Friday, October 30, 2009

ఇస్మాయిల్ నిబద్ధ కవి కాదా?

మొన్నామధ్య "బుడుగోయ్" గారి బ్లాగులో అనుకుంటాను, ద్వా.నా.శాస్త్రి గారు కవులను, కవిత్వాన్ని నిబద్ధ-అనిబద్ధ అని రెండు రకాలుగా వర్గీకరించినట్లు బొల్లోజు బాబాగారు చెప్పారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ వ్రాసిన కవులను, వారి కవిత్వాన్ని "నిబద్ధం" గాను, తద్విరుద్ధమైన కవులను, కవిత్వాన్ని "అనిబద్ధం"గాను వర్గీకరించినట్లుగా నాకర్ధమయ్యింది.

సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి, అసంబద్ధమైన ఇటువంటి వర్గీకరణలకు పాల్పడే మన విమర్శకులనోసారి ఖండించటం కూడా అవసరమే. ఆ చేత్తోనే మరో మొట్టికాయ మన "కవులకు" కూడా. స్వచ్చమైన కవిత్వం దాదాపు మృగ్యమయ్యింది ఈరోజు. అటు ఛందోబద్ధ కవిత్వమైనా, ఛందోబద్ధం కాని కవిత్వమైనా ఇదే ధోరణి. కవిత్వాన్ని భ్రష్టుపట్టించటంలో ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. అక్కడక్కడ "సుప్రభ" గారి లాంటివారు తప్పించి, ఆటవెలది, తేటగీతులు తెలిసినంత మాత్రానే పండితులుగా పరిగణించబడుతున్నారు. ఇటు, మహాప్రస్థానమో, అమృతం కురిసిన రాత్రో చదివి కలం పట్టేసుకొని కవులమనుకునే ప్రబుద్ధులకూ కొదవలేదు.

అసలు నిబద్ధత అంటే ఏమిటి? ఏసీ గదిలో కూర్చొన్నా, కవిత్వం వ్రాయని రోజు చెమటలు పట్టినట్లుంటుంది అని ప్రకటించే సినారె గారు అదే ఏసీ గదిలో రిక్షావాడి మీదో, రైతు కూలీ మీదనో నాలుగైదు పేజీలు గిలికితే, ఆయన నిబద్ధ కవి కింద చలామణి అయినట్లేనా? ఆ నాలుగైదు పేజీల మీద ఓ నలభై పేజీల "తందనాతానా"లు వ్రాసే డి.ఎన్ శాస్త్రులు నిబద్ధత కలిగిన విమర్శకులుగా పరిగణించబడతారా?

సమాజాన్ని గాలికొదిలేసి, అదే గాలిలో మమేకమై, రాత్రి వచ్చిన రహస్యపు వానలో కప్పల నిశ్శబ్దాన్ని మనకు చూపించే ఇస్మాయిల్ కవిత్వంలో నిబద్ధత లేదా! నినాదాలకే పరిమితమయ్యే నిబద్ధత, కవిత్వం కాగలుగుతుందా? ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి. ఆ సందేహాల మధ్య మళ్ళీ ఇస్మాయిల్ కవిత్వాన్ని చదివితే, నిజమైన మహాకవి - ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించిన శ్రీశ్రీని మించిన నిబద్ధుడైన కవిగా నాకు ఇస్మాయిల్ కనిపించారు. కావాలంటే, ఇస్మాయిల్ వ్రాసిన కొన్ని పద్యాలు చూడండి.

కప్పల నిశ్శ్బదం నుండి :

కాలువ బలిసింది
తన విధులు మరిచింది
వంతెనకి నీడ చూపించటంలేదు

కీచు రాయి చప్పుడుతో
గదంతా నిండిపోయింది
గదిలో నాకు చోటు లేదు

పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది
మళ్ళీ ఎన్ని వందల కాళ్ళవసరమో!

ఊరు నిద్దరోయాక
చెరువు మేల్కొంది.
అర్వాత ఎవరికీ నిద్ర లేదు

ముందు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరించింది చీకటి

చెరువు.
చెరువులో ప్రతిబింబాలు
వాటిని అనుకరిస్తూ గట్టుపై చెట్లు

చెరువు లేకపోతే
చెట్ల నీడల్ని
ఎవరు చేరదీస్తారు?

ఇవి చాలా కొన్ని మాత్రమే. అన్వయించుకోగలిగిన తెలివితేటలు ఉంటే, పైన చెప్పిన ఒక్కో పద్యము సామాజికతనే చెబుతున్నది, చెంప ఛెళ్ళుమని మోగిస్తున్నది.

మన పరిణతికి అనుగుణంగా మనం కవిత్వాన్ని చదివి ఊరుకుంటే బానే ఉంటుంది. అంతేకానీ, అర్ధంపర్ధంలేని వర్గీకరణలతో కవుల గుంపులు తయారు చేయటం వలన ఉపయోగం ఉండదు. కేవలం, పరిమితమైన అవగాహన వల్ల, ఆలోచనా పరిమితుల వలన మాత్రమే ఇలాంటి వర్గీకరణలు చేయటం జరుగుతుంది. వీరి ఆలోచనలో, నినాదాలు గుప్పించి వ్రాసే ప్రతిదీ "నిబద్ధ కవిత్వమనే"!

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అంటే, ఎక్కడికా పోయేది అన్న ఆలోచనే కలుగుతుంది.

ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అంటే, ఆలోచన అక్కడే ముగిసిపోతుంది.

మూల పడి ఉంది గొడుగు
వానలొస్తే కానీ
ఇది వికసించదు

అన్న పై వాక్యాల్లో ఆలోచిస్తున్న కొద్దీ అనేక అర్ధాలు స్ఫురిస్తాయి. ఇదీ నిబద్ధమైన కవిత్వం అంటే. చదువుకునేవాడికి ఆహ్లాదం కావాలంటే అంతవరకే కలిగిస్తుంది. ఆలోచించే వాడికి, సామాజిక అవసరాన్ని కూడా పై కవిత్వం గుర్తు చేస్తుంది. ఇస్మాయిల్ శ్రీశ్రీలా "నిబద్ధ కవి" కాదంటారా?

20 comments:

  1. In my not so humble opinion, Sri Dvana Sastry should not overreach his limits and try to talk about things about which he knows nothing!

    ReplyDelete
  2. I am glad someone else agrees with me. nEnE ee vishayaM meeda pedda vyaasaM raaddaamani baddhakiMchaanu.
    dvaanaaSaastri gaaru paMDituDE kaavoccu kaani vissanna cheppiMdi vEdamani prateedi manaM aMgeekariMcanakhkharlEdu.

    ReplyDelete
  3. లేటుగా చూస్తున్నాను.

    బాగుంది. మీ ప్రశ్న.

    ద్వానాశాస్త్రి గారిని కాసేపు పక్కన పెడదాం.

    నిబద్దత అనిబద్దతల గురించి నా అభిప్రాయాలు బుడుగోయ్ గారి బ్లాగులో చెప్పినట్లే గుర్తు. ఇక్కడ మరో సారి.

    నిబద్దత అంటే అదేదో వ్యక్తిత్వానికి సంబందించిన పదం గా తీసుకోరాదు.
    నిబద్దత కలిగిన కవిత్వం అంటే సామాజిక స్పౄహ ఉన్న కవిత్వం అనే కాదు.
    ఒకని కవిత్వం ఏదో ఒక వాదం చుట్టూ తిరుగుతూ ఆ భావజాలాన్ని మాత్రమే ప్రతిబింబినపుడు ఆ కవిత్వం అలాంటి వాదానికి నిబద్దమై ఉంది అని చెప్పుకోవచ్చు కదా.
    ఉదా. స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం. మో గారి కవిత్వం తీసుకొంటే పోస్ట్ మోడర్న్ ఆలోచనలతో ఉంటుంది. అలాగే కృష్ణ శాస్త్రి గారిది ప్రకృతికి, ప్రణయానికీ, విరహానికి పరిమితమై ఉండటం, శ్రీశ్రీ గారి కవిత్వం కమ్యూనిజ భావాలతో ఉండటం వంటివి. (ఈ వర్గీకరణ ఆయా కవులు వెలువరించిన అధికశాతం కవితల పరిగణలోకి తీసుకొని మాత్రమే)

    ఆయా కవిత్వాలు ఆయా భావజాలాలకు లోబడి సంచరిస్తాయి. బయటకు రాలేవు. గానుగెద్దుల్లా. ఇది అలాంటి కవిత్వాలకు కవులకూ ఒక హేండీకేప్. ఉదా: గద్దర్ ను భక్తిగీతాలు రాయమంటే రాయగలడా? అలాగే కృష్నశాస్త్రిగారు ఎర్రజెండా గీతాలు రాసే అవకాసం ఉందా?

    కనుక ఆయా కవులు ఏదో ఒక భావజాలానికి నిబద్దత కలిగి ఉండి తమ కవిత్వాన్ని వెలువరించారు కనుక నిబద్ద కవులని వర్గీకరించారు.

    ఇక రెండవ రకం
    అనిబద్దత. ఇది కూడా వ్యక్తిగత రిమార్కు ఏమీ కాదు. ఎవని కవిత్వమైతే ఏ వాదాన్ని ఇజాన్నీ ప్రతిబింబించకుండా/పరిమితమౌకుండా/భందింపబడకుండా జీవితం యొక్క అన్ని కోణాల్నీ ఆవిష్కరిస్తూ సాగుతుందో అలాంటి కవిత్వాన్నీ అనిబద్ద కవిత్వం అని ఒక వర్గీకరణ.

    అంటే ఎగిరే ఒక పిట్టకు ఎంత స్వేచ్చ ఉంటుందో ఈ కవికీ అంతే స్వేచ్చ ఉంటుంది. ఒక గానుగెద్దు కాదు. కాళ్లకు రోళ్లు తిరగళ్లు కట్టుకొని తిరగడు. అందుచేతనే ఈతని కవిత్వంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా ఉంటుంది.

    ఈ నిబద్దత అనిబద్దత అనే పదాలు కవిత్వానికి సంబందించినవే తప్ప అదికూడా ఒక వాదానికి లోబడి ఉండా లేక ఏవాదానికి లోబడకుండా స్వేచ్చగా ఉందా అనే విషయమే తప్ప మరొకటి కాదు.

    పైన చెప్పిన అంశాన్ని వర్ణించటానికి నిబద్ద అనిబద్ద అనే పదాలు కాకుండా ఏ పదాలైతే బాగుంటాయో సూచించండి.

    బొల్లోజుబాబా

    ReplyDelete
  4. పైన చెప్పిన అంశాన్ని వర్ణించటానికి నిబద్ద అనిబద్ద అనే పదాలు కాకుండా ఏ పదాలైతే బాగుంటాయో సూచించండి.
    =====

    బాబా గారు -

    అదీ అసలు విషయం. నిబద్ధత అనే పదం ఎటువంటి అర్ధాన్ని ఇస్తుందో తెలుసుకోకుండానే, అలాంటి వర్గీకరణలు చేసారా ద్వా.నా.శాస్త్రిగారు? అదే నిజమైతే, ఎంత మూర్ఖత్వం అని జాలిపడాలేమో!

    వాదాలు, ఇజాలకు అతీతమైనది కవిత్వం. నిజానికి, ద్వా.నా.శాస్త్రిగారి లాంటి విమర్శకులే పరిశోధనల పేరుతోనూ, రివ్యూల పేరుతోనూ కవిత్వానికి ఆయా వాదాలు అంటగట్టారు. దాంతో వచ్చిందే ఈ చిక్కంతా. ఇకపైగా, ఇలా వాదాలు ఉన్న కవిత్వం నిబద్ధత కలిగిన కవిత్వంగాను, వాదాలు లేని కవిత్వం అనిబద్ధ కవిత్వంగాను పరిగణించటం మరో దురదృష్టకర పరిణామం.

    అసలు ఆ రకంగా చూసిన, ఇస్మాయిల్ గారివి నేను ఉదహరించిన కవితలు చదివితే, ఆయనంత సామాజిక కవి మరొకరు లేరనే చెప్పుకోవచ్చు కూడా.

    వీలువెంట, ఈ వ్యాసానికే మరో భాగం వ్రాస్తున్నాను. అప్పుడు మరిన్ని వివరాలు కూడా అందిస్తాను.

    ReplyDelete
  5. మీ బాధేమిటో అర్థం కాలేదు. నిబద్ధ కవులను ద్వానా గొప్పకవులని చెప్పారా? కవిత్వానికి నిబద్ధత అవసరమని అన్నారా?

    బాబా గారు ఇచ్చిన వివరణ చదివాకా ఆ వర్గీకరణను మీరెందుకు వొప్పుకోలేకపోతున్నారు? దానివలన విమర్శకూ, కవిత్వానికీ కలుగుతున్న కీడేమిటి?

    >అన్వయించుకోగలిగిన తెలివితేటలు ఉంటే, పైన చెప్పిన ఒక్కో పద్యము సామాజికతనే చెబుతున్నది
    >ఆలోచించే వాడికి, సామాజిక అవసరాన్ని కూడా పై కవిత్వం గుర్తు చేస్తుంది
    ఈ సామాజిక స్పృహ ఉంటేనే గొప్ప కవిత్వమనే భ్రమలో మీరూ పడిపోతూ దాన్ని బలవంతంగా పులుముతున్నట్లుంది. ఆ రంగు లేనంత మాత్రాన ఇస్మాయిల్ కవిత్వం గొప్ప కవిత్వం కాకుండా పోదు.

    ReplyDelete
  6. మీ బాధేమిటో అర్థం కాలేదు. నిబద్ధ కవులను ద్వానా గొప్పకవులని చెప్పారా? కవిత్వానికి నిబద్ధత అవసరమని అన్నారా?
    =======
    రామాయణమంతా విని రాముడికి సీతేమౌతుందని అడిగినట్లు నా బాధేమిటని చాలా బాగా అడిగారు. మరోసారి చెబుతాను వినండి. సామాజికతతో వ్రాసిందే ’నిబద్ధత’ గల కవిత్వమని ద్వానాశాస్త్రిగారి అభిప్రాయమని బాబాగారు చెప్పారు. ఆ లెఖ్ఖన, పైన నేను ఉదహరించిన ఇస్మాయిల్ గారి కవితల్లో సామాజికత కనిపించకపోవటం ఎవరి గుడ్డితనం? వారి గుడ్డితనానికి గాను, ఇస్మాయిల్ గారిని ’అనిబద్ధ’ కవి అని ముద్ర వేయటం ఏమిటి? అసలు ఆ మాటకొస్తే, కవిత్వాన్ని కవిత్వంగా చూడక... నిబద్ధ కవిత్వమని, అనిబద్ధ కవిత్వమనే వర్గీకరణలు అవసరమా?
    ======
    బాబా గారు ఇచ్చిన వివరణ చదివాకా ఆ వర్గీకరణను మీరెందుకు వొప్పుకోలేకపోతున్నారు? దానివలన విమర్శకూ, కవిత్వానికీ కలుగుతున్న కీడేమిటి?
    =======
    కీడు సంగతి తర్వాత. ఆ వర్గీకరణవల్ల కలిగే మేలేంటో చెప్పండి ముందు.

    ReplyDelete
  7. సాయి కిరణ్ గారూ
    మరోసారి చెబుతాను వినండి. సామాజికతతో వ్రాసిందే ’నిబద్ధత’ గల కవిత్వమని ద్వానాశాస్త్రిగారి అభిప్రాయమని బాబాగారు చెప్పారు.

    పై మాటలు నేనెక్కడా అనలేదు. మీరు నేను అనని మాటలను అన్నట్టు చెపుతున్నారు.

    బుడుగోయ్ గారి బ్లాగులో నేనన్న మాటలు ఇవి (http://budugoy.blogspot.com/2009/08/blog-post_19.html)

    //// "అనిబద్ద కవిత్వం అంటే నిబద్దత లేని కవిత్వం అని కాదు నా ఉద్దేశ్యం.
    ఏ ఇజాలకు/వాదాలకు/ప్రాంతీయతలకు కట్టుబడని కవిత్వం అని. విమర్శకులు కొన్ని వాదాలకు కట్టుబడి ఉండే కవిత్వాన్ని నిబద్ద కవిత్వం అని, అలా కాక, ప్రకృతి, మానవసంబందాలు, నాస్టాల్జియా, స్త్రీపురుష కలయిక, దైవచింతన, సంస్కృతి సాంప్రదాయాలు, సమాజంలోని వైరుధ్యాలు వంటివాటిని వస్తువులుగా తీసుకొని వ్రాసే కవిత్వాన్ని అనిబద్ద కవిత్వం అనీ అంటున్నారు."
    ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకులు డా. ద్వానా శాస్త్రి గారు వాడారు.

    బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను."////


    నేను పైన నా కామెంటులో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసాను ఈ వాక్యం ద్వారా
    నిబద్దత కలిగిన కవిత్వం అంటే సామాజిక స్పౄహ ఉన్న కవిత్వం అనే కాదు.

    కనుక మీకెక్కడో క్లారిటీ తప్పింది. సరిచూసుకోగలరు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  8. బాబాగారు - మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించేయండి. క్లారిటీ అనేది మీరు వ్రాసిన కామెంటులోనే లేదు.
    =======
    శ్రీశ్రీది నిబద్దకవిత్వం. ఒక వాదానికి పరిమితమై ఉంటుంది.
    ఇక ఇస్మాయిల్ గారి విషయానికి వస్తే వీరి శైలి వేరు. వీరు అనిబద్ద కవిత్వం వ్రాసారు.
    =======

    పై వాక్యాలు మీవే. అంతే కాదు. "బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను."

    అని మీరు చెప్పటంలో అసందిగ్ధతే కాకుండా ద్వా.నా.శాస్త్రిగారిని ఇరికించానో ఏంపాడో ఎందుకొచ్చింది ఇలా తప్పుకుందామనే ఆలోచనే కనిపిస్తుంది. మీ సమస్యలు మీకుంటాయి కాబట్టి అది వదిలేద్దాం.

    సరే, నిజానికి ఎవరు వర్గీకరించారు అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే, సి.ఎన్.రెడ్డి చేసినా, డి.ఎన్.శాస్త్రి చేసినా, మరెవరో చేసి ఉన్నా అది తప్పే. అలానే, ఒక భావజాలానికి నిబద్ధుడై వ్రాసినమ్త మాత్రాన గొప్పకవులైపోరు. కానీ, నేను ఉటంకించిన ఇస్మాయిల్ కవితల్లో సామాజికత లేదనే నిర్ణయానికి ఈ ప్రఖ్యాత విమర్శకులు ఎలా వచ్చారు? కవిత్వంపైని వారి అవగాహన ఏమిటనేవి నన్ను తొలుస్తున్న మరికొన్ని ప్రశ్నలు.

    ReplyDelete
  9. బాబా గారు

    అసలు బుడుగోయ్ గారి బ్లాగులో నిబద్ధ, అనిబద్ధ కవిత్వాలంటూ శ్రీశ్రీ, ఇస్మాయిల్ కవితలను బేరీజు వేసింది మీరే. ఆ తర్వాత ఆ విషయాన్నే విమర్శకులు అంటారు అని తేల్చేసారు. ఆ పిమ్మట ద్వా.నా.శాస్త్రి వాడారు అని కూడా చెప్పారు. చివరికి అలా వాడటంలో ఉద్దేశ్యం కమిటల్, నాన్-కమిటల్ అన్నవే వారి ఉద్దేశ్యమయ్యుండవచ్చు అని కూడా మీ వ్యాఖ్యానం చేసారు. క్లారిటి ఎవరికి లేదంటారు?

    ReplyDelete
  10. ద్వానశాస్త్రి గారు ఏం రాసారో తెలవదు. ఈ చర్చను చూసాక ఇది రాయాలనిపించింది. గతంలో బుడుగోయ్ బ్లాగులో జరిగిన చర్చను కూడా అది జరుగుతూండగా చూసాను.

    'ఒక ప్రత్యేక అంశాన్ని లేదా భావజాలాన్ని లేదా వాదాన్ని తీసుకుని రాసేవారు నిబద్ధ కవులు, ఏ ఇజానికీ ఏ వాదానికీ కట్టుబడకుండా రాసేవారు అనిబద్ధ కవులు' అని బాబాగారి ఉద్దేశంగా నాకు అనిపించింది.

    ఆ విధంగా చూస్తే ఇస్మాయిల్‌ను ఆయన గౌరవించారేగానీ చిన్నబుచ్చినట్టు అనిపించలేదు. బహుశా బాబాగారి ఉద్దేశం అపార్థానికి గురౌతున్నదేమో! తాను రాసేదానికి నిబద్ధుడై ఉండడు అనే అర్థం వస్తోంది కాబట్టి, ఈ అపార్థం సహజమే. 'నిబద్ధ', 'అనిబద్ధ' ల బదులు మరో రెండు మాటలను ఎంచుకుంటే పోతుంది.

    ReplyDelete
  11. బాబాగారు, అనిబద్ధ అనకపోతే ఏ లేబిల్ తగిలించాలి అని మంచి ప్రశ్నవేశారు.
    అది బాగా ఆలోచించాల్సిన విషయం. (ఇస్మాయిల్ గారు నాకు ఏ లేబిలూ ఇష్టం లేదని పలుమార్లే చెప్పారు. సరే అకడెమిక్ చర్చకోసం ఏదైనా తగిలించాలి అనుకుంటే బాధ్యతాయుతంగా ఆలోచించి తగిలించాలి.
    ఒక వీధిలో రౌడీ మూక ఉందనుకోండి. వాళ్ళకి జడిసో మరేదో వారందరికీ "బలశాలులని" లేబిల్ తగిలంచారు సరే. మిగిలిన వారందరినీ "నిర్బలులు" అనొచ్చా? ఇలాంటి నెగటివ్ లేబిలింగ్ మీదే నా అబ్జెక్షన్.

    ReplyDelete
  12. నా ఆబ్జెక్షన్ మరోటి కూడా. కవులను, కవిత్వాన్ని వర్గీకరించటానికి నేను వ్యతిరేకం. అది అకడమిక్ చర్చ కోసమైనా కానివ్వండి. కవులను వారు వ్రాసిన కవిత్వంతోనే బేరీజు వేయాలి కానీ, విమర్శకులెవరో చేసిన వర్గీకరణల ప్రకారం కాదు. ఆ మాటకొచ్చినా, పైన పేర్కొన్న పద్యాలలో సామాజిక నిబద్ధత కనిపించటంలేదా? అంటే, విమర్శకులు, విశ్లేషకులు వారు చూడాలనుకున్న విషయాన్నే చూడటం, తదనుగుణంగా వర్గీకరణలు చేయటం ఏమాత్రం సబబు?

    ReplyDelete
  13. సాయికిరణ్ గారు,

    నేను ద్వా.నా.శాస్త్రిగారు రాసింది చదవిన గుర్తు లేదు. బాబాగారు అన్నది, ఇతరత్రా చూసిన కొన్ని సందర్భాలని బట్టి నాకర్థమైనది ఇది:

    1. నిబద్ధ కవిత్వం గొప్పది, అనిబద్ధ కవిత్వం కాదు అని ఎవరూ చెప్పలేదు. ఈ వర్గీకరణ కవిత్వ గుణాన్ని నిర్ణయించేది కాదు.

    2. నిబద్ధ కవిత్వం అంటే సామాజిక స్పృహ/నిబద్ధత ఉన్నది అని అర్థం కాదు. కవికి ఒక సిద్ధాంతం మీద నమ్మకం ఉండి, అది అతని కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తే అతను నిబద్ధ కవి అని అంటారు. ఈ విధంగా విశ్వనాథ కూడా నిబద్ధ కవే. సమాజంతో సంబంధం లేకుండా భక్తి ప్రధానమైన కవిత్వం రాసిన కవులు కూడా నిబద్ధ కవులే.

    3. నాకు తెలిసి సి.నా.రె నిబద్ధ కవి కాదు, అలా చెలామణీ కూడా అవ్వలేదు.

    4. పైన నేను చెప్పిన నిర్వచనం ప్రకారం మీరు ఇస్మాయిల్ గారు నిబద్ధ కవే అని అనుకుంటే, వారి కవిత్వంలో మీకు కనిపిస్తున్న సిద్ధాంతాన్ని వివరిస్తూ ఒక మంచి వ్యాసం రాయండి.

    5. కవిత్వాన్ని ఆస్వాదించడానికో, గుణగణాలని నిర్ణయించడానికో యీ వర్గీకరణలు ఉపయోగపడవు. అలా ఎవరైనా చెయ్యడానికి ప్రయత్నించినట్టుగా మీరు చదివితే మాతో పంచుకోండి. మీతో పాటు నేనూ ఖండిస్తాను. అలాగే పైన నేను చెప్పిన నిర్వచనం కాకుండా వేరే నిర్వచనం ఎవరైనా ఇచ్చింది మీకు తెలిస్తే చెప్పండి. దాని మీద చర్చించ వచ్చు.

    6. కవిత్వ విమర్శ అంటే కవిత్వాన్ని అర్థం చేసుకొనే విశ్లేషణ ఒక్కటే కాదు. కవిత్వ చరిత్ర పరిశోధన (కాలానుగుణంగా కవిత్వంలో వచ్చిన మార్పులని విశ్లేషించడం), సమాజమ్మీద కవిత్వం చూపే ప్రభావ విశ్లేషణ మొదలైనవి కూడా విమర్శే అవుతాయి. అలాంటి విమర్శకి ఇటువంటి వర్గీకరణలు తప్పకుండా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఒక సిద్ధాంతానికి నిబద్ధమైన కవిత్వం ఒక వర్గమ్మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి విశ్లేషణ చేసేవాళ్ళకి ఈ వర్గీకరణలు ఉపయోగపడతాయి. దాని మీద ఆసక్తి లేనివాళ్ళు ఆ వర్గీకరణల గురించి పట్టించుకోనవసరం లేదు.

    ReplyDelete
  14. భైరవభట్ల గారు, మీరు చెప్పిన నాలుగో అంశం గురించి..

    ఇంతకుముందే ఇస్మాయిల్ గారు అనుభూతి కవి అని ఒక లేబిల్ ఉంది. "కరుణ ముఖ్యం" వ్యాసాల్లో ఆయనకీ, ఇంద్రగంటి గారికీ ఈ లేబిల్ ఉందనీ ఆయనే చెప్పారు. ఈ కొత్త లేబిల్ అవసరమేమిటి? లేబిల్ తగిలించిన వారు దానిని అవసరమేమిటో జస్టిఫై చేస్తూ రాయాలి కానీ ఇలా ప్రశ్నించిన వారు కాదు.
    on a side note శ్రీశ్రీ కూడా సినిమా పాటల్లో భక్తి గీతాలు రాశారు మరి. అది ఏ బద్ధత?

    ReplyDelete
  15. బుడుగుగారు,

    నాకా వ్యాసం("అనుభూతి కవిత్వం")లో ఇస్మాయిల్ గారు తనకున్న ఆ లేబిల్ ని అంగీకరించినట్టే అనిపించింది. ఎవరో తమకా లేబిళ్ళు ఇచ్చారన్న అభియోగం కూడా నాకందులో కనబడలేదు. అనుభూతి కవిత్వమంటే ఏమిటో వివరించే ప్రయత్నం చేసారు కదా. ఆ లేబిల్ ని ఇస్మాయిల్ గారే జస్టిఫై చేసేందుకు ప్రయత్నించారని నాకనిపించింది. ఇటువంటి కవిత్వాన్ని రాసిన వాళ్ళలో శ్రీకాంతశర్మగారు, ఇస్మాయిల్ గారే అనుభూతి కవిత్వం వెనకనున్న నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం చేసారు, వ్యాసాల ద్వారా. దానిని ఒక వాదంగా నిరూపించే ప్రయత్నం కూడా చేసారని ఆ వ్యాసాలు చదివిన నాకు అనిపించింది. ఇతర వాదాలు, ఇజాలు నమ్మే కవుల్లాగానే ఈ వ్యాసాల్లో కూడా తాము బలంగా నమ్ముతున్న విలువలని వారు వివరించారు. తమ వాదాన్ని వినిపించాల్సిన అవసరం లేకపోతే వ్యాసాలు రాయాల్సిన అవసరం ఏముంది?

    ఈ అనుభూతి కవిత్వం వెనక ఒక ప్రత్యేకమైన సిద్ధాంతమో, తత్త్వమో ఉన్నాయా అన్నది ఆలోచించవలసిన విషయం. అలాంటిది ఉన్నట్లైతే, అతని కవిత్వం కూడా నిబద్ధ కవిత్వమే అవుతుంది. కాని అలాంటిది ఉన్నదని వారు కాని ఇతర విమర్శకులు కానీ స్పష్టంగా నిరూపించ లేదు. జెన్ బౌద్ధపు ప్రభావం కొంతవరకూ కనిపిస్తుంది కాని అది పూర్తిగా ఆ తత్త్వమ్మీద ఆధారపడిందని కూడా వారుకాని ఇతర విమర్శకులు కాని చెప్పినట్టు లేదు. అంచేత ఇస్మాయిల్, ఇతర అనుభూతి కవులలో అనిబద్ధతే లక్షణమని అనుకోవచ్చు.

    శ్రీశ్రీ గురించి మీరడిగిన ప్రశ్నకి నా సమాధానం మీరు ఊహించగలరు (ఇంతకుముందు చాలామంది ఇలాంటి ప్రశ్నలు వెయ్యడం దానికి సమాధానాలు రావడం జరిగింది కనుక). శ్రీశ్రీని కవిగా గుర్తించే విమర్శకులెవరూ అతని సినిమా పాటలని అతని కవిత్వంలో భాగమని ఎంచరు. సినిమా పాటల వెనక ఎలాంటి సిద్ధాంతమూ ఉండదు కాబట్టి. సినిమాపాటల దాకా ఎందుకు, శ్రీశ్రీ పద్యాలలో భావకవిత్వం కూడా రాసారు. అలాగే కృష్ణశాస్త్రి కూడా భక్తి కవిత్వం రాసారు. మరి కృష్ణశాస్త్రిని భావకవి, శ్రీశ్రీని విప్లవ కవి అని ఎందుకంటారు? నా రెండో పాయింటుని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే దీనికి సమాధానం దొరుకుతుంది.

    ReplyDelete
  16. కామేశ్వర రావు గారు రాశారు:

    ఈ అనుభూతి కవిత్వం వెనక ఒక ప్రత్యేకమైన సిద్ధాంతమో, తత్త్వమో ఉన్నాయా అన్నది ఆలోచించవలసిన విషయం. అలాంటిది ఉన్నట్లైతే, అతని కవిత్వం కూడా నిబద్ధ కవిత్వమే అవుతుంది. కాని అలాంటిది ఉన్నదని వారు కాని ఇతర విమర్శకులు కానీ స్పష్టంగా నిరూపించ లేదు

    -- పై మాటలు చదివిన తర్వాత ఇంత చర్చ అనవసరం. అసలు మీరు అనుభూతి కవిత్వం ఏంటో క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత చర్చలో పాల్గొనండి. అంతకు మించి నేను చెప్పేదేమి లేదు. విమర్శకులు ఇప్పటివరకు దానిపై బానే చర్చించారు. కరుణముఖ్యం, కవిత్వంలో నిశ్శబ్దం తదితర ఇస్మాయిల్ విరచిత పుస్తకాలు చదవండి.

    అనుభూతి కవిత్వమేంటో, దాని వెనక సిద్ధాంతమేంటో తెలుసుకోకుండా చర్చలోకి దిగడం మీ బోంట్లకు భావ్యం కాదు.

