Friday, February 22, 2008

తెలంగాణా - ప్రశ్నలకు జవాబులు

తెలంగాణాపై ఏమాత్రమూ అవగాహన లేకుండా ఈమధ్య 'తెలంగాణా ప్రశ్నలకు ప్రశ్నలు' అనే శీర్షికతో వచ్చిన ఓ ఆర్టికిల్ చదవటం తటస్థించింది। 'పేరు మాత్రమే గొప్ప' అన్న తరహాలో ఉన్న ఆ వ్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఆ వ్యాసకర్త కున్న కొన్ని దురభిప్రాయాలు, ఆయనకున్న అవగాహన చూసి నవ్వుకోవాల్సివచ్చింది.

ఎస్సార్సీ అంటే ఏమిటో కూడా తెలియదు ఆయనకు। ఎస్సార్సీ అనేది ఒక కమిటీ. అది కేవలమూ ఒక నివేదిక ద్వారా ప్రతిపాదనో లేదంటే రికమండేషనో చేయగలదు. కానీ, ఆయన మాత్రం అది తీర్పులిస్తుందంటారు!! అప్పట్లో మొదటి ఎస్సార్సీ ఇచ్చిన తీర్పు ఇప్పటి కాలమాన (వాతావరణం కూడా లిస్టులో పెట్టేసారు) పరిస్థితులకు పనికిరాదని కూడా ప్రకటించేసారు.

అయ్యా, ఏదో మేథావితనంతో వ్రాస్తున్నామనుకుంటూ, తెలంగాణాను వేళాకోళం చేస్తున్నారు। అది తప్పు. ఇంకా ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలైతే వ్రాసారు కానీ గుర్తులేవు. మళ్ళీ చూద్దామనుకుంటే, ఆయన మాత్రం ఆ వ్యాసానికి తాళం బిగించుకున్నారు. ఆయన సంగతి పక్కనపెట్టి, గతంలో 'ప్రత్యేక తెలంగాణా' శీర్షికన నేను వ్రాసిన ఓ వ్యాసంపై వచ్చిన కొన్ని అభిప్రాయాలకు వ్యాసం రూపంలోనే సమాధానం ఇస్తాను।

ఆ వ్యాసానికి స్పందిస్తూ, నా బ్లాగులో ఓ 'తెలుగు అభిమాని' 'మూడు ముక్కలు చేసుకుని నీళ్ళకోసం మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు' అని అడిగారు। బానే ఉంది. కొట్టుకుంటే బాగోదని, మనం బాబ్లీ విషయంలో మహారాష్ట్రతోనూ, ఆల్మట్టి విషయంలో కర్ణాటకతోనూ గొడవపడకుండా ఆగామా? వాళ్ళూ మనలాగే భారతీయులేగా అని మిన్నకుండిపోలేదే మరి?

అంతకన్నా ఆశ్చర్యకరమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్య శ్రీ తాడేపల్లి లలితాసుబ్రహ్మణ్యంగారు చేసారు। తెలంగాణాది సాంస్కృతిక సమస్యట!! ఆయన మాటల్లోనే చదవండి. "తెలంగాణా సమస్య సాంస్కృతికమైనది। ఆర్థికం కాదు. తెలంగాణాలో తెలుగు సంస్కృతి పూర్తిగా క్షీణదశకు తేబడింది. మిగతా తెలుగువారితో ఇక్కడి తెలుగువారు మమేకం కాలేకపోవడానికి ఇదే కారణం. This is a culturally impoverished region. అందువల్ల ఈ ప్రాంతం వెనకబడిపోయింది. ముందు సాంస్కృతికంగా బాగుచెయ్యడానికి పూనుకుంటేనే ఆర్థికంగా బాగుచెయ్యగలం."

ఇంకా నయం. తెలంగాణా సమస్య సాంస్కృతికమైనదే అన్నారు. అది తెలంగాణావారి 'మానసిక సమస్య'గా చెప్పనందుకు సంతోషించాలేమో!
ఇంకా 'గ్రంధాలయోద్యమాన్ని' అక్కడ చేపట్టాలని ఆయన సెలవించారు। ప్రజలు తెలుగుభాష నేర్చుకోటానికి, తెలుగులో ప్రభుత్వ వ్యవహారాలు సాగేందుకు వీలుగా మాడపాటి హనుమంతరావుగారి ఆధ్వర్యంలో 'గ్రంథాలయోద్యమం' మొదలయ్యింది తెలంగాణాలోనే అన్న విషయం బహుశా మీకు తెలిసుండదు.

అసలు తెలంగాణా ఉద్యమానికి ఉన్న చారిత్రక నేపథ్యం తెలియకుండా, తెలంగాణావాదాన్ని వేళాకోళం చేస్తూ ఈ కుహానా మేథావులు ఏం సాధిద్దామనుకుంటున్నారో అర్ధం కాదు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణా విముక్తమయ్యిందన్న విషయం వీరికి తెలుసా? స్వతంత్రభారతంలో పరాధీనగా మిగిలిన 'కోటి రతనాల వీణ' చేసిన 'సాయుధపోరాటం'లో అసువులు బాసిన అమరవీరులెందరన్నది వీరికి తెలుసా? 'నీ బాంచన్ దొర' అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనగా పోటెత్తి నిజాం మెడలు వంచారన్న విషయం వీరికి తెలుసా?

ప్రత్యేక తెలంగాణా వాదంపై, పైత్య ప్రకోపాలు చేసే ఈ పెద్దమనుషులు అసలు తెలంగాణా కలిసి ఉంటే కలిగే లాభాలేమిటనేవి మాత్రం చెప్పరు। తెలంగాణా విడిపోతే కలిగే నష్టాలేమిటన్నది కూడా చెప్పరు. 'పెద్దమనుషుల' ఒప్పందం గురించేమైనా వీరికి తెలుసా? ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పుడే, ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కోస్తా విషయాలు ప్రస్తావించబడటంలోని రాజకీయాలు వీరికి అర్ధం కావా? చెప్పిందే చెప్పెరా.... అన్నట్లు, ప్రత్యేక తెలంగాణా సమైక్యతకు ముప్పు అని మాత్రమే వల్లెవేస్తారు.

అటు కాంగ్రెసు నాయకులు కూడా, ప్రత్యేక తెలంగాణా వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు రాజకీయముప్పు ముంచుకొస్తుందనటంలోనూ అర్ధం లేదు। గత ఎన్నికల్లో 'సమైక్యాంధ్ర'తో పోరాడిన తెలుగుదేశం కోస్తాలో ఏపాటి సీట్లు గెలిచిందో అందరికీ తెలుసు. తెరాసతో ఎన్నికల సర్దుబాటు చేసుకొని, ప్రత్యేక తెలంగాణాకు తాము అనుకూలమని ఎన్నికల్లో పోరాడిన కాంగ్రెసు, అటు తెలంగాణాలోనూ, ఇటు కోస్తాలోనూ గెలిచిన విషయం విస్మరిస్తే ఎలా?

రెండో ఎస్సార్సీ వేయటమనేది కేవలమూ కాలయాపన చేయటానికే అనేది ప్రాథమిక రాజకీయాలు తెలిసిన ప్రతివాడు గ్రహించగలడు.
ఏదేమైనా, ఇలా అడ్డుగోలుగా వాదించే ప్రబుద్ధుల కన్నా కూడా, కె.సి.ఆర్., నరేంద్ర, వెంకటస్వామిలాంటి తెలంగాణా నేతలవల్లనే, ప్రత్యేక తెలంగాణాకు ముప్పు. చిత్తశుద్ధిలేని ఈ నేతల తెలంగాణా పూజ ప్రజలు అర్ధం చేసుకోకపోవటం తెలంగాణా దురదృష్టం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణాకు సంబంధించి ఏ ఒప్పందం ఉన్నదనేది ఈనాటికీ తెలంగాణా ప్రజలకు తెలియనీయకపొవటం వీరి నీచ రాజకీయాలకు పరాకాష్ట.
ఈరోజు తెలంగాణాకు కావల్సింది పొట్టి శ్రీరాములులాంటి నిస్వార్ధజీవి. సంకుచిత ప్రయోజనాలు ఆశించని, పదవీలాలసులుకాని నాయకులు అవసరం. పదవీలాలసతో ప్రత్యేక తెలంగాణాను పణంగా పెట్టిన రాజకీయ నాయకులను వదిలి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు, ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలరా లేదా అన్నది శేషప్రశ్న.

