరువస్తుంది. హేమంత్ కర్కరేను తుదముట్టించటానికి హిందూ తీవ్రవాదులు ఆడిన నాటకం ఆయనకు కనిపిస్తుంది! మూడు పొద్దులపాటు అడిగినవారికి అడగనివారికి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆనక పార్లమెంటులో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం తనకు తృప్తినిచ్చిందని అడ్డగోలుగా, సిగ్గులేకుండా ప్రకటిస్తాడు. మూడు రోజుల్లోఅంతూలేలకు తోడుగా దిగ్విజయ్ సింగ్ లు రావటం యధోచితంగా 'రాజకీయ నాటకానికి' తోడ్పాటు నివ్వటం సిగ్గెగ్గులులేకుండా సాగిపోతుంది.

మూడు రోజుల్లో అంతూలే ద్వారా ఆడిన నాటకానికి మైనారిటీలు ఉబ్బితబ్బిబ్బవుతారని కాంగ్రెస్ అనుకుంటే అంతకుమించిన దౌర్భాగ్యం దేశానికి మరొకటి ఉండదు.

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి పార్లమెంటుపై జరిగిన దాడికి కూడా చలించని ప్రభుత్వాలు, ముంబైలో తీవ్రవాదులదాడికి చలించి సమైక్యరాగాన్ని ఆలపించాయంటే నమ్మడానికి ఏమాత్రమూ ఆస్కారంలేదు. ఎన్నికలనుదృష్టిలో ఉంచుకొని వారు చేసిన కుప్పిగంతులుగానే వాటిని భావించాలి.

దేశంలో జరిగిన ప్రతి తీవ్రవాద ఘాతుకానికి పాకిస్తాన్ దే బాధ్యత అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయిప్రభుత్వాలు. సమైక్యరాగాన్ని ఆలపించిన నేతలకు నిజంగానే సిగ్గెగ్గులు ఉంటే, ఇజ్రాయిల్ తరహాలోసమాధానమెందుకు ఇవ్వరు? సంవత్సరానికి కొన్ని వేలమంది మరణిస్తున్నా, మన ప్రభుత్వాలు సరిహద్దులకావలితీవ్రవాదుల శిబిరాలపై దాడులు ఎందుకని చేయవు? ఒక ఇందిరాగాంధిని హత్య చేసారని, మొత్తం సిక్కు జాతినితుదముట్టించే విధంగా కత్తులు నూరి, దాడులు చేసిన కాంగ్రెసీయులకు దేశప్రజల విషయం పట్టదా?

కొసరు విషయాల మధ్య అసలు విషయం మరుగున పడిందనేది వాస్తవం. ఇంతకి తీవ్రవాదుల దాడికి బాధ్యతఎవరిది?

నైతికత గురించి నైతిక బాధ్యత గురించి, ముఖ్యంగా రాజకీయాల్లో నైతికబాధ్యత గురించి గత నెల రోజులుగా చాలానేరహస్యాలు తెలుస్తున్నాయి. మునుపటి రాజకీయ నాయకులకు నైతికబాధ్యత గురించి ఒక్కరోజులోనే తెలిసొచ్చేది. ఏదైనా ఘోరం జరిగినప్పుడు, వెంటనే స్పందించటమూ జరిగేది. ఇప్పుడు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడికొండకచో సంవత్సరాల తరబడి ఆలోచించిన తర్వాత అధిష్టానం చెప్పినప్పుడు మాత్రమే నైతికబాధ్యత గురించితెలుస్తున్నది.

నైతిక బాధ్యతకు ప్రస్తుతం కొత్త భాష్యం చెబుతూ, కేంద్ర హోం మంత్రి, మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామాలుచేయటంలో చిత్తశుద్ధి కన్నా, రాజకీయాలే కనిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి విషయమే చూస్తే, అసలు ఆయనకునైతికత అన్నదే లేదు. ఎన్నికల్లో ఓడిపోయి, అధిష్టానం ఆశీర్వాదాలతో దొడ్డిదారిన పార్లమెంటులో ప్రవేశించటమేకాకుండా, మంత్రి పదవి - అందులోనూ హోం మంత్రి పదవి చేపట్టినప్పుడు ఈయనకి నైతికత ఎందుకు గుర్తుకురాలేదు?

మునుపు అహ్మదాబాద్, హైద్రాబాద్, బెంగుళూరు, జైపూర్, వారణాసి తదితర ప్రదేశాలలో తీవ్రవాదులు బాంబులుపేల్చినప్పుడు ఎందుకని నైతిక బాధ్యత తీసుకోలేదు? మొన్నటికి మొన్న, ఢిల్లీలో బాంబులు పేలినప్పుడు కూడా, ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా విమర్శించినా కూడా, అధిష్టానం కోరితేనే రాజీనామా చేస్తానన్న పెద్దమనిషికి అప్పుడు నైతికబాధ్యత ఎందుకు గుర్తుకు రాలేదు?

పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన రాజీనామా చేయాల్సివచ్చిందికానీ, నిజంగా నైతిక బాధ్యత వహించి మాత్రం కాదు.

సమాజంలో నైతికవిలువలు పతనమౌతున్నాయన్న నెపంతో మహారాష్ట్రలో డాన్సుబారులు రద్దుచేశాడు మహారాష్ట్రహోం మంత్రి. జుగుప్సాకర నృత్యాలతో యువతను పెడదోవ పట్టిస్తున్న బార్ గర్ల్స్ సమాజానికి ప్రమాదకరం అని కూడాఅభివర్ణించాడు. అప్పట్లో ఎన్నికలకు కావల్సిన ఫండ్సును డాన్సు బార్ యజమానులు తమ పార్టీకి ఇవ్వలేదన్నఅక్కసుతో డాన్సుబారులు మూసివేయించాడని అందరికీ తెల్సిన విషయమే. అదే పెద్దమనిషి మీడియా ముందుఅంతకన్నా జుగుప్సాకరంగా వాగిన వాగుడు చూస్తే, సభ్యసమాజం తలదించుకోవాల్సిందే! మహానగరాల్లో ఇటువంటితీవ్రవాదుల దుశ్చర్యలు చాలా సామాన్యమేనట!

ఇందులో మరోవిషయం ఉంది. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకో లేదంటే, అస్సలునిర్ణయాలే తీసుకోకుండా సమస్య జటిలమయ్యేందుకు దోహదపడినందువల్లనో నైతికబాధ్యత వహించి రాజీనామా చేస్తేసరిపోతుందా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పు చేసినందుకు శిక్ష ఎందుకు అనుభవించరు మంత్రులు.

ఒక ప్రభుత్వాధికారి తప్పు చేసి, నైతికబాధ్యత వహించి రాజీనామా చేస్తే, ఇక అతనిపై చర్యలేమీ తీసుకోరా? మరిమంత్రులకు మాత్రం మినహాయింపు దేనికి? లేదంటే, రాజీనామా చేసి, పదవికి దూరంగా ఉండటమే మనరాజకీయనాయకులకు శిక్షా?

పాకిస్తాన్ కన్నా ప్రమాదకరమైన అంతః శత్రువులు మన రాజకీయ నాయకులు. నైతిక బాధ్యత గురించి వారికి దేహశుద్ధిచేసి చెప్పే క్షణం కోసం దేశప్రజలు వేచి చూస్తున్నారు .

Saturday, November 29, 2008

సిగ్గులేని ప్రభుత్వాలు

వాడి పేరు జకీరుల్లా. వయస్సు పాతికేళ్ళు. ముంబాయిలో మూడు రోజుల పాటు అల్లకల్లోలం సృష్టించిన తీవ్రవాదుల్లో వీడు కూడా ఒకడు. ఎ.టి.ఎస్.కు చెందిన ముగ్గురు సీనియర్ ఐ.పి.ఎస్. అధికారులనే కాకుండా, మరో 10-15 మంది అమాయక ప్రజలను మొన్న (26 నవంబరు 2008 రాత్రి) కాల్చి చంపిన తీవ్రవాది. ప్రస్తుతం క్రైం బ్రాంచ్ కస్టడీలో ఉన్నాడు. గాయపడ్డ వాడికి ఇబ్బంది లేకుండా, ముందుగానే ఆసుపత్రిలో చికిత్స చేయించారు కూడా. ఇకపైన సాగే తతంగాన్ని ఊహించటం కష్టమేం కాదు.

వీడు చేసిన ఘాతుకంతో ఇప్పుడు వీడో వి.ఐ.పి. మానవతా దృక్ఫధంతో రేపు వీడి తరుఫున ఓ జెఠ్మలానీనో మరో జిలానీనో కోర్టులో కేసు వాదిస్తామంటూ వస్తారు. ఓ అయిదారేళ్ళపాటు వాయిదాల మీద వాయిదాలు పొందుతారు. మధ్యమధ్యలో పోలీసులు వీడిని ఎంత హింసిస్తున్నారో వివరిస్తూ, ప్రభుత్వానికి తాఖీదులు కూడా పంపుతారు మానవహక్కుల సంఘం వారు. వీళ్ళకి సైదోడుగా నిలుస్తారు కుహానా లౌకికవాదులు. వీడికి అఫ్జల్ గురు టైపులోనో, అబు సలేం టైపులోనో ఫైవ్ స్టార్ ట్రీట్మెంటు ఇవ్వాలని డిమండు చేస్తారు, ఇప్పిస్తారు కూడా. వీలైతే, జైలు నుంచే వీడిని ఎన్నికల్లో నిలబెట్టటానికి సిద్ధమని సమాజ్ వాదినో మరో పార్టీనో సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఈలోపు సుప్రీం కోర్టు వాడికి ఉరిశిక్ష విధించినా, అది అమలు చేస్తే మైనారిటీలు ఫీలవుతారని ప్రభుత్వాలు తాత్సారం చేస్తాయి. వీడిని ఈలోపు విడిపించుకోటానికి మరో టెర్రర్ ఎటాక్ మొదలయ్యి, ఈ ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురినో, మనుమరాలినో కిడ్నాప్ చేస్తారు. చివరికి వీడు విడుదలౌతాడు.

పనికిరాని దద్దమ్మలు నడుపుతున్న ప్రభుత్వంలో ఇంతకుమించి న్యాయం జరుగదు. ఒక్కసారి వీడిని ముంబాయి ప్రజలకు అప్పగించి చూడండి. గుడ్లు పీకి, నాలుక కోసి, వేళ్ళు విరిచి, పోలీసులు కూడా ఊహించలేని విధంగా చిత్రహింసలు చేయకపోతే, ఒట్టు. మరి ఈ ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు తిరగబడరు? చట్టాన్ని గౌరవించే ప్రజలు చెత్తవెధవలు కూర్చున్న చట్టసభలను ఎందుకు ఇంకా గౌరవిస్తున్నారు? సమాధానం చెప్పటం కష్టం.

సరే, ఈ సంగతి కాసేపు పక్కనబెట్టి దరిద్రపుగొట్టు హోం మినిస్టర్ వేసిన వేషాలు ఓసారి మననం చేసుకుందాం. తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడుతారని తెలుసుట. కానీ, ఎక్కడో, ఎప్పుడో, ఎలానో తెలియదు కాబట్టి ఏం చేయలేకపోతున్నదిట ప్రభుత్వం. ఒరేయ్ మంత్రి, ఎవడు ఎలా ఎప్పుడు నిన్ను చంపుతాడో తెలియదనే కదరా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నావు. మరి సామాన్యప్రజలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు కల్పించలేవు. అయినా, తింగిరి వెధవ!! ఏ దొంగైనా ముందుగా చెప్పి మరీ వస్తాడురా? ఆమాత్రం ఇంగిత జ్ణానం కూడా లేకుండా టీవిల ముందు వాగేయటమేనా. నీకున్న ఆ దురద కూడా ఇప్పుడు తీవ్రవాదులు తీరుస్తారు. మొన్నటిదాకా, బాంబులు పెట్టి దాక్కునేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్నే ధిక్కరిస్తూ, మూడురోజులపాటు మహానగరంలోని ఓ ఏరియానే చేతుల్లో తీసుకున్నారు. రేపు నువ్వన్నట్లుగానే, ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేస్తారో చెప్పిమరీ చేస్తారు. అప్పుడేం పీకుతావో చూడాలని ఉంది.

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని.. హోం మినిస్టర్ పైత్యానికి ప్రధాని పైత్యం కూడా! అయ్యా తమరేదో మేథావిగా భావించేవాళ్ళం ఇప్పటి దాకా. ఈ తీవ్రవాదుల దాడి తర్వాత తమరు చేసిన ప్రసంగం విని మొహాన ఉమ్మేద్దామన్న కసి పుట్టింది - నాలాంటి సామాన్యుడికి కూడా. ఈ తీవ్రవాదుల ఘాతుకానికి వెనుక పాకిస్తాన్ ఉన్నదని చెప్పటానికి మాకు ప్రధానమంత్రి అక్కరలేదు. గత అయిదేళ్ళుగా, అంతకుముందు ఓ యాభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన మీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ నిర్వాకాలని చూస్తూ మిన్నకుండి పోయింది ఎందుకు. పిల్లి పిత్తినా, పాకిస్తానే కారణమనటానికి సిగ్గులేదు మీకు. సరిహద్దులు బార్లా తెరిచిపెట్టి, పాకిస్తానే కారణమనటం ముదురుతున్న పైత్యానికి నిదర్శనం.

2006లో ఇదే ముంబాయిలో లోకల్ ట్రైన్లలో బాంబులు పేల్చి కొన్ని వందలమందిని చంపినప్పుడు ఈ ప్రధాని చేసిన వాగ్దానం నాకింకా గుర్తే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాలతో నలిపేస్తామన్నాడు. ఆ తర్వాత తీరిగ్గా 'పోటా' చట్టాన్ని పీకి పారేసాడు. వీడా, తీవ్రవాదాన్ని నిర్మూలించేది?

అసలు ఆ మాటకొస్తే, భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించటంలో పాకిస్తాన్ కు సరిసమానమైన పాత్రను పోషించింది మన ప్రభుత్వాలే. భింద్రన్ వాలేను పంజాబులో పెంచిపోషించింది ఎవరో అందరికీ తెలిసిందే. అఫ్జల్ గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినా, ఇంతవరకూ అమలు చేయకుండా ఉండటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా? ఎవడో మంత్రి కూతుర్ని కిడ్నాప్ చేసి, తీవ్రవాదుల్ని విడుదల చేయించుకోవటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా? కాందహార్ లో తీవ్రవాదుల అడుగులకుమడుగులొత్తటం తీవ్రవాదానికి ఊతమివ్వటం కాదా?

వెన్నెముకలేని వెధవలు హోం మినిస్టర్లగాను, ప్రైం మినిస్టర్లగాను దేశాన్ని పరిపాలించటం మనదేశంలోనే సాధ్యం. వీరి పాలనలో క్షేమంగా ఉండగలమనుకోవటం అత్యాసే. ఉన్మాదుల దుశ్చర్యలకు సాక్షులుగా ఉన్న కొందరు చెప్పిన విషయాలు విన్న తర్వాత, ముంబాయిలోని మారణకాండ చూసి కళ్ళెర్ర జేయనివాడు గాంధీ అంతటి మహానుభావుడైనా అయ్యుండాలి, లేదంటే మన్మోహన్ లాంటి మోపివెధవైనా అయ్యుండాలి.

రెండేళ్ళ పాపను చంకన వేసుకుని ఆక్రందిస్తూ పరుగిడుతున్న ఓ తల్లిని, అటు తిరిగిఉన్న తీవ్రవాది ఇటు తిరిగి మరీ కాల్చి చంపాడట. ఆపైన కిందపడి ఏడుస్తున్న ఆ రెండేళ్ళ పాపను కూడా ఏమాత్రమూ దయలేకుండా కాల్చి నింపాదిగా నడుచుకుంటు పోయాడట! ఎవరు వీళ్ళకి ఈ ధైర్యాన్ని కల్పించారు? పాకిస్తానా లేక మన విధానాలా?

ఒక్క రాజకీయ నాయకుడు తప్పించి, బీదవాడైనా, మధ్యతరగతివాడైనా, ధనవంతుడైనా బతికి బట్టకట్టలేని పరిస్థితి మనదేశంలో ఉంది. దాదాపు అయిదు వందల మంది దేశప్రజలను, పదిహేను మంది పోలీసు అధికారులను, మరో ఇద్దరు కమెండోలను కోల్పోయి మనం సాధించింది ఓ పది మంది తీవ్రవాదులని చంపేయటం! దుశ్చర్య జరిగిన మర్నాడే, ప్రజలు తమ సాథారణ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రదర్శించిన ధైర్యాన్ని మెచ్చుకుంటే ఉప్పొంగిపోతాం. నరనరాల్లో దేశభక్తి జీర్ణించుకుపోయిందని సంబరపడతాం. కానీ, ఇటువంటి దుశ్చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటికి ప్రభుత్వవిధానాలు దన్నుగా ఎందుకు నిలుస్తున్నాయని ఎవ్వరం ప్రశ్నించం.

చచ్చిపోయిన జనాల కోసం శాంతియాత్రలు చేస్తాం. వీరమరణం పొందిన పోలీసు అధికారులకి నివాళులర్పిస్తాం. అవార్డులు కూడా ఇస్తాం. కానీ, వారి మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని మాత్రం నిలదీయం.

నిజానికి, దుశ్చర్య జరిగిన మర్నాడు ఉదయం అంటే, 27 డిసెంబరు 2008్ ఉదయం మా లోకల్ ట్రైను దాదాపు 70% ఖాళీగా ఉంది. అదే పరిస్థితి ఆ మర్నాడు కూడా.

అమెరికాలో 9/11 తర్వాత ఎటువంటి తీవ్రవాద దుర్ఘటన జరుగలేదు. కానీ మనదేశంలో ఇలా ఇంకెంతమంది చచ్చిపోతే, మన ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయో?

హైద్రాబాద్, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ, గౌహతి, ముంబాయ్, అలహాబాద్, వారణాసి, బెంగుళూర్ .. ఇంకెన్ని?

Thursday, October 16, 2008

ముక్కలేకపోతున్న ముఖ్యమంత్రి

ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఈ నిర్ణయంతో అటు తెలుగుదేశం నుండి బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్ కు, ఇటు కాంగ్రెస్ కు ఒకేసారి చెక్ మేట్ చెప్పినట్లయ్యింది. ఏదో ఒక నిర్ణయానికి కాంగ్రెస్ రావల్సిన పరిస్థితుల మధ్య, ఇప్పుడు మత ప్రాతిపదికన తెలంగాణాను వ్యతిరేకించటానికి ముఖ్యమంత్రి సమాయత్తమౌతున్నారు.

ప్రత్యేక తెలంగాణాకు ముస్లీములు వ్యతిరేకమని మజ్లిస్ నేత అల్లిన పలుకులనే చిలకలా ముఖ్యమంత్రి వల్లెవేయటం సిగ్గుపడాల్సిన విషయం. నలుగురైదుగురు మజ్లిస్ ఎమ్మెల్యేల దన్నుతో తెలంగాణాకు మోకాలడ్డగలమని భావించటం బాధాకరం. ఆ మాటకొస్తే, తెలంగాణా వల్ల ముస్లీములకు కలిగే ఇబ్బందులేమిటన్నది ఎవరికీ అర్ధం కాదు. కేవలం మైనారిటీ మతానికి చెందినవారిని ఉద్రేకపరచి, అశ్లీలరాజకీయాన్ని నెరుపుతూ చోద్యం చూడాలన్న దరిద్రపు తలపే ముఖ్యమంత్రి వ్యవహారశైలిలో కనిపిస్తున్నది కానీ, ముస్లీముల సంక్షేమం కాదు. మొన్నటిదాకా కమ్యూనిస్టులే అడ్డమన్న పెద్దమనిషి ఈరోజు హఠాత్తుగా ముస్లీములు కూడా తెలంగాణాకు వ్యతిరేకమని ఎలా తెలుసుకున్నారో ఆయన్నే అడగాలి.

కాంగ్రెస్ మినహా తక్కిన పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణా విషయంలో తమ విధానాన్ని వెలిబుచ్చాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, తె.రా.స.లు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ఏవిధంగా ప్రభావం చూపగలవనేది ఖచ్చితంగా చెప్పలేం. నిరుడు మోసం చేసిన కాంగ్రెస్ ను ఈసారి నమ్మాలనుకోవటంలో అర్ధం లేదు. తెలుగుదేశం, తె.రా.స.ల పరిస్థితే, చిరంజీవి ప్రజారాజ్యం కూడా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యేక తెలంగాణా రాదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇవ్వరాదనటానికి సరైన కారణాలు కూడా చెప్పలేని నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ ఆశించలేం కూడా.

నేత మాటల కనుగుణంగానే, భట్రాజుల ఊపు జోరందుకుంది. తెలంగాణాతోపాటుగా ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా కావాలట. అనంతపురాన్ని కర్ణాటకలో కలిపేయాలట! సాక్షాత్తు రాష్ట్రమంత్రి దివాకర్ రెడ్డి ప్రకటన. రాష్ట్రం కాగితం ముక్క కాదట, అడగ్గానే రెండు ముక్కలు చేసి ఇవ్వటానికి. ఇది కేకే గారి పైత్యం. ఎన్నికలలోపే తెలంగాణా వచ్చే అవకాశాలున్నాయంటూ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటన మరోవైపు. ఇలా, ప్రజలను అయోమయానికి గురిచేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ సత్రకాయల జోరు సాగుతున్నది.

ఈ కుటిల ప్రయత్నాల వెనుక ఉన్నది కేవలం ముఖ్యమంత్రే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అజీర్ణవ్యాధిగ్రస్తుడు కాలకృత్యాలు తీర్చుకోటానికి ముక్కుతూ మూలుగుతూ ఎలా ప్రయత్నిస్తాడో దాదాపు అదే పరిస్థితిలో ముఖ్యమంత్రి ముక్కుతున్నారు. ముందుగా ప్రణబ్ కమిటీ నివేదికే తేలుస్తుందన్నారు. తర్వాత సోనియాకే నిర్ణయాధికారం ఉందన్నారు. పిమ్మట, ఏకాభిప్రాయమే మార్గమన్నారు. అటు పిమ్మట తెలుగుదేశం, కమ్యూనిస్టులే అడ్డంకి అన్నారు. ఇప్పుడు కొత్తగా ముస్లీములు ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకమంటున్నారు!

అయ్యా ముఖ్యమంత్రీ... ప్రజాస్వామ్యంతోపాటుగా, ఏ స్వామ్యంలోనైనా ఏకాభిప్రాయసాధన సాధ్యమయ్యేదేనా? ఆ మాటకొస్తే, ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారనా, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో యు.పి.ఎ. కొలువుతీరింది? మైనారిటీ అభిప్రాయానికి ఇస్తున్న విలువ, మెజారిటీ అభిప్రాయానికి ఎందుకు ఇవ్వటంలేదు. ప్రత్యేక తెలంగాణా విషయంలో మీ అభిప్రాయం విస్పష్టంగా ఎందుకు చెప్పరు. వ్యక్తిగతంగా మీకే కాకుండా, అసలు పార్టీగా కాంగ్రెస్ కున్న అభిప్రాయం ఏమిటి? తమరు కల్పిస్తున్న అడ్డంకులన్నీ, పదవి కాపాడుకునే ప్రయత్నాలేనా?

Wednesday, August 13, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 06

పార్టీల వ్యవస్థల గురించి గతంలో కొద్దిగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దాన్నే మరి కొద్దిగా తరచి చూద్దాం. ఒక కుటుంబ పాలనలో దాదాపు అయిదు దశాబ్దాలు మగ్గిన దేశం మనది. దేశానికి, దేశప్రజలకు జవాబుదారీ వహించాల్సిన నేతలు, తమ స్వార్ధం కోసం (ఎన్నికల్లో టిక్కెట్టు కోసమో, పదవుల కొసమో) ఆయా కుటుంబాలకు ఎనలేని విధేయత ప్రకటించటం రివాజుగా మారింది కాంగ్రెస్ తోనే. క్రమేణా అదే ఒక సంస్కృతిగా మారి అన్ని పార్టీలకు పాకింది. అంతర్గత ప్రజాస్వామ్యమనేది మచ్చుకు కూడా కనిపించకుండా పోయింది. ఒక విషయంలో పార్టీ వైఖరిని నిరసించటం, ఆ కుటుంబానికి అవిధేయత ప్రకటించటంగా కూడా పరిగణించటం కద్దు.

లౌకికత్వానికి, సమసమాజానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలావరకు ఈ వలయంలో ఉన్నవే. కరుణానిధి అయినా దేవెగౌడ అయినా, లాలూ యాదవ్ అయినా ఎన్.సి.పి. అయినా, శివసేన అయినా, తెలుగుదేశం - తెరాసలయినా అన్నీ అవే తాను ముక్కలు. పార్టీలోనూ పదవుల్లోనూ ముఖ్యమైన పదవులన్నీ ఆయా కుటుంబాలవే.

ఇందిరాగాంధి మరణించిందని ఆమె కొడుకు, ఇంద్రారెడ్డి మరణించాడని ఆయన భార్య, పరిటాల రవి మరణించాడని ఆయన భార్య, పి.జె.ఆర్. మరణించాడని ఆయన కొడుకు. నిజానికి ఆయా పార్టీ కుటుంబాలే కాకుండా, పార్టీల్లోని చిన్న పెద్ద నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో తమతమ కుటుంబపాలనే ఉండేలా చూసుకోవటానికి తాపత్రయ పడటం ఎంతవరకు ప్రజాస్వామ్యయుతం?

అలా సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకూ ఆయా నియోజకవర్గాలను కొన్ని కుటుంబాలపరం చేయటం మన ప్రజాస్వామ్యపు ఘనతే! కుటుంబపాలనను నిరసిస్తూ వచ్చిన పార్టీలలో కూడా అదే ఒరవడి.

దేశానికేం చేసాడన్నదానికన్నా కూడా, ఆ పార్టీ కుటుంబపెద్దకు ఎలాంటి గౌరవమర్యాదలు చేసాడన్నది ముఖ్యమయ్యింది. ఒకప్పుడు ప్రధానిగా పనిచేసినా, ఒక పార్టీ కుటుంబపెద్దకు తగిన గౌరవమర్యాదలు చేయలేదని, మరణించిన ఆ మాజీప్రధానికి ఎలాంటి సత్కారాలు చేసారో మనమెరుగుదుము. ఆ మహానుభావుడి శవాన్ని కాకులకు కుక్కలకు వదిలేసారు!!

ఆ కుటుంబ (పార్టీ) పెద్ద చెబితే, వాళ్ళ ఇల్లు ఊడ్చటానికైనా సిద్ధమనే వారికి అన్నీ తాయిలాలే! అలా రాష్ట్రపతులైనవారూ ఉన్నారు. సరే, దిగజారి ఏం చేయటానికి సిద్ధపడ్డా టిక్కెట్ ఇవ్వకపోయే సరికి ఆ పార్టీని వదిలి, ఆ మర్నాడే అదే పార్టీని అమ్మనాబూతులు తిట్టే నాయకమ్మణ్యులూ మనకున్నారు. అలానే, అమ్మవారికో అయ్యవారికో వీరవిధేయత చూపించే ఇతర నాయకులు కూడా, పార్టీ వదిలి వెళ్ళినవారు దేశానికి, రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసారన్నది కూడా కళ్ళకు కట్టినట్లు చెబుతారు. వాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్నీ మూసుకున్న ఆ వీరవిధేయులు, వాడు బయటకు వెళ్ళగానే, నోరు తెరవటంలోని ఔచిత్యం మనం ప్రశ్నించం.

అలా బయటకు వచ్చి - వాపును చూసి బలుపు అనుకుని వేరే కుంపట్లు పెట్టేయటం ఓ వ్యాపారమయ్యింది. అదృష్టం బాగుండి ఒకట్రెండు సీట్లు వచ్చినా ఆ సీట్లతో కోట్లు రాబట్టటం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యమేమీ కాదు.

సిద్ధాంతాలకు విలువనిచ్చే పార్టీలూ మృగ్యం, సిద్ధాంతాలు మెచ్చి పార్టీలో చేరే నాయకులూ మృగ్యం. నిన్నటిదాకా, శివసేనలో ఉండి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి, అతివాద హిందువుగా పేరు తెచ్చుకున్న నారాయణ్ రాణే, కాంగ్రెస్ లో చేరి ఎంత అవలీలగా లౌకికవాదిగా మారోడో చూడండి! ఏ నేతను తిరస్కరించి, వేరే కుంపటి పెట్టాడో, ఇప్పుడు అదే వ్యక్తి అధ్యక్షురాలుగా ఉన్న కూటమిలో చేరి మంత్రి పదవి కూడా అనుభవిస్తున్నాడు శరద్ పవార్!

అయిదు సంవత్సరాలు ఎన్.డి.ఎ.కు మద్దతు ఇచ్చి, కావాల్సినవన్నీ పొంది, ఆ పిమ్మటి ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఎన్.డి.ఎ.తో పొత్తు కారణంగా చెప్పి, మళ్ళీ కమ్యూనిస్టులకు దగ్గరౌతున్నాడు చంద్రబాబు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని లౌకికవాదం, ఎన్నికల్లో ఓడిపోగానే గుర్తుకు రావటం మనకు అసహజంగా అనిపించదు ఎందుకని?

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడీ అన్నట్లు, జనాకర్షణ ఉన్న ఓ వ్యక్తి కొత్తపార్టీతో వస్తుంటే, ప్రజలు మర్చిపోయిన చాలామంది పాత నాయకుల హడావుడీ ఎక్కువ. కొత్తపార్టీ నేతను ఆకర్షించటానికి చేయని గిమ్మిక్కులుండవు. పాతపార్టీలో ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నారో ఏకరవు పెడతారు. మరి ఇంతకాలమూ ఈ దుర్భరపరిస్థితుల్లో ఎందుకు ఉన్నారు అనడిగితే ప్రజా సేవే ముఖ్యంగా భావించామని చెబుతారు. అసలు, అధికారం కాకుండా ప్రజాసేవే పరమార్ధమైతే, ఏ పార్టీలో ఉన్నా సేవ చేయొచ్చుకదా!

మరి ఇటువంటి వారితోనే పార్టీ పెట్టబోయేటట్లయితే, చిరంజీవి పార్టీ మిగతా పార్టీలకు భిన్నమెలా అవుతుంది? లోక్ సత్తా పెట్టారు. మంచి ఆశయాలున్న పార్టీగా చెప్పుకున్నారు. మొన్నటిదాకా 'కొత్త' రాజకీయాలు ఆడతామని ప్రకటించిన ఆ పార్టీ ఇప్పుడు, రాజకీయాల్లో ఒంటరిగా ఉండి పోరాడలేము కాబట్టి ఇతర పార్టీలతో పొత్తులు తప్పనిసరి అనే దిశగా తమ భావజాలాన్ని మార్చుకుంటున్నది. అసలు నా అభిప్రాయంలో లోక్ సత్తాకు ఇతర పార్టీలకు ఇంతకు మునుపు నుంచే ఎటువంటి తేడా లేదు. అన్ని పార్టీలలానే, గాంధీ అంబేద్కర్ బొమ్మలతో ఓట్లు అడుక్కునే పార్టీగానే ఇది అవతరించిందని మొన్నామధ్య ఆ పార్టీకి సంబంధించిన ఓ ఫంక్షను చూసినప్పుడే అర్ధమయ్యింది.

కొద్దో గొప్పో సిద్ధాంతపరంగా ఒకస్థాయిలో ఉన్నాయని చెప్పుకోగల వామపక్షాలు, భా.జ.పా.లు కూడా క్రమేణా సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి అవకాశవాద రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఆ క్రమంలోనే, మిగతాపార్టీల తరహాలో వీరు కూడా రౌడీలకు, గూండాలకు చోటు ఇవ్వడం జరుగుతున్నది.

ఉన్నతాదర్శాలతో ప్రారంభమైన లోక్ సత్తా వంటి పార్టీలే తమ భావజాలం మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నాయంటే, పరిస్థితులు ఎలా దిగజారుతున్నాయో అర్ధమౌతుంది. రౌడీలకు, గూండాలకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వకుండా మనలేని విధంగా మన రాజకీయాలు తయారయ్యాయంటే ఎవరి తప్పు? రాజకీయ నాయకులదా? లేక వారిని శిక్షించేవిధంగా లేని మన రాజ్యాంగానిదా?

ఎన్నికల ముందు ఆ పిమ్మట వీళ్ళ కుప్పిగంతులు చూసితీరాలి. ఎన్నికల ముందు రైతులందరికీ ఉచితంగా ఇస్తామన్న కరెంటు, ఎంతమందికి ఉచితంగా దక్కిందనేది తెలిసిన విషయమే. ఉచితంగా ఇవ్వటం సాధ్యపడేది కాదని అప్పుడు విమర్శించిన చంద్రబాబు, ఈనాడు అందరికీ ఉచితంగా బియ్యం ఇస్తానంటున్నాడు. ఉచితంగా దొరికేదేదో ఊడబెరుక్కోవాలని, జనాలు కూడా మందలుగా ఓట్లేసేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. కనీసపు ఆలోచనతో తమ బుర్రకు పనులు పెట్టని బర్రెలు / గొర్రెలు మన జనాలు.

అయ్యా బియ్యం ఉచితమంటున్నావు, బానే ఉంది. అందులో ఏం వేసుకు తినాలి? పప్పు, నూనె, ఇంధనం వాటి ధరలు ఏమాత్రం ఉన్నాయి ఎవ్వరూ అడగరు. ఆచరణ సాధ్యం కాని పథకాలను మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను వంచన చేయటంలో తప్పు పార్టీలదే అయినా, ఆవిధంగా ప్రతిసారి మోసపోవటంలో మాత్రం తప్పు మన ప్రజలదే.

నేను మహారాష్ట్రలో ఠానేలో ఉంటున్నాను. ప్రాంతాన్ని బట్టి, ప్రతిరోజూ దాదాపు 8 నుంచి 15 గంటల దాకా కరెంటు కోత ఇక్కడ. ఈ మధ్యలో ఠానే పార్లమెంటు నియోజకవర్గానికి గాను మధ్యంతర ఎన్నిక వచ్చింది. ప్రచారానికి పది రోజుల ముందు నుంచి ఎన్నికలైన రెండు రోజుల దాకా కరెంటు కోత అనేదే లేదు. ప్రతిరోజూ గంటల తరబడి కోతవిధించబడుతున్నా, ఆ పన్నెండు రోజులు కోతలేని విద్యుత్తు ఎలా ఇవ్వగలిగారో?

ఇంకా విచిత్రం. ఈ విద్యుత్ కోత గురించి మాట్లాడే నాధుడే లేడు. అదే మీనాతాయి విగ్రహంపై ఎవరో దుమ్ము వేసారని ముంబాయి మొత్తాన్ని హడలెత్తించిన శివసేన, ఇంకా భా.జ.పా.లు అసలు విద్యుత్ ఊసే ఎత్తరు. ఎన్నికల ముందు మాత్రం హోరెత్తిస్తారు కరెంటు ఉచితంగా ఇస్తామని. అసలు కోతలే లేకుండా చూస్తామని.

ఏ పార్టీ చరిత్ర ఏ రాష్ట్రంలో చూసినా గర్వించదగ్గదేమీ లేదు. ఏ రాజకీయనాయకుడి చరిత్ర ఏ పదవిలోనైనా గర్వించదగ్గదేమీ చేయలేదు.

మన వ్యవస్థను, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చెప్పే మేధావినైతే కాదు. లోపాలేమిటనేవి మాత్రం గమనించే సాథారణ పౌరుడిని మాత్రమే. అయినా, నా పరిణితికి, నా ఆలోచనా పరిమితులకి లోబడి నేను ప్రస్తావించదలుచుకున్న మరికొన్ని విషయాలు త్వరలోనే తెలుపుతాను.

Friday, August 8, 2008

నిజంతో కాసేపు

ముసుగులో ఉన్నావు ఎవరు నీవు?
నీలో సగాన్ని, నీ ఇజంలో సగాన్ని.
అంటే నిజానివా?
అది నువ్వు పెట్టిన పేరే.
నిజం తప్ప ఏ ఇజమూ నిజం కాదా?
నిజం కాని అన్ని ఇజాలు అబద్ధాలే.
నువ్వు సగం ఇజానివన్నావు అంటే సగం అబద్ధమనేగా?
కాదు నీ ఇజంలో నిజమైన సగం ఇజాన్ని
అంటే, నా ఇజంలో సగం నిజం ఉన్నట్లేగా!
మాటల గారడీ చాలు. అబద్ధంతో కలసిన నిజం కాబట్టి, నీ ఇజం అబద్ధం.
సరే, అసలెందుకు వచ్చావు?
నేను రాలేదు. నువ్వే తొంగి చూసావు.
నీ మాట తప్ప, నువ్వు కనిపించవా?
చీకటిని కప్పుకున్న నిజాన్ని, నువ్వు చూడలేవు.
బయటకు రాలేని పిరికివాడివా?
బయటపడితే భరించలేవు.
బెదిరిస్తున్నావా?
బందిఖానాలో పెట్టింది నువ్వే.
ఆడుకోటానికి ఇంద్రధనుస్సు ఇస్తా, నిన్ను చూడనిస్తావా?
అబద్ధాన్ని కాదు ఆడుకోటానికి.
ఏం చేస్తే నిన్ను చూడగలను?
ఒక్క నిజం చెప్పు.
నిజం తెలియని మనిషిని, ఏ నిజం చెప్పను?
ఆ నిజం చాలు... చూడు....
అంత వికృతంగా ఉన్నావే?
నీ మనసులో చచ్చిపోయిన సగం మనిషిని.. నీ ఆలోచనల్లో పెరుగుతున్న సగం జంతువుని.
చాలు ఇక, ఆ చీకటినే కప్పుకో... నేను భరించలేను.

Wednesday, August 6, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 05

సమానహక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా... అదే కొద్దిగా పొడిగించి, ఉదాహరణలతోసహా చర్చించుకుందాం.

రాహుల్ మహజన్ లాంటి రాజకీయనాయకుని వారసుడో, ఫర్దీన్ ఖాన్ వంటి సినీనటుడో మాదకద్రవ్యాల వినియోగం చేస్తూ పట్టుబడితే, తేలిగ్గానే తప్పించుకోగలరు. కానీ, సామాన్యుడెవడైనా అయితే, ఇంతే సంగతులు.

హత్యా యత్నం కేసు నుంచి బాలకృష్ణ లాంటి నటులకు ఆఘమేఘాల మీద 'న్యాయం' జరిగిపోతుంది. కనీసం కోర్టు ముందుకు కూడా రాకుండానే, లాకప్పులలోనూ, జైళ్ళలోనూ మగ్గుతున్న కేసులు లక్షలమందివి.

నట్వర్ సింగ్ కోడలు ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా, ఆయన కుటుంబానికి ఏమీ జరగదు. అదే ఒక సామాన్యుని ఇంట్లో ఇటువంటి ఘోరం జరిగితే?

అమితాబ్ లు, అమీర్ ఖాన్ లు రైతులమని చెప్పి చవకగా భూములు కొనేయగలరు. అదే మోసం సామాన్యుడు చేస్తే, జీవితాంతం కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సిందే.

సామాజికంగానూ, రాజకీయంగానూ ఉన్నతస్థాయికి చేరినా తమ కుమార్తెలకు కాలేజీ సీట్ల కోసం రిజర్వేషనులు ఉపయోగించుకునే రాష్ట్రపతులు మనకున్నారు. ఆర్ధికంగా కనీసమైన స్థాయి లేక రిజర్వేషనులు ఉపయోగించుకోలేని సామాన్యులు చాలామందే మనకున్నారు.

మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. అలానే, పెట్టుబడిదారి వ్యవస్థ మనది. ఒకటిన్నర దశాబ్దం వరకూ పెట్టుబడులు దేశీయంగానే ఉండేవి. ఇప్పుడు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. దీన్నే ప్రపంచీకరణగా పరిగణిస్తున్నాము.

మొన్నటిదాకా, ఒక కలర్ టీవీ ధర పాతికవేల పైమాటగానే ఉండేది. అలానే, ఇతర సౌకర్యాలు కూడా. వాషింగ్ మెషిన్లని, ఎ.సి.లని గట్రా గట్రాలు. ప్రస్తుతం ఆరువేలకే కలర్ టీవి, వాషింగ్ మెషిన్లు లభిస్తున్నాయని, ప్రపంచీకరణ ద్వారానే ఇది సాధ్యమౌతున్నదని మనకు చెబుతున్నారు. బానే ఉంది. కానీ, ఒకానొకప్పుడు అయిదు రూపాయలకే మంచి నాణ్యమైన బియ్యం దొరికేది. ఇప్పుడో! ఒకప్పటి నిత్యావసరాల ధరలకి, ఇప్పటి ధరలకి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే, సౌకర్యాల సొంపులో అవసరాలను పట్టించుకోవటంలేదు. అలా అని, ప్రపంచీకరణ ఆసాంతం కూడదని చెప్పటంలేదు. దేశీయంగా ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టటంలేదని అడుగుతున్నాను.

సరే, ఈ నేపథ్యంలోనే సమాన హక్కుల గురించి మరో ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ప్రపంచీకరణ నేపథ్యంలో మన దేశంలో వాణిజ్యం చేస్తున్న దేశీయ లేదా విదేశీయ వ్యాపారి. రెండోవాడు తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ కడుపు నింపుకుంటున్న రైతు.

మొదటివాడు అడగటమే ఆలస్యం అన్నట్లు బ్యాంకులు లోన్లు ఇవ్వటానికి క్యూలు కడతాయి. వాడికి ప్రభుత్వమూ చాలానే తాయిలాలు ఇస్తుంది. వాడి వ్యాపారానికి సంబంధించిన ఆఫీసులు, ఫ్యాక్టరీలకు బీమా సౌకర్యాలూ అందుతాయి.

వాడి ఉత్పత్తులు - కోకాకోలానో, కలర్ టీవీనో మరేదో వస్తువు వాడు నిర్ణయించిన ధరకే అమ్ముడుపోతాయి. 'సీజన్ల' ప్రకారంగా వాడు ధరలు నిర్ణయిస్తాడు.

అంతాచేసి, వాడు ఐ.పి. పెట్టటానికి కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకుంటే, ఏ బ్యాంకు వాడినేమీ చేయలేదు. అలా, వ్యాపారసంస్థలకు ఇచ్చి వసూలు కాని రుణాలు కొన్ని వేలకోట్లు అని మొన్నామధ్య ఆర్.బి.ఐ. నివేదికలోనే చదివినట్లు గుర్తు.

ఇక రెండోవాడు, బ్యాంకుల చుట్టూ ఎన్నెన్ని ప్రదక్షిణలు చేసినా, దక్షిణలు సమర్పించుకున్నా వాడికి రుణాలు లభించవు. పంటలకు బీమా సౌకర్యం లభించదు. ఒకవేళ రుణం లభించినా, వరదలొచ్చో, వానలు పడకో పంట నాశనమైనా కూడా, వాడు చచ్చేదాకా అప్పు వసూలు చేసుకునేందుకు వెంటాడి వేధించే బ్యాంకులు మనవి.

అలానే, పండించిన ఏ పంటకు ధరలు వాడు నిర్ణయించుకోలేదు. మధ్యలో దళారులు, లేదంటే, దళారి పనే చేసే ప్రభుత్వసంస్థలు. అంతచేసీ, కనీస మద్దతుధర కూడా లభించని దౌర్భాగ్యం.

అలానే, మన పార్టీల వ్యవస్థలో సమానహక్కుల గురించి ఓ ఉదాహరణ.

ఒకానొక పార్టీలో ఫలానా నియోజకవర్గంలో దాదాపు ముప్ఫై నలభై ఏళ్ళుగా క్రమశిక్షణతో పనిచేస్తున్న ఓ కార్యకర్త ఉన్నాడు. ఆ పార్టీకే చెందిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేనో, ఎంపీనో మరణించాడు. వాడి స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఏ అధిష్టానమూ మల్లగుల్లాలు పడదు. చచ్చినవాడి భార్యో, కాదంటే కూతురో, లేదంటే కొడుకో! అన్ని సంవత్సరాల కార్యకర్త శ్రమకు ఫలితంగా ఏ పార్టీ వాడికి అవకాశం కల్పించదు. గాంధీలు, సింధియాలు, పైలట్లు ప్రతిపార్టీలోనూ ఉన్నారు. నిజానికి, ఉన్నదే వాళ్ళు.

దీనికి కాంట్రాస్టింగ్ గా మరో ఉదాహరణ (వాస్తవమైనదే) తీసుకుందాం. ఓ పెద్ద వ్యాపారి ఉన్నాడు. బ్రాండీ, విస్కీలు తయారుచేసి అమ్ముతూ ఉంటాడు. ఒకానొకనాడు, పార్లమెంటు సభ్యుడవ్వాలనే కోరిక పుట్టింది. అదృష్టం కూడా అలాంటివారి తలుపులే తడుతుందేమో! సరిగ్గా అప్పుడే, రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఏ రాజకీయపార్టీ వాడికి టిక్కెట్ ఇవ్వటంలేదు. సరే, స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడ్డాడు. గెల్చాడు కూడా. అర్హత ఉన్నా లేకపోయినా, వారసత్వంతోనో, ధన మదంతో చట్టసభల్లో ప్రవేశించగలిగే పరిస్థితి మన రాజ్యాంగం మనకు ఇచ్చింది.

సామాజికంగా, రాజకీయంగా పతనమౌతున్న నైతిక విలువలే వీటన్నిటికీ కారణం. నైతిక విలువల విషయం వైయుక్తికమైనా, వాటికి సరిపడా చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన రాజ్యాంగానిది. కానీ, ఆ రాజ్యాంగం ముందు చెప్పుకున్నట్లు అధికార, ధన మదాంధుల చేతిలో మాత్రమే నడిచే కీలుబొమ్మ. నైతిక విలువల విషయానికి వస్తే, మన ప్రతి రాజకీయ నాయకుడూ ఓ గురువింద గింజ.

మైనారిటీల సంక్షేమం గురించి సవాలక్ష కబుర్లు చెబుతాడు లాలు యాదవ్. తాను దానా కుంభకోణంలో జైలుకెళ్ళే పరిస్థితుల్లో తన భార్యను ముఖ్యమంత్రిని చేసాడే కానీ, తనపార్టీలోని మరే ఇతర మెజారిటీ, మైనారిటీ నేతను కాదు.

దళితుల గురించి ఇంతకు మించి ఉపన్యాసాలు చెబుతాడు రామ్ విలాస్ పాశ్వాన్. మరి దళిత యువతిని వివాహం ఎందుకు చేసుకోలేదు?

దళితులకే తన జీవితం అంకితమంటుంది మాయావతి. కొన్ని వేల కోట్ల రూపాయలు తన పేరు మీద, కుటుంబ సభ్యుల మీద ఎందుకు దాచిపెట్టుకుంది?

ఒక సామాన్యుడు తను కట్టాల్సిన ఆదాయపన్నులో ఓ వంద రూపాయలు తక్కువ కట్టినా, వాడిని నానా రభస చేస్తుంది మన ఆదాయపన్ను శాఖ. మరి మన రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల నేతలకు అంతేసి డబ్బు ఎక్కడి నించి వస్తున్నదనేది మాత్రం ఎందుకని పట్టించుకోదు?

ఆదాయం ఉన్నా, లేకపోయినా రిటర్న్స్ ఫైలు చేయాలంటుంది ప్రభుత్వం. ఎన్ని రాజకీయ పార్టీలు ఆ పని చేస్తున్నాయి? చిన్నపాటి వ్యాపారమైనా, ఆడిటింగ్ జరగాలని రూల్సు చెబుతారు, మరి అంతేసి ఆదాయం ఉన్న పార్టీలపైన ఆడిటింగ్ ఎందుకు లేదు?

సామాన్యులను వారి మానాన వారిని వదిలి, కొందరు అసామాన్యుల విషయం పరికిద్దాం. మైనారిటీలను సంతోషపెట్టటానికి చరిత్రను కూడా వక్రీకరించే దుర్మార్గానికి కూడా మన ప్రభుత్వాలు వెనుదీయవు. దానిని అడ్డుకునే ఏ ప్రయత్నమూ మన రాజ్యాంగం చేయదు, చేయనీయలేదు. ఎంతటి మహోన్నతమైన చారిత్రాత్మక వ్యక్తి అయినా, స్వాతంత్ర్యోద్యమ పోరాట యోధుడైనా ఆయా ప్రభుత్వాల కులమత రంగుల్లో కుళ్ళిపోవల్సిందే.

ఔరంగజేబ్ అనే మొగలాయి పాలకుడిని ముప్పతిప్పలు పెట్టిన ఛత్రపతి శివాజి గురించి, ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఘనంగా చెబితే, మైనారిటీలు బాధపడతారని ఆయనను ఓ దారిదోపిడీ దొంగగా కధలు ప్రచారం చేసి, పాఠ్యాంశంగా కూడా చేరుస్తారు. దేశ రాజధానిలో ఒక రోడ్డుకు ఔరంగజేబ్ పేరు కూడా పెడతారు. శివాజీని మాత్రం తలుచుకునే నాధుడే రాజధానిలో కనిపించడు.
అంబేద్కర్ శిలావిగ్రహాన్నిపగులగొట్టారనో, రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చుక రెట్ట వేసిందనో, మీనాతాయి విగ్రహంపై దుమ్ము వేసారనో బంద్ లకు పిలుపునిచ్చి రెచ్చిపోయే రాజకీయ మూకలున్నాయి.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, తన జీవితంలో చాలాభాగాన్ని అండమాన్ జైల్లోని దుర్భర పరిస్థితుల్లో గడిపిన వీర్ సావర్కర్ ను ఒక కేంద్ర మంత్రి అవమానించిన తీరు మనలని కదిలించలేదు. అదే జైల్లో ఆయన స్మారకంగా ఉన్న చిత్రపటాన్ని బయటపారేయించిన ఆ కేంద్రమంత్రిని ఏం చేయాలి?

వీరి దృష్టిలో గాంధీలు, నెహ్రూలు, అంబేద్కర్ లు మాత్రమే దేశ స్వాతంత్ర్యం కోసమో, దేశ సంక్షేమం కోసమో కృషిచేసినివారు. మిగతావారు అసలు లేనట్లే!

మన రాజ్యాంగంలో అందరికీ సమానహక్కులనేవి కల్లబొల్లి కబుర్లు. డబ్బులు, అధికారం ఉన్నవారికే ఈ దేశంలో జీవించే హక్కు. తక్కినవారి జీవితాలకు విలువే లేదు.

Tuesday, August 5, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 04

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని ఛాతి విరుచుకొని మరీ గర్వంగా నిలబడతాం. అందరికీ అన్నిటా సమాన హక్కులు కల్పించే రాజ్యాంగం మన సొత్తని చెప్పుకుంటాం. నిజానికి, అటు కొంత, ఇటు కొంత చేతివాటంతో తెచ్చుకొని అంటుకట్టిన రాజ్యాంగం మనది. ఇది దివాలాకోరు రాజ్యాంగం అని చెప్పటానికి పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. సామాన్యపరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అందరికీ అన్నిటా సమాన హక్కులు కల్పించే రాజ్యాంగమా!

అణగారిన, నిమ్నజాతులవారికి సమాజంలో ఓ స్థానం కల్పించటానికి మన రాజ్యాంగవేత్తలు రిజర్వేషనులు కల్పించారు. అది తప్పు అని చెప్పను. కానీ, ఏ నెపంతోనైనా, కొన్ని వర్గాలకి రిజర్వేషనులు కల్పించే రాజ్యాంగం అందరికీ సమానహక్కులు కల్పిస్తున్నదని చెప్పటం ఎంతవరకూ సముచితం. అంటే పేరుగొప్ప రాజ్యాంగమే కానీ, నిజానికి అందరికీ సమానహక్కులు కల్పించటంలేదన్నది తేలిపోతున్నది కదా!

అదే విధంగా, మన ఘనతవహించిన లౌకిక రాజ్యంలో, స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాల పైమాటే అయినా, యూనిఫాం సివిల్ కోడ్ ఎందుకని తీసుకురాలేకపోయారు? భారతదేశంలో అవిభాజ్యమైన భాగంగా ఒప్పుకోవాల్సిన కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ, ప్రజలకు ఆయా ప్రాంతాలకు సమానహక్కులు కల్పిస్తున్నట్లేనా?

చట్టసభలలో ప్రాతినిద్యం కల్పించటానికి అనేక కులాలకు, మతాలకు, నియోజకవర్గాలను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు - సంతోషం. ఈ కేటాయింపులు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో మన ప్రధానికైనా తెలుసా? అసలు ఆ మాటకొస్తే, లౌకిక దేశంలో కుల మత ప్రాతిపదికన ఈ కేటాయింపులేమిటి? అందులోనూ చట్టసభలలోకి. సమానహక్కులు కల్పించటమే రాజ్యాంగ ధ్యేయమైతే, అన్ని కులాల, మతాల జనాభా ప్రాతిపదికగా కేటాయింపులు ఎందుకు చేయరు?

ఒకరికి (షాబానో) అన్యాయం జరుగుతున్నదని తెలిసినా, అది అన్యాయమని సుప్రీంకోర్టు ప్రకటించినా, చట్టపరంగా తగిన మార్పులు చేయగలిగిన సంఖ్యాబలం పార్లమెంటులో ఉన్నా, ఏమీ చేయలేని ప్రధానులు మనకున్నారు. ఎందుకంటే, ఒక అబలకు సాయం చేసే క్రమంలో ఆ మతాధికారుల ఆగ్రహానికి గురై, ఓట్లు కోల్పోతామేమోనన్న భయం మన సెక్యులర్ ప్రధానులందరిదీ.

గుజరాత్ లో మారణహోమం ఎలా మొదలయ్యిందో, ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, నరేంద్ర మోడీకి కితాబులిచ్చిన అప్పటి ప్రధాని వాజ్ పేయి, ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో అదే మోడీకి చీవాట్లు పెట్టి, తన పదవీకాలంలో అదో చీకటి అధ్యాయంగా పేర్కొనటం మన సెక్యులర్ రాజకీయాలకే సాధ్యం.

అయోధ్యలో రామమందిరం కోసం ప్రాణపరిత్యాగానికైనా సిద్ధమని తొంభైలలో ప్రకటించి, ప్రజల ఆవేశకావేశాలతో రాజకీయాలాడి, ఇప్పుడు అందరి ఆమోదమో లేదంటే కోర్టు తీర్పో శిరోధార్యమని ప్రకటించటం కొత్తగా సెక్యులర్ పట్టా పుచ్చుకోవాలని ఆశించే భా.జ.పా. ప్రయోగాలే అని ప్రజలు సరిపుచ్చుకోవాలి. వీరివల్ల దేశంలోని రెండు ప్రధాన మతాల మధ్య ఏర్పడిన అగాధం ఇంకా పూడనే లేదనేది విస్మరించలేని మరో సత్యం!

దేశాన్ని రెండుగా చీల్చాడని జిన్నాను ఆడిపోసుకునే అద్వాని ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళి మరీ, ఆ జిన్నాను కొనియాడటం ఈ సెక్యులర్ తెంపరితనంలో భాగమే.

దేశ స్వాత్రంత్ర్యోత్సవ సంబరాలను, రిపబ్లిక్ దినోత్సవాలను బహిష్కరించాలని పిలుపులిచ్చే బుఖారీలను, సలాఉద్దీన్ లను ఏమీ అనలేక చోద్యం చూసే ప్రభుత్వాలే, మ్యాచ్ గెలిచిన తర్వాత జెండా మీద సచిన్ బోర్ల పడ్డాడనో, మందిరా బేడి చీరలా కట్టిందనో నానాయాగీ మాత్రం చేస్తారు.

హిందువుల ఆరాధ్యదైవానికి చారిత్రక ఆధారాలు లేవనే కేంద్ర ప్రభుత్వం తన లౌకికత్వాన్ని చాటుకోటానికి ఆ మాట అనటంలేదని సామాన్యప్రజలు గ్రహించాలి. కరుణానిధికి కోపం తెప్పించి తమ ప్రభుత్వాన్ని పడిపోకుండా చేసే ప్రయత్నంగానే భావించాలి!! అవే చారిత్రక ఆధారాలు ఇతర మతస్థులను అడిగే ధైర్యం ఏ ప్రభుత్వమూ చేయలేదు. వాటిని కూడా ఓట్ల కోసం వాళ్ళ అవస్తలుగా పరిగణించి ప్రజానీకం వదిలేయాలి.

అసలు విషయం దారితప్పినట్లుంది. ఏతావాత చెప్పొచ్చేదేమిటంటే, ఈ దేశంలో సమానహక్కులనేవి అభూతకల్పనగానే భావించాలి. వ్యక్తిగా ఒకని ఓటుకున్న విలువకన్నా, కులమత్ర ప్రాతిపదికన ఒక సమూహంగా ఉన్న ఓట్లకున్న విలువే ఎక్కువ.

దీనికి లేటెస్టు ఉదాహరణ, ఆంద్రజ్యోతి - మంద కృష్ణ మాదిగ వ్యవహారం. పేరులో కులాన్ని చొప్పించుకునే నాయకులు, ఆ నాయకుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే, ఆ కులాన్నే దూషించినట్లుగా పోలీసు కేసులు వేయటం, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు ఆధారంగా జర్నలిస్టులను అరెస్టు చేయటం మన లౌకిక ప్రజాస్వామ్యంలోనే జరుగుతుంది. అదే కుల నాయకుడి ఆధ్వర్యంలో ఈ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మనే ఇదివరలో తగలబెట్టినప్పుడు నోరు మెదిపినవాడు లేడు. అలానే, ఈ కుల నాయకుడి ఆద్వర్యంలోనే, అరెస్టు కాబడ్డవారి దిష్టిబొమ్మలు తగులబెట్టినప్పుడు కూడా అందరూ మూసుకున్నవాళ్ళే! వాడంటే తిట్టు, వీడంటే బూతా! ఇదా మన లౌకిక ప్రజాస్వామ్యం? ఇవా మనకున్న సమాన హక్కులు?

ఏ రాజ్యాంగమైతే మనది లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించిందో, అదే రాజ్యాంగం కులమత ప్రాతిపదికగా ప్రజల్ని విడదీస్తోంది. ఆ నెపాన్ని సామాజిక అసమానతల మీద వేసినా, తప్పు తప్పే. సామాజిక అసమానతలను పోగొట్టటానికి మరేవిధమైనా దారులు మన రాజ్యాంగవేత్తలకు దొరకలేదంటే, అది ఆ రాజ్యాంగవేత్తల్లో సత్త లేకపోవటమే కారణంగా చెప్పుకోవచ్చు.

Tuesday, July 29, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 03

రాజకీయంగా ఎంత అనైతిక పరిస్థితుల్లో ఉన్నామనేదానికి ప్రతిరోజూ ఎన్నెన్నో తార్కాణాలు కనిపిస్తాయి. నిబద్ధత, నిజాయితి, నీతి ఇవేవీ లేకుంటేనే రాజకీయనాయకులౌతారనిపిస్తుంది. దీనికి మన్మోహన్ సింగ్ కూడా మినహాయింపు కాదు.

గత మంత్రిమండలి విస్తరణలో శిబుసోరెన్ కు మొండి చెయ్యి చూపించిన ఈ మన్మోహనే, మొన్న కాళ్ళావేళ్ళా పడి యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు సంపాదించుకున్నాడు. ఎవరెవరికి ఏమేం ఆశలు పెట్టాడో ఎవరైనా ఊహించుకోవచ్చు.

లోక్ సభ స్పీకరు విషయపరంగా, రాజ్యాంగపదవికి రాజకీయాలు పులమకూడదంటున్నారు ఇప్పుడు. ఏ రాజ్యాంగపదవిని రాజకీయం చేయకుండా వదిలారు ఈనాటి వరకు?

తనను ఒక నేతగా తీర్చిదిద్దిన రాజకీయ పార్టీ ముఖ్యమా, రాజ్యాంగపదవి ముఖ్యమా అనే విషయంలో మన స్పీకరు ఒక నిర్ణయానికి రావటం అభినందనీయమే అయినా, ఆయన ఆలోచన ఎంత హిపోక్రటిక్ గా ఉందో ఓ సారి గమనించండి.

పదవికి రాజీనామా చేసి, పార్టీ కట్టుబాటుకు అనుగుణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్దమైనా కూడా, భా.జ.పా.తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం సెక్యులర్ సిద్ధాంతానికి వ్యతిరేకమట మన స్పీకరు గారి దృష్టిలో!! మరి, అదే భా.జ.పా. ఆయన్ని ఏకగ్రీవంగా స్పీకరు పదవికి ఒప్పుకున్నప్పుడు ఈ మాటెందుకు చెప్పలేదు మన స్పీకరుగారు?

పార్టీ విప్ లకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు తన ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోవాలి. ఆ పరిస్థితుల్లో సదరు సభ్యుడు వేసే ఓటు ఎలా చెల్లుబాటవుతుంది. ఆ ఓటు చెల్లుబాటు కాదని, తదనంతరం స్పీకరు వేసిన ఓ కమిటీ నిర్ణయించి, అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసేటప్పటికి పుణ్యకాలం పూర్తవ్వదా? అటువంటి ఓట్లతో మెజారిటీ ఉన్నదని నిరూపించుకోవటంలోని ఔచిత్యం ఏమిటి? మేధావిగా కొనియాడబడే సోమనాథ్ ఛటర్జీ ఈ విషయంలో చేసింది ప్రజాస్వామ్యానికి ద్రోహం కాదా?

ఒక ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్ధకమైన పరిస్థితుల్లో, తమను కొనటానికి బేరసారాలాడుతున్నారని కొందరు పార్లమెంటు సభ్యులు పార్లమెంటులోనే ప్రకటించినా, స్పీకరు ఎటువంటి ఆలోచనా లేకుండా, మొక్కుబడి తంతుగా ముగించిన తతంగంలో ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపిస్తుంది?

సిద్ధాంతాలకు మాత్రమే తలవొంచే సి.పి.ఎం. సీనియర్ నేత, స్పీకర్ మహాశయులు ఏ సిద్ధాంతం ప్రాతిపదికగా అవినీతి ఆరోపణల మధ్య ప్రభుత్వ బలనిరూపణను కొనసాగించినట్లు?

ఇక సి.పి.ఎం. నేతల విషయానికి వస్తే... పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదట. కమ్యూనిస్టుల క్రమశిక్షణ మెచ్చదగ్గదే. కానీ రాజకీయ క్రమశిక్షణ ఎక్కడ? నందిగ్రాంలో వారు చేసింది ఒప్పు. అదే, మరో పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో జరిగితే తప్పు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలకు కాంగ్రెసీయులు ఆరంభం పలికితే, వాటిని 'క్రమశిక్షణ'గా అనుసరిస్తున్నది కమ్యూనిస్టులే.

ఈరోజు అలౌకిక పార్టీగా ఏ పార్టీనైతే బూతులు తిడుతున్నారో, అదే పార్టీతో ఒకానొకనాడు చెట్టపట్టాలేసుకొని తిరిగిన రోజులు మర్చిపోతున్నారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి 24 గంటలు కాకమునుపే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుకు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు వారికి సహకరిస్తామని ఈ ప్రకాష్ కారత్ ప్రకటించటంలోని రాజకీయ క్రమశిక్షణ ఏపాటిది?

ఇక బాంబు పేలుళ్ళ నేపథ్యంలో చూడండి। బెంగుళూరు, అహ్మదాబాద్ పేలుళ్ళ వెనుక ప్రజల ఆలోచనలు పక్కదోవ పట్టించాలనే కుట్ర దాగి ఉన్నదని భా.జ.పా. నేత సుష్మా స్వరాజ్ ఆరోపణ. నిజంగా ప్రజాస్వామ్యాన్ని దిసమొలతో నడిపిస్తున్న ఈ రాజకీయాలు దేశానికి ఏ రకంగా క్షేమకరం? కానీ, ఇందులో కఠినంగా అనిపించినా ఓ కటికవాస్తవం దాగి ఉంది. బహుశా ప్రతి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమూ ప్రజల ఆలోచనలు పక్కదోవ పట్టించటానికి ఇలాంటి ప్రయత్నాలు గతంలో చేసే ఉంటారు.

ప్రజావ్యతిరేకత ఎక్కువగా కనిపించేటప్పుడు గతంలో ఇందిరా, రాజీవ్ తదితరులు పాకిస్తాన్ తో కయ్యానికి కాలు దువ్వేవారన్నది ఇప్పటివరకూ ఓ విమర్శే. బహుశా అది కూడా నిజమే అయ్యుంటుంది. అలానే, కార్గిల్ వ్యవహారం కూడా. అలానే, నిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పులు కూడా ఇటువంటి రకమే అయ్యుంటాయి.

తిని తీరిగ్గా కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించటమే ధ్యేయంగా వ్రాస్తున్న రాతలు కావివి. మన ప్రజాస్వామ్యంపై మనకెన్ని భ్రమలున్నాయో తెలుసుకోవాలని, తెలిసినవి తెలియజెప్పాలని చేస్తున్న ప్రయత్నం. విమర్శించటం కాక, ఏం చేయాలో చెప్పమని కూడా కొందరు అడిగారు. వ్రాయబోయే మరో వ్యాసంలో ఆ విషయాలు ప్రస్తావిస్తాను
.

Wednesday, July 23, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 02

ఎత్తుకు పై ఎత్తులతో జిత్తులమారి వేషాలతో మన నేతలు వేసిన కుప్పిగంతులు ప్రస్తుతానికో కొలిక్కి వచ్చాయి. పంథొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నిలుపుకున్న మన్మోహన్ సింగ్ విజయదరహాసంతో పరువు దక్కించుకోగలిగానన్న స్ఫూర్తిని ప్రదర్శించినా, నలుగురి ముందు నగుబాటుకు లోనయ్యింది మాత్రం మన ప్రజాస్వామ్యమే.

అభినవ దుశ్శాసనుల రాజ'నీతి'కి ప్రజాస్వామ్యం వలువలు ఊడదీయబడ్డ ద్రౌపదిలా కుంచించుకుపోతోంది. దేశ ప్రజాస్వామ్యం పార్లమెంటు సాక్షిగా పరిహాసాస్పదమైంది. ఏ పార్లమెంటు సభ్యుడు అమ్ముడుపోలేదట! మరెవరూ కొనలేదట!!

పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడే మన గౌరవ సభ్యులు అంతరాత్మ ప్రబోధంతో ఓట్లు వేసి యు.పి.ఎ.ని గెలిపించారనుకుందామా? తిమ్మిని బమ్మి చేసే మన నాయకుల తెలివితేటలతో, ప్రజాస్వామ్యం అంతకంతకూ అగాధాలలో కూరుకుపోతోంది. నైతిక విలువలు దిగజారుతున్న కొద్దీ మరిన్ని లోతులు చవిచూస్తున్నది.

ప్రతి పార్లమెంటు సభ్యుడికి 25 కోట్లతో యు.పి.ఎ. వెల కట్టిందని సి.పి.ఐ. నాయకుడు ఎ.బి.బర్ధన్ పత్రికా ప్రకటన మాత్రమే చేస్తే, అమర్ సింగ్ , అహమ్మద్ పటేల్ కోటి రూపాయలు అడ్వాన్సు ఇచ్చారని ఆ డబ్బును సాక్షాత్తు పార్లమెంటులో ప్రదర్శించారు భా.జ.పా. నేతలు. Any way, no one is a holy cow.

కొనడానికి మన నేతలు ఎలా తెగబడ్డారో, అమ్ముడుపోవటానికి కూడా అంతగానే తెగబడ్డారు. సిగ్గెగ్గులు లేకుండా మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే ఈ నేతలనే మరింత సిగ్గుమాలినతనంతో మనం ఎన్నుకుంటాం.

ఈ హంగామాకు కారణంగా నిల్చిన సి.పి.ఎం. నేత ప్రకాష్ కారట్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రెండు మూడు రోజుల క్రితం ప్రకటించటం విడ్డూరం కాదు. అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.

మానిపోయిన గుజరాత్ గాయాలను రేగ్గొట్టటానికి పార్లమేంటునే వేదిక చేసే లాలూ లాంటి నాయకులు, గురువింద గింజ సామెత గుర్తు చేసే విధంగా ఎదుటివారిపై ఆరోపణలు చేసే అద్వాని, అమర్ సింగ్, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు మనకు కొత్త కాదు.
గంతకు తగ్గ బొంతల్లా ఆ గూటి పలుకులే పలికే నేటి యువరాజకీయ నాయకులను చూస్తే మాత్రం మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం రేపు వారి చేతుల్లో ఎలా శీలభంగానికి గురౌతుందో అనే ప్రశ్నలు ఉదయించక మానదు.

ఒక ముస్లీములానో, ఒక రాజకీయ నాయకుడుగానో కాకుండా, ఒక భారతీయుడుగా ఆలోచించి ఓటు వేసాడట నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దులా! నిరుటి ఎన్.డి.ఎ. ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు సిగ్గుతో చచ్చిపోయాడట! చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇటు ఓటు వేసాడట!

మహారాష్ట్రలోని విదర్భలో ముగ్గురు కొడుకులున్న ఓ యువతిని చూసాడట యువరాజలుంగారు. ముగ్గురు కొడుకుల్లో, ఒకడు కలెక్టరు, ఒకడు ఇంజనీరు, మరొకడు ప్రైవేటు ఉద్యోగాలు సాధిస్తామని చెప్పారట. వెరీగుడ్ అంటూ ఓసారి వెనక్కి తిరిగి చూస్తే, వారి పూరిగుడిసెలో విద్యుత్తు లేదట. ఆ పిల్లల స్వప్నాలు సాకారం చేయాలంటే, అణుఒప్పందం తప్పనిసరట! అయ్యా యువరాజలుంగారు, గత తొమ్మిదేళ్ళుగా మహారాష్ట్రలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకుతున్నది?

స్వాతంత్ర్యం వచ్చి అరవైఏళ్ళ పైమాటే అయినా, ప్రజలకు పక్కా ఇళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యం మనది. దాదాపు అర్ధశతాబ్దంపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వీటికి జవాబుగా అణుఒప్పందాన్ని చూపటం పనికిమాలినతనం. చవటగాళ్ళ చవకబారు రాజకీయాలే ఇవి.

ఉన్న అయిదుగురు ఎంపీలను సంభాళించుకోలేని చంద్రబాబులు, చంద్రశేఖరులు మాయావతిని ప్రధానిగా చేద్దామని ఉబలాటపడటం మన ప్రజాస్వామ్యంలోనే సాధ్యం.
కావల్సినవన్నీ అప్పనంగా పొందాలనుకునే అమాంబాపతు అజిత్ సింగ్ ల, దేవెగౌడల పార్టీలవంటివి మన ప్రజాస్వామ్యంలోనే సాధ్యం.

ఊరకుక్కలైనా , పందికొక్కులైనా ఊరికి కొంతైనా ఉపకారం చేస్తాయి. మరి మన ప్రజాప్రతినిధులో?

Tuesday, July 8, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 01

గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, మన దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగానే మిగిలి ఉందన్న విషయం మరోసారి తెలుస్తుంది.

అణు ఒప్పందంపై వాదవివాదాలు మొదలైనది లగాయితూ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామనే బెదిరింపులతో దాదాపు మూడేళ్ళు మభ్యపెట్టిన కమ్యూనిస్టులు ఎట్టకేలకు అన్నంత పనీ చేసారు.

ఇది ఆచీతూచీ తీసుకున్న నిర్ణయమో లేదంటే జాతివిపత్కర పరిస్థితుల్లో తప్పనిసరై తీసుకున్న నిర్ణయమో అర్ధం చేసుకోలేని వెధవలు కాకపోవచ్చు దేశప్రజలు.

ప్రభుత్వానికి, కమ్యూనిస్టుల మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంలో సమాజ్ వాది పార్టీ ఒక పావు మాత్రమే. అణుఒప్పందంపై ఆరంభంలోనే దాడి ఆరంభించిన కమ్యూనిస్టులు అప్పటికి ప్రభుత్వాన్ని కాపాడటానికి నిర్ణయించారని ఇప్పుడు ఎవరికైనా అర్ధమౌతుంది. అణు ఒప్పందంపై, ప్రజలకు బాసటగా నిల్చామన్న ఖ్యాతి మూట కట్టుకోటానికి అటు కమ్యూనిస్టులు, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నామన్న ఖ్యాతి కోసం కాంగ్రెసీయులు ఆడిన నాటకానికి ఎట్టకేలకూ ఈనాటికి తెరపడింది.

అణుఒప్పందంలోని మంచి చెడుల కన్నా, రాజకీయంగా ఎవరికి ఏవిధమైన మేలు జరుగుతుందనేదే ముఖ్యవిషయమయ్యిందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

ప్రభుత్వాన్ని కొనసాగించటానికి కూడా వీలుకానంత దుస్థితిలో అమెరికాతో చేయబోతున్న అణుఒప్పందం ఉందనుకుంటే, కమ్యూనిస్టులు ఇంతకాలం మీనమేషాలు లెక్కిస్తూ ఎందుకున్నరనేది మొదటి ప్రశ్న. ఒప్పందాన్ని చేసితీరతామని భీష్మించుకు కూర్చున్న యు.పి.ఎ. నుంచి కానీ, ఒప్పందం అమలుకానీయకుండా చూస్తామని పట్టుపడుతున్న కమ్యూనిస్టుల నుంచి కానీ ఒప్పందంలోని లోటుపాట్లు ఏమిటనేదానికి ఇంతవరకూ సరైన వివరణ లేదు.

మొన్నటిదాకా, కాంగ్రెస్ ను ఛీత్కరించిన సమాజ్ వాది పార్టీ కేవలం దేశశ్రేయస్సు కోసం అదే కాంగ్రెసును సమర్ధించబోతున్నదని నమ్మేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రస్తుత రాజకీయ అస్థిరత వల్ల మతతత్వశక్తులకు ప్రొద్బలం లభించకూడదనే ఉద్దేశ్యమే పరమావధి అని ములాయం ప్రకటించినా నమ్మశక్యం కాదు.

ఇంకపైగా, తమ వాదనకు అనుకూలంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అణుఒప్పందం దేశానికి మంచిదిగా అభివర్ణించారని సమాజ్ వాది పార్టీ ప్రకటించటం కూడా ఆశ్చర్యమే! దేశానికి మంచి కలిగే చాలా విషయాలు కలాం చెప్పారు. మరి వాటన్నిటి మాట ఏమిటి? అవన్నీ ములాయం, అమర్ సింగ్ లు పాటిస్తున్నట్లేనా?

ఏదేమైనా, అణుఒప్పందం విషయంలో ప్రభుత్వం, కమ్యూనిస్టులు, సమాజ్ వాదిల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందనేది నిర్ద్వంద్వంగా అర్ధమౌతుంది. ప్రజల బాసటగా నిల్చామని ఈ పార్టీలు మరో ఎన్నికలకు మూడు సంవత్సరాల క్రితమే సంసిద్ధమైనాయన్న విషయంలోనూ ఏ సందేహమూ లేదు. ఎన్ని కోట్లు మారాయనే విషయం తెలియకపోయినా, కొన్ని కోట్లు మారే ఉంటాయన్న విషయంలో 'అణు'మానాలేమీ లేవు.

మూడు సంవత్సరాలు ప్రజలను వెధవాయిలు చేసి ఆడించామనుకుంటున్న ఈ పార్టీల ఎత్తుగడలో మరో అయిదు సంవత్సరాలు ప్రజలు నోట్లో వేలు పెట్టుకునే కూర్చుంటారా అనేది కొన్నాళ్ళాగితేనే తెలుస్తుంది.

Wednesday, June 4, 2008

నేతలకు గుణపాఠం

ఎట్టకేలకు ఉప ఎన్నికలు ముగిసాయి. ప్రత్యేక తెలంగాణాకు ఈ ఎన్నికలు రెఫరెండం అని, తాడో పేడో, చావో రేవో తేల్చేసుకుందామని శాసనసభ, లోక్ సభలకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు కారణమైన తెరాస పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లైంది.

ప్రజలు ఎవరిని ఆదరించారు? ప్రత్యేక తెలంగాణా పై ఆ ప్రాంత ప్రజల మనోభావమేమిటి? అసలు ఈ ఉప ఎన్నికల్లో గెలిచిందెవరు? ఇలా చాలానే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎవరికి అనుకూలమైన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు.


ప్రచారం ఊపందుకున్న సమయం నుంచి చివరి వరకు కాంగ్రెస్ - తెలుగుదేశంల ప్రచారాన్ని గమనిస్తే, ఒకానొక దశలో ఈ రెండు పార్టీలు తెలంగాణాకు అనుకూలమైన ప్రకటనలు విడుదల చేసి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసాయనటంలో సందేహం లేదు. మరోపక్క, అనవసరమైన పొలికేకలతో ప్రజలను రెచ్చేగొట్టే దిశగా తెరాస ప్రచారం కూడా ఓట్ల వర్షంలో తడవటమే ఆలస్యం అన్నట్లుగా జరిగింది.

ఒక్క తెరాస, భాజపా తప్పించి ప్రత్యేక తెలంగాణాపై నిర్ధిష్టమైన అభిప్రాయం లేకుండానే కాంగ్రెస్, తెలుగుదేశంలో ఎన్నికల్లో పోటీ చేసాయనేది వాస్తవం. ఆ లోటును కప్పిపుచ్చుకునేందుకు అభివృద్ధి మంత్రం వేస్తూనే, తెలంగాణా సెంటిమెంటు ఉన్నదని ముఖ్యమంత్రి, ఇతర సీనియర్ నేతలు ఒప్పుకోవటం, అలానే, తెలుగుదేశం కూడా అంతర్గతంగా ఒక కమిటీని వేయటం, ప్రతి మీటింగు తర్వాత జై తెలంగాణా, జై తెలుగుదేశం అని నినాదాలు చేయటం; తెలంగాణావాదుల ఓట్లను ఆకర్షించటానికి మాత్రమే అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

ఎన్నికల సమయంలో ప్రజలేం కావాలనుకుంటున్నారో అంచనా వేయలేక, ప్రజలను తికమక పెడదామనుకున్న పార్టీలే, ఫలితాలు తెలిసిన తర్వాత తికమకకు గురౌతున్నాయి.

ఆరు జిల్లాల్లో ప్రాతినిథ్యం కూడా లేకుండా తెరాసను ఓడించి, ప్రత్యేక తెలంగాణా అవసరంలేదని ప్రజలు చెప్పారనుకోవాలా? అభివృద్ధి మంత్రానికి కట్టుబడ్డ కాంగ్రెస్ ను గెలిపించారు కాబట్టి, తెలంగాణాలో అభివృద్ధిని ప్రజలు హర్షిస్తున్నారనుకోవాలా? మరి, సెంటిమెంటు నిజమే అన్న ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు ఆ సెంటిమెంటు విషయంలో?

సమైక్యాంద్రపై కట్టుబడ్డ తెలుగుదేశాన్ని గెలిపించారు కాబట్టి, కలిసి ఉందామనేదే ప్రజా ఉద్దేశ్యమనుకోవాలా? మరి, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తూ అంతర్గతంగా తెలుగుదేశం ఏర్పాటుచేసుకున్న కమిటీ పరిస్థితి ఏమిటి?

నాయకులు తెలివి మీరితే, అధికారాన్ని అప్పగించిన ప్రజలే అంధకారంలోకి నెట్టిపడేస్తారనే విషయాన్ని ఈ ఎన్నికలు మరోమారు రూఢీ చేసాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి ఉప ఎన్నికల వరకూ, ప్రజల సెంటిమెంటుతో పాచికలు ఆడుకున్న తెరాసకు ఇది ఓ గుణపాఠం. ప్రత్యేక తెలంగాణా సెంటిమెంటు అన్నిచోట్లా ఉన్నదని ఎలా చెప్పలేమో, లేదని కూడా అలానే చెప్పలేం.

ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస, ఆనాటి నుంచి ఈనాటి వరకూ తప్పటడుగులే వేస్తూ వచ్చింది.

మునుపు తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ పై ఏ నమ్మకంతో తెరాస గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది? ఏరు దాటాక తెప్ప తగలేయటం కాంగ్రెస్ కు కొత్తకాదన్న విషయం ఈ నెతలకు తెలియదా?

అప్పడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షుంచుకోక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులకై మల్లగుల్లాలు పడిన ఈ నేతలకు తెలంగాణాపై ఏవిధమైన నిబద్ధత ఉన్నదనేది తెలుగుసుకోలేని వాజమ్మలు కాదు ప్రజలు.

కూర్చోటానికి ఓ మంత్రి పదవి పడేస్తే చాలు, ఏ విభాగమూ లేకపోయినా ఓకే అంటూ కక్కుర్తి పడే నేతలు, కేంద్ర ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును ఎందుకు చేర్చలేదో ప్రజలకు అర్ధంకాని విషయమేమీ కాదు.

ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్నా, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఏకాభిప్రాయసాధన కోసం కృషిచేస్తున్నామన్న ఈ నేతల కల్లబొల్లి కబుర్లకు ప్రజలు సరైన సమాధానమే ఇచ్చారు.

ప్రభుత్వంలో పాలుపంచుకుంటే కన్నా కూడా, ప్రజలతో ఉద్యమాన్ని పంచుకుంటేనే రాజకీయ మనుగడ సాధ్యమనే విషయాన్ని విస్మరించినందుకు ప్రజలు సరైన గుణపాఠమే చెప్పారు.

గతంలో పట్టం కట్టిన ప్రజలే, ఈ రోజు చెంపపెట్టులా ఓటేసారంటే దానికి కారణం... అంతర్గత కుమ్ములాటల్లోనూ, నకిలీవీసాలతో డబ్బు దండుకునే నేతలపై రోతతోనే.

తెరాస నాయకత్వంలో మార్పు తప్పనిసరి. ప్రత్యేక తెలంగాణా సాధ్యపడేది అమరజీవిలాంటి పొట్టి శ్రీరాములు లాంటి నేతలవల్లనే కాని, అరపూట కూడా ఉపవాసం చేయలేని కెసిఆర్ లతో కాదు. నిబద్ధత, నిజాయితీ లేని నేతలందరికీ... ముఖ్యంగా తెలంగాణా నేతలకు ఈ ఉప ఎన్నికలు కనువిప్పు కావాలి.


Monday, May 26, 2008

కర్ 'నాటకాలకు' ఇకనైనా కనువిప్పు

అనుకుందొక్కటి... అయ్యిందొక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట... ఓటమిని ఏనాడూ సరైన స్ఫూర్తితో తీసుకొని ఎరుగదు కాంగ్రెస్. తాజాగా కర్ణాటకలో పార్టీ ఓటమికి 'చీలిన లౌకిక ఓట్ల'ను కారణంగా చూపి తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక ఓటమికి మసి పూసి మారేడుకాయగా అధినేత్రిని ఒప్పించగలరేమో కానీ, ప్రజలను కాదని కాంగ్రెస్ నేతలు ఎప్పటికి గుర్తిస్తారో? ఈ ఎన్నికల ఫలితాలు, దేవెగౌడ ద్రోహానికి, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు చెంపపెట్టుగా మాత్రమే కాదు... కేంద్రంలోని యు.పి.ఎ. పాలనపై ప్రజల నిరశనను కూడా ప్రతిఫలిస్తుంది.

గతవారంలోనే, నాలుగేళ్ళ యు.పి.ఎ. పరిపాలనపై తమకుతాము భుజకీర్తులు తొడుక్కున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడవు. అద్భుతంగా సాగుతున్న తమ పరిపాలనను మెచ్చి ప్రజలు బ్రహ్మరథం పడతారన్న భ్రమల్లో మునిగి తేలింది.అదుపుతప్పిన ద్రవ్యోల్బణం, అంతకంతకూ పెచ్చుమీరుతున్న తీవ్రవాదం సామాన్యుడిపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నా ఏమాత్రమూ పట్టించుకోని కేంద్రప్రభుత్వానికి ఈ ఎన్నికలు షాక్ ట్రీట్ మెంటులాంటిదే.

అసలు యు.పి.ఎ. పరిపాలన చూస్తుంటే, ప్రధాని పదవి ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఇలానే ఉండేదనిపిస్తుంది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏనాడో అడియాశలైనాయంటే అతిశయోక్తి కాదు. ప్రజలకన్నా కూడా సోనియాకు మాత్రమే జవాబుదారీగా ఆయన పోషించిన పాత్ర, భారత ప్రధాని పదవిని రోజురోజుకూ దిగజార్చేస్తున్నది. అష్టకష్టాలు పడైనా సరే, అయిదేళ్ళు లాగాలనే తపనే కనిపిస్తుంది కానీ, ప్రజలకు మేలు చేద్దామనే తపన మాత్రం దీవిటీతో వెదికినా కనిపించదు. ఆ మాటకొస్తే, ప్రతి కాంగ్రెస్ మంత్రి ప్రజలకన్నా కూడా సోనియాకు జవాబుదారీగా మాత్రమే తమ శాఖలు నిర్వహిస్తున్నారు.

ధరలు పెంచిన రోజో, లేదంటే ఆ మర్నాడో ఓ ధర్నాతో తమ పని అయ్యిందనిపించే కమ్యూనిస్టుల లాంటి మిత్రపక్షనేతలకు కూడా ఈ పరిపాలనా పాపంలో పిడికెడు వాటా ఉండనే ఉంది. కల్లబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ నేతలకు కమ్యూనిస్టులకు ఈమధ్య అట్టే తేడా ఉండడం లేదన్నది పచ్చి నిజం. ప్రజా ప్రయోజనాలే లక్ష్యమైతే, ఇన్నాళ్ళు ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎందుకు ఉపేక్షించారనే దానికి వీరి దగ్గర కూడా ఒక్కటే సమాధానం - మతశక్తులను అధికారానికి దూరంగా ఉంచాలనే!!

రైతులకు బియ్యం ధరపై పది రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటారట - కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్!! ఈ నాలుగేళ్ళు ఏం చేసినట్లో!!

ప్రాధమిక విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయో పట్టించుకోరు కానీ, ఐ.ఐ.ఎం., ఐ.ఐ.టి.ల్లో మాత్రం తన మాట నెగ్గాలనే పట్టుదలతో ఉంటారు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్!!

ప్రాధమిక ఆరోగ్య వసతులు ఎలా ఉన్నాయో పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం కనిపించవు కానీ, AIIMS డైరెక్టరును తీసిపారేయడానికి, ఇంకా టైముంటే, సినిమాల్లో సిగరెట్లు, ఆల్కాహాలు, చిప్సు గట్రాలు నిషేధించటానికే సమయాన్ని వెచ్చిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అంబుమణి రాందాస్.

రెండు నెలలకో ఘాతుకంతో తీవ్రవాదం బుసలు కొడుతుంటే, ప్రత్యేక చట్టాలు అనవసరమంటారు కేంద్ర హోంశాఖామాత్యులవారు. ఆయన తర్కమేమిటంటే, తీవ్రవాదులు చట్టాలు చదివి ఘాతుకాలకు పాల్పడరుట!! ఆ లెక్కన అసలు చట్టాలు, శిక్షలు ఎందుకు మన రాజ్యాంగంలో? అలానే, అఫ్జల్ గురు ఉరిశిక్షకు, శరభ్ జిత్ సింగ్ విడుదలకు ముడివేసే 'లౌకిక' మంత్రి ఈయన!!

సంకీర్ణ రాజకీయాల్లో రాందాస్, శరద్ పవార్ లాంటివారిని భరించక తప్పదంటే సరే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ మంత్రులే ప్రధానిని లెక్కచేయని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రధాని కూడా, ఆయా మంత్రులను ప్రధాని హోదాలో ప్రశ్నించినట్లు తెలియదు.

ప్రధానితోపాటు, ఆయా మంత్రులే ఇలా పరిపాలన దేకిస్తుంటే, ప్రజలు ఓట్లెందుకు వేస్తారు? ఇకపైగా, లౌకిక ఓట్లు చీలిపోవటంవల్ల భా.జ.పా. గెలిచిందనే సిగ్గులేని ప్రకటనలా!! ఆ మాటకొస్తే, భా.జ.పా.కు ఓట్లు వేసినవారంతా మతవాదులనా!!

ఇకనైనా, కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రజల బాగోగులు పట్టించుకునే విధంగా పరిపాలిస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత బఠానీలైనా అమ్ముకునే స్థాయిలో ఉండగలుగుతుంది. లేదంటే, అదీ అనుమానమే.

Wednesday, May 14, 2008

ఏదో చెప్పాలని

కళ్ళకు జోడు
కాళ్ళకు జోడు
నోటికి పూత
ఇన్ని తొడుగుల నాటకం
ఆసాంతం అబ్బురపరచింది
రంగురంగుల వలువలతో
సీతాకోకచిలుక మురిపిస్తూనే
తెర మూసుకొంది.
***
చుట్టూ చీకటి
రంగుల్లేని నీడలు
నాకు అలవాటైనవి కావు.
సామూహికంగా
నీడలు జరిపిన దాడిలో
ఏదో తెలియని ఓ రహస్యం.
శిథిలమైన ఈ గుహలో
ఒకానొకప్పుడు
ఏముందో!
నాకు నేనే ప్రేక్షకుడుగా
అపస్మారకంలో వేసుకున్న సంకెళ్ళు
***
చిందులు వేస్తున్న
చినుకుల మధ్య
ఏడుస్తూనే ఓ ఆశ
నడవాలి...
నడుస్తూ.. నడుస్తూ...
కాళ్ళ కింది దారి
ఆగిపోయేదాకా నడవాలి.
పారిపోయినవాడిని
పరామర్శిస్తూ
విసిరేసిన పూలను
అణగదొక్కుతూ నడవాలి
చీకటి చెరబట్టిన
నక్షత్రాల మధ్య
నగ్నంగా నడవాలి.
***
పుస్తకంలా విచ్చుకున్న
ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
మసక వెలుగుల సెగల మధ్య
ఆకాశపంజరంలో
చందమామ
అల్లరి పిల్లల కంటపడేదాకా
తెగిన గాలిపటానికి
అనువైన మజిలీ ఇదేనేమో!

Tuesday, May 13, 2008

అమ్మ రాష్ట్రం

బుర్రతక్కువ సన్నాసులు ఆంధ్రులా, ఆంద్రా కాంగ్రెసు నాయకులా అనేది నాకెప్పుడూ ఉన్న అనుమానమే। అధినాయకులను ప్రసన్నం చేసుకోటానికి కాళ్ళావేళ్ళా పడటం మన కాంగ్రెసు నేతలకి అలవాటే. ఆ ప్రయత్నంలో నానాగడ్డీ కరిచే ఈ నేతల చేష్టలను భరిస్తున్న తెలుగువాళ్ళు నిజంగానే సహనశీలురా లేక చేతగాని వాజమ్మలా అనేది నాకర్ధం కాని విషయం.

మనరాష్ట్రంలో ఉన్నన్ని ఇందిరమ్మ, రాజీవ్ పథకాలు బహుశా మరే రాష్ట్రంలోనూ కనిపించవు. ఇందిర దీపం, రాజీవ్ ఫలానా, ఆఖరికి వీధి చివర కట్టిన మరుగుదొడ్లకు కూడా విధేయత పేరుతో ఈ నాయకులు ఆ నాయకుల పేర్లను పులమటం విచిత్రం!!

వేయి తలలు వేసిన ఈ వెర్రి, ఇప్పుడు రాష్ట్రం పేరే మార్చే దిశలో ఉందని, మొన్న గుంటూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి చేసిన ప్రకటనతో తేటతెల్లమయ్యింది. ప్రజలు కోరితే రాష్ట్రాన్నే ఇందిరమ్మ రాష్ట్రంగా నామకరణం చేస్తామని ప్రజలకు రోకలి చుట్టే ప్రయత్నం చేసారావిడ. ఆ నేతల పట్ల ప్రేమ అంతగా కారిపోతుంటే, తమ పిల్లలకో, వారి వారి పిల్లలకో ఆయా పేర్లు పెట్టుకు ఏడవచ్చుగా! ప్రజల నెత్తిన పేర్లు రుద్దాల్సిన అవసరం ఏముంది?

దేశం పేరునే గాంధీగా మార్చేసి, రాష్ట్రాలను, జిల్లాలను - వాటి పేర్లను ఆ వంశానికే రాసిచ్చే ఘనులు మనరాష్ట్రంలో తప్ప మరెక్కడా కనిపించరేమో? గాంధీ దేశంలో, ఇందిర రాష్ట్రంలో, రాజీవ్ జిల్లాలో, రాహుల్ తాలూకాలో ఫలానా రాజశేఖర్ రెడ్డి అన్న అడ్రసు ఎంత ముచ్చటగా ఉంటుందో! కానిచ్చేయండి ఈ పేర్ల మార్పిడి తతంగం.

గాంధీల కోసం వెంపర్లాడటం మన పక్క రాష్ట్రాల్లో ఇంతగా కనిపించదు. పోనీ, ఇన్ని ముష్టివేషాలు వేసినా, బొచ్చె నిండుతున్నదా అంటే అదీ నిండదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని పార్లమెంటు సీట్లు కాంగ్రెసు మరే రాష్ట్రం నుంచీ గెలవలేదు. అయినా, ఆంధ్రులపై సవతిప్రేమ. కంటితుడుపు బహుమతుల్లా అనామక మంత్రిత్వశాఖలు, అవైనా మూడో నాలుగో.

అయినా, సిగ్గులేని మన నాయకులు చొంగ కార్చటం మాత్రం మానరు. ఈ బానిసబుద్ధుల నుంచి వీరికి విముక్తెప్పుడో?

పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని, ఈ కాంగ్రెసుకు పెత్తనం రాగానే రాష్ట్రాన్నంతా గాంధీగా చేస్తున్నారు. మొన్నామధ్య ఏదో క్రికెట్ మ్యాచుకు యువరాజులవారు వేంచేస్తున్నారని, క్రికెట్ స్టేడియంలో మహామహా క్రికెట్ యోధుల ఫొటోల మధ్య రాజీవ్ గాంధి క్రికెటర్ గా ఓ ఫొటో ముస్తాబు చేసారంటేనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల స్వామిభక్తి మూసీనదిలా ఎంత గబ్బుకొడుతున్నదో అర్ధమౌతుంది.

రాజీవ్ గాంధి రాష్ట్రానికి ఏం చేసాడో, దేశానికి ఏం చేసాడో అన్నది అనవసరం. ఆ మాటకొస్తే, అధికారంలో ఉండి ఆయన పీకిందేమీ లేదు. ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయమా? టంగుటూరి ప్రకాశం పంతులు, బూర్గూల రామకృష్ణారావు, అల్లూరి సీతారామరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావులు రాజీవ్ గాంధీ పాటి చేయరా అనేది ప్రశ్న.

వీథి పేర్ల నుంచి విమానాశ్రయాల వరకు పాకిన ఈ పిచ్చి ఇప్పుడు రాష్ట్రానికే పేరు మార్చే దశలో ఉన్నదంటే తెలుగువాళ్ళే దానికి కారణం.

ఫ్లిప్ సైడ్ : తెలంగాణా రాష్ట్రానికి 'రాజీవ్' పేరో 'సోనియా' పేరో పెడతామని తెరాస నాయకులు మాటిస్తే, రేపటికల్లా తెలంగాణా వచ్చేస్తుంది గామోసు.

Tuesday, April 22, 2008

తడి

వాకిట్లో
వర్షం చొరబడితే
ఇల్లంతా వాకిలి చేస్తూ
నిన్నటి చినుకుల్లో
నిలువెల్లా తడిసింది
నాలాంటి పాపే!

అర్థంతరంగా
ఆగిన వర్షాన్ని
కాగితం పడవలతో
పిలుస్తూ
ఈరోజు మళ్ళీ...

Tuesday, April 1, 2008

అనుభవాలు

మెలికలు తిరిగే
ప్రశ్నార్ధకాల ప్రవాహంలో
నేనూ ఓ చుక్కనే!

మలుపుల మధ్య
ఎగుడుదిగుళ్ళ మధ్య
ప్రతి రాయి చెప్పిన రహస్యం
రాత్రి వానలోఒదిగిపొమ్మనే.

చీకటి వేసిన
చిక్కుముళ్ళు సవరిస్తూ
మరచిపోయిన
ఆనవాళ్ళను పరామర్శించే
రేపటి కోసం
మూసేసిన పుస్తకాన్ని
మరోసారి తెరవాలి.

Thursday, March 20, 2008

చౌకబారి, మసకబారి, మసిపట్టి పోయిందెవరు?

ఎవరో ఒక ఒరియా పెద్దమనిషి తెలుగువాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చస్తారంటూ ఏదో సైటులో చేసిన ఓ కామెంటుకు వాపోతూ, తెలుగువాళ్ళం చౌకబారయ్యాం, మసకబారిపోయాం, మసిపట్టిపోయామంటూ ఓ బ్లాగరిగారు ఖిన్నులై ఓ వ్యాసం వ్రాసిపడేశారు నెట్లో। ఆ మనిషి తెలుగువారి మీద ద్వేషంతో వ్రాసినందుకు కాకున్నా, ఆయన అన్న మాటల్లో నిజం ఉన్నందుకు ఈయన తెగ బాధపడిపోయి ఆ వ్యాసం వ్రాసేసారుట! ఆ ఒరియా పెద్దమనిషి మాటలు ఉన్నదున్నట్లు ఉటంకిస్తే తెలుగువాళ్ళం బాధపడిపోతామని అంటూనే, ఈయనగారు తెలుగులో అంతకన్నా ఘనంగానే తిట్టిపోసారేంటని ఆశ్చర్యపోయా కాసేపు.

ఇంతకి అసలు విషయం మన అసెంబ్లీలో నేతల ప్రవర్తనో, ప్రభుత్వంలోని అవినీతో కాదు। ప్రత్యేక తెలంగాణా కోరుకోవటంవల్ల నలుగురి దృష్టిలో పలచనైపోయామని ఈయన బాధ. తెలంగాణా డిమాండు వల్ల, తెలుగుజాతి ప్రతిష్ట దెబ్బతిందట! తెలంగాణా వాదులు ప్రపంచవేదికపై తెలుగుజాతిని బట్టలువిప్పి బద్నామ్ చేసారట! ప్రాంతీయ ఉన్మాదంతో తెలంగాణా వాదులు, నోళ్ళకే పని చెబుతున్నారు కానీ, మెదళ్ళకు కాదని అంటూ, తమ నోటి తీటను నెట్లో వ్రాతలతో ఈయన తీర్చుకున్నారులా ఉంది॥ ఇంకా ఈ వ్యాసంలో తెలుసుకోవాల్సింది, ప్రత్యేక తెలంగాణా కేవలం ఏడు సంవత్సరాల ఉద్యమమని!!

అంతటితో ఆగదు ఆ తీట। శాపనార్ధాలతో కొనసాగుతుంది. పరిస్థితులు ఇలానే ఉండవుట. తెలుగుజాతికి మంచిరోజులు వస్తాయట. అవి రావాలంటే, నిజాం కాలంలో పుట్టిన ముసలివాళ్ళంతా చావాలట! వీళ్ళందరూ ఆకు తొలిచే పురుగులు, తెలుగుజాతికి పట్టిన కాన్సర్లు నట.

ఈయన పెట్టినంతగా, ఆ ఒరియా పెద్దమనిషి కూడా బహుశా ఇన్ని తిట్లు, బూతులు, శాపనార్ధాలు పెట్టి ఉండరు. ఒరియావాడు తెలుగువాళ్ళనేదో అన్నాడని, కన్నీళ్ళ పర్యంతమైన పెద్దమనిషి తను మాత్రం తోటివాళ్ళపై కారుకూతలు కూయొచ్చా?

ఈ వ్యాసం చదివి ఒకరు 'ఆనాడు నెహ్రు కూడా తెలంగాణా కలసి ఉండలేని పక్షంలో విడిపోవచ్చని నిజామాబాద్ సభలో ప్రకటించారు' అని ఓ వ్యాఖ్య వ్రాస్తే, దానికి ఈ మేధావిగారు ఇచ్చే సమాధానం విచిత్రం। ఈయన అంటారు 'నెహ్రూ ఇలా అన్నాడని చెబుతున్నవాళ్ళు ఆ అన్న మాట ఎక్కడుందో ఎవరు ఆమాటని ఆ రోజుల్లో ఏ పత్రికలో ప్రచురించారో ఆధారాలు చూపించలేకపోయారు. ఊరికే పుకార్లు వ్యాపింపజెయ్యడం తప్పిస్తే !' అని ప్రకటించారు.


అయ్యా, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి। ఆనాడు నెహ్రూ అన్న మాటలు ఏ వార్తా పత్రికలో వచ్చిందో చెబితే, అది కూడా పుకారు, తారీఖు చెప్పమంటారు. తారీఖు చెబితే, ఆ 'క్లిప్పింగ్' ఆధారంగా చూపించమంటారు. (నెహ్రూ చెప్పిన మాట, 17-అక్టోబరు-1953 ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చింది. )

రెండో విషయం, ఆ ఒరియా పెద్దమనిషి ఎక్కడ తెలుగుజాతిని నానామాటలు అన్నాడో చెప్పమంటేనే, ఆ లింకు చూపలేని మీరు ఎప్పుడో 50వ దశకంలో నెహ్రూ అన్న మాటకు ప్రమాణం చూపమని అడగటంలో అర్ధం లేదు।

మాట్లాడితే, తూర్పు పశ్చిమ జర్మనీల ఉదాహరణ ఊదరగొడతారు। చెకొస్లోవేకియా గురించి అడిగితే మారు మాట్లాడరు.పాడిందే పాటరా.... అన్నట్లు, తెలంగాణావాదులు ప్రజల ఎమోషన్లను, సెంటిమెంటును రాజేస్తున్నారని విమర్శించే మీరు మాత్రం, సమైక్యవాదన పేరుతో చేసే ఈ అర్ధరహిత వాదనవల్ల ఏం సాధిస్తున్నారు। సమైక్యవాదన పేరుతో తమరు మాత్రం ప్రజలను రెచ్చ కొట్టటంలేదా? తెలుగుజాతి విడిపోకూడడదు, సమైక్యంగా ఉండాలని చేసే ఉద్బోధలే తప్ప, తెలంగాణా కలసి ఉండటంవల్ల కలిగే లాభాలేంటి, విడిపోతే నష్టాలేంటి అనే దానికి మాత్రం సమాధానం ఉండదు. పాడిందే పాటగా మరి.

తెలంగాణావాదులు, మేధావులు అవకాశవాద రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలౌతున్నారని విమర్శించే తమరు, ఏ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మలు?

అయ్యా, తెలంగాణా రాదని మీరిచ్చే పిల్లి శాపాలవల్లనో, తెలంగాణా రావాలని కె.సి.ఆర్. చేసే చండీయాగాలవల్లనో పనులు సాగవు. మునుపు చెప్పినట్లుగానే, తెలంగాణా ప్రజల ఉద్యమం. ఇందులో నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఉద్యమం ఆగదు.

http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=471&pageNo=0

Thursday, March 13, 2008

తెలంగాణా ప్రశ్నలకు జవాబులు 2

నా 'తెలంగాణా ప్రశ్నలకు జవాబులు' అన్న వ్యాసానికి నా బ్లాగులో కామెంట్లు వ్రాసినవారికి ధన్యవాదాలు తెలుపుతూ, సమాధానంగా ఈ వ్యాసం వ్రాయటం జరుగుతున్నది।
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=462&pageNo=0
తెలుగు అభిమాని గారు -

తెలుగువారంతా ఒకేచోట కలిసి ఉండాలని కోరుకుంటున్నా అన్నారు। రెండు వేరువేరు రాష్ట్రాలుగా తెలుగువారు ఉన్నా, వారంతా ముందుగా భారతీయులేగా! ఇక అభ్యంతరమేముంది. ఒక భాషకు ఒకటే రాష్ట్రమని ఎక్కడాలేదే? రాష్ట్రంలో 80 శాతం మంది కలిసే ఉందామని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు? ఏ ప్రాతిపదికన మీరు చెప్పారో వివరిస్తే బాగుంటుంది.

సమైక్యాభిమాని గారు -

రాజకీయ నాయకులు చెబితేనే తెలుసుకున్న చరిత్ర కాదు తెలంగాణా వీరుల త్యాగాలు. ఆ వీరుల త్యాగాలు తలచుకోవటం పాపమైతే, మహాత్మాగాంధిని, పొట్టి శ్రీరాములును తలుచుకోవటం కూడా పాపమే అవుతుంది.
యూరోపియన్ వ్యవస్థకు తెలంగాణాకు ముడివేయటం, అలాగే ఒకే భాష మాట్లాడుతున్నారు కాబట్టి తూర్పు పశ్చిమ జర్మనీలు కలిసిపోయాయని అంటూ మళ్ళీ తెలంగాణాకు ముడిపెట్టటం అర్ధరహితం। ఆ లెక్కన, చెకొస్లోవేకియా ఈనాడు చెక్ రిపబ్లిక్ గాను, స్లోవేకియాగాను విడిపోయిందని, నేను ప్రత్యేకంగా తెలంగాణాకు ముడిపెడితే మీకు హాస్యాస్పదంగా ఉండదా?

అసలు, ఏ పరిస్థితుల్లో, ఎలా, ఎందుకు జర్మనీ విడిపోయిందో మీకు తెలిసుంటే, అవి ఈనాడు ఎందుకు కలిసిపోయాయో అనేదానికి సమాధానం తెలుస్తుంది। ఓ సారి చరిత్ర పుటలు తిప్పి చదవండి.

ప్రత్యేక తెలంగాణా ఒక ఉద్యమం। చెన్నారెడ్డిలు, కె.సి.ఆర్.లు ఆ ఉద్యమంలో భాగస్తులు మాత్రమే. అంతే కానీ, వారే ఉద్యమం కాదని గ్రహించగలరు. తెలంగాణా ఏర్పాటైన తర్వాత, తెలంగాణా ప్రజలే వారి నాయకులను ఎన్నుకుంటారు. కాబట్టి, వారి పదవీలాలసతను, స్వార్ధాన్ని ఎండగట్టే ప్రయత్నంలో తెలంగాణా ఉద్యమాన్ని నీరుకార్చాల్సిన అవసరంలేదు.

తెలంగాణా ఎందుకు అడుగుతున్నారు - అభివృద్ధికోసమా, రాజకీయలబ్ది కోసమా అని ప్రశ్నించారు. వీటికి సమాధానంగా నేను వ్రాసిన వ్యాసం చదవండి. అలాగే, మీరు ప్రత్యేక తెలంగాణాకు ఎందుకు వ్యతిరేకమో, అలానే తెలంగాణా కలసి ఉండటంవల్ల కలిగే లాభాలు, విడిపోవటంవల్ల కలిగే నష్టాలు గురించి మీరు వివరంగా వ్రాస్తే తెలుసుకోవాలనుంది.