    ReplyDelete
  17. బుడుగు గారికి

    కామేశ్వరరావు గారు సౌమ్యులు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషల్లో కోవిదులు. ప్రాచీన ఆధునిక కవిత్వాలపై సాధికారికంగా వ్యాఖ్యానించగల వ్యక్తులలో వారొకరు. వారి శైలి ఎవ్వరినీ నొప్పించకుండా ఎదటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఉంటుంది. తాను చెప్పదలచుకొన్న విషయాన్ని పరుషపదాలతో కాక అన్యాపదేశంగా చెప్పటం వారి పద్దతి.

    "మీరు అనుభూతి కవిత్వం ఏంటో క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత చర్చలో పాల్గొనండి."
    "ఫలానా పుస్తకాలు చదవండి"
    అంటూ ఆయనకు ఉచితసలహాలు విసిరేయటం మీకు మర్యాద కాదు.

    ముందునించీ చూస్తున్నాను. ఎందుకంత టెంపర్మెంట్ మీకు. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని సభామర్యాదను పాటిస్తూ చెప్పండి. మరీ గొంతుచించుకొని అరచెయ్యక్కర్లా. (మునుపెక్కడో నన్నుచాలా వెటకారంతో మహాప్రభో అంటూ సంభోదించారు)ఇలాంటివి అవసరమా అని ఆలోచించుకోండి.

    అనుభూతి కవిత్వానికి సిద్దాంతం ఏముంటుంది. ఒక కవి అన్ని సిద్దాంతాలకు అనుభూతిని పొందవచ్చు. దాన్ని అక్షరీకరించవచ్చు. ఈ మాత్రం తెలియని/గ్రహించలేని మీకు అన్యాపదేశంగా చెప్పినా ఒకటే స్ఫష్టంగా చెప్పినా ఒకటే.

    శ్రీశ్రీ భక్తి పాటలు వ్రాయలేదా అని ప్రశ్నించటం కూడా మీ అవగాహనా రాహిత్యాన్ని తెలియచేస్తుంది. నా మొదటి కామెంటులో "(ఈ వర్గీకరణ ఆయా కవులు వెలువరించిన అధికశాతం కవితల పరిగణలోకి తీసుకొని మాత్రమే)" రాసిన వాక్యం ఇందుకోసమే. మీనుంచి ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వస్తాయనే.
    కవులను వర్గీకరించేటప్పుడు వారు వెలువరించిన అధికశాతం కవితలను పరిగణలోకి తీసుకొంటారు తప్ప ఏవో కొన్ని స్ట్రే కవితలను కాదన్న విషయం మీకు అవగాహన లేకుండా వాదనలోకి దూకేయటం మీకు ఉచితం కాదు.

    "పైన చెప్పిన అంశాన్ని వర్ణించటానికి నిబద్ద అనిబద్ద అనే పదాలు కాకుండా ఏ పదాలైతే బాగుంటాయో సూచించండి."
    అన్న నా ప్రశ్నకు కిరణ్ గారు నాకసలు వర్గీకరణలే ఇష్టం లేవనీ, మీరేమో ఇదేదో ఆలోచించాల్సిన విషయం అనీ కప్పదాట్లు వేస్తున్నారు తప్ప దానిపై కనీస ఆలోచన చేసినట్లు కూడా కనిపించటం లేదు.

    ముందు ఆలోచించండి. విషయ జ్ఞానం సేకరించండి. పంచుకోండి. చర్చించండి. వాదించండి. కానీ ఇలా తూలనాడొద్దు. మీకు మర్యాద కాదు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  18. బుడుగుగారు,
    అవతలవాళ్ళు వెఱ్ఱివాళ్ళని నిరూపించి చర్చనుంచి తప్పించుకోడానికి ఇదొక బ్రహ్మాండమైన టెక్నిక్ :-) సరే కానీండి. నాబోటి మందబుద్ధులకి ఆ సిద్ధాంతాన్ని వివరించే ఓపిక మీకు లేదు. ఏంచేస్తాం, నా దురదృష్టం!
    ఒక్కమాట. ఏదో సామెత చెప్పినట్టు, అనుభూతికవిత్వమంటే ఏమిటో, దాని వెనకనున్న సిద్ధాంతం ఏమిటో "మీలాగ" "సరిగ్గా" అర్థమే చేసుకుంటే ఇంక చర్చ అవసరమే ఉండదు కదా, ఒకళ్ళ భుజాలొకళ్ళు తట్టుకోడం తప్ప!

    మళ్ళీ చెపుతున్నాను. మీరు కాని సాయికిరణ్ గారు కాని, అసలు ఇస్మాయిల్ నిబద్ధకవా కాదా, అయితే ఆ నిబద్ధత వెనకాలున్న సిద్ధాంత మేమిటో స్పష్టంగా ఓ వ్యాసం రాస్తే ఆనందించేవాళ్ళలో నేను ముందుంటాను.

    సెలవు.

    ReplyDelete
  19. మర్యాదపూర్వకంగా చర్చించడం కూడా సాహిత్యమూ, ఈ కవిత్వమూ (ఉద్యోగాల చదువులూ, తెలుగునాట రాజకీయలూ వదిలేయండి) నేర్పించలేకపోయాయంటే దిగులేస్తూంది. తర్కంలో బలం లేనప్పుడే ప్రతివాదిని కించపర్చడం జరిగేది. ad hominem fallacy నుంచి విముక్తి ఎప్పుడు?

