రేపటికి ముంబాయి దాడులు జరిగి సరిగ్గా సంవత్సరం. సంవత్సరం క్రితం మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో అదే ఇప్పుడూ ఉంది. దాడులలో పట్టుబడ్డ "కసబ్" అలానే ఉన్నాడు. పాకిస్తాన్ అప్పుడు ప్రకటించినట్లుగానే, మరిన్ని సాక్ష్యాలు కావాలని ఇప్పటికీ అంటున్నది. పాకిస్తాన్ కు ఇచ్చిన సాక్ష్యాలు సరిపోతాయన్న మాటే, మన ప్రభుత్వమూ ఇప్పటికీ అంటున్నది. తీవ్రవాదుల మీద పాకిస్తాన్ సత్వరమే చర్యలు తీసుకోవాలని అమెరికా ఇప్పటికీ హూంకరిస్తుంటే, అలా బెదిరించమని ఇండియా ఇంకా దేబిరిస్తూనే ఉంది.ఈ కేసుకు సంబంధించి, పోలీసుల, కోర్టుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని చాటిచెబుతూ భారత ప్రభుత్వం విడుదల చేసిన సాక్ష్యాలు, కసబ్ ను దోషిగా నిర్ధారించటంలో ఎందుకు ఉపయోగపడటంలేదో మనకు అర్ధం కాదు.
సంవత్సరకాలంగా మారని ఈ పరిస్థితుల మధ్య, మారింది ఒక్క పౌరుడే. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగిన ఈ పౌరుడే, ఇప్పుడు బితుకు బితుకు మంటూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు, ప్రతి తీవ్రవాద ఘాతుకం తర్వాత, పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసిన పౌరుడు, ఇప్పుడు నిస్సత్తువగా ఉన్నాడు.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాల కింద అణచివేస్తామన్న ఆనాటి ప్రధాని, తన గుండెకు పడిన గాయానికి చికిత్స చేయించుకొని మళ్ళీ ప్రధాని అయ్యాడు. దేశానికి తూట్లుపొడుస్తున్న తీవ్రవాదాన్ని అంతమొందించటానికి తీసుకున్న చర్య మాత్రం ఒక్కటీ లేదు.
తీవ్రవాదుల దాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ ను వేలెత్తి చూపించి సరిపెట్టేసే ప్రభుత్వం, దేశద్రోహులకు, వారి మతానికి లంకె పెట్టి పార్లమెంటు దాడి కేసులో ఉరిశిక్షపడిన "అఫ్జల్ గురుకు" ఇంత వరకూ శిక్ష అమలు పరచని ప్రభుత్వం, "కసబ్" విషయంలో ఎలా రాజకీయాలు ఆడగలదో ఊహించుకోటానికే సిగ్గు వేస్తుంది. మైనారిటీ దేశద్రోహులను, వారికి వంతపాడే రాజకీయాలను చేష్టలుడిగి ఇంకా అలా చూస్తూనే ఉన్నారు మెజారిటీ దేశభక్తులు! దేశభక్తుల సహనాన్ని దేశప్రభుత్వమే పరీక్షించటం మన లౌకిక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం!
మతాన్ని రాజకీయాలతోను, దేశంతోను ముడిపెట్టిన జిన్నా వారసులు జాతీయ చిహ్నాలను అవమానించటం మొదలేసినప్పుడే వాటిని ఆపే ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చి ఉండేవి కావు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల దారుణ ఊచకోతకు స్పందించని, హిందువుల ఓట్ల కోసం అయోధ్యలో శిలాన్యాసం చేసి తదనంతర పరిణామాలలో బాబ్రీ మసీదు కుప్పకూలిపోవటానికి పరోక్ష కారకుడైన రాజీవ్ గాంధీ సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మన దేశంలో మతవిద్వేషాలు ఈ తీరుగా చెలరేగేవే కావు.
అఫ్జల్ గురు ను విడుదల చేయకపోతే, కాశ్మీరులో హింసాకాండ చెలరేగుతుందని భయపెట్టే గులాంనబీ అజాద్ లాంటి ముఖ్యమంత్రులు, రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించమనే షాబుద్దీన్ లు, వందేమాతరాన్ని పాడము అని తేల్చి చెప్పే ఉలేమాలు - రేపు జాతీయ గీతాన్ని, జాతీయ జండాను కూడా అవమానించినా లౌకిక ప్రజాస్వామ్య దేశంలో అవి మైనారిటీ హక్కుల కిందే జమ చేసే నీతిలేని రాజకీయ జాతులున్న ఈ దేశంలో ఆ విషయాలు వేలెత్తి చూపినా తప్పే.
అపి స్వర్ణమయి లంకానాం నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి
మాతృదేశం కన్నా, మతానికి విలువనిచ్చే ప్రతి దౌర్భాగ్యుడూ దేశద్రోహే. వాళ్ళని తరిమి కొట్టనంతవరకూ ముంబాయి తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
ముంబాయి మృతవీరులకు శ్రద్ధాంజలులతో...
>>మాతృదేశం కన్నా, మతానికి విలువనిచ్చే ప్రతి దౌర్భాగ్యుడూ దేశద్రోహే.
ReplyDeleteWell said sir. I agree with every line of your post.
మితిమీరిన దేశభక్తి కూడా మతమౌఢ్యం లాటి జాడ్యమే అని నమ్ముతా నేను.
ReplyDeleteకానీ ఇక్కడ ప్రసక్తి అది కాదు. ప్రపంచం విస్తుపోయి చూసేంత ఘాతుకం జరిగాక, సంవత్సరం గడిచినా - దేశ భద్రత రక్షణ గురింఛి పట్టుదల, నిందితులపై సత్వర న్యాయవిచారణ, తగిన శిక్ష - ఇలాంటివేవీ ప్రభుత్వ నాయకులు ఏమాత్రమూ పట్టించుకున్నట్టు కనబడక పోవడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎంతసేపూ మాటల కత్తి ఝళిపింపులు తప్ప క్రియా శూన్యం, శక్తి శూన్యం. ప్రజలు, ప్రజా సంఘాలు ఈ విషయమై ప్రభుత్వాన్ని బలంగా నిలదియ్యాలి
ఈ దేశం ఎటు పోతోందో తెలియట్లేదు. కొన్నేళ్ళ క్రితం, రాజకీయనాయకులు ఏదో వాళ్ళమానాన వాళ్ళు దోచుకుతింటూ, పేదవాడిని, మధ్యతరగతి వాడిని అలా బతకనిచ్చేవారు.ఇప్పుడు సాధారణ ప్రజల జీవితం కూడా చెలగాటమయిపోయింది.
ReplyDeleteచనిపోయిన జవాన్ల ఆత్మలు కూడా సిగ్గుతో తలవంచుకుంటాయి వీరి నిర్వాకాలు చూసి.