Wednesday, August 6, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 05

సమానహక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా... అదే కొద్దిగా పొడిగించి, ఉదాహరణలతోసహా చర్చించుకుందాం.

రాహుల్ మహజన్ లాంటి రాజకీయనాయకుని వారసుడో, ఫర్దీన్ ఖాన్ వంటి సినీనటుడో మాదకద్రవ్యాల వినియోగం చేస్తూ పట్టుబడితే, తేలిగ్గానే తప్పించుకోగలరు. కానీ, సామాన్యుడెవడైనా అయితే, ఇంతే సంగతులు.

హత్యా యత్నం కేసు నుంచి బాలకృష్ణ లాంటి నటులకు ఆఘమేఘాల మీద 'న్యాయం' జరిగిపోతుంది. కనీసం కోర్టు ముందుకు కూడా రాకుండానే, లాకప్పులలోనూ, జైళ్ళలోనూ మగ్గుతున్న కేసులు లక్షలమందివి.

నట్వర్ సింగ్ కోడలు ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా, ఆయన కుటుంబానికి ఏమీ జరగదు. అదే ఒక సామాన్యుని ఇంట్లో ఇటువంటి ఘోరం జరిగితే?

అమితాబ్ లు, అమీర్ ఖాన్ లు రైతులమని చెప్పి చవకగా భూములు కొనేయగలరు. అదే మోసం సామాన్యుడు చేస్తే, జీవితాంతం కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సిందే.

సామాజికంగానూ, రాజకీయంగానూ ఉన్నతస్థాయికి చేరినా తమ కుమార్తెలకు కాలేజీ సీట్ల కోసం రిజర్వేషనులు ఉపయోగించుకునే రాష్ట్రపతులు మనకున్నారు. ఆర్ధికంగా కనీసమైన స్థాయి లేక రిజర్వేషనులు ఉపయోగించుకోలేని సామాన్యులు చాలామందే మనకున్నారు.

మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. అలానే, పెట్టుబడిదారి వ్యవస్థ మనది. ఒకటిన్నర దశాబ్దం వరకూ పెట్టుబడులు దేశీయంగానే ఉండేవి. ఇప్పుడు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. దీన్నే ప్రపంచీకరణగా పరిగణిస్తున్నాము.

మొన్నటిదాకా, ఒక కలర్ టీవీ ధర పాతికవేల పైమాటగానే ఉండేది. అలానే, ఇతర సౌకర్యాలు కూడా. వాషింగ్ మెషిన్లని, ఎ.సి.లని గట్రా గట్రాలు. ప్రస్తుతం ఆరువేలకే కలర్ టీవి, వాషింగ్ మెషిన్లు లభిస్తున్నాయని, ప్రపంచీకరణ ద్వారానే ఇది సాధ్యమౌతున్నదని మనకు చెబుతున్నారు. బానే ఉంది. కానీ, ఒకానొకప్పుడు అయిదు రూపాయలకే మంచి నాణ్యమైన బియ్యం దొరికేది. ఇప్పుడో! ఒకప్పటి నిత్యావసరాల ధరలకి, ఇప్పటి ధరలకి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే, సౌకర్యాల సొంపులో అవసరాలను పట్టించుకోవటంలేదు. అలా అని, ప్రపంచీకరణ ఆసాంతం కూడదని చెప్పటంలేదు. దేశీయంగా ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టటంలేదని అడుగుతున్నాను.

సరే, ఈ నేపథ్యంలోనే సమాన హక్కుల గురించి మరో ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ప్రపంచీకరణ నేపథ్యంలో మన దేశంలో వాణిజ్యం చేస్తున్న దేశీయ లేదా విదేశీయ వ్యాపారి. రెండోవాడు తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ కడుపు నింపుకుంటున్న రైతు.

మొదటివాడు అడగటమే ఆలస్యం అన్నట్లు బ్యాంకులు లోన్లు ఇవ్వటానికి క్యూలు కడతాయి. వాడికి ప్రభుత్వమూ చాలానే తాయిలాలు ఇస్తుంది. వాడి వ్యాపారానికి సంబంధించిన ఆఫీసులు, ఫ్యాక్టరీలకు బీమా సౌకర్యాలూ అందుతాయి.

వాడి ఉత్పత్తులు - కోకాకోలానో, కలర్ టీవీనో మరేదో వస్తువు వాడు నిర్ణయించిన ధరకే అమ్ముడుపోతాయి. 'సీజన్ల' ప్రకారంగా వాడు ధరలు నిర్ణయిస్తాడు.

అంతాచేసి, వాడు ఐ.పి. పెట్టటానికి కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకుంటే, ఏ బ్యాంకు వాడినేమీ చేయలేదు. అలా, వ్యాపారసంస్థలకు ఇచ్చి వసూలు కాని రుణాలు కొన్ని వేలకోట్లు అని మొన్నామధ్య ఆర్.బి.ఐ. నివేదికలోనే చదివినట్లు గుర్తు.

ఇక రెండోవాడు, బ్యాంకుల చుట్టూ ఎన్నెన్ని ప్రదక్షిణలు చేసినా, దక్షిణలు సమర్పించుకున్నా వాడికి రుణాలు లభించవు. పంటలకు బీమా సౌకర్యం లభించదు. ఒకవేళ రుణం లభించినా, వరదలొచ్చో, వానలు పడకో పంట నాశనమైనా కూడా, వాడు చచ్చేదాకా అప్పు వసూలు చేసుకునేందుకు వెంటాడి వేధించే బ్యాంకులు మనవి.

అలానే, పండించిన ఏ పంటకు ధరలు వాడు నిర్ణయించుకోలేదు. మధ్యలో దళారులు, లేదంటే, దళారి పనే చేసే ప్రభుత్వసంస్థలు. అంతచేసీ, కనీస మద్దతుధర కూడా లభించని దౌర్భాగ్యం.

అలానే, మన పార్టీల వ్యవస్థలో సమానహక్కుల గురించి ఓ ఉదాహరణ.

ఒకానొక పార్టీలో ఫలానా నియోజకవర్గంలో దాదాపు ముప్ఫై నలభై ఏళ్ళుగా క్రమశిక్షణతో పనిచేస్తున్న ఓ కార్యకర్త ఉన్నాడు. ఆ పార్టీకే చెందిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేనో, ఎంపీనో మరణించాడు. వాడి స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఏ అధిష్టానమూ మల్లగుల్లాలు పడదు. చచ్చినవాడి భార్యో, కాదంటే కూతురో, లేదంటే కొడుకో! అన్ని సంవత్సరాల కార్యకర్త శ్రమకు ఫలితంగా ఏ పార్టీ వాడికి అవకాశం కల్పించదు. గాంధీలు, సింధియాలు, పైలట్లు ప్రతిపార్టీలోనూ ఉన్నారు. నిజానికి, ఉన్నదే వాళ్ళు.

దీనికి కాంట్రాస్టింగ్ గా మరో ఉదాహరణ (వాస్తవమైనదే) తీసుకుందాం. ఓ పెద్ద వ్యాపారి ఉన్నాడు. బ్రాండీ, విస్కీలు తయారుచేసి అమ్ముతూ ఉంటాడు. ఒకానొకనాడు, పార్లమెంటు సభ్యుడవ్వాలనే కోరిక పుట్టింది. అదృష్టం కూడా అలాంటివారి తలుపులే తడుతుందేమో! సరిగ్గా అప్పుడే, రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఏ రాజకీయపార్టీ వాడికి టిక్కెట్ ఇవ్వటంలేదు. సరే, స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడ్డాడు. గెల్చాడు కూడా. అర్హత ఉన్నా లేకపోయినా, వారసత్వంతోనో, ధన మదంతో చట్టసభల్లో ప్రవేశించగలిగే పరిస్థితి మన రాజ్యాంగం మనకు ఇచ్చింది.

సామాజికంగా, రాజకీయంగా పతనమౌతున్న నైతిక విలువలే వీటన్నిటికీ కారణం. నైతిక విలువల విషయం వైయుక్తికమైనా, వాటికి సరిపడా చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన రాజ్యాంగానిది. కానీ, ఆ రాజ్యాంగం ముందు చెప్పుకున్నట్లు అధికార, ధన మదాంధుల చేతిలో మాత్రమే నడిచే కీలుబొమ్మ. నైతిక విలువల విషయానికి వస్తే, మన ప్రతి రాజకీయ నాయకుడూ ఓ గురువింద గింజ.

మైనారిటీల సంక్షేమం గురించి సవాలక్ష కబుర్లు చెబుతాడు లాలు యాదవ్. తాను దానా కుంభకోణంలో జైలుకెళ్ళే పరిస్థితుల్లో తన భార్యను ముఖ్యమంత్రిని చేసాడే కానీ, తనపార్టీలోని మరే ఇతర మెజారిటీ, మైనారిటీ నేతను కాదు.

దళితుల గురించి ఇంతకు మించి ఉపన్యాసాలు చెబుతాడు రామ్ విలాస్ పాశ్వాన్. మరి దళిత యువతిని వివాహం ఎందుకు చేసుకోలేదు?

దళితులకే తన జీవితం అంకితమంటుంది మాయావతి. కొన్ని వేల కోట్ల రూపాయలు తన పేరు మీద, కుటుంబ సభ్యుల మీద ఎందుకు దాచిపెట్టుకుంది?

ఒక సామాన్యుడు తను కట్టాల్సిన ఆదాయపన్నులో ఓ వంద రూపాయలు తక్కువ కట్టినా, వాడిని నానా రభస చేస్తుంది మన ఆదాయపన్ను శాఖ. మరి మన రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల నేతలకు అంతేసి డబ్బు ఎక్కడి నించి వస్తున్నదనేది మాత్రం ఎందుకని పట్టించుకోదు?

ఆదాయం ఉన్నా, లేకపోయినా రిటర్న్స్ ఫైలు చేయాలంటుంది ప్రభుత్వం. ఎన్ని రాజకీయ పార్టీలు ఆ పని చేస్తున్నాయి? చిన్నపాటి వ్యాపారమైనా, ఆడిటింగ్ జరగాలని రూల్సు చెబుతారు, మరి అంతేసి ఆదాయం ఉన్న పార్టీలపైన ఆడిటింగ్ ఎందుకు లేదు?

సామాన్యులను వారి మానాన వారిని వదిలి, కొందరు అసామాన్యుల విషయం పరికిద్దాం. మైనారిటీలను సంతోషపెట్టటానికి చరిత్రను కూడా వక్రీకరించే దుర్మార్గానికి కూడా మన ప్రభుత్వాలు వెనుదీయవు. దానిని అడ్డుకునే ఏ ప్రయత్నమూ మన రాజ్యాంగం చేయదు, చేయనీయలేదు. ఎంతటి మహోన్నతమైన చారిత్రాత్మక వ్యక్తి అయినా, స్వాతంత్ర్యోద్యమ పోరాట యోధుడైనా ఆయా ప్రభుత్వాల కులమత రంగుల్లో కుళ్ళిపోవల్సిందే.

ఔరంగజేబ్ అనే మొగలాయి పాలకుడిని ముప్పతిప్పలు పెట్టిన ఛత్రపతి శివాజి గురించి, ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఘనంగా చెబితే, మైనారిటీలు బాధపడతారని ఆయనను ఓ దారిదోపిడీ దొంగగా కధలు ప్రచారం చేసి, పాఠ్యాంశంగా కూడా చేరుస్తారు. దేశ రాజధానిలో ఒక రోడ్డుకు ఔరంగజేబ్ పేరు కూడా పెడతారు. శివాజీని మాత్రం తలుచుకునే నాధుడే రాజధానిలో కనిపించడు.
అంబేద్కర్ శిలావిగ్రహాన్నిపగులగొట్టారనో, రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చుక రెట్ట వేసిందనో, మీనాతాయి విగ్రహంపై దుమ్ము వేసారనో బంద్ లకు పిలుపునిచ్చి రెచ్చిపోయే రాజకీయ మూకలున్నాయి.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, తన జీవితంలో చాలాభాగాన్ని అండమాన్ జైల్లోని దుర్భర పరిస్థితుల్లో గడిపిన వీర్ సావర్కర్ ను ఒక కేంద్ర మంత్రి అవమానించిన తీరు మనలని కదిలించలేదు. అదే జైల్లో ఆయన స్మారకంగా ఉన్న చిత్రపటాన్ని బయటపారేయించిన ఆ కేంద్రమంత్రిని ఏం చేయాలి?

వీరి దృష్టిలో గాంధీలు, నెహ్రూలు, అంబేద్కర్ లు మాత్రమే దేశ స్వాతంత్ర్యం కోసమో, దేశ సంక్షేమం కోసమో కృషిచేసినివారు. మిగతావారు అసలు లేనట్లే!

మన రాజ్యాంగంలో అందరికీ సమానహక్కులనేవి కల్లబొల్లి కబుర్లు. డబ్బులు, అధికారం ఉన్నవారికే ఈ దేశంలో జీవించే హక్కు. తక్కినవారి జీవితాలకు విలువే లేదు.

3 comments:

  1. చాలా విసృతమైన బాధ,ఆక్రోశం. కానీ ఇప్పుడు ఏంఛేద్దామని సూచిస్తారోకూడా చెబితే విని మిమ్మల్ని ఆచరించడానికి ప్రయత్నిస్తాము.

    మన ప్రజాస్వామ్యం మేడిపండే,కానీ అది "మనదే" కదా! అందుకని మీరు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలుకూడా చెబితే బాగుంటుంది.

    ReplyDelete
  2. మీ ఆవేదన అర్థం అయింది. నిజమే కుహనా లౌకికవాదులు ఉన్నంత వరకు ఏమి చెయ్యలేము. సావర్కర్ గురించి జరిగింది చాలా బాదాకరం. ఒక వర్గాన్ని సంతుష్ట పరచడానికి ఎక్కడికైన దిగజారే వీళ్ళను చుస్తే నిజంగా అసహ్యం వేస్తుంది.

    ReplyDelete
  3. కిరణ్ కుమార్ గారూ!

    భారతీయులంతా చదవదగిన వాస్తవాలను మీరు ఈ శీర్షిక ద్వారా అందిస్తున్నారు.. ధన్యవాదాలు.ఇన్ని చెప్పినవారు పరిష్కారం సూచించకుండా ఉండకపోరు.కానీ మీరు అంతిమంగా పరిష్కారంగా సూచించేదేమిటి?.. సంస్కరణా?..లేక సమూల మార్పా?..అని నాకు కుతూహలంగా ఉన్నది.ఐతే మీరు చెప్పే వరకూ నేను వేచి చూస్తాను... మీరు కొనసాగించండి.. మరో సారి ధన్యవాదాలు!

    ReplyDelete

మీ అభిప్రాయం :