Thursday, January 3, 2008

ఉగ్రవాదం పెనుభూతం

దక్షిణాసియాలో ముఖ్యంగా ఉపఖండంలో మునుపెన్నడూ లేనంత భారీ విపత్కరపరిస్థితులు చుట్టుముట్టి ఉన్నాయి. ప్రంపంచంలోనే అత్యధికంగా ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఘాతుకాలతో పెట్రేగిపోతున్నారు. అభంశుభం తెలియని సామాన్యులతోపాటు, ఆయా దేశాల అగ్రనేతలూ బిక్కుబిక్కుమంటూ కాలం వెలిబుచ్చుతున్న దుస్థితి. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ పడగ నీడలో కూనారిల్లుతున్నది. ఈ పరిస్థితుల మధ్య బేనజీర్ భుట్టో హత్య ఆశ్చర్యం ఏమీ కలిగించదు.
పొరుగుదేశంపై పోరు కోసం పాకిస్తాన్ ఏలికలు మొదలేసిన పన్నాగాలు, ఇప్పుడు ఆ ఏలికలకే ఎసరు పెట్టే దిశగా సాగుతున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రవాదులపై జరుపుతున్న పోరులో అమెరికాకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలాగా తన్నుకులాడుతోంది.
పదవికి ప్రాణగండానికి ఉన్న సంబంధం తెలుసు కనుకనే, పాకిస్తాన్ పాలకులు పదవి నిల్పుకోడానికి వేయని పాచికలంటూ వదలరు. కాబట్టే, సైన్యాధ్యక్షుడుగా తననితాను నిలుపుకోడానికి తపనపడ్డ ముషారఫ్, ఎట్టకేలకు అమెరికా అభీష్టానికి తలవొగ్గి సైన్యాధిపతిగా పదవీ విరమణ చేసినా, రాష్ట్రపతిగా మాత్రం తననితాను ఎన్నిక చేయించుకున్నాడు. ప్రజాస్వామిక విలువలకు పట్టం కడుతున్నట్లుగా భేషజంగా ఎన్నికలను ప్రకటించిన రాష్ట్రపతి, దేశానికి తిరిగివచ్చిన నవాజ్ షరీఫ్ ను ఏవిధంగా తిప్పిపంపాడో అందరికీ తెల్సిందే. ఎన్నికలను బహిష్కరిస్తానన్న తర్వాత మాత్రమే, నవాజ్ షరీఫ్ ను పాకిస్తాన్ లోకి అనుమతించటం ఆలోచించాల్సిన విషయం. ఆపైన, మరో అగ్రనేత బేనజీర్ భుట్టోకు, పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం రక్షణ కల్పించిందనేది కూడా ఇప్పుడు అర్ధమౌతున్నది.
అసలిప్పుడు పాకిస్తాన్ లో ఎన్నికలు జరుగుతాయా అన్నదో ప్రశ్నైతే, ఒకవేళ జరిగినా ప్రధాన ప్రతిపక్షాల నేతలు లేకుండా జరిగే ఎన్నికలు ఏపాటివి అనేది మరో ప్రశ్న. నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ఈనాటివరకూ పాకిస్తాన్ లో జరుగలేదన్నది యదార్థం.
ఇక భారత్ లో పరిస్థితులు చెప్పుకోదగ్గ గొప్పగా మాత్రం లేవు. రాజకీయ అస్థిరత్వం, ఆపైని కుటిల రాజకీయాలు పరోక్షంగా తీవ్రవాదుల కొమ్ముకాస్తున్నాయి. రాజకీయంగా నిబద్ధతలేని నాయకుల అనాలోచిత నిర్ణయాలకు తీవ్రవాదం బుసలు కొడుతుంటే సామాన్యుల రోజువారీ జీవనం నిప్పులపై నడకలా సాగుతొంది. ముంబాయి, హైదరాబాద్, బెంగుళూరు... ఇలా ఒక్కటేమిటి దేశమంతా ఏ రోజుకారోజు గడిస్తే చాలనుకునే పరిస్థితులమధ్య బితుకుబితుకుమంటున్నది.
పేరుగొప్ప ప్రజాస్వామ్యమే కానీ, ప్రజల రక్షణకు మన ఏలికలు చేస్తున్నదేమిటి? దుర్ఘటన జరిగిన తర్వాత సంతాపం వ్యక్తం చేయటం, దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయటం, నివేదిక వచ్చింతర్వాత తుంగలోకి తొక్కటం! దేశభద్రతపై మన పాలకుల అలక్ష్యం ఇంతవరకూ కనీవినీ ఎరుగనిది.
తీవ్రవాద నిరోధానికి మునుపటి ఎన్.డి.ఎ. ప్రభుత్వం జారీచేసిన 'పోటా'కు పట్టిన దుర్గతి తెలిసిందే. దేశభద్రతకు ముప్పుగా పరిణమించిన తీవ్రవాదాన్ని నిరోధించటానికి చేసే యత్నాలకు మతం రంగు పులమటంలోని ఔచిత్యం ఏమిటి? దేశ సార్వభౌమత్వానికి, సాధికారతకు చిహ్నమైన పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురుకు, ఆ శిక్ష ఇంతవరకూ అమలుచేయకపొవటమేమిటి? దేశభద్రత కన్నా, మతం ముసుగులో ఉన్న తీవ్రవాది భద్రతపై మన నాయకులకు ఎందుకు అంతులేని ప్రేమ?ఓటు బ్యాంకు రాజకీయాలకు దేశభద్రతను కుదువపెట్టిన మన నాయకులకు, పాకిస్తాన్ పాలకులకు ఏమైనా తేడా ఉందా?

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :