Monday, November 30, 2009

ఉద్యమాన్ని నీరుగార్చిన కె.సి.ఆర్.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు సంవత్సరానికి తెలంగాణా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తమయ్యింది. "నీ బాంచన్ దొర" అన్న బానిసలే, విప్లవాగ్నులై ప్రజ్వరిల్లి, ఉప్పెనలా పోటెత్తి, నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతావనిలో తెలంగాణాను భాగం చేసారు.

ఆనాడు, స్వతంత్ర భారతంలో పరాధీనగా మిగిలిన "కోటి రతనాల వీణ" చేసిన ఆ సాయుధపోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, ఈరోజు కె.సి.ఆర్. వలన బూడిదలో పోసిన పన్నీరైనాయి. అంతకు మించిన ఆవేదన ఏమిటంటే, ఈ రోజు "ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం కే.సి.ఆర్. లాంటి నేత వలన ఓ జోక్ గా మిగిలిపోయింది.

ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు విరుద్ధంగా "విశాలాంధ్ర" ఏర్పడిందనేది సత్యం. ప్రస్తుతానికి ఆ విషయం జోలికి పోకుండా, ఒక ఉద్యమాన్ని కె.సి.ఆర్. తన స్వార్ధ రాజకీయాల కోసం, ఎలా పక్కదోవ పట్టించింది ఓసారి నెమరువేసుకుందాం.

పోరాటంతో సాధించాల్సిన తెలంగాణాను, అడుక్కుని, దేబిరించే స్థాయికి దిగజార్చిన ఘనుడు కె.సి.ఆర్. ప్రత్యేక తెలంగాణాయే లక్ష్యంగా ఆవిర్భవించిన తె.రా.స., కె.సి.ఆర్. నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తప్పటడుగులు వేస్తూనే వచ్చింది.

చెన్నారెడ్డి నేతృత్వంలో కొనసాగిన తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎలా నీరుకార్చిందో తెలిసినా, ఏ నమ్మకంతో కె.సి.ఆర్., ముందుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారో ఇప్పటికీ అర్ధం కాదు. అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాతైనా పరిస్థితులు సమీక్షించుకోకుండా ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవుల కోసం సాగిలపడ్డ విషయం ఇంకా మరచిపోలేదు.

ఏ విభాగమూ లేకపోయినా మంత్రి పదవిలో కొనసాగిన కే.సి.ఆర్. ఆనాటి కేంద్రప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణా చేర్చాలని ఎందుకు పోరాడలేదు?

ప్రజాస్వామ్య దేశంలో పది రకాల అభిప్రాయాల కన్న, మెజారిటీ అభిప్రాయానికే విలువ ఎక్కువన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పింది ఏమాశించి?

తెలంగాణా పై నిజాయితీ నిరూపించుకుంటానని, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న నేత, అర పూట కూడా ఉపవాసం ఉండలేక, అప్పటి లోక్ సభ స్పీకర్ మొహమాటానికి అన్నదే తడవుగా దీక్ష విరమించుకోలేదా? చిత్తశుద్ధి లేకుండా చేసే చండీ యాగాల వలనా తెలంగాణా వచ్చేది?

తెలంగాణా ప్రజలు, నిజంగానే తనను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమాదరిస్తారనుకుని ఉంటే, నిరుటి ఎన్నికలలో తె.దే.పా., కమ్యూనిస్టులతో చేతులు ఎందుకు కలపటం? ఒంటరి పోరు ఎందుకని సాగించలేదు. తన నిజాయితీని తెలంగాణా ప్రజలు అంతకు మునుపు జరిగిన ఉప ఎన్నికల్లో శంకించారని తెలుసు కాబట్టే, ఇతర పార్టీలతో జట్టు కట్టింది అనే విషయం అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు తెలంగాణా ప్రజలు.

తన నిజాయితీ మీద, తెలంగాణాపై తన నిబద్ధత మీద ప్రజలకు నమ్మకం లేదని గ్రహించబట్టే, గ్రేటర్ ఎన్నికల్లో తె.రా.స. పోటీ చేయకుండా కె.సి.ఆర్. అడ్డుపడ్డాడనేది వాస్తవం కాదా?

తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్. సచ్చుడో అన్న నాయకుడు, నెల రోజుల ముందరే ఆర్భాటంగా ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్షకి ఇప్పుడు కూడా అదే గతి పట్టటం ఆశ్చర్యం కాదు.

చేవలేని నాయకుడు చేసే పోరాటం వల్ల, ఆ ఉద్యమమే భ్రష్టు పట్టే అవకాశం ఉంటుందని కె.సి.ఆర్. నిరూపించాడు. కె.సి.ఆర్. చేత బలవంతంగా రాజకీయ సన్యాసం చేయించి, పొట్టి శ్రీరాములు లాంటి మరో నిస్వార్ధ నాయకుడిని ఎన్నుకోవటం వలన మాత్రమే, ప్రత్యేక తెలంగాణా సాధ్యమౌతుందని తెలంగాణా ప్రజలు గ్రహించాలి.

10 comments:

  1. without K.C.R., Telengana agitation cannot sustain. there is no other leader who can rouse Telengana sentiments.

    ReplyDelete
  2. దాదాపు ముప్ఫై గంటల పోలీసు కస్టడీలో ఏమై ఉంటుంది? హఠాత్తుగా దీక్ష విరమించుకున్నట్లు కె.సి.ఆర్. ఎందుకు ప్రకటన చేసాడు? ఆ తర్వాత, హరీశ్ రావు బయటకు వచ్చి, ఇది ప్రభుత్వం కుట్రగా ఎందుకు ప్రకటించాడు? నిజాయితీ లేని కె.సి.ఆర్. నాయకత్వం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. ప్రభుత్వం అరెస్టు చేసి ఓరకంగా కె.సి.ఆర్. పరువు కాపాడింది. ఆ కె.సి.ఆర్. బతుకుమీది ఆశతో తెలంగాణాను తాకట్టుపెట్టి, జ్యూసులు తాగి దీక్ష విరమించినట్లు ప్రకటించాడు. నిజానికి, ప్రభుత్వం అరెస్టు చేయకపోయినా, రెండోరోజుకే దీక్ష విరమించి ఉండేవాడు కె.సి.ఆర్. తెలంగాణాకు మొదటి శత్రువు కె.సి.ఆర్. మాత్రమే.

    ReplyDelete
  3. చాలా మంచి పరిశీలనగా వ్రాశారు!
    మరి సమస్యను విశధీకరించినట్టుగానే మీరు కొన్ని పరిష్కార మార్గాలను సూచనప్రాయంగా చెబితే ఇంకా బాగుంటుంది. నన్నడిగితే అసలు తెలంగాణ ప్రాంతా ప్రజానికానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఏదొ శాపమున్నట్టుంది - ఇక్కడి సామాన్య ప్రజ ఏనాడు సుఖంగా జీవించలేదు. నాయకుల్లో అన్యోన్యత కరువైంది... ఈ పరీస్థితికి పరిష్కారం ఏమిటి?

    శ్రీధర్ రాజు - చికాగో

    ReplyDelete
  4. థాంక్యూ శ్రీధర్ రాజు గారు. పరిష్కార మార్గమల్లా, పోరాటమే. ఆ పోరాటానికి నిబద్ధత కలిగిన ఓ నాయకుడు కూడా అవసరమే. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అనేది ఓ రాజకీయ ప్రక్రియ. రాజకీయ నాయకుల ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నాయకుల్లో అన్యోన్యత లేకపోవటానికి కారణం అధికార దాహమే. ఎటువంటి స్వార్ధపు ఆలోచనలు లేకుండా తెలంగాణా కోసం పోరాడే ఒక్క నాయకుడు కూడా లేకపోవటం ఓ విషాదం.

