Tuesday, July 29, 2008

మేడిపండు ప్రజాస్వామ్యం 03

రాజకీయంగా ఎంత అనైతిక పరిస్థితుల్లో ఉన్నామనేదానికి ప్రతిరోజూ ఎన్నెన్నో తార్కాణాలు కనిపిస్తాయి. నిబద్ధత, నిజాయితి, నీతి ఇవేవీ లేకుంటేనే రాజకీయనాయకులౌతారనిపిస్తుంది. దీనికి మన్మోహన్ సింగ్ కూడా మినహాయింపు కాదు.

గత మంత్రిమండలి విస్తరణలో శిబుసోరెన్ కు మొండి చెయ్యి చూపించిన ఈ మన్మోహనే, మొన్న కాళ్ళావేళ్ళా పడి యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు సంపాదించుకున్నాడు. ఎవరెవరికి ఏమేం ఆశలు పెట్టాడో ఎవరైనా ఊహించుకోవచ్చు.

లోక్ సభ స్పీకరు విషయపరంగా, రాజ్యాంగపదవికి రాజకీయాలు పులమకూడదంటున్నారు ఇప్పుడు. ఏ రాజ్యాంగపదవిని రాజకీయం చేయకుండా వదిలారు ఈనాటి వరకు?

తనను ఒక నేతగా తీర్చిదిద్దిన రాజకీయ పార్టీ ముఖ్యమా, రాజ్యాంగపదవి ముఖ్యమా అనే విషయంలో మన స్పీకరు ఒక నిర్ణయానికి రావటం అభినందనీయమే అయినా, ఆయన ఆలోచన ఎంత హిపోక్రటిక్ గా ఉందో ఓ సారి గమనించండి.

పదవికి రాజీనామా చేసి, పార్టీ కట్టుబాటుకు అనుగుణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్దమైనా కూడా, భా.జ.పా.తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం సెక్యులర్ సిద్ధాంతానికి వ్యతిరేకమట మన స్పీకరు గారి దృష్టిలో!! మరి, అదే భా.జ.పా. ఆయన్ని ఏకగ్రీవంగా స్పీకరు పదవికి ఒప్పుకున్నప్పుడు ఈ మాటెందుకు చెప్పలేదు మన స్పీకరుగారు?

పార్టీ విప్ లకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు తన ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోవాలి. ఆ పరిస్థితుల్లో సదరు సభ్యుడు వేసే ఓటు ఎలా చెల్లుబాటవుతుంది. ఆ ఓటు చెల్లుబాటు కాదని, తదనంతరం స్పీకరు వేసిన ఓ కమిటీ నిర్ణయించి, అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసేటప్పటికి పుణ్యకాలం పూర్తవ్వదా? అటువంటి ఓట్లతో మెజారిటీ ఉన్నదని నిరూపించుకోవటంలోని ఔచిత్యం ఏమిటి? మేధావిగా కొనియాడబడే సోమనాథ్ ఛటర్జీ ఈ విషయంలో చేసింది ప్రజాస్వామ్యానికి ద్రోహం కాదా?

ఒక ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్ధకమైన పరిస్థితుల్లో, తమను కొనటానికి బేరసారాలాడుతున్నారని కొందరు పార్లమెంటు సభ్యులు పార్లమెంటులోనే ప్రకటించినా, స్పీకరు ఎటువంటి ఆలోచనా లేకుండా, మొక్కుబడి తంతుగా ముగించిన తతంగంలో ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపిస్తుంది?

సిద్ధాంతాలకు మాత్రమే తలవొంచే సి.పి.ఎం. సీనియర్ నేత, స్పీకర్ మహాశయులు ఏ సిద్ధాంతం ప్రాతిపదికగా అవినీతి ఆరోపణల మధ్య ప్రభుత్వ బలనిరూపణను కొనసాగించినట్లు?

ఇక సి.పి.ఎం. నేతల విషయానికి వస్తే... పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదట. కమ్యూనిస్టుల క్రమశిక్షణ మెచ్చదగ్గదే. కానీ రాజకీయ క్రమశిక్షణ ఎక్కడ? నందిగ్రాంలో వారు చేసింది ఒప్పు. అదే, మరో పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో జరిగితే తప్పు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలకు కాంగ్రెసీయులు ఆరంభం పలికితే, వాటిని 'క్రమశిక్షణ'గా అనుసరిస్తున్నది కమ్యూనిస్టులే.

ఈరోజు అలౌకిక పార్టీగా ఏ పార్టీనైతే బూతులు తిడుతున్నారో, అదే పార్టీతో ఒకానొకనాడు చెట్టపట్టాలేసుకొని తిరిగిన రోజులు మర్చిపోతున్నారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి 24 గంటలు కాకమునుపే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుకు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు వారికి సహకరిస్తామని ఈ ప్రకాష్ కారత్ ప్రకటించటంలోని రాజకీయ క్రమశిక్షణ ఏపాటిది?