    ReplyDelete
  20. బాబా గారు,

    వ్యక్తి అర్హతల గురించి చర్చ ఇక్కడ మనకు అనవసరం. ఎలాగూ ప్రస్తావన తెచ్చారు గాబట్టి ఓ మూడు ముక్కలు. కామేశ్వరరావు గారిని పదేళ్ళుగా ఇంటర్‌నెట్‌లో చూస్తునే ఉన్నాను. ఆయనమీద నాకు సౌజన్యారావు పంతులు గారి మీదున్నంత గౌరవం. పద్యసాహిత్యమ్మీద ఈమాటలో రాసిన వ్యాసాలను చదివి నేనూ అహా ఓహో అనుకున్నవాణ్ణే. అందుకే "మీ బోంట్లకు భావ్యం కాదు" అని రాసాను. ఇక ఆధునిక సాహిత్యమ్మీద ఆయన సాధికారికత మీద, ఆంగ్ల భాష కోవిదులో కాదో అన్న విషయమ్మీద నా రిజర్వేషన్స్ నాకున్నాయి. ఇవి ఈ చర్చకనవసరం. first let us learn to call spade a spade and not get into unnecessary hyperboles.
    ద్వానాశాస్త్రి గారే కానీ, మరెవరైనా గానీ, మూడు భాషల్లో పీ.ఎచ్.డీ లున్నా గానీ , గుడ్డిగా ఆయన చెప్పినవన్నీ నమ్మాల్సిన పని లేదన్నది అందరూ ఒప్పుకుంటారనుకున్నాను.

    ఇక ఈ చర్చ ముందుకు సాగాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ ద్వానాశాస్త్రి గారి వ్యాసాన్ని మీ బ్లాగులో ప్రకటించండి. ఆ తర్వాత చర్చను కొనసాగించొచ్చు. అప్పటి వరకూ నేనైతే ఈ చర్చనుండి తప్పుకుంటున్నాను.

    అలాగే మీరు ఇంత వరకు చేసిన చర్చలో ఒక మాటను నేను సమర్తించి ఆలోచించాల్సిన విషయం అని అంటే దాన్ని కప్పదాట్లు అంతున్నారు. ఇది ఏ పాటి సభామర్యాద? నాకు ఎటువంటి కప్పదాట్లు వేయాల్సిన అవసరం లేదు. నేను ఏ భాషా కోవిదుణ్ణి కాదు గాన, సరైన పదం తోచే వరకు మిన్నకుండిపోయాను. "రాముడు దొరక్కపోతే శ్యాముడితో సరిపెట్టుకోమా?" అని అడిగేవారట వివేకానందులు. సరైన లేబిల్ దొరకనంత మాత్రాన ఆయన్ని అనిబద్ధ కవి అంటే మాత్రం ఒప్పుకునేది లేదు.

    అయ్యా కామేశ్వరరావు గారు,
    "అవతలి వాళ్ళు వెర్రివాళ్ళని నిరూపించి చర్చనుంచి తప్పించుకోడానికిదో టెక్నిక్."
    మిమ్మల్ని ఏదోగా నిరూపించి నేనేం భావుకున్నదీ లేదు. అలాగే ఈ చర్చనుంచి నేను తప్పుకోవాలనీ అనుకోవట్లేదు. ఆధునిక సాహిత్యమ్మీద సాదికారికంగా వ్యాఖ్యానించగలమీరు అనుభూతి కవిత్వానికి ఒక సిద్ధాంతమూ లేదూ ఓ ప్రాతిపదిక లేదూ అన్నట్టు మాత్లాడుతుంటే మీరూ నేనూ చదివేది ఒకే పుస్తకమేనా అని అనుమానం వచ్చింది. నేను ఖచ్చితంగా మీరడిగిన వ్యాసం రాసి బ్లాగులో ప్రచురిస్తాను. దానికి ముందుగా నాకు మాత్రం రెండు వ్యాసాలు కావాలి.
    1) బాబా గారి నుండి - ద్వానా శాస్త్రి గారి వ్యాసం. (ఆ వ్యాసమేమిటో చదవకుండా ఇంత చర్చ అనవసరం).
    2) అనుభూతి కవిత్వం మీద మీ సాధికారిక వ్యాఖ్య. (ఏ సిద్ధంతమూ, ప్రాతిపదిక లేకుండా దాన్నెందుకు ఒక ప్రత్యేక కవిత్వంగా భావిస్తున్నారో వివరించగలిగితే మరీ మంచిది) (అలాగే చర్చ కొన్సాగించేముందు మీరు ఇంతకు ముందు చదివుండకపోతే 1) కవిత్వంలో నిశ్శబ్దం 2) కరుణ ముఖ్యం 3) ఇస్మాయిల్ కవిత్వం 4) సలాం ఇస్మాయిల్ పుస్త్కాలు చదవగలరు. బాబా గారు, కిరణ్ గారు చదివారు గావున మనమందరి చర్చకు ఒక పునాది ఉంటుంది. అలాగే నాకూ ఏవైనా పుస్తకాలు సూచిస్తే ధన్యుణ్ణి. )

    ఇవి మీరు ప్రకటించాక, ఇస్మాయిల్ గారు ఎందుకు అనిబద్ధ కవి కాదో, ఆయన ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారో నా బ్లాగులో ప్రచురిస్తాను.

    అప్పటి వరకూ ఈ చర్చకు సెలవు.

    ReplyDelete

మీ అభిప్రాయం :