Friday, January 11, 2008

అక్షరాలు

దారితప్పిన చంద్రుడి కోసం
కడలి లోతుల్లో
నక్షత్రాలు తొంగిచూసినట్లు
గాడి తప్పిన అక్షరాల కోసం
ఆలోచనలు
మనసుపొరల్లో
తొంగిచూస్తున్నాయి.

తూగుటుయ్యాలలో
ఊగుతున్న నక్షత్రాలలానే
ఆలోచనలు అక్షరాలు
ఆవులిస్తూనిద్రిస్తున్నాయి.

నిర్లిప్తమో, నిర్వికారమో
అస్తవ్యస్తమో, సాథారణమో
ఓ కదలిక
నిర్నిద్రమైన ఆలోచనతో
ఒక ఆవేశపు కలయిక
గుండె గొంతును
తట్టి లేపింది.

గుట్టుగా
గుండెచేసే చప్పుడే
ఇప్పుడు
అక్షరాలై
గుండె లోతుల్లో
దారులు వెతుకుతోంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :