Wednesday, June 2, 2010

'ఈనాడు'లో నా అనుభవాలు


"ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం మొదలేసా. డిగ్రీ అయిపొయిందే తడవుగా ఈనాడులో ఉద్యోగం రావటంతో మరేమీ ఆలోచించకుండా జాయిన్ ఐపోయాను. నిజానికి, కాలక్రమంలో ఓ జర్నలిస్టుగా స్థిరపడదామనే ఆలోచన కూడా ఈనాడులో చేరటానికి మరో ముఖ్య కారణం. రెండు సార్లు ఈనాడులో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి గాను, వ్రాత పరీక్షలకు కూడా హాజరయ్యాను. అదృష్టం కొద్దీ పాస్ కాలేదు :)

నేను పని చేసిన దాదాపు ఏడెనిమిది నెలల్లో, ఈనాడులో నాకు నచ్చిన ఓ మంచి విషయం ఏదైనా ఉన్నదంటే, అది జీతం. బెత్తెడు జీతమే (స్టైఫండ్) అయినా ఠంచనుగా నెలాఖరుకల్లా వచ్చేది. ఆ రోజుల్లో, మా రూం మేట్లుగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల ఉద్యోగులు మాత్రం నానా బాధలు పడేవారు జీతం సమయానికి రాక. బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా జీతాలు ఇవ్వాళ పెరుగుతాయి, రేపు పెరుగుతాయి అనుకుంటూనే, దాదాపు ఓ అయిదేళ్ళు గడిచిపోయాక గానీ, ఈనాడులో జీతాలు పెరగలేదని చెప్పేవారు, ఆ తర్వాత నా జర్నలిస్టు స్నేహితులు.

జర్నలిస్టులు ఎలా పీడింపబడేవారో నాకైతే తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం సబ్ ఎడిటర్లు పీల్చి పిప్పి చేసేవారు. అలానే, సీనియర్లు కూడా చెండుకు తినేవారు. కొత్తగా వచ్చామని మాకు డే షిఫ్టు ఉండేది, కంప్యూటర్ లో తెలుగు టైపు చేయటం నేర్చుకోటానికి వీలుగా. ఎందుకంటే, డే షిఫ్టులో ఎక్కువ పని కూడా ఉండేది కాదు, కాబట్టి ఆ సమయంలో మాకు మా షిఫ్టు ఇన్ ఛార్జి టైపు చేయటం, అలానే, ప్రకటనలు చేయటం నేర్పేవాడు. కానీ, చేరిన కొత్తలో ఓ రెండు వారాలు మినహా, మళ్ళీ ఏనాడు ఆ షిఫ్టులో పని చేయలేదు. సీనియర్లు అడ్జస్టుమెంట్లని వేధించేవారు. కుదరదంటే వాళ్ళ చాకిరి కూడా మా మీద రుద్దేవారు. మా షిఫ్టు ఇన్ ఛార్జి మాత్రం చాలా మంచివాడు. నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసేవాడు. అతని పేరు తాతబ్బాయి. తిరుపతికి కొత్త కావటంతో, మాకు అద్దె గది వెతుక్కోటంలో, వీక్లీ ఆఫ్ రోజు ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టటం చేసేవాడు. అలానే, ఓవర్ టైం చేయించి, కంపెన్సేటరీ సెలవలు కూడా ఇచ్చేవాడు. రెండో షిఫ్టు ఇన్ ఛార్జి (భీమారావు) అంటే అప్పట్లో ఎందుకో టెర్రర్ గా ఉండేది. మనిషి మాట తీరే కఠినంగా ఉంటుంది కానీ, మంచివాడే అని ఆ తర్వాత తెలిసింది.

ఇక ఈ సబ్ ఎడిటర్లు... ఈనాడులో సబ్ ఎడిటర్ అనేప్పటికి ఏవో కొమ్ములు మొలిచినట్లు, కంపోజింగ్ సెక్షనులో ఉన్న మేమేదో పనికిమాలినవాళ్ళమైనట్లు చూసేవారు. వారు వ్రాసి ఇచ్చే వార్తలు, నిజం చెప్పాలంటే నవ్వొచ్చేది. ఏదో వ్రాసుకుపోవటమే కానీ, స్పార్క్ ఏకోశానా కనిపించేవిధంగా ఉండేవి కాదు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలైన జిల్లా ఎడిషనుల వల్ల, వార్తలలో పస తగ్గిపోయిందేమో అనిపించేది. మడకశిరలో మడత మంచాల పంపిణీ,.. అనంతపురంలో ఆత్మహత్య... కుళాయి తగాదాలో కన్నుమూత... ఇలా సాగేవి వార్తల శీర్షికలు. ఇక వీళ్ళ చేతివ్రాత చూస్తే కళ్ళు బైర్లు కమ్మేవి. ఎవరో ఒకరిద్దరు తప్ప, మరెవరి చేతివ్రాత అర్ధమయ్యేది కాదు. నమ్మండి, నమ్మకపోండి... నేను, రమణ బాబు అనే మరోతను కలిసి నాలుగు జిల్లా ఎడిషన్లు పూర్తిగా కంపోజ్ చేసేవాళ్ళం, పోటీ పడి మరీ. ఇక మమ్మల్ని రెచ్చగొడుతూ, సీనియర్లు వాళ్ళ పని కూడా మాకు పురమాయించేవాళ్ళు.

వ్యక్తిగతంగా, నేను నైట్ షిఫ్టు కోరుకునేవాడిని. ఎందుకంటే, ఆ సమయంలో సబ్ ఎడిటర్లతో కూర్చొని నేను కూడా వార్తలు వ్రాసే అవకాశం దొరికేది. అప్పట్లో విశ్వప్రసాద్ గారు చిత్తూరు డెస్కు ఇన్ ఛార్జిగా ఉండేవారు. వాళ్ళ డెస్కుకు పని తగ్గుతుందనేమో తెలియదు కానీ, ఆయన చాలా ప్రోత్సహించేవారు. అప్పటి ఓ విషయం నాకింకా గుర్తే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, కొన్నిపనులు ఎందుకు చేయలేకపోతున్నది (దాదాపుగా ఇదే అర్ధంలో) వివరణ ఇచ్చారు. రిపోర్టరు ఇచ్చిన ఆ వార్తకు "ముద్దు" మాటలు "గాలి"కే అనే శీర్షిక పెట్టి ఆ వార్తను ఎడిట్ చేసా. విశ్వప్రసాదుగారు నవ్వి, ఆ శీర్షిక తీసి, ఇంకోటి పెట్టారు.

మమ్మల్ని వేధించిన వాళ్ళలో మరో ముఖ్య వ్యక్తి అక్కడి పర్సనల్ మేనేజర్. పేరు సరిగా గుర్తులేదు... రాజేంద్రబాబు అనుకుంటా. కంప్యూటర్ సెక్షనులో ఏ.సి. ఉండేది. దాదాపు ఎనిమిది గంటలు కూర్చోవాలంటే ఇబ్బందిపడేవళ్ళం. మధ్యలో ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకొని బయట జేబులో చేతులు పెట్టుకు నుంచుంటే... "ఏరా, జేబులో చేతులు పెట్టి XXXX పిసుక్కుంటున్నారు... ఇలాగైతే ప్రొబేషన్ పెంచేస్తా..." అని అరిచేవాడు. సగం ఈయన కూడా కారణమే, నేను ఈనాడు వదిలేసి వెళ్ళిపోటానికి. ఇక ఆ మేనేజరు... గోవిందరావో, గోపాలరావో ఉత్సవవిగ్రహంలా మాత్రమే ఉండేవాడు. అసలు ఆయన చేసే పనేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. అంతా రాజేంద్రబాబు హవానే నడిచేది.

