అవినీతి భారతంలో 'సత్యం' ఆది పర్వమూ కాదు ఆఖరి పర్వమంతకన్నా కాదు. 'లింగరాజు' చెప్పిన మేరకు ఆయన బొక్కిందీ లేదు, అయినవాళ్ళకు దక్కిందీ లేదు. సత్యసంధతతో, చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి 'త్యాగధనుడే'! 'సత్యాన్ని' అడుసులోకి తొక్కాలని కాదుగా అధిక లాభాలు చూపించింది. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి. సంకల్పం 'సత్యం' కాబట్టి ఆరోపణలు సత్యదూరాలు. ఇలా సాగుతున్నాయి 'సత్యం' సాగించిన దురంతాన్ని సమర్దిస్తూ వస్తున్న వాదనలు.
అసలే, ఆర్ధికమాంద్యానికి వణికిపోతున్న భారతావనికి రోకలిపోటులా ఈ సత్యం చేటు తెచ్చింది. హర్షద్ మెహతాల స్థాయినే దాటి, అంతర్జాతీయ కుంభకోణాల స్థాయిలో మోసం చేసానని ఒప్పుకున్న 'లింగరాజు' ఆంధ్రుడు కాబట్టి, ఆంధ్రులం ఆవలివైపే చూడాలా? వేలమందికు ఉపాధి కల్పించాడు కాబట్టి, లక్షలమందిని ముంచటాన్ని పరిగణనలోకి తీసుకోకూడదా! ఆ మాటకొస్తే, తోటి భారతీయుడే కాబట్టి తీవ్రవాదులతో చేతులు కలిపి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న దావూద్ ఇబ్రహీంను వదిలేయాలా? సరే, 'లింగరాజు రామాయణం'లో పిడకలవేట కాసేపు పక్కనబెడదాం.
రెండు దశాబ్దాల కాలంలోనే, సాఫ్ట్ వేర్ రంగంలో విప్లవాత్మకంగా ఎదిగిన 'సత్యం' ఈనాడు మోసానికి పర్యాయపదంగా మారటంలో ఎవరి బాధ్యత ఎంత? ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్న ప్రతి రాజకీయనాయకుడు ఒకనాడు 'సత్యం' కొమ్ము కాచినవాడే. అడుసు తొక్కాడు కాబట్టి ఈ రోజు అంటరానివాడయ్యాడు.
అసలు ఇటువంటి నేరగాళ్ళకు అంతులేని ధైర్యం ఎక్కడి నుండి వస్తున్నది? సంపన్న నేరస్థులకు చుట్టాలుగా మారిన చట్టాలు ఇటువంటి ఆర్ధికనేరాలు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. హర్షద్ మెహతా, ఆ తర్వాత కేతన్ పారిఖ్ లు సాగించిన ఆర్ధిక దురంతాలలో కోట్లు నష్టపోయిన చిన్న మదుపుదార్లకు ఇంతవరకూ ఏ చట్టమైనా ఉపయోగపడిందా? ఆ మాటకొస్తే, చిన్నా చితకా ఫోర్ ట్వంటీ గాళ్ళకు తప్పించి అవినీతి ఊబిలో కూరుకుపోయిన మన బడా నేతలు, వ్యాపారులకు ఏనాడైనా శిక్ష పడిందా? వేల కోట్ల 'స్టాంపు పేపర్ల' కుంభకోణంలో ఇంతవరకూ మన చట్టాలు ఏం పీకాయి? 'సత్యమేవ జయతే' అన్న స్ఫూర్తికి ఏది విలువ?
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి, విచారణ అవసరమే. కానీ, నేరాన్ని ఒప్పుకున్న తర్వాత శిక్ష వేయటంలో తాత్సారం దేనికి? ఆయనకు వేయాల్సిన శిక్ష వేసి, ఆపైన వంచన పనుల్లో భాగస్వాములెవరన్నదానిపై విచారణ కొనసాగించవచ్చుకదా! అవేమీ చేయరు. 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది'. చట్టాలను చిన్నబుచ్చే ప్రయత్నాలను తెరచాటున ప్రభుత్వమూ చేస్తుంది. కర్రా విరగదు, పాము చావదు. దీన్ని మించిన మరో కుంభకోణం తెరపైకి వచ్చేలోపే మనం 'సత్యాన్ని' మర్చిపోతాం. 'సత్యం మిధ్య, చట్టం మిధ్య'.
u said right sir,
ReplyDeletekani eelantivi anni chusthu uurukovadamena
Deniki anthe leda?
dheniki margam emita aani enno rojula
nundi alochistunnanu?
na aalochanala ki paripakvatha eppudu vaccheno??????