Thursday, January 3, 2008

ఎర్రన్నలకో వెర్రిప్రశ్న

ఎనుమాముల వీధుల్లో
ఆకాశం మెడను వంచి
ఎగరేసిన ఎర్ర జెండా
గళమెత్తిన పాట వింటు
గంతులేస్తు గద్దరన్న
గద్దించిన ప్రభుత్వాన్ని
గద్దె మీద పాతేసిన
పెద్దన్నల తీరు చూసి


జారుతున్న గుండెదిటవు
చెబుతున్న హితవు వింటు
మాగాణం అమ్ముకునే
రైతన్నల అణువణువున
అలుముకున్న శోకాన్ని
నిస్సహాయ రోషాన్ని
ప్రజాయుద్ధ భేరితో
సమాయత్తం చేయగలరా?

కరవాలం ఝళిపించి
కలవరాన్ని సృష్టించి
మిణుకుమిణుకు మంటున్న
చిరుఆశలు బుగ్గిచేయు
వరవరాలు, వంగపండు
చలసాని, సత్యమూర్తి
అభిప్రాయబేధాలు
ప్రజారాజ్య మార్గాలా?

ఆశయాలు నమ్ముకొని
పోలీసుల పాడెగట్టి
ఆశయాలు అమ్ముకున్న
పెద్దన్నల జతగట్టి
ప్రజారాజ్యమిస్తారా?
చైతన్యం తెస్తారా?
తెలంగాణా తేగలరా!
ఆల్మట్టి తెరవగలరా?

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :