మొన్న ఒకానొక చర్చలో బొల్లోజు బాబా గారు కొన్ని ఆసక్తికరమైన సందేహాలు లేవనెత్తారు. ఆయనకు సమాధానమైతే కాదు కానీ, ఆ సందేహాల ప్రేరణే ఈ వ్యాసం.
బాబా గారు లేవనెత్తిన సందేహాల్లో మొదటిది "కవిత్వం అర్ధం కావాలా అఖ్ఖరలేదా?" దీనికి సమాధానం చాలా సరళం. అర్ధం కావాల్సిందే. మరి, కవిత్వం అర్ధం కాకపోవటానికి కారణమేమిటి? నేనాలోచించే పరిధిలో దీనికి కారణాలు రెండు. ఒకటి కవిలో లోపం. రెండు పాఠకుడిలో లోపం. చెప్పాలనుకున్న భావాన్ని, చెప్పాల్సిన భాషలో చెప్పలేకపోవటం కవి పరంగా లోపం. వ్రాసిన కవి విడమరిచి చెబితే కానీ, అర్ధం చేసుకోలేకపోవటం పాఠకుడి లోపం.
అంటే, భాష సరళంగా ఉన్నంత మాత్రాన కవిత్వం అర్ధమౌతుందా అనడిగితే, కాదనే చెప్పాలి. సరళమైన భాష ఉన్నా, మితి మీరిన సంక్లిష్టత కవిత్వానికి అర్ధం లేకుండా చేస్తుంది. సందర్భం ఎలాగూ వచ్చింది కాబట్టి, సరళమైన భాషలోనే ప్రజలు మెచ్చిన కవి "శివారెడ్డి" వ్రాసిన ఈ కవితనోసారి చదువుదాం.
నేనొక బర్రె పక్కలో
నేనొక బర్రెపక్కలో పడుకోగలను
దాని పొదుగులో తలదూర్చి నిద్రించగలను
దాని శరీరం నుంచి వచ్చే నులివెచ్చని కాంతిలో
నన్ను నేను శుద్ధి చేసుకోగలను
ఒక జీవి
ఇంకొక జీవి
ఒక జీవి ఇంకొక జీవిని
ముట్టుకోవటం
స్పర్శోపాధిని వెతుక్కోవటం
ఒకదానికొకటి తోడు
అదొక ధైర్యం, అదొక ఆనందం, అదొక అప్యాయత
నేనుగాక
మరొకరున్నారనే ఒక భద్రత
సహజీవనం, సహచరత్వం
ఆనందమేమిటి
నాకు దగ్గరగా మరొకరుండటం
నాలాగ మరొకటి బతికుండటం
ఒక నది
నాలోనూ, దాన్లోనూ కదలాడటం
నా బర్రెని నేను ప్రేమిస్తాను
నా కుక్కని నేను ప్రేమిస్తాను
నేను, నా దొడ్లో లావణ్యంగా, నేర్పుగా
చెట్లమీద తిరిగే
అందాల పసికర పాముని ప్రేమిస్తాను
నా కాళ్ళకు చుట్టేసుకుని
నా మీదకు ఎగబాకే నా కుక్కపిల్ల కంటే
ఈ ప్రపంచంలో మరొకటి గొప్పదని
నే భావించటం లేదు
నేను దాన్ని వింటున్నా, చూస్తున్నా
అది నన్ను వింటుంది, చూస్తుంది
నేనొక బర్రె పక్కలో పడుకుని
దాని పొదుగులో తలదూర్చి నిద్రిస్తూ -
తెల్లని మేఘాల మీద
వెచ్చని లోకాల్లో నిర్భీతిగా విహరిస్తున్నా
కవితగా చలామణి అయిన పై రచనలో, భాష సరళమే. కానీ భావ సంక్లిష్టత గమనించండి. కవి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇది కవిత్వమా? లేక బర్రె మీది వ్యాసమా? మహామహులనుకుంటున్న కవులే ఈరకంగా వ్రాసి కవిత్వమని మభ్య పెడుతుంటే, ఇక మన బ్లాగుల్లో వచ్చే సోకాల్డ్ కవిత్వం గురించి బాధపడటం అవసరమా?
* * *
అర్ధంకానిదల్లా అద్భుతమైన కవిత్వం అని ఎలాగైతే చెప్పలేమో, అర్ధమైన ప్రతిదీ అద్భుతమని కూడా చెప్పలేం. మన శివారెడ్డిగారి మరో ఉదాహరణ చూడండి.
ఇది నాకూ నా కుక్కకి సంబంధించిన పద్యం
ఎవడి కుక్కను వాడు ప్రేమించవచ్చు, ఎవడి పెళ్ళాన్ని -
వాడు ప్రేమించినట్టుగానే
లేదు ఎవడి కుక్క వాణ్ణి ప్రేమిస్తుంది
ఎవడి పెళ్ళాం వాణ్ణి - ప్రేమించినట్టుగా -
కానీ చాలాచోట్ల పెళ్ళాం పిల్లలు ప్రేమించకపోయినా
కుక్క మాత్రం తప్పక ప్రేమిస్తుంది -
ఒక్క ముద్దేస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ గుర్తు పెట్టుకోకపోవచ్చు
కానీ, కుక్క మాత్రం గుర్తు పెట్టుకుంటుంది
ఎన్నిరకాలుగా, ఎన్ని భంగిమలతో, ఎన్ని శబ్దాలతో
దాని ప్రేమనీ, కౄతజ్ౙతనీ వ్యక్తపరుస్తుంది !
తప్పకుండా నువ్వు మేలుచేసినవాళ్ళు నీకు శత్రువులుగా మారొచ్చు
కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్క మాత్రం శత్రువవదు
కౄతఘ్నత అంతకన్నా చూపదు
ఇక్కడే కదా అది చనిపోయింది, క్షణంలో అందకుండా వెళ్ళిపోయింది
క్షణం ముందు దాకా నా భుజాలదాకా ఎగిరి,
నన్నల్లరి పెట్టి గొడవ చేసిన కుక్క విచిత్రంగా చనిపోయింది.
ఇక ఇప్పుడు మీరు నిర్భయంగా, నిస్సంకోచంగా గేటు తీయవచ్చు
నేను కూడా ఏ మూలనుంచో ఎగబడుతుందనే బెరుకు లేకుండా
గేటు తీయవచ్చు -
బహుశా అన్ని చావులకి అలవాటు పడిన మీకు కుక్క చావు
గొప్ప కాకపోవచ్చు
కళ్ళ ముందు మనిషిని మాయం చేస్తే పట్టించుకోని మీకు
ఒక కుక్క చావు గొప్ప కాకపోవచ్చు
అన్నింటికీ అన్ని కదలికలకీ మొద్దుబారిపోతున్న మీకు
కుక్క చావు గొప్ప విషయం కాకపోవచ్చు
కుక్కే కాదు ఏదీ కూడా మనల్ని కదిలించలేకపోవచ్చు
కంటనీరు పెట్టించకపోవచ్చు
యంత్రాలస్థితికి మనల్ని తెచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు
చెబుతూ నా కుక్క గురించి చెబుతా -
ఓ పొద్దుటి ఆ పూట నాలుగు చినుకులు పడేటప్పుడు
ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమో ఓ మూల మునగ తీసుక్కూర్చుంది
అంతే అప్పటి నుంచి మొదలైంది మా స్నేహానుబంధం
ఓ ముద్దకి నిష్కల్మషంగా ప్రేమించే కుక్కపోతే
దు:ఖపడనివాడు జీవితంలో దేనికి మాత్రం దు:ఖపడతాడు ?
చనిపోయి పదిరోజులైనా దాని తాలూకు స్పౄహ నన్ను వీడడం లేదు
అన్నింటికంటే ముఖ్యంగా చావెంత తేలికైపోయిందోనన్న భయం
ఎక్కడైనా, ఎవణ్ణయినా నిరభ్యంతరంగా వాళ్ళు చంపేయవచ్చు
పేపర్లలో చూస్తాం, ఓ క్షణం ఆగి అలాగా అని వెళ్ళిపోతాం
చావును అలవాటు చేస్తున్న వ్యవస్థకు జోహార్లు
సవాలక్ష సామాన్య విషయాల్లో చావు కూడా ఒకటని
మనకి ఎక్కిస్తున్న రాజ్యానికి జోహార్లు
అది సహజమరణమైతే, పండి రాలిపోవడమైతే నాకు బాధ లేదు,
పేచీ లేదు
ఎదుగుతున్న మొక్క మధ్యలోనే తుంచబడుతుంది
ఇప్పుడే కళ్ళ ముందు కదలాడినవాడు అంతర్థానమౌతాడు
చలనంలేని స్థితికి మనల్ని తెస్తున్న ప్రభుత్వానికి జోహార్లు
ఏ స్పందనా లేని మామూలు రాతి జీవితానికి మనని అలవాటు చేస్తున్న
క్రమబద్ధ విషప్రయోగ స్వాములకీ జోహార్లు
పాదాల దగ్గర మొదలై క్రమక్రమంగా ప్రతి అవయవం
చచ్చిపోతున్న స్థితిలో
నేను నా కుక్కని గురించి మాట్లాడడం నేరమే
మాట్లాడడమే దేశద్రోహమయ్యే స్థితిలో
నేను ఏ కుక్కను గురించి మాట్లాడినా నేరమౌతుంది
ఒక అప్రాణితత్వం మనలో పాదుకొంటున్న సమయంలో
ఒక అచేతనత్వం ఒక అమానుష్త్వం జీవితానికి
పర్యాయపదమయ్యే సన్నివేశంలో
కంటనీరు పెట్టడం నేరమే, ఆఫ్ట్రాల్ ఒక జాగిలం కోసం
విలవిల్లాడ్డం ఘోరమైన నేరమే
నాకు తెలియక అడుగుతాను -
కుక్కకీ, మనిషికీ ఏమిటీ తేడా ఇక్కడ?
* * *
అయ్యా ఇదీ సంగతి. భాషా సరళమే, భావమూ సరళమే. కానీ ఇది అద్భుతమైన కవిత్వమా లేక కుక్కపైని మొదటి సగం వ్యాసమా?
సరిగ్గా ఇలాంటి సమయంలోనే "అనంతం"లో శ్రీశ్రీ వ్రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తాయి.
తెలుగువాడి జాతీయగుణం ఓర్వలేనితనం. తెలుగువాడి జాతీయ కార్యక్రమం కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెట్టడం. కానీ, తెలుగుదేశంలో ఒక గొప్పతనం కూడా ఉంది. అదేమంటే, తెలుగుదేశంలో అందరూ కవులే.
ఏ చండశాసనుడికీ లేని శక్తి భాషకి ఉంది. భాషలో కూడా రాజులు, బానిసలు ఉన్నారు.
ఉద్రేకాలను రెచ్చగొట్టడం ఒకటే కవితాధర్మం కాదు. మనిషి ఆలోచించే జంతువు కాబట్టి, అతని కవిత కూడా ఆలోచనలు రేకెత్తించాలంటాను నేను. (శ్రీశ్రీ)
ఈనాడు కుటుంబ నియంత్రణకన్నా ముఖ్యం కవిత్వ నియంత్రణ అని నాకనిపిస్తుంది. (శ్రీశ్రీ)
మాటలకి సొంత విలువ లేదు. వాటిని పేర్చినప్పుడు కొంత విలువ వస్తుంది. పేర్చినంత మాత్రానే కవిత్వం కాదు. పేర్పు పేర్పులోంచి బయలుదేరే ఒకానొక వేడి - అదే మాటలను క్రియలుగా మార్చగలిగేది. అదే కావాలి. మాటలు మిగలకు. పొయెట్స్ ఆర్ ద ఇంజనీర్స్ ఆఫ్ ఎమోషన్, నాట్ ఇట్స్ విక్టింస్. కవిత్వం అంటే మాటలా?
మీరు మొదటి కవితలో బర్రె బదులుగా
ReplyDeleteఒక నల్లటి
పెద్ద స్తనాలు గల
ఒక అమ్మాయిని ప్రతిక్షేపించండి
అప్పుడు అది కవిత - మీకు అర్థం అయిన కవిత అవుతుందా
mIrannAru:
ReplyDelete"నేనాలోచించే పరిధిలో దీనికి కారణాలు రెండు. ఒకటి కవిలో లోపం. రెండు పాఠకుడిలో లోపం. "
ఇంకో కారణం ఉంది - అది కవికీ పాఠకుడికీ మధ్య పూడ్చలేని అగాథం .. భావాల వల్లనో, రాసిన పద్ధతి వల్లనో, రుచి వల్లనో .. ఇందులో ఇద్దరి లోపమూ లేదు. ఉదాహరణకి, "నాకు కవిత్వం ఇష్టం" అనుకునే అందరికీ మను చరిత్ర అర్ధం కాదు, మహాప్రస్థానం అర్ధం కాదు, ఎలియట్ రాసిన వేశ్ట్లాండ్ అంతకంటే అర్ధం కాదు. కొన్ని కొన్ని కొందరికోసమే. అన్నీ అందరికీ కాదు.
శివారెడ్డి గారి సంగతి పక్కన పెడితే (ఆయన రాసిన నాస్టాల్జియా పద్యాలు నాకు చాలా ఇష్టం) కవిత్వంలో (ఆ మాటకొస్తే ప్రతీ ఫీల్డులోనూ) కొన్ని గుంపులు ఏర్పడి కొందరు మీడియోకర్ టేలెంట్ మనుషుల్ని బుజాలకెత్తుకుని మొయ్యడం జరుగుతోందన్న మీ పాయింటు నేనంగీకరిస్తాను.
"నాకు కవిత్వం ఇష్టం" అనుకునే అందరికీ మను చరిత్ర అర్ధం కాదు, మహాప్రస్థానం అర్ధం కాదు, ఎలియట్ రాసిన వేశ్ట్లాండ్ అంతకంటే అర్ధం కాదు. కొన్ని కొన్ని కొందరికోసమే. అన్నీ అందరికీ కాదు.
ReplyDelete====
చాలా కరెక్టుగా చెప్పారండి. ఆ లిస్టులో ’కవితా ఓ కవిత’ కూడా చేర్చవచ్చు.
చక్కగా ఉంది వ్యాసం;మంచి హాస్యం పుట్టించారు.ఈ మాత్రం వ్యాసాలు అప్పుడప్పుడూ వస్తూ ఉంటే గాని చురుకు పుట్టదు.ఇలాంటి కవిత్వాలకు అవార్డులు కూడా వస్తాయంటే మన కవిత్వం /విమర్శ ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.నానీలమీద రాయండి;ఒక వేళ ఇదివరకే రాసి ఉంటే తెలపండి.
ReplyDeleteతమ్మినేని యదుకుల భూషణ్.
good analysis. mIku caalaa Opika aMta Taipu ceyyaTaaniki.
ReplyDeletemadhyalO jIvitaM pai virakti kalagalEdaa? :-)
bollojubaba
:))
ReplyDelete