Showing posts with label పాత కవితలు. Show all posts
Showing posts with label పాత కవితలు. Show all posts

Monday, March 8, 2010

అనామిక డైరీలో ప్రతిరోజూ...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో.... మహిళల కోసం నా పాత కవిత....

యవ్వనం పొలిమేరల్లో ఉన్నప్పుడే
నాలుగు అక్షింతలు వేసి
ఆంజనేయులుకు కట్టబెట్టారు
ఉత్తేజంతో యవ్వనాన్ని
ఏతమేసి తోడేసరికి
రెండు ఇష్యూలు
ఆపైన, కరీనాలాంటిదాన్ని
కొక్కిరాయినైపోయాను
ఈ అమీర్ ఖాన్ కళ్ళకు!


పేస్టు బాలేదని మారిస్తే,
నా టేస్టు బాగుందన్నవాడే
ఇప్పుడు గీచి గీచి
ట్యూబు కోసిమరీ వాడమంటుంటే
తాజ్ మహల్ గుర్తుకొచ్చి
నవ్వొస్తుంది.
తాజ్ మహలంటే గుర్తొచ్చింది,
టీ పొడి తెమ్మని గుర్తుచేయాలి.


ఎదురెదురు గోడలకి
మేకులు కొట్టి
మంగళసూత్రాన్ని
దండెంగా కట్టి
నా జీవితాన్ని ఎండగట్టిన
పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
ఇద్దరాడపిల్లలను చూసి
గమ్మునుండాల్సి వస్తున్నది.


ఏంటో, నాకోసం నేను గడిపే
ఈ పావుగంటలోనూ
ఎన్నెన్నో ఆలోచనలు
సబ్బు కూడా అయిపోయింది
తెమ్మంటే ఏం తెగులో
ఈరోజుకు ఇలా తెమిలేస్తా.

Tuesday, January 15, 2008

ప్రకృతిలాస్యం

చిలుకమ్మ మాటకు
కోకిలమ్మ పాటకు
భావకవితలా
వసంతం స్వాగతం
పలికిందని

తరివి నీడ, గాలి నీరు
చిగురుటాకు, చిన్న మొగ్గ
రోషించి విప్లవిస్తూ
గ్రీష్మంలా ఉద్యమించాయి

మావిచిగురు కినుకలను
మల్లెమొగ్గ అలకలను
బుజ్జగిస్తూ ఆకాశం
మనసారా నవ్వుతుంటే

మేఘమాల తాళానికి
చినుకు నాట్యమాడింది
తుళ్ళిపడ్డ మావి చిగురు
తనువంతా తడిసింది

రెక్కలొచ్చి చిరుగాలి
రివ్వుమంటు సాగింది
పెదవి విప్పి మల్లెమొగ్గ
పల్లె పదం పాడింది

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పండుగంటేనే అమ్మాయిల పండుగ. అమ్మాయిలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ...

ఆడపిల్లలు ఆడపిల్లలు
ఆకుపచ్చని ఆడపిల్లలు


అవని విరసిన పూలజల్లులు
విరగబూసిన సన్నజాజులు


కులుకు నడకల రాజహంసలు
అలక మనసుల గొల్లభామలు


మొలకనవ్వుల మల్లెమొగ్గలు
చిలుక పలుకుల తేనెచినుకులు


కలువ కన్నుల కోమలాంగులు
ఉరుముచూపుల మెరుపుమాలలు


ఆడపిల్లలు ఆడపిల్లలు
పచ్చపచ్చని ఆడపిల్లలు

Friday, January 11, 2008

అక్షరాలు

దారితప్పిన చంద్రుడి కోసం
కడలి లోతుల్లో
నక్షత్రాలు తొంగిచూసినట్లు
గాడి తప్పిన అక్షరాల కోసం
ఆలోచనలు
మనసుపొరల్లో
తొంగిచూస్తున్నాయి.

తూగుటుయ్యాలలో
ఊగుతున్న నక్షత్రాలలానే
ఆలోచనలు అక్షరాలు
ఆవులిస్తూనిద్రిస్తున్నాయి.

