విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు హజారే దీక్ష-హజార్ సవాళ్లు అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ వ్యాసం చదివిన పాఠకులకు తోస్తుంది.
పురిటిలోనే సంధి కొట్టించేటట్లుగా కొనసాగిన జన లోక్ పాల్ బిల్లు ప్రతిపాదనలు ఎన్ని దశాబ్దాలుగా మనలని మభ్యపెడుతున్నాయో మనకు తెలుసు. ఆ ప్రతిపాదనలకు రూపురేఖలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యమూ తెలుసు. మరి ఇంతకాలం, లోక్ సత్తా, కమ్యూనిస్టులతో సహా ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకని తీసుకురాలేకపోయాయి?
ఎందుకంటే, ఈ పార్టీలన్నీ ఆ తానులోని గుడ్డలే. ఒక సాధారణ సంఘటనగా మొదలైన ఉద్యమానికి ఊహాతీతంగా లభించిన జనస్పందన పాలక, ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి కలిగించిందనేది వాస్తవం. అవకాశవాద రాజకీయాల్లో దిట్టలైన ఈ నేతలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది కానీ, అవినీతిపై వారికి ఉన్న విముఖత కానేకాదు.
తెలకపల్లి గారు ఓ విచిత్రమైన వాదన చేస్తూ ఇలా అన్నారు "వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలు ఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది.”........




