నీవు ఎవరు అన్న ప్రశ్నకు ప్రకృతి ఇచ్చిన సమాధానంగా వ్రాసిన కవిత :
ధరణీమణి దాహార్తికి
చిరుజల్లులు కురిపించగ
సుమశరములు సంధించిన
జలధరముల హరిధనువును నేనే
హిమపాతపు స్వరఝరిలో
శివరాతిరి రసధునిలో
నిటలాక్షుడు నర్తించగ
విడివడిన సిరిమువ్వల ఘనజ్వాలను నేనే
నగముల చిరునగవుకు
మురిసిల్లి స్పృశియించిన
సురభామల దరహాసపు
శ్వసనంలో చలనంలా నేనే
ప్రత్యూషపు కాంతుల్లో
కుసుమించిన కెందమ్ముల
అందాలను అలరించే
మిహిరారుణ చరణంలో కిరణంలో నేనే
వడగాలుల వింజామరలో
బీటలువారిన ఎండునేలలో
సంవేశించిన చిరుమొలకల
అలకల పెనుకదలికలో నేనే
భువనయాత్రలో సంగ్రామిస్తూ
అభవఘోషలో సంగమించిన
శుష్కకాష్ఠములు ప్రస్తానించే
ప్రేతభూమిలో చితులు కాలిన తరివినీడలో నేనే
శిశిరంలో తిమిరంలో
గగనంలో గర్జనలో
జడివానల, పెనుగాలుల
పరాక్రమంలో, ప్రకంపనల్లో నేనే
అణువుఅణువులా నిక్వాణంలో
క్షణపుక్షణపు నిశ్వాసంలో
అనంతకాలపు ఆరోహణల
గమనంలో నేనే
గమ్యంలో నేనే
నాకైతే సిరివెన్నెల గారి కవిత్వం చదివిన ఫీలింగ్ వచ్చింది!!
ReplyDeleteకానీ, కొన్ని పదాల అర్ధాలు తెలీదు :((
ఉదా: శ్వసనం, మిహిరారుణ...
btw, very nice blog! :-)