Friday, December 28, 2007

గుజరాతీయుల విజయం

ఇది గుజరాత్ ప్రజల విజయం!

గుజరాత్ లో ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసాయి. ఎన్నికల ముందు సర్వేలు, ఆ పిమ్మట ఎగ్జిట్ పోల్సు అంచనాల ప్రకారం ఈపాటికి కాంగ్రెస్ అధికారం అంచుల్లో పచార్లు చేస్తూ ఉండి ఉండాలి. యు.పి.ఎ. కేంద్ర నాయకత్వం మధ్యంతర ఎన్నికలకి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండి ఉండాలి. కానీ, అవేమీ జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్షణం నుంచే కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా కాంగ్రెస్ నేతల మొహాలు వెలాతెలాబోయాయి. కక్కలేని మింగలేని పరిస్థితుల మధ్య వేరువేరు వార్తాసంస్థల 'సర్వేరాయుళ్ళు' ఫలితాలను విశ్లేషించటంలో మునిగితేలారు.

అభివృధ్ధి నినాదంగా 'జీతో గుజరాత్' అంటూ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన మోడీకి పెనుసవాళ్ళే ఎదురైనాయి. మాజీ ముఖ్యమంత్రుల ఇంటిపోరు, కొత్తకుల సమీకరణలతో గుజరాత్ ఎన్నికల్లో మాయావతి మోహరింపు, రాజధర్మాన్ని ప్రభోధించే వాజ్ పేయి లాంటి అగ్రనేతల లేమి. ఇన్ని సవాళ్ళ మధ్య మోడీ పీఠం బీటలువారేది ఖాయమనే వార్తాసంస్థల విశ్లేషణలు!

మతపరమైన భావోద్వేగాలు మచ్చుకైనా కనిపించని మొదటిదశ పోలింగు తర్వాత, ఆరుతున్న గాయాల్ని మళ్ళీ రేపే కుటిలయత్నంతో కాంగ్రెస్ రెండో దశ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. మృత్యువ్యాపారిగా మోడీని అభివర్ణిస్తూ ఇటు సోనియాగాంధీ, గుజరాత్ రెండుగా చీలిందని ప్రధాని మన్ మోహన్ సింగ్, హిందూ తీవ్రవాదులతో రాష్ట్రం అట్టుడికి పోతున్నదని అటు డిగ్గీరాజాలు మతవిద్వేషాన్ని మళ్ళీ రగిల్చే ప్రయత్నాలు యధోచితంగా చేసారు.

తిరుగు జవాబిచ్చే ప్రయత్నంలో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటరును సమర్ధిస్తూ మోడీ ఇచ్చిన ప్రసంగాన్ని అవసరానికి మించి వాడుకునే ప్రయత్నంలో కాంగ్రెసీయులు అడుసు తొక్కారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ కు కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష అమలులో కేంద్రం ఎందుకని ఆలస్యం చేస్తున్నదని మోడి అడిగిన ప్రశ్నకు బదులు లేదు. తీవ్రవాదులపై కర్కశపాదం మోపుతామని ప్రకటించిన మోడీకి, గత అయిదేళ్ళలో గుజరాత్ లో అరాచకత్వానికి ఏ తీవ్రవాది పాల్పడనేలేదనే విషయం తెలిసిన గుజరాత్ ప్రజలూ అండగా నిల్చారనేది సత్యం.

నిరుటి ఎన్నికల ఫలితాలతో సరిపోలిస్తే నష్టపోయినవి 10 సీట్లే. 360 కోణాల్లో పరిశీలించి, విశ్లేషించినా గుజరాత్ ప్రజలు మోడీకి నిర్మొహమాటంగా మద్దతు ఇచ్చారనేది కూడా స్పష్టమే। నిష్టూరమైన ఈ నిజం ఇంకా యు.పి.ఎ. పాలకుల నెత్తికి అంటలేదనేది నిన్నటి వార్తాసంస్థల ఇంటర్వ్యూలలో వాళ్లిచ్చిన 'సంజాయిషి' చూసిన వారెవరికైనా స్పష్టమౌతుంది.

గుజరాత్ ఎన్నికల వలన, అమెరికాతో అణుఒప్పందంపై యు.పి.ఎ. ప్రభుత్వానికి 'ఫైనల్ అల్టిమేటం' ఇవ్వలేదని చెప్పుకున్న కమ్యూనిస్టుల గొంతులో గులకరాళ్ళే పడ్డాయనేది అర్ధమౌతుంది. గుజరాత్ గెలుపు గుజరాత్ కే పరిమితమని నిన్నటి ఇంటర్వ్యూలలో వాళ్లు చేసిన ఊహాగానాల పట్టు ఎంత అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. తెగువ చూపించి మధ్యంతరానికి బాటలు పరిస్తే, అధికారాన్ని భోజన తాంబూల సహితంగా భా.జ.పా. చేతుల్లో పెట్టినట్లే అవుతుందనే అనుమానాల మధ్య రాబోయే రోజుల్లో చూడబోయే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఏది ఏమైనా, ప్రగతిని కాంక్షించిన గుజరాత్ ప్రజలు భా.జ.పా.కు, మోడీకి అధికారం కట్టబెట్టారనే విషయాన్ని, ఆరిపోయిన అల్లర్ల జ్వాలలను తిరిగి రేకెత్తించటం వల్ల నష్టపోయేది తామేననే విషయాన్ని కాంగ్రెసీయులు, కమ్యూనిస్టులు గుర్తెరిగి ప్రవర్తిస్తారనే ఆశిద్దాం.

1 comment:

  1. ayya andhra lo naaku telisi telangana separate chsthe oppose chese vaalu chaalaa takkuva. evaro kondaru balisina kamma reddla kulaala vallu baagaa balisina vaalle nana yaagi chesthunnaru, vidipothe sukam anukunte adi chesthe pola ani anukune vaalle ekkuva, manchi samanthwa palane development chesthundi ee pranthannaina, migilina anni articles chala baagunnayi abhinandanalu

    ReplyDelete

మీ అభిప్రాయం :