    ReplyDelete
  5. తెలంగాణా ఓ రాష్ట్రంగా అవతరిస్తే *సమస్యలు* తీరిపోతాయా?
    కొందరనొచ్చు, కొన్ని *సమస్యలు తీరుతాయ్ అని. అవి *వారి* దృష్టిలో సమస్యలైనా *అందరి* దృష్టిలో *సమస్యలు* అనిపించుకోవాలిగా.
    సమస్యల్లా ఒక్కటే, సమస్యని వదిలేసి పోరాటం చేయటమే సమస్య. ఆంధ్రాలో జనాలు ఏవిధంగా బాగున్నారూ? పైనాయన శాపం అన్నాడు తెలంగాణాకి, ఆంధ్రాకి ఏవిధంగా శాపంలేదు? అదికూడా చెప్తే బాగుంటుంది.
    రాజకీయ కారణాలకోసం అవసరాల కోసం ఉపయోగాలకోసం చేసే పోరాటాలు ఇలానే ఉంటాయని ఎందుకు గుర్తించరు జనం?
    >>there is no other leader who can rouse Telengana sentiments.
    సెంటిమెంట్లతో రాష్ట్రాలు రావు.

    ReplyDelete
  6. Mr. Anonymous
    You don't know anything about Telangana - your comments and comparision with andhra region proves your lack of awareness. So please don't comment without knowing the truth.

    You don't believe if I tell you - either find it by yourself or travel to Telangana villages, towns and districts then find out.

    ఈ క్రింద లింకులో ప్రచురితమైన యథార్థ విషయాన్ని చదవండి…:
    http://www.andhraprabha.in/specialstories/article-43713

    అసలు తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో తెలుసుకోండి!: http://video.google.com/videoplay?docid=7730660376611492753#

    మరొక్క విషయం – ఈ క్రింది లఘు-చిత్రంలో సంగతులు నేను ఏనాడు స్కూల్లో పాఠంగా చదవలేదు – కాని మా తాతగారినుండి తెలిసిన విషయాల్లో ఇది ఓ చిన్న మచ్చుతునక మాత్రమే: http://video.google.com/videoplay?docid=7247237671139634776#

    ReplyDelete
  7. Hello Anonymous gaaru - Pls go through this.

    http://amtaryaanam.blogspot.com/2008/02/blog-post_14.html

    ReplyDelete
  8. ఇప్పటికైనా ఈ వేర్పాటు ఉద్యమం కట్టిపెట్టి, తెలంగాణా ప్రాంతం అభివృద్ధికోసం కనీసం 20 ప్రాజెక్టులను గుర్తించి వాటి సాధనకై ఉద్యమం చేయటం మంచిది. మాటిమాటికి గతం తవ్వుకోని ఉపయోగం లేదు. ఈరోజుల్లో ప్రాంతీయ భావనలు తగ్గాయి. మళ్ళి కేసీ ఆర్, ఇంకొందరు మేధావులు రెచ్చగొట్టకపోతే చక్కగా అందరు తెలుగువారు కలిసిపోతున్నారు. అన్యాయం అన్ని ప్రాంతాలలో ఉంది. తెలంగాణా కు జరిగిన అన్యాయం బాగా వెలుగులొనికివ చ్చింది. ఆంధ్ర, రాయలసీమల్లో ఉన్న సమస్యలు వెలుగులోకి అంతగా రాలెదు. తెలుగువారిని చూసి ఇతర రాష్ట ప్రజలు నవ్వుకుంటున్నారు. కలిసి ఉండలేని మనలను చూసి హేళనగా చూస్తున్నారు. తెలంగాణా విడిపోతే మజ్లిస్, మావోల చేతిలోకి పోవటం ఖాయం.

    ReplyDelete
  9. సూటిగా, విశదంగా ఉంది టపా.

    ReplyDelete

మీ అభిప్రాయం :