Friday, December 11, 2009

భంగపడ్డ తెలంగాణా

నా క్రిందటి వ్యాసం 'తెలంగాణా - మరోసారి మోసపోవద్దు'లో నేను అనుకున్నదే అయ్యింది.

"రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమే కాకుండా, ఆ బిల్లును ఆమోదించిన తర్వాతనే కె.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం."

పదకొండు రోజులు ఆపసోపాలు పడి, అమ్మవారి హామీ కోసం పరితపించి, చివరాఖరికి హడావుడీగా, బ్రతుకు జీవుడా అనుకుంటూ కె.సి.ఆర్. ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. గొంతులో ముద్ద కూడా దిగకుండానే, అమ్మవారి హామిలోని పితలాటకాలు ఒక్కటొక్కటిగా ఇప్పుడు బైటపడుతుంటే, ఖంగు తినటం తప్పనిసరయ్యింది ఈయనకు.

కె.సి.ఆర్. పుణ్యమా అని, వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకులు కూడా సోనియాకు అవిధేయత ప్రకటించటం ఆశ్చర్యకరం. కేంద్ర మంత్రి పదవుల పందేరంలోను, జనరల్, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి మొండి చేయి చూపించినప్పుడు, కరువు, వరదల బీభత్సానికి అతలాకుతలమైన రాష్ట్రానికి చేయూతనందించటంలో తిథి, వార, నక్షత్రాలు లెక్కపెట్టిన కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించని నాయకులు, ఈరోజు ప్రజాభీష్టం మేరకే తమతమ పదవులకు రాజీనామాలు ఇచ్చారంటే ఆశ్చర్యంగానూ ఉంది, అసహజంగానూ ఉంది.

గత ఆరు సంవత్సరాలకు పైగా నలుగుతున్న తెలంగాణా విషయంపై, ఆయా పార్టీల నాయకత్వం ఆయా పార్టీల సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని ఎలా చెబుతున్నారో అర్ధం కావటంలేదు. ఒకప్పుడు, దొరికిన అవకాశాన్నే కాక, దొరకని అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని తెలంగాణాపై సోనియా నిర్ణయమే శిరోధార్యమన్న నాయకులే వీళ్ళు.

విచిత్రమేమిటంటే, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదపటంలేదు. ఇదంతా చూస్తుంటే, గూడుపుఠానీలా అనిపిస్తున్నది. కోస్తా సీమ నాయకుల నుంచి పార్టీల కతీతంగా ఐకమత్యంగా ఉండటం కనీసమాత్రంగానైనా తెలంగాణా నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో?


కోస్తా, సీమల ఎమ్మెల్యేలు మెజారిటీగా ఉన్న శాసనసభలో తెలంగాణా బిల్లు ఏరకంగా ఆమోదింపబడుతుందని తెలంగాణా మేథావులు విశ్లేషించారు? సోనియా హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో, చిదంబరాలు, మన్మోహన్లు చేసే హామీల విలువ ఏపాటిది? మొన్నటిదాకా, తెలంగాణాపై నాంచుడు ధోరణితో ఆరేళ్ళు లాక్కొచ్చిన కాంగ్రెస్, "చిదంబర హామీతో" మరో అరేళ్ళు లాక్కొస్తుందనటంలో ఎటువంటి అనుమానము లేదు.

చేవలేని చవటల నాయకత్వంలో 'ప్రత్యేక తెలంగాణా'కు మరోమారు భంగపాటు తప్పదు.

10 comments:

  1. కిరణ్ గారు, కవిత్వమే అనుకున్నా రాజకీయాన్నికూడా suనిశితంగా విశ్లేషించారు. ఇలాంటి వ్యాసం ఒక్క తెలుగు పేపర్లోనైనా పడుతుందా అని భూతద్దాలు పెట్టుకొని చూస్తున్నా. సెన్సేషనల్ న్యూసులు తప్పితే సెన్సున్న వార్తలు తక్కువయ్యాయి ఈ మధ్య. స్టాకుమార్కెట్టు ఇండెక్సుల్లాగా రాజెకీయాల్లో విలువలకూ చక్రభ్రమణాలుంటాయని ఆశిద్దాం.

    ReplyDelete
  2. సాయి కిరణ్ గారు,
    నాకు ఎందుకో కోస్తా & సీమ నాయకులూ, ప్రజాభిప్రాయం మేరకు రాజీనామా చెయ్యలేదు. నాకు ఎందుకో ఇది ఒక conspiracy లాగా అనిపిస్తోంది. నా అనుమానం ఇది అథిష్టానం ఆడిన నాటకమా అని. తెలంగాణా వచ్చినా రాకపోయినా, ప్రతిదానికి, మేడం అంటే, ఇది ప్రజాస్వామ్య దేశమా లేక నియంతృత్వ దేశమా అనిపిస్తోంది.

    ReplyDelete
  3. ఏం నాయనా.. ఇప్పడు గుర్తుకొచ్చింది. మీ చవటల నాయకత్వం. ఏం చేశారని వారి వెంట తెలంగాణ పరుగులు తీశారు. ఏం త్యాగాలు చేశారని... వారి వెనుక పరిగెత్తావ్.
    అసలు ఎందుకు తెలంగాణ అడుగుతున్నవు. జమ్మూ కాశ్మీర్లో కూడా మెజారిటీ ఉంది పాకిస్థాన్లో కలిపేద్దామా... ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ దేశం నుంచి విడిపోవాలనుకుంటున్నయి. ప్రజలు కూడా మీకంటే బాగానే మద్దతిస్తున్నరు.. ఇచ్చేద్దామా.. కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక లేదా.. ముందు కేసీయార్ కుందా. ఎందుకు పార్టీ పెట్టాడు.. తర్వాత ఏమేమి చేశాడు... సిగ్గుండాలి. నిరాహార దీక్షలకే రాష్టాలు ఇచ్చేద్దామంటే ఇంటికొక రాస్ట్రం తయరవుద్ది.. ఇచ్చేద్దమా నాయనా..

    ReplyDelete
  4. నేటి తెలంగాణా లో విద్యార్ధి శక్తి 1969 నాటి కంటే వంద రెట్లు పెరిగింది.
    ప్రజా చైతన్యం వెయ్యి రెట్లు పెరిగింది.

    తెలంగాణా లో ప్రైమరీ స్కూల్ పిల్ల వాడు కూడా రాజకీయ నాయకుల మోసాలను, బానిస మనస్తత్వాలను చాలా సులువు గా గ్రహించ గలుగుతున్నాడు.

    కాబట్టి మరోసారి భంగపాటు కు అవకాశమే లేదు.
    నిరాశ వద్దు.

    భళ్ళున తెల్ల వారు నింక భయం లేదు.
    జూలు విదిలించిన తెలంగాణాకు ఇంక అడ్డు లేదు

    జై తెలంగాణా !

    ...

    ReplyDelete
  5. ఎనిమిదేళ్లు ఊపీ ఊపీ విదిలించగా ఒక్కంగుళం లేచిన జూలు సమైక్యులు ఒక్కసారి ఉఫ్ మంటే ఎగిరిపోయింది ;-) మళ్లీ విదిలించటం మొదలెట్టండి.

    సాయికిరణ్ గారు,

    విధ్వంసమే ప్రభుత్వాలని కాళ్లబేరానికి తెస్తుందన్నారు మీరు మొన్నామధ్య. విధ్వంసం మిగిలినోళ్లూ చేస్తే ఎలా ఉంటుందో అర్ధమవుతుందా ఇప్పుడు?

    ReplyDelete
  6. మరి నేను చెప్పింది కరెక్టు అవునా కాదా @ అబ్రకదబ్ర గారు. కోస్తాంధ్రలో జరుగుతున్న విధ్వంసానికేగా ప్రభుత్వం ఆలోచనలో పడింది. చక్కగా నూనె పూసుకొని, క్రాఫ్ దువ్వుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి డౌన్ డౌన్ అని ఓ రోజల్లా అరిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? కె.సి.ఆర్. నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కూడా మొన్నటిదాకా అలానే సా...గింది.

    ReplyDelete
  7. గణేష్ గారు - అవునండి. ఇది ఖచ్చితంగా గూడుపుఠానీయే. సందేహం లేదు. తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోటీగా రాజీనామాలు చేస్తారని ఆశించా. సిగ్గెగ్గులు లేకుండా, ఇంకా అంటిపెట్టుకు కూర్చున్నారు. రాజకీయ సంక్షోభం కలగాల్సిందే. ప్రత్యేక తెలంగాణా అంశంపై ఎన్నికలు జరగాల్సిందే. అప్పుడు తేలిపోతుంది కదా, ఎవరి తాహతు ఎంతో.

    బుడుగు గారు - థాంక్యూ.

    ReplyDelete
  8. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  9. Good analysis, I agree with you on many of your thoughts.
    But I don't think that all this is only because of KCR.
    And even for the telangana issues it is the other politicians who can not stay united and fight.

    ReplyDelete

మీ అభిప్రాయం :