ఏ పార్టీ కూడా ప్రజల కోసం ఏర్పడిన పార్టీగా లేదు. వారి వారి కుటుంబాల కోసమో, వారి వారి పేరుప్రఖ్యాతుల కోసమో ఏర్పడ్డ ప్రైవేటు సంస్థల లాగానే పని చేస్తున్నాయి. ప్రజలను ఏమార్చటానికి గాలిలో ముద్దులు పెట్టటం, తొడలు కొట్టి మీసాలు మెలేయటం వంటి చేష్టలతో ప్రజాస్వామ్యాన్నే పరిహాసాస్పదం చేసే ఈ నేతల చేతుల్లోనేనా మన భవిష్యత్తును మనం పెట్టబోయేది?
నిజానికి, ఏ పార్టీ కూడా దేశానికి, ప్రజలకు ఒరగబెడుతున్నదేమీ లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఆయా పార్టీలకే దన్నుగా నిలుస్తున్నది కానీ, ప్రజలకు దన్నుగా మాత్రం కాదు. ప్రజల చేతిలో ఉన్నది 'ఓటు' అనే ఒక్క ఆయుధం. అయిదేళ్ళకోసారి మాత్రమే ఉపయోగించుకోవలసిన ఆయుధం. దీనివల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. అధికారంలో వచ్చే పార్టీలు మారినా పరిపాలనలో ఏమాత్రమూ మార్పులేదని చెప్పటమే నా ఉద్దేశ్యం.
ఇటువంటి పరిస్థితులలో ఓటు వేయటం ద్వారా మన ప్రజాస్వామిక హక్కును నెరవేర్చుకుంటున్నామే కానీ, దాని ద్వారా మనకు లభించాల్సిన సుపరిపాలన మనకు లభించని దుస్థితికి దాసోహమని మరో అయిదేళ్ళు నిరీక్షణలో గడిపేస్తున్నాం. ఇది ఎక్కడితో ఆగాలి? ఎలా ఆగాలి?
ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.... చూడండి.
===
నిరుటి సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపార్టీగా అవతరించి, ఆనక యు.పి.ఎ. భాగస్వామ్యపక్షాలతో ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గురించి చెప్పుకుందాం.
గాంధీ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే పార్టీగా కాంగ్రెస్ సుపరిచితమే. ఎన్నికలైన వెంటనే, గాంధీని జమాఖర్చుల కింద పద్దు రాసేసి, గోడలకెక్కించేయటం దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ మనం చూస్తూనే ఉన్నాం. గాంధీ ఆదర్శాలను అటకెక్కించిన ఈ పార్టీ ఇటు మనరాష్ట్రంలో ఓ మాఫియాలా పనిచేస్తుంటే, అటు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే సందేహాన్ని కలుగచేస్తుంది!
బొడ్డూడని పసివాడైతేనేం, గాంధీ పేరుంటే చాలు ప్రధాని కావటానికి అర్హత వచ్చేస్తుంది! సీనియర్ మోస్ట్ నేతలు కూడా బాలుడు ఎంత బుద్ధిమంతుడో, ఎంత పనిమంతుడు కాగలడో అని బుర్రకథలు, హరికథలతో ప్రజలకు కాలక్షేపం చేయిస్తారు.
ఆ బాలుడు కూడా తన పరిణతిని పరిపరివిధాలుగా ప్రకటిస్తూ ఉంటాడు. గాంధీ కుటుంబం అధికారంలో ఉండి ఉంటే, బాబ్రీ మసీదు కుప్పకూలేది కాదని నమ్మిస్తాడు. యాభై ఏళ్ళ తమ పార్టీ పరిపాలన తర్వాత కూడా, చాలా గ్రామాలకు రహదారులు లేకపోవటానికి, విద్యుత్తు లేకపోవటానికి, పాఠశాలలు కళాశాలలు లేకపోవటానికి ప్రధాన కారణం ప్రతిపక్షాలేనని, వాటిని అధిగమించటానికి అణు ఒప్పందం ఒక్కటే మార్గమని కంట తడి పెట్టుకుంటూ పార్లమెంటులో ప్రసంగిస్తాడు.
అధినేత్రికి, ఆ బాల నేతకు సాగిలపడి సాష్టాంగ ప్రణామాలు చేస్తేనే కాంగ్రెస్ లో అధికార మోక్షం లభిస్తుంది. ఆ విషయం తెలుసు కాబట్టే, తిలా పాపం తలా పిడికెడు కాకుండా, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కలిగిన బాధలన్నిటికీ పీవీ అనే పాపాలభైరవుడు కారణమంటూ ఆ పార్టీ నేతలు బాల గోపాలుడిని, అమ్మను ప్రసన్నం చేసుకోటానికి నోరు పారేసుకుంటూ ఉంటారు. వీరి అడుగులకు మడుగులెత్తే వీరముష్టి వెధవలు ఇటు రాష్ట్రంలో కూడా ఆయన శవాన్ని కనీసం కాలనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు.
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని మంత్రులు, వెన్నెముక లేని నేతలు మళ్ళీమళ్ళీ ఎన్నికైతే, కాంగ్రెసుకు మేలేమో కానీ, దేశానికి మాత్రం కాదు.
===
దేశం వెలిగిపోతున్నదనే భ్రమల్లో ఉండి, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించి నిరుటి సార్వత్రిక ఎన్నికల్లో ముక్కు పగిలి, మూతిపళ్ళు రాలించుకున్న భారతీయ జనతా పార్టీ గురించి కూడా చెప్పుకుందాం.
సిద్ధాంతాలే ప్రాతిపదికగా, రాజకీయ మనుగడ చేస్తున్న పార్టీలుగా దేశంలో ఒకప్పుడు భా.జ.పా.ను, కమ్యూనిస్టులను పరిగణించేవారు. కానీ, ప్రధానమంత్రి పదవి మోజుతో, అధికారంపై మోజుతో సిద్ధాంతాలకు నిరుటి సార్వత్రిక ఎన్నికల ముందే తిలోదకాలు ఇచ్చేసింది ఈ పార్టీ. ఎన్.డి.ఎ. కూటమి ఏర్పాటుకు ముందుగా జరిగిన ఎన్నికల్లో ఆర్టికిల్ 370, అయోధ్యలో రామ మందిరం, యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరసత్వ చట్టం)ల ఏజెండాతో పోరాడిన భా.జ.పా. అధికారం కోసమే, వాటిని చంద్రబాబు నాయుడు, సమతా పార్టీ తదితరులకు తాకట్టు పెట్టి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. పోనీ ఈ కొత్త వేషమైనా కొనసాగిందా అంటే అదీ లేదు. ఇప్పుడు మళ్ళీ రామ మంత్రాన్ని జపిస్తున్నది!
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని మెచ్చుకున్న వాజ్ పేయి, గత సార్వత్రిక ఎన్నికల సమయానికి అదే మోడీని నిందిస్తూ చేసిన ప్రసంగాల సారాంశం 'అవకాశవాదమే'. అలానే, దేశం రెండుగా విడిపోటానికి కారణభూతుడుగా పేర్కొంటూ జిన్నాను ఆడిపోసుకున్న అద్వాని, అదే జిన్నాను పాకిస్తాన్ లో మెచ్చుకోవటం కూడా ఆ కోవలోనిదే.
మోడీని నిందించి, జిన్నాను పొగిడితే, ముస్లీములు ఒటు వేస్తారని, భా.జ.పా. ఒక లౌకిక పార్టీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తుందనే నమ్మకంతో ఈ నేతలు వేసిన వేషాలకు ప్రజలు బానే బుద్ధి చెప్పారు. ఉభయ భ్రష్టత్వానికి అద్భుతమైన ఉదాహరణ భా.జ.పా.
అధికారం కోసం మూలసిద్ధాంతాలను పణంగా పెట్టే భారతీయ జనతా పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవటం భ్రమే.
===
అవకాశవాద రాజకీయాల్లో కాంగ్రెస్ తో సరితూగగలిగే పార్టీలు కమ్యూనిస్టులు. ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమై కూడా జాతీయపార్టీలుగా సి.పి.ఐ., సి.పి.ఎం. ఎలా మనుగడ సాగిస్తున్నాయో అర్ధం కాని విషయమేమీ కాదు.
ఉదాహరణకు మనరాష్ట్రాన్నే గమనిద్దాం. . ఒకానొకప్పుడు, ఖమ్మం, నల్గొండ, విజయవాడ తదితరప్రాంతాల్లో కమ్యూనిస్టుల ఉనికి స్పష్టంగా ఉండేది. ఎన్నికలు కూడా గెలిచేవే. కానీ, తమంతతాముగా కమ్యూనిస్టులు గెలిచే ఒక్క పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు మన రాష్ట్రంలో లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఒకసారి ఎన్నికల్లో తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం... ఇలా ఈ రెండు పార్టీలు పారేసే ముష్టి ఎత్తుకుని ఆమాత్రం సీట్లు గెలుచుకుంటున్నాయి. దాదాపు ఇటువంటి పరిస్థితే, దేశంలోని మిగతా రాష్ట్రాలలోనూ.
మారుతున్న పరిస్థితుల కనుగుణంగా తమ సిద్ధాంతాలు మార్చుకోమని చెబుతూ ఉంటారు. కానీ, మారే ప్రతిరాజకీయ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోటానికి మాత్రం ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మార్చుకుంటూనే ఉంటారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో గుజ్రాల్ కు ముందో ఆ తర్వాతో సి.పి.ఎం. కురువృద్ధుడు జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, సొంత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులే ఆ అవకాశాన్ని నేల రాసేసారు. కారణమేమిటంటే, సంకీర్ణ ప్రభుత్వంలో కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టేనట! అవకాశాన్ని అందిపుచ్చుకోలేని అర్భకులు, బయటి నుంచి మద్దతంటారు. ముప్పై నలభై మంది సభ్యుల మద్దతుతో దేశాన్ని సంకట పరిస్థితుల అంచుకు తీసుకువెళతారు.అణు ఒప్పందం దీనికో ఉదాహరణ.
ఆంద్రలో వీరు సాగించే భూపోరాటం, నందిగ్రాం వచ్చేసరికి అరాచకమౌతుంది! యు.పి.లో ములాయంతో కులుకుతున్న సమయంలో, మాయావతి చేసేదంతా అవినీతిలానే కనిపిస్తుంది. ములాయం చీకొట్టినప్పుడు మాత్రం ఆ మాయావతినే అందలమెక్కిస్తామంటారు.
ప్రతి ఎన్నికల సమయంలో మూడో ఫ్రంటు అవసరాన్ని ఆఘమేఘాల మీద జనాలకి ఉద్బోధలు చేస్తారు. నిజానికి, రెండు సంఖ్యల స్కోరు దాటలేని వీళ్ళు, మూడో ఫ్రంటును ఏమాత్రం ఉద్ధరిస్తారో దేశం అల్రెడీ చూసేసింది. కాబట్టి, ప్రస్తుతం దేశానికి మూడో ఫ్రంటు అవసరం లేదు. దానికున్న మరో కారణం ఏమిటంటే, భా.జ.పా., కాంగ్రెస్ లను ఓడించటమనే ఉమ్మడి ప్రణాళిక కన్నా, ఎవరికివారు ప్రధానులుగా అవ్వాలనే మూకుమ్మడి ప్రణాళికే మూడో ఫ్రంటులో భాగస్వాములకు ముఖ్యం కాబట్టి. మన్నికలేని మందల ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం ప్రజాస్వామ్యానికే చేటు.
కాంగ్రెస్ ను కుడి చెప్పుతో కొట్టి, భా.జ.పా.ను ఎడమ చెప్పుతో కొట్టి క్షమించేయవచ్చు. కానీ కమ్యూనిస్టులను క్షమిస్తే మాత్రం దేశద్రోహం కిందే లెక్క.
===
ఇక మన రాష్ట్రంలో చూద్దాం. Every thing comes at some price. గత ఎన్నికల్లో తెలుగుదేశం నాయకుడుచంద్రబాబునాయుడుగారు చెప్పిన మాట. కాంగ్రెస్ ఉచిత విద్యుత్తు అని ప్రజలను మోసం చేస్తున్నదని, ఓటర్లను మభ్య పెడుతున్నదనీ, ఇది చట్ట వ్యతిరేకమూ, రాజ్యాంగ విరుద్ధమూ అని గావు కేకలు వేసారు ఈ పెద్దమనిషి. ఇప్పుడు, కలర్ టీవీలు ఫ్రీ అంటున్నారు. వడ్డీ లేకుండా రైతులకు ఋణాలంటున్నారు. ఉచితంగా 12 గంటలు వ్యవసాయానికి విద్యుత్తు ఇస్తామంటున్నారు!
ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను ఎంత వెధవాయిలను చేసిందో తెలిసినా, మరి ఈ పోకడలేమిటో అర్ధం కాదు. విచిత్రమేమిటంటే, అప్పుడు చంద్రబాబునాయుడు 'ఉచితం' పై ఎలా విమర్శించాడో, ఇప్పుడు కాంగ్రెస్ అలానే విమర్శిస్తున్నది!
ఫ్రీగా వస్తే, ఫినాయిల్ కోసమైనా ఎగబడతారు ఈ ప్రజలు అని అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ఎన్నిసార్లు మనలని వెధవలకింద జమకట్టినా మనం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి ఓట్లు వేస్తాం, ఒక్క మారైనా ప్రశ్నించకుండా.
ఇప్పుడు ప్రజలకు కావల్సింది మూడో ప్రత్యామ్నాయమట. అరిగిపోయిన రికార్డునే ఇంకా అరగదీస్తూ... లౌకిక పార్టీలన్నీ మూడో ఫ్రంటులో చేరాలని పిలుపునిస్తున్నారు ఈయన. గతంలో, ఎన్.డి.ఎ. ప్రభుత్వాన్ని బయటి నుంచైనా సమర్ధించినప్పుడు ఈ లౌకికత్వం ఈయనగారికి ఎందుకు గుర్తుకురాలేదో!
అన్నీ ఫ్రీ అంటున్న ఈయన్ని ప్రస్తుతానికి లైటుగా తీసుకుంటేనే రైటు.
===
ఇక చిరంజీవి ప్రజారాజ్యానికి వద్దాం. నాలుగైదు దశాబ్దాలు పాతుకుపోయిన కాంగ్రెస్ ను తొమ్మిది నెలల్లో పెరికిపారేయటమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయపు అవసరాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశరాజకీయాల్లో చరిత్ర సృష్టించారు ఎన్.టి.ఆర్.
దానికి ఆయన ఎన్నుకున్న పంథా 'తెలుగువాడి ఆత్మగౌరవం'. ఆయన ఉపన్యాసాలు వింటే, రక్తం మరిగిపోయేది. అప్పటికప్పుడు ఏమైనా చేయాలి అనిపించేంతగా ఉడికిపోయేవాళ్ళు జనం. అప్పటి చారిత్రక, రాజకీయ అవసరాన్ని పరికిస్తే, ఇప్పుడు అటువంటి అవసరమేమీ కనిపించటంలేదు. అంటే, మంచి పార్టీలు ఉన్నాయని కాదు. అన్నీ ఒకే తాను గుడ్డలే.
చిరంజీవి ఎన్నుకున్న పంథా 'అవినీతి మీద యుద్ధం'. స్టాలిన్ సినిమానో, ఠాగూర్ సినిమానో చూసి మర్చిపోయేంత చిన్న విషయం కాదు. పోటెత్తి వస్తున్న ప్రజలకు దిశానిర్దేశం కలిగించేంతగా నాయకుడి ఉపన్యాసాలు కూడా వెల్లువై పొంగాలి. అవేమీ లేవు. భాష లేదు, హావభావాలు ప్రజలను ఆకట్టుకునేవేమీ లేవు. ఆవేశం అస్సలే లేదు. ఎక్కడో తెలియని ఓ భయంతో ఆయన ప్రసంగాలు సాగుతాయి.
సరే ఇవి అనవసరమే అనుకుంటే, ఆయన పార్టీ మిగతాపార్టీలకు ఏవిధంగా భిన్నం? పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులే సగం పైగా. కొత్త పార్టీకి కొత్త సభ్యులే ఉండాలని కాదు. ఆయా పార్టీల్లో ప్రాముఖ్యత కోల్పోయిన వాళ్ళు తప్పించి కొత్త రక్తం ఎక్కడా కనిపించటంలేదు. ఇక కొత్తరాజకీయాలేం కనిపిస్తాయి?
కొన్నిపార్టీలు 'సిల్లీ'గా విమర్శించాయని కాదు కానీ, సొంత మరదలికే న్యాయం చేయలేకపోయిన చిరంజీవి జనాలకేం చేస్తారు? కాబట్టి, దేశ రాజకీయాల్లో మరో వేస్ట్ కాండిడేట్ వచ్చారనుకోవటమే.
===
కొత్త రాజకీయాలు చేస్తామంటు మొన్నామధ్య వచ్చిన 'లోక్ సత్తా' గురించి కూడా ఓ రెండు విషయాలు అనుకుంటే సరిపోతుంది. ఆ పార్టీ వచ్చిన కొత్తల్లో నిజంగానే కొత్తగానే ఉండేది. ఆ పార్టీ బ్యానరు మీద గుర్తు, పేరు తప్పించి ఇంకేవీ ఉండేవి కాదు. కానీ కొన్నాళ్ళ క్రితం గాంధీని బ్యానర్ పైకి ఎక్కించారు. ఆ తర్వాత ఏవో దళితసభల్లో పాల్గొన్న గుర్తుగా, బ్యానర్ కు మరోవైపు అంబేద్కరును ఎక్కించారు.
అయ్యా జయప్రకాష్ గారు కొత్త రాజకీయాలు చేస్తామన్న మీకు, గాంధీ-అంబేద్కర్ బొమ్మలతో ఓట్లు అడుక్కునే మిగతా పార్టీలకు తేడా ఏమిటి? దానికితోడు, ఈమధ్యనే భావసారూప్యత ఉన్న ఇతర పార్టీలతో పొత్తు కూడా పెట్టుకునేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీతోనూ భావసారూప్యత లేదంటూనే కదా మీరు కొత్త పార్టీ, కొత్త రాజకీయాలంటూ పేనుతున్నది! పొత్తుల విషయంపై కనీసం ఆలోచించే స్థాయికి మీ పార్టీ చేరుకుందంటే, శతకోటి లింగాల్లో ఇదో బోడిలింగమనుకోవటమే.
But,....At last we need to vote,isn't it? otherwise its a crime!1
ReplyDeleteఏ పార్టీతోనూ భావసారూప్యత లేదంటూనే కదా మీరు కొత్త పార్టీ, కొత్త రాజకీయాలంటూ పేనుతున్నది! పొత్తుల విషయంపై కనీసం ఆలోచించే స్థాయికి మీ పార్టీ చేరుకుందంటే, శతకోటి లింగాల్లో ఇదో బోడిలింగమనుకోవటమే. - True, LS should protect its identity by itself.
