Friday, May 15, 2009

మంత్రాలు - కామెడీ కింగులు - ద్వంద్వ ప్రవృత్తి

ఏవో లింకులు తన మేధావితనానికి గుర్తుగా కామెడీ కింగు గారు నా బ్లాగులో ఇచ్చారు. అవి క్లిక్కితే, ఓ చోట మంత్రాలపై, పూజలపై కా.కిం. గారి అభిప్రాయాలు అబ్బురపరచాయి.

ఆయనే ఛాతి విరుచుకొని వ్రాసారు 'నాకు తెలిసిన కాస్తోకూస్తో సంస్కృతంతో కొన్ని మంత్రాలకు అర్ధాలు తీసే ప్రయత్నాలు చేసానుకూడా'.
అబ్బో అయ్యవారికి అంత ఉందనుకోలేదు. పాపం, సంస్కృతంలో తనది మిడిమిడి జ్ణానం అని ముందే చెప్పుకొని, మంత్రాలకు అర్ధాలు కూడా తీసారుట! ఆ అర్ధాలు ఎలా అఘోరించి ఉంటాయో ఊహించుకోటం కష్టమేమీ కాదు. పోన్లే కనీసం తన తెలివితేటలను చూచాయగా మాత్రమైనా గ్రహించారు. అందుకు ఆయనకు అభినందనలు.

'చాలా వరకు మంత్రాలు దేవుడి గుణగణాలు, బంధుత్వాలు, లేక ఆయన సౌందర్యాన్నో శక్తినో తెలియజెప్పేవే తప్ప పనికొచ్చేవి చాలా తక్కువ కనిపించాయి'

ఊ! పనికొచ్చే మంత్రాలంటే ఏమిటని అయ్యవారి ఉద్దేశ్యం? అసలు, ప్రతి కౌన్ కిస్కా గాడికి అర్ధమయ్యేవైతే అవి మంత్రాలెందుకౌతాయి? అసలా పెళ్ళిలో కూడా తన దిక్కుమాలిన పాండిత్యంతో వేధిస్తున్నాడని ఏవేవో అర్ధాలు చెప్పుంటారు వాళ్ళు 'ఇంద్ర' సినిమాలో 'బ్రహ్మానందం'లా.

'మూఢాచారాల నుంచి, అర్ధరహిత మంత్రాల నుంచి, ఉబుసుపోక చేసె పూజా పునస్కారాల నుంచీ విముక్తి ప్రసాదించిన నా తండ్రికి ధన్యుడిని.'

ఆహా హా, తండ్రంటే ఎంత గౌరవభావం!! అదే తల్లి చేసేవన్ని ఉబుసుపోక చేసే పూజలు పునస్కారాలు!! ఎంత గొప్ప మనసో? అయినా, ఏదో రోజువారీ వ్యాయమంలా చేసే పూజలు పునస్కారాల నుంచి ఎవరైనా ఏం నేర్చుకుంటారులే. పెరిగిన వాతావరణం ప్రభావితం చేసే మనసు కడదాకా అలానే ఉంటుంది. అది మారదు. అందుకు ఆయనకు నా 'ప్రఘాఢ సానుభూతి'.

ఇక అసలు విషయానికి వద్దాం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అన్నారు. అంటే, మననం చేస్తే రక్షించేది మంత్రం. అలాంటి మంత్రం ఎలా సాధన చేయాలి. ఎవరు ఇస్తే చేయాలి. ఇవన్నీ తాంత్రిక గ్రంధాలలో చెప్పారు. కా.కిం. లాంటి వారికి మంత్రాలపై చిన్నచూపు ఏర్పడటానికి కారణం వారివారి జీవన పరిధుల్లో వారి మిత్రులో బంధువులో వారికి చెప్పే విషయాలతో ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తారు. దానికి తోడు పెంపకం ఒకటి. దిక్కుమాలిన పెంపకాలు ఎలా ఉంటాయంటే, ఖచ్చితమైన అభిప్రాయాలతో పెంచే విధంగా ఉండవు. అటూ ఇటూ కాని వ్యవహారాలన్న మాట. సమ్మర్ లో, తిరుమలలో గుండు కొట్టించుకుంటే, అది మొక్కు కింద లెక్క కాదు... అలా అలా ఉంటాయన్న మాట ఆ పెంపకంలోని రీజనింగులు.

ఎవరి తండ్రి వాళ్ళకి హీరోనే. కానీ, నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకునే దశ బాల్యం ఎంతమాత్రం కాకూడదు. అయితే, ఇదిగో ఇలానే కా.కిం.లు ఉద్భవిస్తారు. బాల్యంలోనే ఇలాంటి విషయాలపై ఏర్పరరుచుకునే అభిప్రాయాలు వారి అభివృద్ధికి ఏమాత్రమూ దోహదపడవు. ముఖ్యంగా దేవుడు, జీవితం, రాజకీయాలు ఇటువంటి విషయాల్లో. వీటికి విచక్షణా జ్ణానం అవసరం. నా తండ్రి నాకు హీరో కాబట్టి, ఆయన చెప్పిందంతా విచక్షణాయుతంగా ఉంటుందని భావించే దశ బాల్యం. ఆ మాటకొస్తే, ఆ వయసులో విచక్షణ అన్న పదం కూడా తెలీదు.

వీళ్ళ మిత్రులో బంధువులో వచ్చి చెబ్తారు. అరేయ్ పిల్లలు లేరని బాధపడుతుంటే 'దానయ్య' ఎవరో ఏదో 'నాగమంత్రం' ఇచ్చారు. మూడు నెలలు చేసాను. రోజుకు నూట ఎనిమిది చొప్పునా, ఇంకా ఏం జరగలేదు. అసలివి తొక్కలో మంత్రాలు. నమ్మకూడదు అని అంటారు. ఈ పిల్లగాడి మనసులో ఇదే నిల్చిపోతుంది. ఓహో.. బాబాయ్ ఇంత చేసినా ఫలితం లేదా. నిజమే, మంత్రాలు వేస్టు అని ఓ నిశ్చితాభిప్రాయానికి రావటానికి ఈ ఉదాహరణ దోవతీస్తుంది.

అసలు మంత్రం ఇవ్వాల్సింది ఓ గురువు. ఆ గురువైనా కానీ, మహాపాదుకాదీక్షాదక్షుడై ఉండాలి. ఇచ్చిన మంత్రాన్ని సిద్ధి పొందినవాడైనా అయ్యుండాలి. కనీసం ఆ మంత్రానుష్ఠానం చేసినవాడైనా అయ్యుండాలి. ఇవేమీ లేని ఎవరో దానయ్య, ఎక్కడో చదివిన మంత్రం వీడికి వ్రాసి ఇస్తే, అది వీడు రోజుకో ౧౦౮ జపం చేస్తే ఎలా ఫలిస్తుంది. సంవత్సరాల తరబడి సాధన చేసినా సిద్ధిపొందలేకపోయామని వాపోయే మహామహా సాధకులున్నారు. వారి సాధనలతో పోలిస్తే, వీడి సాధన ఏపాటి.

మంత్రాల మీద నమ్మకం ఉందా లేదా అనే రెండు విషయాలే ముఖ్యం. అర్ధంలేని మంత్రాలతో పెళ్ళి చేసుకోవటం దేనికట? మళ్ళీ నలుగురికి వచ్చి మంత్రాలు అర్ధరహితమని చెప్పటంలోని ఔచిత్యం ఏమిటి? ఇదీ ద్వంద్వ ప్రవృత్తి. నమ్మకం లేనప్పుడు అసలు మంత్రాల జోలికే వెళ్ళకూడదు. ఏ విషయాన్నైనా విమర్శించాలంటే, ముందుగా ఆ విషయంపై కూలంకషంగా అధ్యయనం చేయాలి. దానితోపాటు చెప్పినవిధంగా సాధన కూడా చేయాలి. అప్పటికి ఫలితం లేనప్పుడు చెప్పు ఇది తప్పు అని. అవేమీ లేకుండా ఇవి అర్ధరహితమంటే ఎలా?

తల్లినో భార్యనో బాధపెట్టటం ఇష్టంలేక చేసుకున్నాను అంటే, అదే విచక్షణ నలుగురు చూసే బ్లాగుల్లో పెట్టేముందరేమయ్యింది? నీ కోసం నువ్వు బతికేవాడివని ఘనంగా చెప్పుకోటం దేనికట?

అయ్యా ఇదీ భోగట్టా. బజార్లో తిరిగే జీవి వేరు, ఇంట్లో తిరిగే జీవి వేరు. శ్రీరంగనీతులని జనాలని తప్పుదోవ పట్టించి, తాము మాత్రం యధాప్రకారం నడుచుకునే మనుషుల రెండు నాల్కల ధోరణి. తాను భార్య మాటో తల్లి మాటో వింటే కుటుంబపు మనిషి. బ్లాగుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు; ఉదాహరణకు రాముడు, మంత్రాలు గట్రా గట్రాలు వినకూడదు. వింటే, వాళ్ళకి 'భావ వైశాల్యం' లేదని తీర్మానిస్తారు కా.కిం.లు.

స్వస్తి.