Tuesday, January 8, 2008

శాంతి సందేశం

కాలం లోతులు
తవ్వి చూసాను
రాలిపడిన చినుకుల్లా
చెదిరిపడిన
స్వప్నశిథిలాల్లో
ఊపిరందక
గతం గొంతు
మూలుగుతోంది.

కాలం అంచున
తరచి చూస్తున్నాను
రంగు వెలసిన
ఇంద్రధనువును
అలుముకున్న నల్లటినీడల్లో
సమాధి చేయబడుతున్న
వెలుగు శకలాలు
కనిపిస్తున్నాయి.

అనుభవాల ఆస్తిగా
మిగిలిన
అస్తిపంజరాల సాక్షిగా
హాలాహల జ్వాలల్లో
ఛిద్రమౌతున్న
రేపటి భవితపై
నమ్మకం కలగటంలేదు

గతం గొంతు
నులమలేను
సమాధుల పునాదులు
పెకిలించలేను
నిరాశావాదిని కాను నేను
యథార్ధాన్ని కాదనలేను
విశ్వమానవుడిలో
వీగిపోతున్న
శాంతి సందేశాన్ని నేను

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :