Thursday, February 25, 2010

"ఊరి చివర" - చిన్న వివరణ


కవిత్వంలో సామాజిక కోణం కొందరికి మింగుడు పడదేమో అనే ఆసక్తికరమైన అనుమానాన్ని వ్యాఖ్యగా ప్రకటించారు అఫ్సర్ గారు, నా బ్లాగులో. నిజమే, చాలామంది విమర్శకులకు, కవులకు కవిత్వంలో సామాజికత మింగుడుపడదు. నావరకు, కవిత్వంలో సామాజిక భావన అంతర్లీనమైతే బానే ఉంటుంది. కానీ, సో కాల్డ్ సామాజిక కవులు మాత్రం సామాజిక భావనలో అంతర్లీనంగా కూడా కవిత్వాన్ని ప్రవేశపెట్టలేకపోవటమే, ఆలాంటి కవిత్వం మింగుడుపడకపోవటానికి కారణం.

దానికి తోడు, ఓ సునామీనో, బాంబుదాడో, మరో దుర్ఘటనో జరిగినప్పుడు "రక్త మాంస దాహం" పేరిట బలవంతపు తంతు నడిపిస్తారు. ఆ తంతులో పాలుపంచుకోకపోయినా, లేదా విమర్శించినా సంఘీభావం ప్రకటించలేదనే ప్రతివిమర్శతోపాటు, సదరు కవినో, విమర్శకుడినో "అనిబద్ధుడు"గా వెలివేయటం కూడా కద్దు.

ప్రస్తుత తెలుగు కవిత్వంలో, ప్రముఖమైన సామాజిక కవిగా ప్రఖ్యాతి గడించిన శివారెడ్డిగారి కవితలు చాలావరకు, ఒకానొక పూనకంతో కవిత్వానికి హద్దులు చెరిపేసే ప్రయత్నాలే. అంతేకాదు, అతి విస్తరణ దోషాలు కూడా ఆయన కవిత్వంలో పరిపాటి. ఆయన ఆదర్శంతో కలం పట్టిన చాలామంది చిన్న, చితక కవులు కూడా అలా స్పందించగలిగితేనే కవులం కాగలమనే భ్రమల్లో ఉన్నారనేది వాస్తవం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఫ్సర్ గారి కొన్ని కవితలు అసంతృప్తి కలిగించాయని చెప్పటం జరిగింది. సామాజికతను అంతర్లీనంగా చొప్పించిన కొన్ని అద్భుతమైన కవితలు చూసాక, ఆ అసంతృప్తి మరికొంత ఎక్కువయ్యింది. అంతేకానీ, శివారెడ్డి ప్రభావం అఫ్సర్ గారి మీద ఉన్నదని చెప్పే తప్పు మాత్రం చేయలేదండోయ్.

ఒకానొక చోట అదేలాంటి ఆవేశం, మరికొన్ని చోట్ల అదేలాంటి విస్తరణ నాకు కనిపించింది ఈ సంకలనంలో. ఇక ఈ రాజకీయ, సామాజిక వాసనలని పక్కనపెట్టి, మరికొన్ని మంచి కవితలు ఆస్వాదించుకుందాం.

* * *

మరోసారి చదివిన తర్వాత, అద్భుతమనిపించే మరో విశేషమేమిటంటే, అనుభూతులను ఆస్వాదించటంలో పాఠకులకు కలిగే స్వేచ్ఛ. ఒకానొక అనుభూతికే, పాఠకులను పరిమితం చేసే కవిత్వం కాదు. ముఖ్యంగా కవిత్వాతీత స్థితిని ఆస్వాదించాలనుకునే నాలాంటి పాఠకులకు కొన్ని వాక్యాలు అనిర్వచనీయం.

నీటి కడుపులోకి వెళ్ళి
మళ్ళీ తీరమ్మీదకి
పసిపిల్లాడిలా పరుగెత్తుకుంటూ వచ్చే అల
బతుక్కి ఇంకో తలుపు - మరణం

* * *

చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజు తెలుస్తూనే వుంది

* * *

వొక సెలయేరు
పరిగెత్తుకుంటూ వెళ్తూ
కాసిన్ని నీటి బిందువుల్ని
పై మీద చిలకరించి వెళ్ళింది
తీరా చూస్తే
ఆ నీటి బిందువు నేనే
అచ్చంగా

* * *

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరి మీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం

* * *

బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం.

* * *

ఏదేమైనా, ఈ సంకలనంలో అద్భుతమైన కవిత్వం చాలా ఉన్నదనే విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు.

Wednesday, February 24, 2010

"ఊరి చివర" ఉప్పెనలా కవిత్వం

అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! "ఊరి చివర" ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.

ఇప్పటి రోజుల్లో, ఊరు చివర అనగానే నిజంగా నిస్తేజమై స్ఫురించే ఒకానొక చిత్రమే ఈ "ఊరు చివర" కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదు, మనను చుట్టుముట్టిన ప్రపంచాన్ని నిజాయితీగా ఆవిష్కరింపచేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. సామాన్యంగా కవిత్వంలో సామాజికతను చొరబెట్టాలని కొందరు చేసే ప్రయత్నంలో, పడికట్టు పదాల విన్యాసమే కనిపిస్తుంది. ఆ విన్యాసాల సంరంభంలో ఊళ్ళు తగలబడతాయి, ఆకాశాలు విరిగిపడతాయి, చేతులు నరకబడతాయి, అలానే కవిత్వమూ కూలబడుతుంది. ఈ విన్యాసాలకు దాదాపు అతీతంగా, ఊరు చివర నిలువెత్తు "నిశ్శబ్దంలో" నిలుస్తుంది అఫ్సర్ గారి కవిత్వం.

ఈ పుస్తకం చదవాలంటే, ఊరి చివర నుంచి ఊళ్ళోకి ప్రవేశించాలి. వరుసబెట్టి, మూడు సార్లు చదివిన తర్వాత నేను తీర్మానించిన విషయం ఇది :)) మీకు అర్ధమైన విషయం కరెక్టే... ఈ పుస్తకం చివరి నుంచి ఓసారి, మొదటి నుంచి ఓసారి చదివి చూడండి.

జండాలో జాతీయ గీతాలో
పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటు హక్కులో ఎన్నయినా వుండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్ళే జాతీయ గీతం మాకు

ఈ సంకలనంలో కవి ఆవిష్కరింపబోయే విషయం ఇక్కడే చూచాయగా తెలుస్తుంది. అందమైన నిశ్శబ్దంలో అలరించే పాలపిట్టల పకపకల కోసం "ఊరి చివర"కు వెళ్ళొద్దు. ఎవరు వెళతారో "చివరికి" కవి మాటల్లోనే చూస్తే బాగుంటుంది :

ఎవరొస్తారో
ఈ వూరి చివరకి!
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కులేని దేహం కొసకి.
మాటలన్నీ రాలిపోయి
మోడై నిలిచిన చెట్టు కొసకి.

వొళ్ళంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన
శకలాల ఎముకల కలలతోపుకి.
ఎవ్వరొస్తారో ఈ వూరి చివరకి?

చివరికి వచ్చింది "ఎవరికైనా, ప్రేమతోనే" కవి చెబుతున్న విషయం, ముఖ్యంగా మన అంతర్జాల కవి మిత్రులకు కనువిప్పు కావాల్సిందే :

నడుస్తొందే, వొక సంతలో!
అన్నీ తెగనమ్ముకున్న
అన్నీ ఎక్కడికక్కడ దిగవిడిచిన
మార్కెట్ సరుకుల సమూహం.

నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయ నినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందుకులే
.....
.....
నువ్వేమిటో
నీ పద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
.....
.....
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకు నువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆటలో కాసింత ఆనందపు తుంకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!

హిందిలో "ఓ ఆ రహా హై, ఖానా ఖానే కే లియే" అనేది శుద్ధ వచనం. అదే వాక్యాన్ని, నేను విన్న కొందరు హిందీ కవులు "ఆ రహా హై ఓ, ఖానే కే లియే ఖానా" అంటారు అదేదో విరగదీసే కవిత్వం చెబుతున్నట్లు. అలా ఉన్నాయి ఓ రెండు వాక్యాలు ఈ కవితలో (నడుస్తోందే, వొక సంతలో!....పరిగెత్తుతోంది వొక సంతలో!...). అవి సిల్లీ విషయాలైనా, నా అభిప్రాయం చెప్పాలనిపించేసింది, చెబుతున్నాను.

ఇలా అనుకున్నానో లేదో, ఆశ్చర్యం గొలిపుతూ "ఇఖ్ రా!"

లోకం
నాకు వంకరగా కనిపిస్తుందనే కదా
నువ్వెప్పుడూ అంటావ్

లోకం కాదు
నేనే వంకరగా వున్నానని కదా, నీ అర్ధం!
.....
.....
ఇంతకీ

ప్రశ్నని మించిన వక్రరేఖ
ఏదీ ఇంకోటి చూపించు.

అంటూ... మొహంలో మొహం పెట్టి అఫ్సర్ గారు ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ కవిత, నా వరకూ శివారెడ్డి మార్కు అద్భుతమైన కవిత! అఫ్సర్ గారి బెంచ్ మార్క్ ప్రకారం ఓ సాథారణ కవిత. అన్నట్లు, ఏ సందర్భంలో ఈ కవిత పెల్లుబికిందో చెప్పనవసరంలేదు అనిపించింది. ఎందుకంటే, ఇప్పటి కాలమాన పరిస్థితుల మధ్య ఎప్పటికీ అన్వయించుకోగల కవిత ఇది. ఇటువంటి, అఫ్సర్ మార్కు సాథారణ కవితలు అక్కడక్కడ కనిపించాయనే చెప్పక తప్పదు.

కరెక్టుగా చివరి నుంచి నాలుగో కవిత "నాలుగు మెతుకులు"

బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం
.....
.....
ఒక్కోసారి నువ్వూ నేనూ
రెండు అలల కేకలం
మరోసారి
నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.
.....
.....
ఈ నాలుగు మెతుకులూ
దాచి వుంచు
ఏ దూరాల నించో వచ్చే
ఆ దిగులు బావి
ఖాళీ కడుపు కోసం!

ఈ "నాలుగు మెతుకులతో" చిక్కటి కవిత్వం కోసం అలమటించేవారికి పంచభక్ష్య పరమాన్నం వండి వడ్డించారు అఫ్సర్ గారు. చాలా అద్భుతమైన కవిత్వం. ఇలా తేరుకునే లోపే..."థియేటర్ స్క్వేర్" లోకి ఆహ్వానిస్తారు కవి.

ఒక నిశ్శబ్దంలోకి అందరూ
మౌనంగా
తెరమీద
ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా...
.....
.....
ఎవరి జీవితం వాళ్ళకి చేదు
అవతలి బతుకు
కాసేపు అద్దం
తెలియని అర్ధానికి
.....
.....
థియేటరు
నన్ను అనువదించే యంత్రం
ఇక్కడ
నన్ను నేను వెతుక్కుంటాను
ప్రతి సాయంత్రం

చెప్పుకుంటూ పోతే, చాలా కవితలున్నాయి. ఇవన్నీ ఒకరు చెబితే వినటం కన్నా, చదివి తీరాల్సిన అనుభూతులు ఒక్కో కవిత. కంట తడిపెట్టించేవి కొన్నైతే, కలకలం రేపేవి కొన్ని.జి.వి.ఎన్ మూర్తిగారు "ఈనాడు"లో చెప్పినట్లు, మన లోతులని మనమే తడుముకునేట్లు చేసే కవిత్వం ఇది.

కవి సమాధి
ఒక కొల్లేజ్ పోయెం
నీరెండలో వూరు
రెండంటే రెండు మాటలు
.....
.....
అనుమానితుడి ఆత్మకథనం (నాకెందుకో మా అన్నాజీ ఇక్బాల్ చంద్ గారి "ఆరో వర్ణం" కవిత గుర్తుకొచ్చింది. "ఆరో వర్ణం"లోని క్లుప్తత మాత్రం ఈ కవితలో లేదు. అయినా బాగుంది, అది వేరే విషయం.)

జటిలమైన కొన్ని అనుభూతులుంటాయి. అందులోనూ పరభాషా కవిత్వంలో, అక్కడి మహాకవులు వ్రాసినవి. సామాన్య భాషకు, సామాన్య కవులకు ఆ అనుభూతులు అందవు. అటువంటి అనుభూతులు కూడా అలవోకగా, తనదైన శైలిలో కవిత్వమై పారిస్తారు అఫ్సర్ గారు "సరిగంగ స్నానం" అనే కవితలో. అది అనువాదమని ఆయన చెబితే గానీ, బహుశా మనం తెలుసుకోలేమేమో!

మంచి కవితల గురించి తక్కువగానే అయినా, ఎలాగూ చెప్పుకున్నాం కాబట్టి, ఒకట్రెండు దిష్టి చుక్కల గురించి (ఐ మీన్ శివారెడ్డి మార్కు అద్భుత కవిత్వం కూడా ఉదహరించుకుందాం.)

కలలో ఈద్ గాహ్
డెజావూ...
వీరుడి శిరస్సు

అద్భుతమైన ఉద్వేగాన్ని మిగిల్చినా, శివారెడ్డిని మించిన పద ప్రయోగాలు చేసారు అఫ్సర్ గారు. అంతకు మించి అభిప్రాయాన్ని చెబితే, "ఊరి చివర"కు ద్రోహం చేసినట్లౌతుంది కాబట్టి, ఇక్కడితో విరమిస్తా.

అన్నట్లు, అఫ్సర్ గారికి నాదో మనవి.  వీలువెంట, ఈ కవితలని అంతర్జాలంలో కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది.

మరో చివరి మాట. ఈ పుస్తకాన్ని చివరిని నుంచి చదవమని చెప్పటానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం - గుడిపాటి గారు, ఎన్. వేణుగోపాల్ గారు వ్రాసిన ఆప్త వాక్యాలు. ముందుగా అవి చదివితే, వారి మాటలు దురభిమానంగా పాఠకులు అనుమానించే అవకాశం ఉంటుంది. మొత్తం కవితలు చదివాక, వారి ఆప్తవాక్యాలు ఎంత నిజమనేది తెలుస్తుంది.

Tuesday, February 23, 2010

అనుకోని అతిథి

కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అంచనాలకు అందదు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనామార్గంలో ఉన్నప్పుడు కలిగే అనుభవాలు. జరిగే ప్రతి సంఘటనా, కలిగే ప్రతి అనుభవం ఎక్కడో ఎప్పటికో లింకు కలిగే ఉంటుంది. అది ఏమిటనేది మాత్రం సమయానికి స్ఫురించదు.


అది 16 ఫిబ్రవరి, 2010. యధాప్రకారం రాత్రి 11 కు పడుకున్నా. కానీ, 2 గంటలకే నిద్ర ఎగిరి పోయింది. దానికి సగం కారణం "కొత్తపాళి" గారైతే, మరో సగం కారణం "అఫ్సర్" గారు. :))


నిద్రలేమితో అలా పొర్లుతూ ఉండగానే, 3.30 కు అలారం మోగింది. దాన్నో అరగంట ముందుకు జరిపి మళ్ళీ పొర్లుతూనే ఉన్నా. దాదాపుగా నాలుగైంది. లేవగానే, ముందస్తుగా పూజ గదిలో అమ్మవారిని చూడాల్సిందే. లైటు వేసుకుంటే, నా మొహమే చూడాల్సొస్తుందనే భయంతో అలానే బయలుదేరుతా.


క్రమంలో స్టడీ రూము దాటుతుండగా పక్కనే కుప్పలా కనిపించింది. మాములుగా అయితే, కాళ్ళు తుడిచే పట్టాగా భావించి పక్కకు నెడతాను. ఎందుకో సమయంలో మాత్రం సం థింగీజ్ రాంగ్ అనిపించింది. పిల్లల స్కూలు బ్యాగో, గుడ్డలో అయ్యుంటాయిలే అని సర్దిచెప్పుకుంటూ, పక్కన పెడదామని కొద్దిగా వంగితే వెంటనే స్ఫురించింది అదో పాము అని!


వెంటనే బెడ్రూములో మా ఆవిడను నిద్రలేపి చెప్పి, తిరిగి వచ్చి చూస్తే, పాము మాయం. మళ్ళీ అనుమానం. అదసలు పామేనా, లేక నిద్రమత్తులో నా భ్రమా! భ్రమ అయినా ఫర్వాలేదు కానీ, అది నిజమైన పామే అయ్యుంటే, మూలకు వెళ్ళిందో? వెంటనే లైటేసి మరో అర నిముషం వెతికితే, వాషింగ్ మెషీన్ వెనుక పడుకొని, మమ్మల్ని చూస్తూ కనిపించింది. నిజానికి భయంకన్నా, బెదిరిపోయిన మాట మాత్రం వాస్తవమే కానీ, అదే బెడ్రూములోకి వెళ్ళుంటే అన్న ఆలోచన మాత్రం ఇప్పటికీ వణుకు తెప్పిస్తుంది.


వెంటనే, మా వాచ్ మన్ ను పిలచి, పాము కదలికలు కనిపెడుతూ అక్కడే కూర్చున్నాం. పక్కింటతనికి (జితేంద్ర కాంబ్లే) రెండు సార్లు ఫోను చేస్తే, రెండుసార్లూ కట్ చేసాడు. తర్వాత పది నిముషాలకు అతను ఫోను చేసి, అంతకు ముందు మోగింది అలారం అనుకొని కట్ చేసాను ఏమిటి విషయం అని అడిగాడు. మొత్తం చెప్పగానే, వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు.


అంత తెల్లవారుజామున ఏం చేయాలో తోచటంలేదు. పామును చూస్తూనే ముప్పావు గంట గడిచింది. సరిగ్గా, అప్పుడు మా పక్కింటతను కార్పొరేటర్ అశోక్ ఘోర్పడెకు ఫోను చేసాడు. అంత తెల్లవారుఝామున ఫోను చేసినా, ఎంతో స్వాంతనగా మాట్లాడి, పావుగంటలో మనిషిని పంపిస్తానని చెప్పారు అశోక్ ఘోర్పడె. చెప్పినట్లుగానే దాదాపు 5.15 కు నితిన్ అనే స్నేక్ కాచర్ వచ్చాడు. అప్పటికి, దాదాపు గంటసేపు కదలకుండా, మెదలకుండా వాషింగ్ మెషీన్ వెనుకే ఉన్న మా అతిథి మెల్లగా, పక్కనే ఉన్న పుస్తకాల రాక్ క్రిందకు పాకి వెళ్ళింది.


పామును పట్టుకోటానికి అయిదు నిముషాలు పడితే, దానిని గోతాంలో వేయటానికి అంతకన్నా ఎక్కువే పట్టింది. మొత్తానికి 5.30 కు ఊపిరి పీల్చుకున్నాం.


ఆల్ ఈజ్ వెల్, దట్ ఎండ్స్ వెల్. జవాబులేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి సంఘటనలో.


My humble gratitude to our Corporator – Mr. Ashok Ghorpade, for timely help in those odd hours.


My sincere thanks to Nitin – The Snake Catcher, my neighbour – Jitendra Kamble and our Watchman – Gopal Bahadur.


ఆలోచనా తరంగాల అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Monday, February 15, 2010

రామ రామ... గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా....!

గొల్లపూడి గారు "శివ.. శివా..." అన్న శీర్షికతో వ్రాసిన వ్యాసంలో షారూఖ్ లాంటి ఓ అమాయక నట చక్రవర్తిపై, ఓ ముసలి రాజకీయ గూండా బాల్ థాక్రే ఎలా దౌష్ట్యాన్ని, దౌర్జన్యాన్ని ప్రదర్శించారో వివరించారు. ఇది చదివిన తర్వాత, 'మనం మనం సినిమావాళ్ళం' అన్న ఉద్దేశ్యంతో వ్రాసినట్లే కనిపిస్తున్నది కానీ, తులనాత్మక పరిశీలన, విచక్షణ అణుమాత్రం కూడా కనిపించట్లేదు. ఆయన అభిప్రాయాలు ఎంత అసమంజసంగా ఉన్నాయో చెప్పాలని ఈ వ్యాసం వ్రాస్తున్నా కానీ, అక్కడ బాల్ థాక్రేని గొల్లపూడి గారు ఆక్షేపించినట్లు ప్రముఖులపై రాయి వేసి, పది మంది దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంతో మాత్రం కాదని ముందుగానే మనవి చేస్తున్నా.

గొల్లపూడిగారు విస్మరించిన ఓ రెండు ముఖ్యమైన విషయాలు :

1. ఐ.పి.ఎల్. లో కోల్కతా నైట్ రైడర్సుకు షారూఖ్ ఓనరు. మై నెమీజ్ ఖాన్ విడుదలకు కొద్ది రోజుల ముందుగా జరిగిన క్రీడాకారుల వేలంపాటలో, పల్లెత్తి ఒక్కసారైనా పాకిస్తాన్ క్రీడాకారులు కావాలని కోరని వ్యక్తి, సినిమా విడుదలకు ముందు, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. లో ఆడించాలని చెప్పాడు. దీని వెనుక మర్మమేమిటో అర్ధం చేసుకోలేని అమాయకులు ఎవరైనా ఉంటారా? మీరు ఏ లోకంలో, ఏ కాలంలో ఉన్నారు గొల్లపూడి గారు?

2. కొన్ని నెలల క్రితం, ఆ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడే, తన పేరు చివర ఖాన్ అని ఉన్నదన్న నెపంతోనే, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను రెండు గంటలపాటు అమెరికాలోని ఓ విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపిస్తూ, ఈ సినిమా ప్రచారానికి ఆనాడే తెర లేపాడు షారూఖ్. ఈ విషయం కూడా మీరు మర్చిపోయినట్లున్నారు.

* * *

ఇకపైగా, అసలు విషయాన్ని అడుసులో తొక్కి, బాల్ థాక్రేపై కాళ్ళు కడుక్కున్న గొల్లపూడి గారి తీరు గర్హనీయం. ముంబాయిపై తీవ్రవాదుల దాడి జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. దాడి జరిగిన వెనువెంటనే, పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను తిరస్కరించిన భారత ప్రభుత్వం, ఒక సంవత్సరంలోగా, పాకిస్తాన్ ఎలాంటి సకారాత్మక ధోరణి కనబరచిందని, మళ్ళీ చర్చలకు పూనుకున్నదని ప్రశ్నించరే?

గత సంవత్సర కాలంలో, భారత పాకిస్తాన్ ల సంబంధ బాంధవ్యాలను షారూఖ్ ఏరకంగా ఉద్ధరించిందీ ప్రశ్నించరే?

గత ఆరు దశాబ్దాలుగా, క్రీడా సాంస్కృతిక రంగాల ఆసరాతో, ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టతకు భారత్ చేయనిదేమిటి? దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి అన్న విషయాన్ని ఎందుకు విస్మరించారు?

బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తులు, సంకుచిత వ్యాపార దృక్ఫధంతో చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్ల, ఆవేశాలు పెచ్చరిల్లే ప్రమాదమొకటైతే, గొల్లపూడి గారి లాంటి జ్ఞానవృద్ధులు (వ్యంగ్యం ఏమాత్రమూ లేదు) కూడా ఇటువంటి మాయ మాటల వలలో పడి, అసలు విషయాన్ని విస్మరించే ప్రమాదం కూడా ఉంటుందని నిరూపితమయ్యింది.

గొల్లపూడి గారు ఆఖరికి మీరు కూడా ....ఇలా కామెడీ చేస్తే ఎలా?

ఈ మొత్తం వ్యవహారంతో షారూఖ్ ఆశించినవి రెండు. ఒకటి, మై నేమీజ్ ఖాన్ కు ప్రచారం. రెండు, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని తూర్పార బెట్టి, పద్మభూషణ్ సంపాదించుకున్న అమీర్ ఖాన్ సరసన, తను కూడా పద్మభూషణుడుగా వెలిగిపోవాలని.


హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'

Saturday, February 6, 2010

'తాగుడు' ఉద్యమం కాదు, 'నెత్తురోడిన' ఉద్యమం

తెలంగాణా ఇచ్చినట్లే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోసపుచ్చినందుకు, తాడోపేడో తేలాల్సిన స్థితిలో ఉన్న ఉద్యమాన్ని కే.సి.ఆర్. నీరుగార్చినందుకు నిరాశా నిస్పృహలతో తెలంగాణా గురించి ఇక వ్రాయకూడదని నిర్ణయించుకున్నాను ఈ మధ్యనే. కానీ, తెలంగాణా సమస్య ఒక రాజకీయ, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, సాహితీ సమస్యలుగా చిత్రీకరిస్తూ వచ్చి, ఇప్పుడు దాన్ని తాగుడు సమస్యగా మరో మెట్టు దిగజారి చేస్తున్న విమర్శలు నిజంగానే మనసుని కలచివేస్తుంది. అందునా, మంచి రచయితగా, మేధావిగా అభిమానించే వ్యక్తులు చేస్తున్నప్పుడు మరింత బాధ కలిగిస్తుంది.

తెలంగాణా సమస్య అర్ధం చేసుకోలేని బ్రహ్మ పదార్ధం కాదు. మునుపు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, ఏ అభివృద్ధి ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలయ్యిందో, అదే ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణా మొదలయ్యింది. ఉన్న తేడా అల్లా, చారిత్రక కోణం.

నిజాం నిరంకుశ పాదాల కింద నెత్తురోడింది తెలంగాణా. భారతజాతి యావత్తు అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తుంటే, తెల్లవారే దిక్కేదో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడింది తెలంగాణా. ఆపై సంవత్సరానికి గానీ, స్వేఛ్చావాయువులు సోకని దుర్భర పరిస్థితుల్లో, రేపటి ఉషస్సు కోసం పోరుబాటన పట్టింది తెలంగాణ. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటంలో రక్తసిక్తమైన చరిత్ర తెలంగాణాది. సంకుచిత రాజకీయ పరిధుల్లో పరిగణించాల్సిన పోరాటం కాదిది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం ఇది. పటేల్, పట్వారీ, దేశ్ ముఖ్, దేశ్ పాండే, రజాకార్ల అరాచకాన్ని ఎదిరించిన పోరాటం ఇది. విశాల భారతంలో మమేకమవ్వాలని తెలంగాణా చెసిన పోరాటం ఇది.

అలాంటి తెలంగాణా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడిగితే, ప్రత్యేక దేశం అడుగుతున్నట్లుగా చీదరింపులు దేనికి? ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ప్రశ్నిస్తే, వెక్కిరింపులు దేనికి? ఆశించిన తీరులో అభివృద్ధి ఏదని అడిగితే, గేలి చేయటం దేనికి?

తెలంగాణా కె.సి.ఆర్. పోరాటం కాదు. ప్రజల పోరాటం. అందుకే, రెండు నెలలుగా స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నా పెద్దా అని లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం, పార్టీలు పోషిస్తున్న పోరాటం కాదిది.

ఆ పోరాటానికి, ఇప్పటి పోరాటానికి ఉన్న సారూప్యమేమిటనేది అసలైన ప్రశ్న. అప్పుడు నిజాం నవాబు, వారి తాబేదార్లు దోచుకున్నారు, ఇప్పుడు ఆంధ్రావాళ్ళు ఆ పనే చేస్తున్నారనేది అసలు సారూప్యమే కాదు. కేవలం ప్రజలను, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించటానికి కొందరు నాయకులు చేసే ప్రేలాపనలే అవి. విచారకరమైన విషయం ఏమిటంటే, చదువుకున్న వ్యక్తులు కూడా అటువంటి నాయకుల ప్రేలాపనలనే తెలంగాణా గుండె చప్పుడుగా పేర్కొంటూ తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించటమే కాకుండా, అవమానిస్తున్నారు కూడా.

సరే, అప్పటి ప్రజల దుర్భర పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి పెద్దగా మార్పేమీ లేకపోవటమే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ప్రధాన కారణం. జరిగిన అభివృద్ధైనా, కాలక్రమంలో జరిగినదే కానీ, కాలాతీతంగా జరిగిన అభివృద్ధి శూన్యం. భూమి లేక, భుక్తి లేక ఇక్కట్లు పడ్డ ప్రజలు అప్పుడు ఉన్నట్లే, ఇప్పుడూ ఉన్నారు. సమైక్యాంధ్రుల మాటకొస్తే, అటువంటి దుర్భర పరిస్థితులు సీమాంధ్రలలో కూడా ఉంది. అవును. అభివృద్ధి ప్రాతిపదికగా పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెచ్చుకున్నా అభివృద్ధి జరగకపోతే, ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వాలని నిలదీయరే? అటు తెలంగాణా ప్రజలు, చేసిన బాసలు మరచిన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక రాష్ట్రం అడుగుతుంటే తప్పు పట్టటం ఏమిటి?

దురదృష్టవశాత్తు, ఇది రాజకీయంగా తీరాల్సిన సమస్య కాబట్టి, రాజకీయ కోణాలు వికృతంగా ఆవిష్కరింపబడుతున్నాయి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, మరెన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు నడవాలి. ఆ క్రమంలో ఆయా రాజకీయ పక్షాల విధివిధానాలు అడ్డు రాకూడదు. కానీ, తెలంగాణాకు సంబంధించి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడవడిక, తదితర రాజకీయపక్షాల నడవడిక ఆ స్ఫూర్తినే దెబ్బ తీసేదిగా ఉంది.

Friday, February 5, 2010

హిజ్ నేమ్ ఈజ్ 'కామెడీ కింగ్ ఖాన్'

కొన్నాళ్ళ క్రితం, తన పేరు చివర ఖాన్ అన్ని ఉన్నందుకే, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండు గంటలపాటు నిర్బంధించారని నానా హడావుడీ చేసాడు ఈ కామెడీ కింగ్. ఇప్పుడు ఐ.పి.ఎల్. లో పాకిస్తాన్ క్రీడాకారులను తీసుకోకపోవటంపై నిరశన వ్యక్తం చేస్తున్నాడు అదే కామెడీ ఖాన్.

మింగుడుపడని విషయం ఏమిటంటే, ఐ.పి.ఎల్. లో కోల్ కత్త నైట్ రైడర్సుకు వీడు అధినేత. ఐ.పి.ఎల్. ఆక్షన్లు జరుగుతున్నప్పుడు పల్లెత్తు మాట అనలేకపోయినవాడు, ఇప్పుడు ప్రతిఘటించటంలోని ఔచిత్యం ఏమిటి?

ముంబాయి దాడులు జరిగి గట్టిగా సంవత్సరం కాలేదు. ఈ సంవత్సర కాలంలో భారత్ నమ్మకాన్ని ఏరకంగా పాకిస్తాన్ సాధించిందని ఇప్పుడు ఆ దేశంతో క్రీడా సంబంధాలు పెట్టుకోవాలి? వీడికి తందనాలాడుతూ కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం కూడా, పాకిస్తాన్ క్రీడాకారులను ఐ.పి.ఎల్. ఫ్రాంచైజీలు తీసుకుంటే అభ్యంతరంలేదని, వారి రక్షణకు ఏర్పాట్లు చేయగలమని ప్రకటించాడు!

పాకిస్తాన్ లో శిక్షణ పొందిన తీవ్రవాదుల నుంచి సామాన్య భారతీయులను రక్షించలేని ప్రభుత్వాలు, పాకిస్తాన్ క్రీడాకారులకు మాత్రం ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మాట్లడటం ఏమిటి? భారతీయుల కన్నా, పాకిస్తాన్ వాళ్ళే ఈ ప్రభుత్వాలకి ముఖ్యమా?

ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే క్రీడా సాంస్కృతిక సంబంధాలు, సంఝౌతా ఎక్స్ ప్రెస్సులు మొదలవ్వలానేదే ముఖ్యమా? గత ఆరు దశాబ్దాల కాలంలో, సంబంధాల మెరుగుదలకు భారత్ చేయనిదేమిటి, దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ మనకు ఇచ్చిందేమిటి?

కామెడీ కింగ్ ఖాన్ సినిమాలు పాకిస్తాన్ లో విడుదల చేస్తే, వాడికి వాడి నిర్మాతలకు ఉపయోగమేమో కానీ, దానివల్ల సగటు భారతీయుడికి కలుగుతున్న ప్రయోజనం ఏమిటి - తీవ్రవాదుల చేతుల్లో దాడులకు గురవ్వటం తప్ప. కామెడీ కింగ్ ఖాన్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులకు కాశ్మీర్ పండితులపై జరిగే అత్యాచారాలను ప్రశ్నించే అనుపం ఖేర్ పై ఎందుకు చిన్న చూపు?

ఏదేమైనా, నేను హిందువునని గర్వంగా చెప్పుకునే ఓ భారతీయుడుగా కామెడీ కింగ్ ఖాన్ సినిమాలనే కాదు, వాడినే దేశం నుంచి బహిష్కరించాలని కోరుతున్నా. ఈ విషయంలో బాల్ థాక్రేకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. కామెడీ ఖాన్ నే కాదు, లౌకిక ప్రజాస్వామ్య దేశమంటే, మైనారిటీలకే ప్రత్యేక పరిరక్షణ కల్పించటమే అంటూ వత్తాసు పలికే కుహానా లౌకిక రాజకీయ నాయకులను కూడా హిందు దేశం నుంచి బహిష్కరించాలి.