నిర్లిప్తమో, నిర్వికారమో
అస్తవ్యస్తమో, సాథారణమో
ఓ కదలిక
నిర్నిద్రమైన ఆలోచనతో
ఒక ఆవేశపు కలయిక
గుండె గొంతును
తట్టి లేపింది.

గుట్టుగా
గుండెచేసే చప్పుడే
ఇప్పుడు
అక్షరాలై
గుండె లోతుల్లో
దారులు వెతుకుతోంది.

Monday, December 31, 2007

నేను

నీవు ఎవరు అన్న ప్రశ్నకు ప్రకృతి ఇచ్చిన సమాధానంగా వ్రాసిన కవిత :

ధరణీమణి దాహార్తికి
చిరుజల్లులు కురిపించగ
సుమశరములు సంధించిన
జలధరముల హరిధనువును నేనే

హిమపాతపు స్వరఝరిలో
శివరాతిరి రసధునిలో
నిటలాక్షుడు నర్తించగ
విడివడిన సిరిమువ్వల ఘనజ్వాలను నేనే

నగముల చిరునగవుకు
మురిసిల్లి స్పృశియించిన
సురభామల దరహాసపు
శ్వసనంలో చలనంలా నేనే

ప్రత్యూషపు కాంతుల్లో
కుసుమించిన కెందమ్ముల
అందాలను అలరించే
మిహిరారుణ చరణంలో కిరణంలో నేనే

వడగాలుల వింజామరలో
బీటలువారిన ఎండునేలలో
సంవేశించిన చిరుమొలకల
అలకల పెనుకదలికలో నేనే

భువనయాత్రలో సంగ్రామిస్తూ
అభవఘోషలో సంగమించిన
శుష్కకాష్ఠములు ప్రస్తానించే
ప్రేతభూమిలో చితులు కాలిన తరివినీడలో నేనే

శిశిరంలో తిమిరంలో
గగనంలో గర్జనలో
జడివానల, పెనుగాలుల
పరాక్రమంలో, ప్రకంపనల్లో నేనే

అణువుఅణువులా నిక్వాణంలో
క్షణపుక్షణపు నిశ్వాసంలో
అనంతకాలపు ఆరోహణల
గమనంలో నేనే
గమ్యంలో నేనే

ప్రతిధ్వని

తమస్సులో జ్వలించినా
ఉషస్సులా జనించినా
అదే స్వరం
అదే స్వనం
కుహూకుహూల ప్రతిధ్వనం
నిశ్శబ్దశబ్ద ప్రతిధ్వనం

అనాది నెరుగు వేదమైన
అమ్మ మరుగు రోదనైన
అదే క్షణం
అదే క్వణం
నినాదనాద ఘోషణం
నిశ్శబ్దశబ్ద ప్రతిధ్వనం

గీతగాన గోవిందుని
బలసూదనసూనుడిది
అదే రణం
అదే రవం
ప్రళయరావ గర్జనం
నిశ్శబ్దశబ్ద ప్రతిధ్వనం

ప్రచండభాను వీక్షణాన
శమింపు సోమ రసామృతాన
అదే నాద
మదే ధ్వానం
నిశ్శబ్దశబ్ద ప్రతిధ్వనం
నిశ్శబ్దశబ్ద ప్రతిధ్వనం

పుట్టుక

ఒక ప్రేమావేశం
ఒక మోహావేశం
కోటికోట్ల జీవకణాల
రూపుదిద్దే లిప్తావేశం
క్షణభంగుర జీవితాన్ని
సృష్టించే
ప్రకృతి పారవశ్యం

జననమో, మరణమో
సహనమో, హననమో
సత్యమో, ధర్మమో
కష్టమో, సౌఖ్యమో
కాళరాత్రి చీకట్లో
కాంతిరేఖ వెలుగులో
ఏమీ తెలియని అద్వైతం!!

కొండచిలువై
కాలం మింగబోతోందని
అనుభవాలు
గుండె చీకట్లై నిండబోతోందని
తెలియని
మంచితనపుమెతకబిడ్డ
కనులెత్తి విశ్వాన్ని చూస్తొంది.