Wednesday, May 14, 2008

ఏదో చెప్పాలని

కళ్ళకు జోడు
కాళ్ళకు జోడు
నోటికి పూత
ఇన్ని తొడుగుల నాటకం
ఆసాంతం అబ్బురపరచింది
రంగురంగుల వలువలతో
సీతాకోకచిలుక మురిపిస్తూనే
తెర మూసుకొంది.
***
చుట్టూ చీకటి
రంగుల్లేని నీడలు
నాకు అలవాటైనవి కావు.
సామూహికంగా
నీడలు జరిపిన దాడిలో
ఏదో తెలియని ఓ రహస్యం.
శిథిలమైన ఈ గుహలో
ఒకానొకప్పుడు
ఏముందో!
నాకు నేనే ప్రేక్షకుడుగా
అపస్మారకంలో వేసుకున్న సంకెళ్ళు
***
చిందులు వేస్తున్న
చినుకుల మధ్య
ఏడుస్తూనే ఓ ఆశ
నడవాలి...
నడుస్తూ.. నడుస్తూ...
కాళ్ళ కింది దారి
ఆగిపోయేదాకా నడవాలి.
పారిపోయినవాడిని
పరామర్శిస్తూ
విసిరేసిన పూలను
అణగదొక్కుతూ నడవాలి
చీకటి చెరబట్టిన
నక్షత్రాల మధ్య
నగ్నంగా నడవాలి.
***
పుస్తకంలా విచ్చుకున్న
ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
మసక వెలుగుల సెగల మధ్య
ఆకాశపంజరంలో
చందమామ
అల్లరి పిల్లల కంటపడేదాకా
తెగిన గాలిపటానికి
అనువైన మజిలీ ఇదేనేమో!

4 comments:

  1. కిరణ్ గారూ, మీ భాషలో చెప్పాలంటే సూపర్!! ఆఖరిది చాలా నచ్చింది!

    ReplyDelete
  2. "పుస్తకంలా విచ్చుకున్న
    ఆకాశం
    ఎగురుతున్న కాగితంలా
    సముద్రం"

    మంచి పోలికలు.

    ReplyDelete
  3. చాలాబావుంది.
    ఏదో చెప్పాలని అనుకుని, చాలా చెప్పారు!
    ఇంకా నేను చాలామార్లు చదువుకోవాలి.

    ReplyDelete

మీ అభిప్రాయం :