ReplyDelete"కొత్త రాజకీయాలు చేస్తామంటు మొన్నామధ్య వచ్చిన 'లోక్ సత్తా' గురించి కూడా ఓ రెండు విషయాలు అనుకుంటే సరిపోతుంది"
ReplyDelete:)
మరో రెండు విషయాలు కూడా చెప్పండి, మీశైలిలో, మీదైనశైలిలో!
వోపిగ్గా ఇన్ని పార్టీల పోకడలను విశ్లేషించినందుకు మిమ్మల్ని అభినందించాలి.
ReplyDeleteకొత్తగా పిరమిడ్ పార్టీ ఏర్పడింది చూశారా? "శ్వాస మీద ధ్యాస" అంటూ ధ్యానం ఎలా చేయాలో శిబిరాల ద్వారా బోధించే సుభాష్ పత్రి ఏకంగా రాజకీయాల్లోకి దిగి "ధ్యాన యోగుల్ని ఎన్నుకుందాం రండి" అని పిలుపునిస్తున్నారు. అంటే ఇక రాజకీయాలకు సినిమా రంగమే కాక మరో కొత్త (అడ్డ)దారి కూడా ఉందన్నమాట.
దేవుడా రక్షించు ఈ దేశాన్ని!
సాయి కిరణ్ గారూ, ఒక పని చేద్దాం. ఎటువంటి లోపాలు లేకుండా, పవిత్రమైన పార్టీ ఒకటి మీరు పెట్టండి. దేశాన్ని మీరే బాగుచేయవచ్చు. భయపడకండి పోటీ చేసే అర్హత ను మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది. ప్రతి ఒక్కరి లోనూ ఇన్ని తప్పులు చూపిన మీరు ఖచ్చితంగా మంచి పాలననే ఇవ్వగలరు. నా ఓటు మీకే
ReplyDeleteమరేం చేయాలని మీరనుకుంటున్నారో మీనోటితోనే కూడా చెబితే బాగుండేది. ఐనా లోక్ సత్తా కొంతలో కొంత మేలని నా అభిప్రాయం. B.J.P. మరియు కాంగ్రెస్ లని అభిమానించే వాళ్ళ మానసికారోగ్యాలపై నాకెప్పటినుంచో అనుమానాలున్నాయ్.
ReplyDeleteగవ్ అన్న తెరాస నీ లిస్టులో లేదేమి? అది పులు కడిగిన ముత్యమా? లేక కావాల్సికన్న యాది మర్సిపోయినావా?
ReplyDeleteకాంగ్రేస్ పార్టీకి మిథ్యా లౌకికవాదం, కుహనా సొషలిజం, నెహ్రూ కుటుంబ జపం తప్ప వేరే సిధ్ధాంతాలు లేవు. బీజేపీ, కమ్యూనిస్టులకు సిధ్ధాంతాలు ఉన్నాయి. కాని వాటికి పూర్తి మెజారిటీ వస్తే కాని అసలు రంగు బయట పడదు. టీఆరెస్ సిధ్ధాంతం లోక విదితమే. ఇక సిధ్ధాంతం పై స్పష్టత లేని మరో పార్టీ ప్రజారాజ్యం. ఇది కేవలం వ్యక్తి ప్రతిష్ట పైనే అధార పడింది. ఐతే పురిట్లోనే అవినీతి, బంధు ప్రీతి, అశ్రిత పక్షపాతం లాంటి కళలన్నిటిలోనూ ఆరితేరింది.
ReplyDeleteలోక్ సత్తా సిధ్ధాంతం అవినీతిని అంతమొందిచడం. ఆ దిశలో అది స్పష్టమైన అడుగులు వేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం గందరగోళం లో పడి పోయి, నిరాశావాదంతో ఏదో ఒకరికి వోటు వేయడం కన్నా ఉత్తమ సిద్దాంతంతో ముందుకు వెళ్తున్న లోక్ సత్తాను బలపర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత. మంచిని గుర్తించలేక పోవడం అంటే పరోక్షంగా చెడుకు తోడ్పడటమే.