Monday, May 18, 2009

ఎన్నికల ఫలితాలు - కామెడీ కింగులు

ఈ ఎన్నికల ఫలితాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయనేది వాస్తవం. ముఖ్యంగా, రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం సానుభూతిపరులని, చిరంజీవి అభిమానులని, ఈనాడు పాఠకులను ఈ ఫలితాలు ఆశ్చర్యంలో ముంచేసాయి.

మొన్నటిదాకా, ఉచితంగా లభించేవాటికి కక్కుర్తిపడేవాళ్ళు మన ఓటర్లు అనే అభిప్రాయం (నాక్కూడా) ఉండేది. కానీ, ఈ ఎన్నికల్లో ఫ్రీగా ఎన్నో ఇస్తామని వాగ్దానాలు చేసిన తెలుగుదేశాన్ని మరో అయిదేళ్ళు ఫ్రీగా ఉండమని ప్రజలు తీర్పు నివ్వటం ఆహ్వానించదగ్గ పరిణామం.

ఈ ఎన్నికల్లో అటు కేంద్రస్థాయిలోనూ, ఇటు రాష్ట్రస్థాయిలోనూ ఓటర్లు చూపిన పరిణతి పార్టీలన్నిటికీ కనువిప్పు కావాలి. ముఖ్యంగా కేంద్రస్థాయిలో ఏ ఏ ఒత్తిళ్ళమధ్య గత అయిదుసంవత్సరాలుగా ప్రధాని దేశాన్ని నెట్టుకువచ్చారో ప్రజలు గుర్తించినట్లే కనిపిస్తుంది. అలానే, రాష్ట్రస్థాయిలో వాపును చూసి బలుపుగా భ్రమపడ్డ ఆర్జేడి., ఎల్జెపి వంటి పార్టీలనే కాకుండా, సినీమాయలో ప్రజలను ప్రలోభపెట్టటం తేలిక అనుకునే చాలామంది సినీనాయకులను కూడా మట్టికరిపించారు.

గతంలోని ఎన్నికలతో పోలిస్తే, ఈనాటి ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఏ అంశమూ లేకుండానే పోరాడాయి. భా.జ.పా. 'బలహీన ప్రధాని'ని అంశంగా చేయాలని ప్రయత్నించి భంగపడింది. ఎప్పుడూ వైరిపక్షాలపై నోరుమెదపని మన్మోహన్, మొదటిసారి నోరుమెదిపి కాందహార్ లో ఈ 'లోహపురుషుడు' ఏం చేసాడని వేసిన ప్రశ్నకు, రాబోయే అయిదేళ్ళవరకూ భా.జ.పా. సమాధానాన్ని వెదుక్కుంటూనే ఉంటుంది.

ఈ ఎన్నికల్లో అటు కేంద్రస్థాయిలోను, ఇటు రాష్ట్రస్థాయిలోనూ 'అధికారపక్షానికి' అనుకూల పవనాలు వీయటం కన్నా, 'ప్రతిపక్షాలకు' వ్యతిరేక పవనాలు వీచాయని చెప్పుకోవచ్చు. అధికారపక్షాన్ని 'యాగీ' చేయటంలో చూపిన నిబద్ధత, ప్రజా సమస్యలపట్ల ప్రతిపక్షాలు చూపలేదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తెరిగారు.


ముఖ్యంగా, రాష్ట్రంలో ప్రత్యేక ఆర్ధికమండళ్ళ పేరు మీద, పేదరైతుల భూములను ప్రభుత్వం ఇతరులకు ధారాదత్తం చేయటాన్ని ఖండిస్తూ మొదలేసిన ప్రతిపక్షాల ఆందోళన చివరివరకూ సాగలేదు. అదే, పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ చివరి వరకూ పోరాడి సాధించగలిగిన విషయం గుర్తించాలి. అందుకే కామ్రేడ్ల కంచుకోట బీటలువారిపోయిందన్న విషయం కూడా గుర్తించాలి.

మొత్తానికి ఈ ఎన్నికల్లో, కాంగ్రెస్ గెలిచిందనైతే ఆనందించటం లేదు కానీ, మూలసిద్ధాంతాలకు దశాబ్దం క్రితమే తిలోదకాలు ఇచ్చిన భా.జ.పా.కు, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే కమ్యూనిస్టులకు, వాపును బలుపుగా భ్రమపడిన ఆర్జేడి, ఎల్జెపి, పిఆర్పీలలాంటి కామెడీకింగులకు ప్రజలు నిజంగానే గడ్డిపెట్టారని ఆనందంగా ఉంది.

అటు కాంగ్రెస్ కూడా రాష్ట్రస్థాయిలో తగ్గిన తమ పరపతిని గమనించుకోవాలి. సరిపడ్డ మెజారిటీ వచ్చిందని సంబరపడితే కాదు, తమ అనుచరులకు, తమ పార్టీవారికి దోచిపెట్టటం మాని, ఎన్నో ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు వేసిన ఓట్లకుగాను, వారికి న్యాయం చేయాలి.

Friday, May 15, 2009

మంత్రాలు - కామెడీ కింగులు - ద్వంద్వ ప్రవృత్తి

ఏవో లింకులు తన మేధావితనానికి గుర్తుగా కామెడీ కింగు గారు నా బ్లాగులో ఇచ్చారు. అవి క్లిక్కితే, ఓ చోట మంత్రాలపై, పూజలపై కా.కిం. గారి అభిప్రాయాలు అబ్బురపరచాయి.

ఆయనే ఛాతి విరుచుకొని వ్రాసారు 'నాకు తెలిసిన కాస్తోకూస్తో సంస్కృతంతో కొన్ని మంత్రాలకు అర్ధాలు తీసే ప్రయత్నాలు చేసానుకూడా'.
అబ్బో అయ్యవారికి అంత ఉందనుకోలేదు. పాపం, సంస్కృతంలో తనది మిడిమిడి జ్ణానం అని ముందే చెప్పుకొని, మంత్రాలకు అర్ధాలు కూడా తీసారుట! ఆ అర్ధాలు ఎలా అఘోరించి ఉంటాయో ఊహించుకోటం కష్టమేమీ కాదు. పోన్లే కనీసం తన తెలివితేటలను చూచాయగా మాత్రమైనా గ్రహించారు. అందుకు ఆయనకు అభినందనలు.

'చాలా వరకు మంత్రాలు దేవుడి గుణగణాలు, బంధుత్వాలు, లేక ఆయన సౌందర్యాన్నో శక్తినో తెలియజెప్పేవే తప్ప పనికొచ్చేవి చాలా తక్కువ కనిపించాయి'

ఊ! పనికొచ్చే మంత్రాలంటే ఏమిటని అయ్యవారి ఉద్దేశ్యం? అసలు, ప్రతి కౌన్ కిస్కా గాడికి అర్ధమయ్యేవైతే అవి మంత్రాలెందుకౌతాయి? అసలా పెళ్ళిలో కూడా తన దిక్కుమాలిన పాండిత్యంతో వేధిస్తున్నాడని ఏవేవో అర్ధాలు చెప్పుంటారు వాళ్ళు 'ఇంద్ర' సినిమాలో 'బ్రహ్మానందం'లా.

'మూఢాచారాల నుంచి, అర్ధరహిత మంత్రాల నుంచి, ఉబుసుపోక చేసె పూజా పునస్కారాల నుంచీ విముక్తి ప్రసాదించిన నా తండ్రికి ధన్యుడిని.'

ఆహా హా, తండ్రంటే ఎంత గౌరవభావం!! అదే తల్లి చేసేవన్ని ఉబుసుపోక చేసే పూజలు పునస్కారాలు!! ఎంత గొప్ప మనసో? అయినా, ఏదో రోజువారీ వ్యాయమంలా చేసే పూజలు పునస్కారాల నుంచి ఎవరైనా ఏం నేర్చుకుంటారులే. పెరిగిన వాతావరణం ప్రభావితం చేసే మనసు కడదాకా అలానే ఉంటుంది. అది మారదు. అందుకు ఆయనకు నా 'ప్రఘాఢ సానుభూతి'.

ఇక అసలు విషయానికి వద్దాం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అన్నారు. అంటే, మననం చేస్తే రక్షించేది మంత్రం. అలాంటి మంత్రం ఎలా సాధన చేయాలి. ఎవరు ఇస్తే చేయాలి. ఇవన్నీ తాంత్రిక గ్రంధాలలో చెప్పారు. కా.కిం. లాంటి వారికి మంత్రాలపై చిన్నచూపు ఏర్పడటానికి కారణం వారివారి జీవన పరిధుల్లో వారి మిత్రులో బంధువులో వారికి చెప్పే విషయాలతో ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తారు. దానికి తోడు పెంపకం ఒకటి. దిక్కుమాలిన పెంపకాలు ఎలా ఉంటాయంటే, ఖచ్చితమైన అభిప్రాయాలతో పెంచే విధంగా ఉండవు. అటూ ఇటూ కాని వ్యవహారాలన్న మాట. సమ్మర్ లో, తిరుమలలో గుండు కొట్టించుకుంటే, అది మొక్కు కింద లెక్క కాదు... అలా అలా ఉంటాయన్న మాట ఆ పెంపకంలోని రీజనింగులు.

ఎవరి తండ్రి వాళ్ళకి హీరోనే. కానీ, నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకునే దశ బాల్యం ఎంతమాత్రం కాకూడదు. అయితే, ఇదిగో ఇలానే కా.కిం.లు ఉద్భవిస్తారు. బాల్యంలోనే ఇలాంటి విషయాలపై ఏర్పరరుచుకునే అభిప్రాయాలు వారి అభివృద్ధికి ఏమాత్రమూ దోహదపడవు. ముఖ్యంగా దేవుడు, జీవితం, రాజకీయాలు ఇటువంటి విషయాల్లో. వీటికి విచక్షణా జ్ణానం అవసరం. నా తండ్రి నాకు హీరో కాబట్టి, ఆయన చెప్పిందంతా విచక్షణాయుతంగా ఉంటుందని భావించే దశ బాల్యం. ఆ మాటకొస్తే, ఆ వయసులో విచక్షణ అన్న పదం కూడా తెలీదు.

వీళ్ళ మిత్రులో బంధువులో వచ్చి చెబ్తారు. అరేయ్ పిల్లలు లేరని బాధపడుతుంటే 'దానయ్య' ఎవరో ఏదో 'నాగమంత్రం' ఇచ్చారు. మూడు నెలలు చేసాను. రోజుకు నూట ఎనిమిది చొప్పునా, ఇంకా ఏం జరగలేదు. అసలివి తొక్కలో మంత్రాలు. నమ్మకూడదు అని అంటారు. ఈ పిల్లగాడి మనసులో ఇదే నిల్చిపోతుంది. ఓహో.. బాబాయ్ ఇంత చేసినా ఫలితం లేదా. నిజమే, మంత్రాలు వేస్టు అని ఓ నిశ్చితాభిప్రాయానికి రావటానికి ఈ ఉదాహరణ దోవతీస్తుంది.

అసలు మంత్రం ఇవ్వాల్సింది ఓ గురువు. ఆ గురువైనా కానీ, మహాపాదుకాదీక్షాదక్షుడై ఉండాలి. ఇచ్చిన మంత్రాన్ని సిద్ధి పొందినవాడైనా అయ్యుండాలి. కనీసం ఆ మంత్రానుష్ఠానం చేసినవాడైనా అయ్యుండాలి. ఇవేమీ లేని ఎవరో దానయ్య, ఎక్కడో చదివిన మంత్రం వీడికి వ్రాసి ఇస్తే, అది వీడు రోజుకో ౧౦౮ జపం చేస్తే ఎలా ఫలిస్తుంది. సంవత్సరాల తరబడి సాధన చేసినా సిద్ధిపొందలేకపోయామని వాపోయే మహామహా సాధకులున్నారు. వారి సాధనలతో పోలిస్తే, వీడి సాధన ఏపాటి.

మంత్రాల మీద నమ్మకం ఉందా లేదా అనే రెండు విషయాలే ముఖ్యం. అర్ధంలేని మంత్రాలతో పెళ్ళి చేసుకోవటం దేనికట? మళ్ళీ నలుగురికి వచ్చి మంత్రాలు అర్ధరహితమని చెప్పటంలోని ఔచిత్యం ఏమిటి? ఇదీ ద్వంద్వ ప్రవృత్తి. నమ్మకం లేనప్పుడు అసలు మంత్రాల జోలికే వెళ్ళకూడదు. ఏ విషయాన్నైనా విమర్శించాలంటే, ముందుగా ఆ విషయంపై కూలంకషంగా అధ్యయనం చేయాలి. దానితోపాటు చెప్పినవిధంగా సాధన కూడా చేయాలి. అప్పటికి ఫలితం లేనప్పుడు చెప్పు ఇది తప్పు అని. అవేమీ లేకుండా ఇవి అర్ధరహితమంటే ఎలా?

తల్లినో భార్యనో బాధపెట్టటం ఇష్టంలేక చేసుకున్నాను అంటే, అదే విచక్షణ నలుగురు చూసే బ్లాగుల్లో పెట్టేముందరేమయ్యింది? నీ కోసం నువ్వు బతికేవాడివని ఘనంగా చెప్పుకోటం దేనికట?

అయ్యా ఇదీ భోగట్టా. బజార్లో తిరిగే జీవి వేరు, ఇంట్లో తిరిగే జీవి వేరు. శ్రీరంగనీతులని జనాలని తప్పుదోవ పట్టించి, తాము మాత్రం యధాప్రకారం నడుచుకునే మనుషుల రెండు నాల్కల ధోరణి. తాను భార్య మాటో తల్లి మాటో వింటే కుటుంబపు మనిషి. బ్లాగుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు; ఉదాహరణకు రాముడు, మంత్రాలు గట్రా గట్రాలు వినకూడదు. వింటే, వాళ్ళకి 'భావ వైశాల్యం' లేదని తీర్మానిస్తారు కా.కిం.లు.

స్వస్తి.

Thursday, May 14, 2009

రాముడు - చారిత్రక ఆధారాలు

'ప్రస్తుతం రాముడు ఏ చరిత్రలోనూ లేడు. రామాయణం అనే పుస్తకంలో అతనొక పాత్ర. మహా అయితే పురాణపురుషుడవుతాడు. చరిత్ర పురుషుడు కాడు. కొత్తగా రాముడ్ని చరిత్రపురుషుడుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించటానికి నేను రెడీ...'

అయ్యా కత్తిలాంటి కామెడీ బ్లాగులో ఇది ఆ అయ్యవారి చచ్చుతునకలాంటి కామెంటు. 'ప్రస్తుతం రాముడు ఏ చరిత్రలోనూ లేడు' అంటే, ఏ చరిత్రలో ఉండాలని ఈయన ఉద్దేశ్యం? పురాణాలలో ఉన్నాడు కాబట్టి రాముడు పురాణపురుషుడు. చరిత్రలో లేడు కాబట్టి చరిత్రపురుషుడు కాదు. కానీ, రామాయణం పురాణం కాదే! అది ఇతిహాసమే! మరి ఏం చేద్దాం? పురుషుల్లో మరో కేటగిరీ సృష్టించేద్దాం.. ఇతిహాస పురుషుడు అని.

సరే, ఇక ఆధారాల సంగతి ఏమిటి? రాముడికి సంబంధించి ఏ చారిత్రక ఆధారాలు దొరికితే చరిత్రపురుషుడు అవుతాడు? మాక్స్ ముల్లర్లు, నందన్ నీలకేనిలు, రామచంద్ర గుహలు వ్రాసే పుస్తకాల్లో 'రిఫర్' చేస్తే రాముడు చరిత్ర పురుషుడౌతాడా? లేదంటే, ఈ అయ్యవారిని ఒప్పించటం కోసం, అయోధ్యలో తవ్వకాలు సాగించి అక్కడి ఎముకలు గట్రా గట్రాలు సేకరించి అయ్యా ఫలానా ఎముక ఫలానా రామాయణకాలానికి చెందిందని డి.ఎన్.ఎ. పరీక్షలో తేలిందని చెబితే నమ్ముతారా? అప్పుడైనా, అది రాముడిదే అనే గ్యారంటీ ఏమిటి? ఎవడో మహాలింగానిది కావచ్చుగా!

ఇక, కొన్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు వేసుకుందాం. ఈనాటి మన అస్థిత్త్వానికి చారిత్రక ఆధారాలేమిటనేవి ఆలోచిద్దాం. ఓటరు కార్డు ఉంది కాబట్టో, పాస్ పోర్టు ఉంది కాబట్టో మనం భారతీయులం. పాస్ పోర్టు అనే ఆధారం లేకపోతే, భారతీయులం కానట్టేనా? అసలు మనం ఉన్నట్లే కాదా? అసలు చరిత్ర అంటే ఏమిటి? అసలు చరిత్ర ఎక్కడ నిక్షిప్తమౌతుంది? మునిసిపాలిటీ రికార్డుల్లోనా, పాఠ్య గ్రంధాలలోనా? ఆరకంగా చూస్టే, మనమంతా చరిత్రలో లేనివారమేగా? అంటే, మన ఉనికి లేదనేనా అర్ధం? కాదంటే, మరెవడో వచ్చి వకాల్తా తీసుకొని ఫలానా ఇది సాక్ష్యం అని చెబితేనే గానీ, అది మనం నమ్మకూడనిదా?

ఓ చాకులాంటి తలకుమాసినవాడు, వాడి నాయనతో చేస్తున్న చర్చ చదవండి.

చాకు - నాన్న నాన్న...
తండ్రి - ఏంట్రా చాకు
చాకు - నాన్న, దేవుడు ఉన్నాడంటావా?
తండ్రి - ఉంటే ఎంత లేకపోతే ఎంత? అయినా ఉన్నాడనుకుంటే సరి.
చాకు - అలా ఎందుకనుకోవాలి? ఆధారాలేంటి?
తండ్రి - కొన్ని కొన్ని పక్కవాళ్ళ కోసం నమ్మినట్లుండాలి.
చాకు - అంటే, దేవుడున్నాడని నువ్వు నమ్మనట్లేగా?
తండ్రి - మె మె మె
చాకు - సరే కానీ నాన్న, నేను వర్తమాన పురుషుడిని అవునా? కాదా?
తండ్రి - నువ్వు పురుషుడివేరా.. అయినా ఎందుకొచ్చింది అనుమానం?
చాకు - వర్తమాన పురుషుడంటే, నేను బ్రతికే ఉన్నానా, ఉంటే ఎవరికి పుట్టాను?
తండ్రి - ఇంకెవరికి? నాకు మీ అమ్మకు.
చాకు - అసలు నువ్వెవరివి, నీ నాయనెవరు?
తండ్రి - నేను కొడవలి, నీ తాత గొడ్డలి
చాకు - నువ్వు నా నాన్నవనీ, తాత నీ నాన్నని ఆధారాలేంటి?
తండ్రి - ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అయినా ఉన్నాయనుకుంటే సరి.
చాకు - అలా ఎందుకనుకోవాలి? ఆధారాలేవి?
తండ్రి - కొన్ని కొన్ని పక్కవాళ్ళ కోసం నమ్మినట్లుండాలి.
చాకు - అంటే నువ్వు నమ్మవా?
తండ్రి - ??నువ్వు నావి, తాతవి మనోభావాలు కూడా గాయపరుస్తున్నావురా.
చాకు - చరిత్రలో ఏ సిరాతోనైనా చాకు నాయన కొడవలి అని, కొడవలి నాయన గొడ్డలి అని ఎక్కడైనా ఉందా?
తండ్రి - మునిసిపాలిటీ రికార్డ్సులో ఉండొచ్చురా. అయినా ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఉందనుకుంటే సరి.
చాకు - పక్కవాళ్ళ కోసం నేను నమ్మినట్లు ఉండలేను. మునిసిపల్ రికార్డ్సు చారిత్రక ఆధారాలౌతాయా అనేది మరో ఆలోచనాత్మక ప్రశ్న.
తండ్రి - మరి ఎలారా? మీ అమ్మనో బామ్మనో అడుగు.
చాకు - నో.. చెప్పుడు మాటలు నమ్మకూడదు, ఆధారాలుంటేనే ఒప్పుకుంటా అన్నారే కత్తిలాంటి మహానుభావులు.
తండ్రి - అయితే ఇప్పుడేమంటావు?
చాకు - నువ్వు నా తండ్రివని ఆధారాలు చూపే వరకు నేను నమ్మను.
తండ్రి - ఒరేయ్ తండ్రి ఎవరైనాగానీ, ఆధారాలు చూపలేరురా అబ్బాయ్. పోనీ డి.ఎన్.ఎ. టెస్టులేవో వొచ్చాయట. చేయించి చెప్పు నువ్వసలు నా కొడుకువేనో కాదా?
చాకు - ఐ పిటీ యు నాయనా.
తండ్రి - అయితే ఏంటి, భావ వైశాల్యం పెంచుకొని పక్కింటివాడ్ని నాయనంటావా?
చాకు - డి.ఎన్.ఎ. టెస్టులైనా కానీ ఎలా నమ్మాలి? ఇవే సరైన టెస్టులనే చారిత్రక ఆధారాలు ఉన్నాయా?
తండ్రి - నీ *&^%$#
చాకు - ప్రస్తుతం నేను, నువ్వు, తాత ఏ చరిత్రలోనూ లేము. ఇంట్లోని పాత్రలమే. మహా అయితే ఇంటి పురుషులమౌతాము. కొత్తగా మనల్ని వర్తమాన పురుషులుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించటానికి మహానుభావులు రెడీ. మరి ఆధారాలు వెదుకుదాం నాయనా, తాతనీ పిలు.

* * * *

ఆధారాల కోసం చూస్తే, మన తల్లిదండ్రులేవరనేదే ఓ నమ్మకం మీద ఆధారపడిన విషయం. ఇక, రాముడు ఉన్నాడా లేడా అనే విషయం మీద చర్చలు తెగవు. ఫలానావాడు తండ్రి అని మనలని నమ్మించిన తల్లిదండ్రులు మనలను మోసం చేయరనే నమ్మకంతోనే రాముడు కూడా ఉన్నాడనే నమ్మాలి. ఈ విషయానికి ఆధారాలు కావాలనేవాళ్ళు వారివారి తండ్రులెవరనేదానికి కూడా ఆధారాలు వెదకండి. బహుశా అప్పుడు రాముడి ఆధారాలు దొరకవచ్చు.

Monday, May 11, 2009

ప్రజలు జోకర్లు - ఎన్నికలో జోక్!

మన ఘన ప్రజాస్వామ్యంలో ఓ ప్రముఖమైన ప్రహసనం - ఎన్నికలు ; దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. ప్రజలు తమ పక్షమేనని ఎవరికి వారు ధీమా ప్రకటిస్తున్నా, వీరికి పీఠం నుంచి పీకలదాకా టెన్షనుతో తడారిపోయిందనే విషయం తెలుస్తూనే ఉన్నది.

కాంగెస్ నేతృత్వంలో యు.పి.ఎ. (ఎన్.సి.పి., డి.ఎం.కె. తప్పించి మిగతా అంతా చిల్లర సరుకు పార్టీలు), భా.జ.పా. నేతృత్వంలో ఎన్.డి.ఎ., గంతకు తగ్గ బొంతగా మహా కూటమి, అతుకుల బొంతగా నాలుగో కూటమి, ఇవేవీ కాకుండా గోడ మీద కూర్చున్న చిల్లరమల్లర పార్టీలు మరికొన్ని - ఇవి మనకు ఉన్న రకరకాల ప్రత్యామ్నాయాలు!

ఈ ఎన్నికల వల్ల ఏం సాధించామనేది మే 16 తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా ఊహించటం కష్టమేమీ కాదు. ఓటు వేసిన ప్రజలు సాధించిందేమీ లేదు. అధికారం కోసమే అర్రులు చాచే ఈ పార్టీలు సాధించేదే బోల్డంత! ఏ ముసుగులో ఎవరి చాటున ఉంటే ఎంత లాభమో; అంతా చూసుకొని ప్రజలకు పోటు పొడిచే రోజు కోసమే పార్టీలన్నీ వేచి ఉన్నాయి.

మహాకూటమి ముసుగులో ఎన్నికల్లో పోటి చేసి, ఇప్పుడు ఎన్.డి.ఎ. అడుగులకు మడుగులొత్తే తె.రా.స. రేపు యు.పి.ఎ. చంకనెక్కి ఊరేగినా ఆశ్చర్యం లేదు. రాజకీయ విలువల్లో అంతకుమించి అడుసులో కూరుకుపోయిన లాలూలు, ములాయంలు, పాశ్వానులు రేపు ఎన్.డి.ఎ.కు మద్దతునిచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అంతా అధికారంపై మోజే.

యు.పి.ఎ. ప్రజా వ్యతిరేక విధానాలను, అమెరికా అనుకూల విధానాలను నిరసిస్తూ, ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని కమ్యూనిస్టు నేతలు వీధివీదినా చాటింపు వేసారు - ఎన్నికలకు ముందు. ఒకవేళ, అటూఇటూ కాని పరిస్థితి వస్తే, దేశప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి, ప్రజావ్యతిరేక విధానాలను, అమెరికా అనుకూల విధానాలను ఆచరించిన యు.పి.ఎ.కే మళ్ళీ పట్టం కడతామని నిస్సిగ్గుగా ప్రకటించారు! కె.సి.ఆర్.ను విమర్శించటానికి వీళ్ళకెలాంటి నైతికహక్కు ఉందో మరి!

నాకు అర్ధంకాని విషయమేమిటంటే, అసలు మనదేశంలోని పార్టీలకు సిద్ధాంతాలంటూ ఏవైనా ఉన్నాయా? ఉంటే అవేమిటి? కేవలమూ అధికారమే సిద్ధాంతమా? మొన్నటిదాకా బాబ్రీమసీదు విధ్వంసానికి కళ్యాణ్ సింగ్ కూడా కారణమే అన్న ములాయం, ఇప్పుడు అదే కళ్యాణ్ సింగ్ కు మద్దతు ఇస్తున్నాడు.

కొన్నాళ్ళ దాకా, సంఘ్ సిద్ధాంతాలతో మమేకమైన కళ్యాణ్ సింగ్, మసీదు విధ్వంసానికి తాను కారణం కాదనీ, భా.జ.పా. నే కారణమని ప్రచారం చేస్తున్నాడు. తప్పో ఒప్పో నమ్మి ఆచరించిన ఓ సిద్ధాంతాన్ని ఒప్పుకోటానికి ఇంత బెరుకు ఎందుకు మన నేతలకు? ఆయన సిద్ధాంతానికి విరుద్ధంగా భా.జ.పా. ఆరోజు ప్రవర్తించిందని అనిపిస్తే, ఆ వెంటనే పార్టీని ఎందుకు వీడలేదు? వీడిన తర్వాత మళ్ళీ చేరి, మళ్ళీ వదిలేయటంలోని పారమార్ధిక సిద్ధాంతమేమిటి?

మరోవైపు ఓడిపోనున్నామనే వార్తల మధ్య, ప్రజాస్వామ్యాన్ని సచివాలయంలో అగ్నికి ఆహుతి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం చేయాలి?

నిర్లజ్జగా ప్రజాస్వామ్యానికి పాతరవేసి తప్పించుకో చూస్తున్న ఈ నేతలు ఎవరికి, ఎప్పుడు జవాబుదారీ. అయిదు సంవత్సరాలకోసారి మాత్రమే వచ్చే ఎన్నికల్లోనేనా, అప్పుడే ప్రజలకు జవాబుదారీనా?

ఇష్టంలేని నేతను వెనక్కు పిలిపించే వ్యవస్థ కూడా కల్పించినప్పుడు అసలైన ప్రజాస్వామ్యానికో అర్ధం ఏర్పడుతుంది. అప్పటివరకూ ప్రజలు జోకర్లే, ఎన్నికలు మనమీది జోకులే!