ఇంత చెప్పీ, రెడ్డెమ్మ మెస్ గురించి చెప్పకపోతే ఎలా? చాలా చౌకగా భోజనం పెట్టేది. ఈనాడు ఆఫీసు నుంచి, రైల్వే లైను దాకా నడుచుకుంటూ వచ్చి లైనుకు అవతల ఉన్న రెడ్డెమ్మ మెస్ లో భోజనం చేసేవాళ్ళం. కానీ, నాలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే, శాఖాహారం, మాంసాహారం రెండు వండేది. అంతా ఒకేచోట కూర్చొని తినాల్సి వచ్చేది. తాగుబోతు భర్తని, ఆకతాయి మొదటి భార్య పిల్లవాడిని భరిస్తూ, ఎలా పని చేయాల్సి వస్తున్నదో నసుగుతూ వడ్డించేది.

ఇక, తెల్లవారుఝామున మూడు గంటలకు బయలుదేరి, లారీలు ఆపుకుంటూ తిరుపతి చేరేవాడిని. వదిలేసే ముందు రేణిగుంటకు మకాం మార్చాను. కంపోజింగ్ సెక్షనులో అప్పటి నా మిత్రులు వాసుదేవ రావు, లక్ష్మణ రావు, రమణ బాబు, దుర్గా ప్రసాద్, మురళీమోహన రావు, నాయుడు, కృష్ణమూర్తి.... ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో!

ఆవకాయలో కూడా....

7 comments:

  1. మీ గత కాలపు స్ముతులు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  2. Nice narration. For many, first job is an unforgettable memory.

    ReplyDelete
  3. Dear Mr.Sai Kiran Kumar,
    Thanks for your good story. Its really good and well-written. I too started my career as a contributor and faced many problems like you. I couldn't face humiliation in the hands of mindless middle managers. They troubled me for eight years till Mr.Ramoji gave me a chance to work in editorial page.
    The suffocating situation forced me to work hard to become a journalist in The Hindu. I can tell you that those who worked hard got out of Eenadu and found good jobs.
    Cheers
    Be in touch
    S.Ramu
    Dean
    Indian School of Journalism
    Hyderabad
    apmediakaburlu.blogspot.com
    srsethicalmedia@gmail.com

    ReplyDelete
  4. ఈనాడు లో మీ అనుభవాలు బావున్నాయి.కార్మికులకు అతితక్కువ వేతనాలు చెల్లించి,ఎక్కువ పని రాబట్టుకొనేది ఈనాడే అంటారు.ఇది నిజమా?

    ReplyDelete
  5. ఈనాడు ఎప్పటికీ మారదు.ఇప్పటికీ అదే చాకిరీ, అదే దోపిడీ! అదే నిర్లక్ష్య ధోరణి! అదే అవమాన కర ప్రవర్తన! కింది ఉద్యోగులని తక్కువగా చూడటం! you are lucky! బయటపడ్డారు.

    అమ్మ నవల్లో ఫాక్టరీ కార్మికుల జీవితాలని గోర్కీ హృదయవిదారకంగా వర్ణిస్తాడు. అదే పరిస్థితి ఇక్కడ కూడా! వ్యక్తి స్వేచ్ఛకు విలువే లేదు.

    ReplyDelete
  6. Hello Ramu gaaru - Yes. Indeed, Eenadu has a very very suffocating environment to work with. Any ways, since it was my first employment, I learned the things hardest way, which helped in my further employments.

    ReplyDelete
  7. సాయి కిరణ్,
    మీరు ఈనాడు లో పనిచేసిన సంగతి నాకు తెలియదు. ఇదిగో ఈ పోస్ట్ ద్వారా ఇంకా అనేక విషయాలు తెలిసాయి. జర్నలిజం కబుర్లు తవ్వుకొని చెప్పుకోవటానికి పనికివస్తాయెమో అనిపిస్తుంది ఒక్కోసారి. మనమంతా ఒకే గూటి పక్షులమ్ అన్న మాట.
    కల్పనారెంటాల

    ReplyDelete

మీ అభిప్రాయం :