5 comments:

  1. అన్నా! నేను 20 ఏండ్ల సంది హైదరాబాదులో ఉంటున్నా. సమైక్యవాదులు తెలంగాణా ను వేళాకోళం చేస్తున్నారు అని నీవు వ్రాయటం చాలా బాధాకరం. ఈ వాక్యను నీవు వెనక్కు తీసుకో. కేవలం తెలుగువారంతా ఒకే చోట కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత గొంతు చించుకొని ఏమి లాభం. నీకు ఇంకా ఎందరో misguided intellectuals కు ప్రాంతం ఆతరువాతే భాష ప్రాధమ్యాల వరుసలో ఉంది. నా అసుంటి వానికి భాషతరువాతే మరొకటి. . తెలుగు మాట అమ్మ మాట . రాజకీయ నాయకుల ఉచ్చులో మేధావులు పడటం మంచిది కాదు. నీ వ్యాసం లో సమైక్యవాదులను అవహేళన చేయటం భావ్యం కాదు.--రాష్ట్రంలో 80 % మంది అందరం కలిసి ఉందామనే కోరుకుంటున్నారు. మరి వారి సెంటిమెంటు బలంగా లేదా? మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళూ కలిసి అడిగినా మహరాష్ట్ర కర్నాటక వారు ప్రాజెక్టులు ఆపలేదు. అలాంటిది ముక్కలైనతరువాత మనలను ఎవ్వలు లెక్కచెయ్యరు. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందాన నదుల అనుసంధానం పేరుతో గోదావరి , కృష్ణ నదీ జలాలను తరలించుకు పోవటానికి కరుణానిధి పన్నుతున్నా కుట్ర మనం గుర్తెరగాలి. సమైక్య బలంతోనే అలాంటి కుతంత్రాలను అడ్డుకోగలం. guntupalli kiran kumar.

    ReplyDelete
  2. తెలంగాణ అభిమాని గారికి, కొన్ని ప్రశ్నలు.ఎంతసేపు తెలంగాణ పోరాటంలో అసువులు భాసిన వీరులు,త్యాగాలు,అణగారిన బడుగు వర్గాలు అంటూ వాగే రాజకీయ నాయకుల మాటలకు విలువ ఎందుకు ఇస్తారు.మీరు తెలంగాణ ఎందుకు అడుగుతున్నారు,అభివృద్ది కోసమా,రాజకీయ లభ్ది కోసమా? మీకు తెలుసా రెండుగా విడగోట్టబడ్డ (పెట్టుబడిదారీ వ్యవస్త,కమ్మునిస్ట్ వ్యవస్త)జర్మనీలు ఏకం అయింది.ఎందుకు? కేవలం ఒక భాష ప్రజలు కావున.32 వివిధ భాషలు,సంస్కృతులు ఉన్నా అందులో కొన్ని దేశాలు పరస్పరం యుద్దాలు చేసుకున్న కలిసి ఒక యురోపెయన్ వ్యవస్థగా ఏర్పడ్డారని,కారణం కలసివుంటే అభివృద్ది అనే స్ప్రుహ.కెనడా దేశంలో విదిపోతామన్న క్యుబెక్ రాష్ట్రం వాళ్లు కేవలం రెండు శాతం వోట్ల తేడాతో వోడిపోగానే ఇప్పుడు కలసి హాయిగా వున్నారని?కొరియాలు కూడా కలసి పోయే ప్రయత్నాలు చేస్తున్నాయని?ఒక వేళ తెలంగాణ వచ్చిన తరువాత కొంత కాలానికి ఏదయినా ఒక జిల్లా వాళ్లు వేరే రాష్ట్రం కావాలంటే మీకు బాధ వుండదా?(ఉద:హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లా లేదా ఇంకొకటి) ఎప్పుడు కలసివుందాం అనేవాల్లని శత్రువులుగా ఎందుకు చూస్తారు?ప్రపంచెంలో ఎన్నో దేశాలు ఇప్పుడు అభివృద్ది గురించే అలోచిస్తున్నాయి కావున పరాయి దేశాల వాళ్ళని(శత్రు దేశాల వాళ్ళని కూడా) కూడా ఆహ్వానిస్తున్నాయి.ఇదంతా నేను తెలంగాణ కి వ్యతిరేకతో వ్రాయటం లేదు.నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నాను.మా బాబుకి బాసర లోనే అక్షరాభ్యాసం చేయించాం.నాకు ఇష్టమయిన వాళ్లు సినారె,దాశరధి,పివి,ఆర్.నాగేశ్వరరావు (professor and MLC) తెలంగాణ వాళ్ళే.తమ పార్టి లోని నరుగురిని సమైక్యంగా ఉంచలేని,పదవిలో వున్నపుడు గుర్తుకురాని తెలంగాణ,ఆత్మాభిమానం గురించి మాట్లాడే ఒక స్వార్థ,పదవి లాలసుడి మాటలు ఎందుకు వింటారు.___ vasu.B

    ReplyDelete
  3. ఆయన ప్రశ్నలు ఏమో గాని , మీ వాదన అంతకన్నా గొప్పగా లేదు. అది ఈ కింది వున్న రెండు కామెంట్లు చదివితే అర్థం అవుతుంది. బిజెపి రాజకీయ నాయకుడు కాకున్నా , బిజెపి అభిమానిగా ఆ పార్టీ ప్రతి అవకాశవాద రాజకీయాన్నీ మీరు సమర్థించనవసరం లేదనుకుంటా.

    ReplyDelete
  4. ఆయన ప్రశ్నలు ఏమో గాని , మీ వాదన అంతకన్నా గొప్పగా లేదు. అది పైన వున్న రెండు కామెంట్లు చదివితే అర్థం అవుతుంది. బిజెపి రాజకీయ నాయకుడు కాకున్నా , బిజెపి అభిమానిగా ఆ పార్టీ ప్రతి అవకాశవాద రాజకీయాన్నీ మీరు సమర్థించనవసరం లేదనుకుంటా.

    'మా సంస్కృతి వేరే', 'మీరు మా సంస్కృతి ని గౌరవించలేదూ , 'మా బతుకమ్మా, 'సమ్మక్క-సారక్కలు ఆంధ్రోళ్ళు చేయడం లేదూ (ఎందుకు చేయాలో!) 'మా యాస మీరు వెక్కీరిస్తున్రూ - ఇలాంటివి చిల్లర కామెంట్లు. కెసిఆర్ లెవెల్లో వుండే జనాకర్ష్ణ కామెంట్లు. మీలాంటి చదువుకున్నోళ్ళు అలాంటి వాటిని సీరియస్ గా ప్రస్తావించనవసరంలేదు, అని గ్రహించండి. గోదావరి, కౄష్ణ నీటి వాడకంలో ఆప్రాంతంలో అసమానతలున్నాయన్నారు, దాన్ని కరక్ట్ చేయాల్సిన అవసరం వుంది. భౌగోళికంగా ఎత్తులో వున్న చాలా తెలంగాణా ప్రాంతాలు కూడా అందుకు కారణం కావచ్చు. కౄష్ణ , గోదావరి డెల్టాలు లో లెవెల్ ఏరియాలయినందువల్ల సహజంగా లాభం పొందుతాయి. ఇలా టెక్నికల్ ఏమైనా వుంటే చెప్పండి, కాని ఏదో వాదించాలని సంస్కృతి/భాష/యాస/ నిజాం రాజ్యం అని అసలు విషయాన్ని పలుచన చేయవద్దని మనవి.

    ReplyDelete
  5. తెలంగాణా సమస్య నిజముగా అయితే మీలాంటి వారి 'మానసిక సమస్య'... మన రాజకీయ నాయకుల వల్లే కాక సూటిగా తెలంగాణా ఎందుకు కావాలో చెప్పండి. అంత హడవుడి చేసిన TRS only have 45% people support.

    ReplyDelete

మీ అభిప్రాయం :