Monday, March 10, 2008

జ్ఞాపకాలు

అవసరానికో
రంగుమార్చే ఆకాశంలో
ఎదురుపడ్డ
రెండు మబ్బులు

కళ్ళ మెరుపుల మధ్య
మెరుస్తున్న వర్షం

విడివడిన
కొసలు బిగిస్తూ
జ్ఞాపకాల హరివిల్లు

Friday, February 22, 2008

తెలంగాణా - ప్రశ్నలకు జవాబులు

తెలంగాణాపై ఏమాత్రమూ అవగాహన లేకుండా ఈమధ్య 'తెలంగాణా ప్రశ్నలకు ప్రశ్నలు' అనే శీర్షికతో వచ్చిన ఓ ఆర్టికిల్ చదవటం తటస్థించింది। 'పేరు మాత్రమే గొప్ప' అన్న తరహాలో ఉన్న ఆ వ్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఆ వ్యాసకర్త కున్న కొన్ని దురభిప్రాయాలు, ఆయనకున్న అవగాహన చూసి నవ్వుకోవాల్సివచ్చింది.

ఎస్సార్సీ అంటే ఏమిటో కూడా తెలియదు ఆయనకు। ఎస్సార్సీ అనేది ఒక కమిటీ. అది కేవలమూ ఒక నివేదిక ద్వారా ప్రతిపాదనో లేదంటే రికమండేషనో చేయగలదు. కానీ, ఆయన మాత్రం అది తీర్పులిస్తుందంటారు!! అప్పట్లో మొదటి ఎస్సార్సీ ఇచ్చిన తీర్పు ఇప్పటి కాలమాన (వాతావరణం కూడా లిస్టులో పెట్టేసారు) పరిస్థితులకు పనికిరాదని కూడా ప్రకటించేసారు.

అయ్యా, ఏదో మేథావితనంతో వ్రాస్తున్నామనుకుంటూ, తెలంగాణాను వేళాకోళం చేస్తున్నారు। అది తప్పు. ఇంకా ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలైతే వ్రాసారు కానీ గుర్తులేవు. మళ్ళీ చూద్దామనుకుంటే, ఆయన మాత్రం ఆ వ్యాసానికి తాళం బిగించుకున్నారు. ఆయన సంగతి పక్కనపెట్టి, గతంలో 'ప్రత్యేక తెలంగాణా' శీర్షికన నేను వ్రాసిన ఓ వ్యాసంపై వచ్చిన కొన్ని అభిప్రాయాలకు వ్యాసం రూపంలోనే సమాధానం ఇస్తాను।

ఆ వ్యాసానికి స్పందిస్తూ, నా బ్లాగులో ఓ 'తెలుగు అభిమాని' 'మూడు ముక్కలు చేసుకుని నీళ్ళకోసం మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు' అని అడిగారు। బానే ఉంది. కొట్టుకుంటే బాగోదని, మనం బాబ్లీ విషయంలో మహారాష్ట్రతోనూ, ఆల్మట్టి విషయంలో కర్ణాటకతోనూ గొడవపడకుండా ఆగామా? వాళ్ళూ మనలాగే భారతీయులేగా అని మిన్నకుండిపోలేదే మరి?

అంతకన్నా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్య శ్రీ తాడేపల్లి లలితాసుబ్రహ్మణ్యంగారు చేసారు। తెలంగాణాది సాంస్కృతిక సమస్యట!! ఆయన మాటల్లోనే చదవండి. "తెలంగాణా సమస్య సాంస్కృతికమైనది। ఆర్థికం కాదు. తెలంగాణాలో తెలుగు సంస్కృతి పూర్తిగా క్షీణదశకు తేబడింది. మిగతా తెలుగువారితో ఇక్కడి తెలుగువారు మమేకం కాలేకపోవడానికి ఇదే కారణం. This is a culturally impoverished region. అందువల్ల ఈ ప్రాంతం వెనకబడిపోయింది. ముందు సాంస్కృతికంగా బాగుచెయ్యడానికి పూనుకుంటేనే ఆర్థికంగా బాగుచెయ్యగలం."

ఇంకా నయం. తెలంగాణా సమస్య సాంస్కృతికమైనదే అన్నారు. అది తెలంగాణావారి 'మానసిక సమస్య'గా చెప్పనందుకు సంతోషించాలేమో!
ఇంకా 'గ్రంధాలయోద్యమాన్ని' అక్కడ చేపట్టాలని ఆయన సెలవించారు। ప్రజలు తెలుగుభాష నేర్చుకోటానికి, తెలుగులో ప్రభుత్వ వ్యవహారాలు సాగేందుకు వీలుగా మాడపాటి హనుమంతరావుగారి ఆధ్వర్యంలో 'గ్రంథాలయోద్యమం' మొదలయ్యింది తెలంగాణాలోనే అన్న విషయం బహుశా మీకు తెలిసుండదు.

అసలు తెలంగాణా ఉద్యమానికి ఉన్న చారిత్రక నేపథ్యం తెలియకుండా, తెలంగాణావాదాన్ని వేళాకోళం చేస్తూ ఈ కుహానా మేథావులు ఏం సాధిద్దామనుకుంటున్నారో అర్ధం కాదు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణా విముక్తమయ్యిందన్న విషయం వీరికి తెలుసా? స్వతంత్రభారతంలో పరాధీనగా మిగిలిన 'కోటి రతనాల వీణ' చేసిన 'సాయుధపోరాటం'లో అసువులు బాసిన అమరవీరులెందరన్నది వీరికి తెలుసా? 'నీ బాంచన్ దొర' అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనగా పోటెత్తి నిజాం మెడలు వంచారన్న విషయం వీరికి తెలుసా?

ప్రత్యేక తెలంగాణా వాదంపై, పైత్య ప్రకోపాలు చేసే ఈ పెద్దమనుషులు అసలు తెలంగాణా కలిసి ఉంటే కలిగే లాభాలేమిటనేవి మాత్రం చెప్పరు। తెలంగాణా విడిపోతే కలిగే నష్టాలేమిటన్నది కూడా చెప్పరు. 'పెద్దమనుషుల' ఒప్పందం గురించేమైనా వీరికి తెలుసా? ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పుడే, ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా విషయాలు ప్రస్తావించబడటంలోని రాజకీయాలు వీరికి అర్ధం కావా? చెప్పిందే చెప్పెరా.... అన్నట్లు, ప్రత్యేక తెలంగాణా సమైక్యతకు ముప్పు అని మాత్రమే వల్లెవేస్తారు.

అటు కాంగ్రెసు నాయకులు కూడా, ప్రత్యేక తెలంగాణా వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు రాజకీయముప్పు ముంచుకొస్తుందనటంలోనూ అర్ధం లేదు। గత ఎన్నికల్లో 'సమైక్యాంధ్ర'తో పోరాడిన తెలుగుదేశం కోస్తాలో ఏపాటి సీట్లు గెలిచిందో అందరికీ తెలుసు. తెరాసతో ఎన్నికల సర్దుబాటు చేసుకొని, ప్రత్యేక తెలంగాణాకు తాము అనుకూలమని ఎన్నికల్లో పోరాడిన కాంగ్రెసు, అటు తెలంగాణాలోనూ, ఇటు కోస్తాలోనూ గెలిచిన విషయం విస్మరిస్తే ఎలా?

రెండో ఎస్సార్సీ వేయటమనేది కేవలమూ కాలయాపన చేయటానికే అనేది ప్రాథమిక రాజకీయాలు తెలిసిన ప్రతివాడు గ్రహించగలడు.
ఏదేమైనా, ఇలా అడ్డుగోలుగా వాదించే ప్రబుద్ధుల కన్నా కూడా, కె.సి.ఆర్., నరేంద్ర, వెంకటస్వామిలాంటి తెలంగాణా నేతలవల్లనే, ప్రత్యేక తెలంగాణాకు ముప్పు. చిత్తశుద్ధిలేని ఈ నేతల తెలంగాణా పూజ ప్రజలు అర్ధం చేసుకోకపోవటం తెలంగాణా దురదృష్టం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణాకు సంబంధించి ఏ ఒప్పందం ఉన్నదనేది ఈనాటికీ తెలంగాణా ప్రజలకు తెలియనీయకపొవటం వీరి నీచ రాజకీయాలకు పరాకాష్ట.
ఈరోజు తెలంగాణాకు కావల్సింది పొట్టి శ్రీరాములులాంటి నిస్వార్ధజీవి. సంకుచిత ప్రయోజనాలు ఆశించని, పదవీలాలసులుకాని నాయకులు అవసరం. పదవీలాలసతో ప్రత్యేక తెలంగాణాను పణంగా పెట్టిన రాజకీయ నాయకులను వదిలి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు, ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలరా లేదా అన్నది శేషప్రశ్న.

Thursday, February 21, 2008

దాగుడుమూతలు

ఎప్పుడో మొదలైన ఆట ఇది
ఇప్పటికీ మారలేదు.

దాటిన గోడలు
దాగిన నీడలు
అన్వేషణలో ఇవి మామూలే

వైఫల్యం, వైరాగ్యం మధ్య
గెలుపు అనుమానాస్పదమైతే
ఆ పక్కనే మరో ఆశ

అలజడే అదృశ్యమైతే
కనుచూపు మేరా కాంతిపుంజాలే

Thursday, February 14, 2008

ప్రత్యేక తెలంగాణా

దాదాపు ప్రతి వార్తాపత్రికలోనూ, వెబ్ సైట్లలోనూ తెలంగాణా వాదనతో విద్వేషాలు పొడచూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణా ఎందుకు అవసరమనే విషయాన్ని రాజకీయపక్షాలు వదిలేసి, ఇతర విషయాల మీద యాగీ చేయటంతోనే సమస్య మొదలౌతున్నది. తెలంగాణాను వ్యతిరేకించే సమైక్యవాదుల వాదన కూడా ఇందుకు భిన్నంగా ఏమాత్రమూ లేదు.

సమైక్యవాదుల అభిప్రాయంలో, ప్రత్యేక తెలంగాణా అనేది దేశసమైక్యతను, ఆంధ్రుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందనేది ముఖ్యమైనది. తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా కోరుతున్నారే కానీ, 'ఖలిస్తాన్' తరహాలో ప్రత్యేక దేశాన్ని అడగటంలేదే!

అసలు ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా కారణం, ఆంద్రప్రాంతంపై మద్రాసు నేతలు చూపించిన వివక్షే అనేది చారిత్రక సత్యం. ఇప్పుడు అదే వివక్షతను కారణంగా చూపిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలని కోరుకోవటం తప్పేమిటి?

మొదటి ఎస్సార్సీ 1953లోనే, ఆంద్ర తెలంగాణాలు వేరువేరు రాష్ట్రాలుగా ఏర్పరచాలని ప్రతిపాదించింది.

'...It will be in the interest of Andhra as well as Telangana if, for the present, the Telangana area is constituted into a separate state, which may be known as Hyderabad State, with provision for its unification with Andhra after general elections likely to be held in or about 1961, if by two thirds majority the legislature of the residuary Hyderabad State expresses itself in favour of such unification.'
ఇంకా
'Andhra and Telangana have common interests and we hope these interests will tend to bring the people closer to each other. If, however, hope of the development of the environment and conditions congenial to the unification of the areas do not materialize and if public sentiment in Telangana crystalizes itself against the unification of the two states, Telangana will have to continue as a separate unit.'

కానీ ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా విశాలాంధ్ర ఏర్పడింది. నిజానికి అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా తెలంగాణా - ఆంధ్ర ల సంయుక్తరాష్ట్రానికి వ్యతిరేకమే. విశాలాంధ్ర ప్రతిపాదనను ఆయన 'Tint of Expasionist Imperialism' అని కూడా అన్నారు.

విశాలాంధ్రలో తెలంగాణాకు మొండిచేయి చూపుతారనే ప్రజల అనుమానాల నివృత్తి కోసం 'పెద్దమనుషుల ఒప్పందం' చేసుకున్నారు. ఆ ఒప్పందంలోని ఏ అంశమూ ఇంతవరకూ అమలు చేయలేదు.

తెలంగాణాలో అభివృద్ధి జరిగిందంటూ సమైక్యవాదులు హైదరాబాదునే చూపిస్తారు కానీ, తెలంగాణాలో ఇతర జిల్లాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈనాటికీ, నల్గొండ, సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య తీరలేదు.

ఉదాహరణకు, ఆంద్ర రాయలసీమల్లో థర్మల్ విద్యుత్ ఉత్పాదన 7500 మెగావాట్లు. అదే తెలంగాణాలో 1600 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. విచిత్రమేమిటంటే, ఆంద్ర రాయలసీమలకు బొగ్గును సరఫరా చేసేది తెలంగాణా నుంచే. ఇక్కడ వనరులు దొరుకుతున్నప్పుడు ఇక్కడే అభివృద్ధి చేపట్టవచ్చు కదా!

ఆంద్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి 2001 దాకా దాదాపు 200 బిలియన్ రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే, తెలంగాణాలో కేవలం 40 బిలియన్ రూపాయలే ఖర్చు పెట్టారు.

ఇవి నేను వండి వడ్డించిన వివరాలు కాదు. 2001 సెన్సస్ ప్రకారం ప్రభుత్వ గెజెట్ లో ప్రకటించిన వివరాలు :

EDUCATION
Literacy Rate (as per 2001 Census)
Coastal Andhra – 63.58 %
Rayalaseema – 60.53 %
Telangana – 58.77 %
National Average - 65.38 %
=============
Enrolled School going children :
Coastal Andhra – 27,57,269 (45.50%)
Rayalaseema – 13,02,673 (21.49%)
Telangana – 20,00,452 (33.01%)
==============
No. of Teachers
Coastal Andhra – 64,314 (48.16%)
Rayalaseema – 28,434 (21.29%)
Telangana – 40,798 (30.55%)
================
Schools of Primary Education :
Coastal Andhra – 25,504 (45.62%)
Rayalaseema – 12,479 (22.32%)
Telangana – 17,918 (32.05%)

While noting the above details, keep in mind the Region-wise population percentage, which is as under :

Coastal Andhra – 41.69 %
Rayalaseema – 17.77 %
Telangana – 40.54 %

చిన్న రాష్ట్రాల వలన రాజకీయ అస్థిరత ఎక్కువౌతుందనేది మరో విమర్శ. పెద్ద దేశం మనది. ఇక్కడి కేంద్ర ప్రభుత్వమే అయిదు సంవత్సరాలు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఇక అస్థిరత గురించి మాట్లాడటంలో అర్ధం లేదు. అలానే, గోవా జార్ఖండ్ ల మాదిరిగా చిన్న రాష్ట్రమేమీ కాదు తెలంగాణా.

ఏమైనా రాజకీయ నాయకుల సంకుచిత ప్రయోజనాల కోసం తెలంగాణా బలౌతున్నదనేది వాస్తవం. ప్రత్యేక రాష్ట్రమనేది ఒక రాజకీయ ప్రక్రియే. కానీ, ప్రజలు మార్పును కోరుతున్నారా లేదా అనేది ప్రజాభిప్రాయం ద్వారానే సాధ్యం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. అంతేకానీ, ప్రణబ్ ముఖర్జీలు, రఘువంశప్రసాద్ యాదవ్ లు, సోనియా గాంధీల దయాభిక్ష కోసం తెలంగాణా ప్రజలు ప్రాకులాడేలా చేయటం సమంజసం కాదు.