ఇక బాంబు పేలుళ్ళ నేపథ్యంలో చూడండి। బెంగుళూరు, అహ్మదాబాద్ పేలుళ్ళ వెనుక ప్రజల ఆలోచనలు పక్కదోవ పట్టించాలనే కుట్ర దాగి ఉన్నదని భా.జ.పా. నేత సుష్మా స్వరాజ్ ఆరోపణ. నిజంగా ప్రజాస్వామ్యాన్ని దిసమొలతో నడిపిస్తున్న ఈ రాజకీయాలు దేశానికి ఏ రకంగా క్షేమకరం? కానీ, ఇందులో కఠినంగా అనిపించినా ఓ కటికవాస్తవం దాగి ఉంది. బహుశా ప్రతి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమూ ప్రజల ఆలోచనలు పక్కదోవ పట్టించటానికి ఇలాంటి ప్రయత్నాలు గతంలో చేసే ఉంటారు.

ప్రజావ్యతిరేకత ఎక్కువగా కనిపించేటప్పుడు గతంలో ఇందిరా, రాజీవ్ తదితరులు పాకిస్తాన్ తో కయ్యానికి కాలు దువ్వేవారన్నది ఇప్పటివరకూ ఓ విమర్శే. బహుశా అది కూడా నిజమే అయ్యుంటుంది. అలానే, కార్గిల్ వ్యవహారం కూడా. అలానే, నిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పులు కూడా ఇటువంటి రకమే అయ్యుంటాయి.

తిని తీరిగ్గా కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించటమే ధ్యేయంగా వ్రాస్తున్న రాతలు కావివి. మన ప్రజాస్వామ్యంపై మనకెన్ని భ్రమలున్నాయో తెలుసుకోవాలని, తెలిసినవి తెలియజెప్పాలని చేస్తున్న ప్రయత్నం. విమర్శించటం కాక, ఏం చేయాలో చెప్పమని కూడా కొందరు అడిగారు. వ్రాయబోయే మరో వ్యాసంలో ఆ విషయాలు ప్రస్తావిస్తాను
.

6 comments:

  1. as long as speaker holds his position he is supposed to be neutral but after he comes out of that as a party man he can vote according to his principles. nothing wrong there, nobody can question that.
    he never requested bjp to support him as speaker, even if he did it you cannot say that as a reason to support bjp now
    he stuck to his principles.
    what better job you would expect speaker to do on the day of trust vote ? i would expect to suspend bjp mps immediately for breaching security and bringing cash bags into parliment

    ReplyDelete
  2. కిరణ్ కుమార్ గారూ!

    ఈ వ్యవస్థ గురించి,ఈ ప్రజా ద్రోహుల గురించి ఒక నిర్ణయానికి రావడమే గానీ ఇంకా ఇంత విశ్లేషణ అవసరమా?!

    ఏది ఏమైనా మీ విశ్లేషణ అద్భుతం.

    ReplyDelete
  3. Hello Srikanth gaaru - Speaker did not hold his position in it's true sense. Had he been so principled, he would have either suspended the BJP MPs for breaching security and defaming the Parliament or postponed the Trust Vote. He did neither of the things.

    You are trying to justify that Somnath Chatterjee never asked for BJP to support his candidature. Fine. Even now, I think, BJP never asked him nor did CPM ask BJP to vote against the UPA. What is his problem then.

    ReplyDelete
  4. ధన్యవాదాలు సరస్వతి కుమార్ గారు. ఇది విశ్లేషణ కాదు. మన ప్రజాస్వామ్యం మనని ఎలా మభ్యపెడుతున్నదో తెలియజేసే ప్రయత్నం. మన రాజకీయనాయకుల ప్రతి చర్యలోనూ ప్రజాస్వామ్యానికి సమాధి కట్టే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పే ప్రయత్నం. నిజమైన ప్రజాస్వామ్యం లేనేలేదన్నది చెప్పాలన్న తాపత్రయం.

    ReplyDelete
  5. చాలా బాగా రాశారు.

    ఈ నీచత్వాలు దశాబ్దాల నుంచి ఉన్నవే. "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు"అనే సంప్రదాయాన్ని పాటించి నోరెత్తలేకపోతున్నాం. అంతే !

    Communist movement in India is heavily dominated by Bengalis. Hence, their policies and action plans are all captive to the narrow regional scenario of West Bengal. I see no reason why the leftist forces in other States should blindly tow their line. Especially their obsession with Muslim votes is something to do exclusively with the demographic composition of Bengal. This obsession has in no way benefited them in other States.

    ReplyDelete
  6. Excellent Analysis. I too really felt the same way. Keep going

    ReplyDelete

మీ అభిప్రాయం :