అనుకుందొక్కటి... అయ్యిందొక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట... ఓటమిని ఏనాడూ సరైన స్ఫూర్తితో తీసుకొని ఎరుగదు కాంగ్రెస్. తాజాగా కర్ణాటకలో పార్టీ ఓటమికి 'చీలిన లౌకిక ఓట్ల'ను కారణంగా చూపి తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక ఓటమికి మసి పూసి మారేడుకాయగా అధినేత్రిని ఒప్పించగలరేమో కానీ, ప్రజలను కాదని కాంగ్రెస్ నేతలు ఎప్పటికి గుర్తిస్తారో? ఈ ఎన్నికల ఫలితాలు, దేవెగౌడ ద్రోహానికి, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు చెంపపెట్టుగా మాత్రమే కాదు... కేంద్రంలోని యు.పి.ఎ. పాలనపై ప్రజల నిరశనను కూడా ప్రతిఫలిస్తుంది.
గతవారంలోనే, నాలుగేళ్ళ యు.పి.ఎ. పరిపాలనపై తమకుతాము భుజకీర్తులు తొడుక్కున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడవు. అద్భుతంగా సాగుతున్న తమ పరిపాలనను మెచ్చి ప్రజలు బ్రహ్మరథం పడతారన్న భ్రమల్లో మునిగి తేలింది.అదుపుతప్పిన ద్రవ్యోల్బణం, అంతకంతకూ పెచ్చుమీరుతున్న తీవ్రవాదం సామాన్యుడిపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నా ఏమాత్రమూ పట్టించుకోని కేంద్రప్రభుత్వానికి ఈ ఎన్నికలు షాక్ ట్రీట్ మెంటులాంటిదే.
అసలు యు.పి.ఎ. పరిపాలన చూస్తుంటే, ప్రధాని పదవి ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఇలానే ఉండేదనిపిస్తుంది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏనాడో అడియాశలైనాయంటే అతిశయోక్తి కాదు. ప్రజలకన్నా కూడా సోనియాకు మాత్రమే జవాబుదారీగా ఆయన పోషించిన పాత్ర, భారత ప్రధాని పదవిని రోజురోజుకూ దిగజార్చేస్తున్నది. అష్టకష్టాలు పడైనా సరే, అయిదేళ్ళు లాగాలనే తపనే కనిపిస్తుంది కానీ, ప్రజలకు మేలు చేద్దామనే తపన మాత్రం దీవిటీతో వెదికినా కనిపించదు. ఆ మాటకొస్తే, ప్రతి కాంగ్రెస్ మంత్రి ప్రజలకన్నా కూడా సోనియాకు జవాబుదారీగా మాత్రమే తమ శాఖలు నిర్వహిస్తున్నారు.
ధరలు పెంచిన రోజో, లేదంటే ఆ మర్నాడో ఓ ధర్నాతో తమ పని అయ్యిందనిపించే కమ్యూనిస్టుల లాంటి మిత్రపక్షనేతలకు కూడా ఈ పరిపాలనా పాపంలో పిడికెడు వాటా ఉండనే ఉంది. కల్లబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ నేతలకు కమ్యూనిస్టులకు ఈమధ్య అట్టే తేడా ఉండడం లేదన్నది పచ్చి నిజం. ప్రజా ప్రయోజనాలే లక్ష్యమైతే, ఇన్నాళ్ళు ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎందుకు ఉపేక్షించారనే దానికి వీరి దగ్గర కూడా ఒక్కటే సమాధానం - మతశక్తులను అధికారానికి దూరంగా ఉంచాలనే!!
రైతులకు బియ్యం ధరపై పది రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటారట - కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్!! ఈ నాలుగేళ్ళు ఏం చేసినట్లో!!
ప్రాధమిక విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయో పట్టించుకోరు కానీ, ఐ.ఐ.ఎం., ఐ.ఐ.టి.ల్లో మాత్రం తన మాట నెగ్గాలనే పట్టుదలతో ఉంటారు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్!!
ప్రాధమిక ఆరోగ్య వసతులు ఎలా ఉన్నాయో పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం కనిపించవు కానీ, AIIMS డైరెక్టరును తీసిపారేయడానికి, ఇంకా టైముంటే, సినిమాల్లో సిగరెట్లు, ఆల్కాహాలు, చిప్సు గట్రాలు నిషేధించటానికే సమయాన్ని వెచ్చిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అంబుమణి రాందాస్.
రెండు నెలలకో ఘాతుకంతో తీవ్రవాదం బుసలు కొడుతుంటే, ప్రత్యేక చట్టాలు అనవసరమంటారు కేంద్ర హోంశాఖామాత్యులవారు. ఆయన తర్కమేమిటంటే, తీవ్రవాదులు చట్టాలు చదివి ఘాతుకాలకు పాల్పడరుట!! ఆ లెక్కన అసలు చట్టాలు, శిక్షలు ఎందుకు మన రాజ్యాంగంలో? అలానే, అఫ్జల్ గురు ఉరిశిక్షకు, శరభ్ జిత్ సింగ్ విడుదలకు ముడివేసే 'లౌకిక' మంత్రి ఈయన!!
సంకీర్ణ రాజకీయాల్లో రాందాస్, శరద్ పవార్ లాంటివారిని భరించక తప్పదంటే సరే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ మంత్రులే ప్రధానిని లెక్కచేయని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రధాని కూడా, ఆయా మంత్రులను ప్రధాని హోదాలో ప్రశ్నించినట్లు తెలియదు.
ప్రధానితోపాటు, ఆయా మంత్రులే ఇలా పరిపాలన దేకిస్తుంటే, ప్రజలు ఓట్లెందుకు వేస్తారు? ఇకపైగా, లౌకిక ఓట్లు చీలిపోవటంవల్ల భా.జ.పా. గెలిచిందనే సిగ్గులేని ప్రకటనలా!! ఆ మాటకొస్తే, భా.జ.పా.కు ఓట్లు వేసినవారంతా మతవాదులనా!!
ఇకనైనా, కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రజల బాగోగులు పట్టించుకునే విధంగా పరిపాలిస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత బఠానీలైనా అమ్ముకునే స్థాయిలో ఉండగలుగుతుంది. లేదంటే, అదీ అనుమానమే.
కర్నాటకలో అంతా సవ్యంగా జరిగి ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో కానీ, జెడిఎస్ భాజపాల మధ్య జరిగిన డ్రామానే ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించింది.అందువల్లనే భాజపా 'కేవలం ' సానుభూతి వోట్లతో గెలిచింది. యడ్యూరప్ప ఏదో వొరగబెడతాడని ప్రజలకేమాత్రం నమ్మకం లేకపోయినా, జెడియెస్ కి గుణపాఠం చెప్పారని మాత్రం సంతోషించాలి. దేవెగౌడ మితిమీరిన పుత్ర వాత్సల్యానికి ఇదొక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే! కాని యడ్యూరప్పకు అధికారం అప్పగించేందుకు కుమార స్వామి, నాన్న నేతృత్వంలో పెట్టిన అడ్డమైన షరతులూ ఒప్పుకోకుండా రాజీనామా చేసి ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నందుకు యడ్యూరప్పను అభినందించాలి.
ReplyDelete