'ఒక్కోసారి చేసిన తప్పు కన్నా, ఆ తప్పుకు ఇచ్చే వివరణ అపాయకరంగా ఉంటుంది జహాపనా' అన్నడు బీర్బల్. అది నిరూపించకపోతే శిక్ష తప్పదని హెచ్చరించాడు అక్బర్. సీను మారింది. అక్బర్, బీర్బల్ ఒక సాయంత్రం తోటలో పచార్లు చేస్తున్నారు. ఒక గులాబీ మొక్క దగ్గర వంగి పూవును చూస్తున్నాడు అక్బర్. హఠాత్తుగా వెనుక నుంచి గిల్లాడు బీర్బల్. కోపంతో తిరిగి చూసాడు అక్బర్. మళ్ళీ రెండోసారి అలానే గిల్లాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు అక్బర్.. కాసేపాగి, స్థిమితపడి ఎందుకు కొట్టావని అడిగితే, క్షమించండి జహాపనా, అక్కడ వంగుని గులాబీ చూస్తున్నది 'మహారాణీ' గారనుకున్నాను అంటాడు. ఇక తర్వాతి కథ ఊహించుకోవచ్చు.
సరే పై కథను గొల్లపూడి గారి వివరణకు అన్వయించుకోవచ్చని వేరే చెప్పనక్కర్లేదనుకుంటా.
తన ముప్ఫై ఏళ్ళ రచనాకాలంలో, ఒక కాలమ్ కు వివరణగా మరో కాలమ్ వ్రాయలేదని ఆయన చెప్పిన వాక్యాలతో వివరణ మొదలౌతుంది. ఇది సంజాయిషీ కాదు, వివరణ మాత్రమే అని కూడా వక్కాణించేసారు. కిందపడ్డా మీసాలకు దుమ్మంటలేదనే సామెతను నిజం చేస్తూ చేసిన పలుకుల్లానే నాకు అనిపించాయి. నేను ఇంకా వ్రాస్తూనే ఉన్నాను అని జనాలకు చెప్పటమే లక్ష్యంగా ఆయన వ్రాసిఉంటే, నేను చేయగలిగిందేమీ లేదు.
అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధనారీ పతివ్రతా :
అసమర్ధుడు సాధువుగాను, డబ్బులేని వాడు జితేంద్రియుడుగాను, వృద్ధుడు భక్తుడుగాను, వృద్ధనారి పతివ్రతగానూ చలామణీ అవుతుంటారని భావం. మొన్నీమధ్యే 'ఆవకాయ'లో ఒకరు పోస్టు చేసిన ఈ శ్లోకం దాచి ఉంచుకున్నాను.
ఇందులో 'వృద్ధనారీ పతివ్రతా:' అన్న లైను కూడా గొల్లపూడిగారి వ్యాసాలు (స్లమ్ డాగ్ మీద) విశ్లేషిస్తే నిజమని అర్దమౌతుంది. అంతకుముందుగా నేనో మాట చెప్పాలి. గొల్లపూడి గారితో నాకెటువంటి విరోధమూ లేదు. అస్సలామాటకు వస్తే, పరిచయం కూడా నాస్తి. 'సంసారం ఓ చదరంగం' సినిమాలో ఓ మంచి నటుడుగా ఆయనని నేనెరుగుదును. కాబట్టి, ప్రాజ్ఞులు నా విమర్శను గొల్లపూడి గారి స్లమ్ డాగ్ మీది ఆ రెండు రచనల పరంగానే భావించమని మనవి చేస్తున్నాను.
'కళ' గురించి ఆయన చెప్పిన ఉదాహరణ, వాక్యాలు సరే సరి. అవేమీ ఆయన ఈరోజు చెబితేనే తెలిసినవి కాదు. నిజానికి, సినిమాల గురించి అందునా ఇప్పటి సినిమాల గురించి మాట్లాడేటప్పుడు మనం కళ గురించి, కళాకారుల గురించి ప్రస్తావన తీసుకురాకూడదు. కళ గురించి ఆయన చెప్పింది కూడ, చర్చను పక్కదోవ పట్టించటానికే అని నా అనుమానం.
అందులోని విపరీతమైన సంకుచితత్వ ధోరణిని కూడా ఖండించాల్సిందే. కళలకు, కళాకారులకు కుల, మత, జాతి వివక్షలుండవని అంటారు. అందునా, సినిమా నటులను, తదితర చలనచిత్ర సంబంధీకులను కళాకారులుగా పరిగణించే గొల్లపూడి గారు స్లమ్ డాగ్ దర్శకుడిలో కళాకారుడిని ఎందుకు చూడలేకపోయారు? సంకుచిత ధోరణితో ఆయన ఇచ్చిన వివరణ ఏమాత్రమూ సహేతుకంగా లేదు.
నిజానికి, ఆ వ్యాసాలు గొల్లపూడి గారు వ్రాసి ఉండరనే నా నమ్మకం. వేమన మరణించిన తర్వాత కూడా, వేమన పేరుతో చాలామంది వేమన పద్యాలు వ్రాయటం జరిగింది. అలానే, మన నిజమైన గొల్లపూడి గారు కాక, ఆయనలోని మరో గొల్లపూడి గారు వ్రాసిన వ్యాసాలవి. నిష్కర్షగా చెప్పాలంటే, సారం పోయి, శేషం మిగిలిన గొల్లపూడి గారు వ్రాసిన వ్యాసం. కనుకనే, నాలాంటి సామాన్యుడు కూడా, ఆ వ్యాసాలలోని సంకుచిత ధోరణిని గ్రహించగలిగాడు.
గొల్లపూడిగారు చెప్పినట్లుగానే కథలతోనో, కవిత్వంతోనో సమాజాన్ని ఉద్ధరించగలమని భావించటం సహేతుకం కాదు. కానీ, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఒక్కటుంది. సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా, వాటివాటి పరిధుల్లో ప్రజలను, తద్వారా సమాజాన్ని కొంతమేరకు ప్రభావితం చేసే శక్తి కళలకు ఉన్నాయనేది నిర్వివాదాంశం. బంకించంద్ర వందేమాతరం, గురజాడ కన్యాశుల్కం వాటికి ఉదాహరణలు. ఇకపోతే, సినిమా ఒక 'కళాకృతా' కాదా అనే మీమాంస పక్కనబెట్టి చూస్తే, ప్రస్తుత సమాజంలో సినిమాల ప్రభావాన్ని అంచనా వేయటం కష్టమైనా, ఆ ప్రభావం లేదని చెప్పటం మాత్రం కుదరదు.
నిత్యజీవితంలో హేయమైన జీవనాన్ని యధాతథంగా చూపాలంటే తెరే అక్కరలేదు, అద్దం చాలు అంటారు గొల్లపూడి గారు. మనకు కళ్ళు ఉంటే, అసలు ఆ అద్దం కూడా అనవసరం అని నేనంటాను. మనకు కళ్ళు లేవు కాబట్టే, ఉన్న కళ్ళు కూడా రంగుటద్దాల మాటున నిద్రిస్తుంటాయి కాబట్టే, సత్యజిత్ రే, మృణాల్ సేన్ లు Art Films తీస్తుంటారు. అలా అని, స్లమ్ డాగ్ దర్శకుడిని ఈ మహానుభావుల పక్కన పెట్టటంలేదని గ్రహించండి. సినీ హీరోల అభిమానుల హేయమైన జీవనాన్ని ఆ ఒక్క దృశ్యం ద్వారా అతను చూపించాడు అని మాత్రమే చెబుతున్నాను. ఇంతటి హేయమైన విషయంలో కళాత్మకత ఉండాలని వాదించేటట్లయితే, నేను మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్న ఒక్కటే 'మెరుపుదాడి లేదంటే ప్రళయసింహం'లాంటి సినిమాల్లో మీరెటువంటి కళాత్మక విలువలు ఉన్నాయని నటించారు?
ఆయన చెప్పిన అభిరుచి దారిద్ర్యం విదేశీయులకు కాదు, మనకే ఉంది. అందుకనే, ఆరు పాటలు, ఆరు ఫైట్లు, నాలుగు కామెడీ ట్రాకులతో మాత్రమే సినిమాలు తయారౌతాయి.. మనం చేసే సినిమాలకు, స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు చాలానే తేడాలున్నాయి. ఆ సినిమాలో మీసాలు మెలేసి, తొడలు గొట్టి ఒక్కడే పదిమందిని నరికిపారేసే హీరోలు లేరు. ట్రాఫిల్ లైట్ల కూడలిలో అడుక్కునే పిల్లలు ఎలా తయారౌతున్నారో చూపించిన కథ అది. వానపాటల్లో, పాల పాటల్లో, బురదలో పొర్లాడే హీరో హీరోయిన్లు లేరు. హద్దులు మీరిన అభిమానంతో మలకూపాలలో ఈదులాడే మన మనస్తత్వాన్ని ఎండగట్టిన కథ అది. చెప్పుకుంటే, చేంతాడంత అవుతుంది.
దేశ ఔన్నత్యాన్ని కించపరిచే సినిమాగా ఆయన దీన్ని అభివర్ణించటం ఓవర్ యాక్షనే. ఆ మాటకొస్తే, అడవిరాముళ్ళు, గూండాలు, మంగమ్మగారి మనవళ్ళు మన దేశ లేదంటే రాష్ట్ర ఔన్నత్యాన్ని ఏరకంగా గొప్పగా చూపించాయి? అలా గొప్పగా చూపించిన ఎన్ని సినిమాలకు ఆయన రచయితగా చేసారు? ఎన్ని సినిమాల్లో నటించారు? బహుశా తప్పు ఆయనది కాదనే వాదన కూడా రావచ్చు. జనాలు చూస్తున్నారు కాబట్టి అటువంటి సినిమాలు వచ్చాయని వాదిస్తే, ఆ వాదన ఈ సినిమాకు ఎందుకని అన్వయించుకోకూడదు.
నిష్టూరమైనా, నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగిన సినిమా అది. ఆ మాత్రం నిజాయితి ఎంత మంది మన దర్శకులకు ఉందో మనకన్నా, గొల్లపూడి గారికే బాగా తెలిసుంటుంది. అందుకే ఆయనకో చిన్ని సలహా. చచ్చినా ఆ సినిమా చూడనన్నారు. చచ్చే ముందు ఓసారైనా ఈ సినిమా చూడమని నా మనవి.
సర్
ReplyDeleteమీరు నవతరంగం చూశారా?
మీ సినిమా వ్యాసాలు నవతరంగంలో చూడాలని ఉంది