రోజువారీ ప్రయాసే. అయినా ప్రతిరోజూ ఓ కొత్తపోటి. గెలవాలనే ప్రతిఒక్కరి పట్టుదల. తను గెలవాలని చెప్పటంకన్నా, పక్కవాడిని ఓడించాలనే పట్టుదలగా చెప్పుకోవచ్చేమో! ముంబాయి లోకల్సులో ప్రయాణం, ప్రతిఒక్కరికీ జీవించటం ఎలానో నేర్పుతుంది. గెలవటం ఎలానో నేర్పుతుంది. మౌనిగా ఉండటం ఒక్కోసారి ఎంత మేలో నిరూపిస్తుంది కూడా.
పదిమంది నుంచోగల చోటులో దాదాపు యాభైమంది నుంచుంటారు. ముగ్గురు కూర్చోవాల్సిన సీటులో అయిదుగురు కూర్చుంటారు. సర్దుబాటు ధోరణి మనం నేర్చుకునేలా చేస్తుంది ఈ పరిస్థితి. అసలు పై నుంచి ట్రైను వచ్చేటప్పుడే పోటీ మొదలౌతుంది.
ఆచంట మల్లన్నలు ప్లాట్ ఫాం అంచుకు అడుగు దూరంలో నుంచుంటారు, వచ్చే ట్రైనులో అందరికన్నా ముందు ఎక్కేయటానికి. అతనికంటే ఘనుడు కూడా ఉంటాడు. వాడు సరిగ్గా కూతవేటు దూరంలో ట్రైను ఉన్నప్పుడు మల్లన్న ముందుకు సరిగ్గా వచ్చి నుంచుంటాడు. ట్రైను వచ్చేస్తున్నప్పుడు మల్లన్నని వెనక్కి తోస్తాడు. అదీ టెక్నిక్. అందులో ప్రమాదాలూ ఉన్నాయి. ఎలా అంటే, ట్రైనులో ఉన్న మరో ఘనుడు, ట్రైను ఆగక ముందే అందరికన్నా ముందుగా దిగటానికి తయారై ఉంటాడు. ఒక్కసారిగా దూకేస్తాడు కూడా. అప్పుడు ఘనులిద్దరు, మల్లన్నలు మల్లయుద్ధాలలో ఓ రెండు సెకన్లు కూడా గడిపేస్తారు.
వీరిని మించినవారు స్థితప్రజ్ఞులు. ట్రైను వచ్చేదాకా వాళ్లెక్కడ ఉన్నదీ ఎవరికీ అంతుపట్టదు. సరిగ్గ సమయానికి గుంపులో గోవిందా అంటూ నిలబడతారు. ఘనులు, మల్లన్నల తోపులాటలో తమ ప్రమేయం లేకుండానే ఎక్కేస్తారు, అలానే దిగేస్తారు. బండి ఆగే ముప్పై సెకన్లలో 15 సెకన్లు దిగేవారికి, 15 సెకన్లు ఎక్కేవారికి. ఈ సమయంలోనే, చిన్నపాటి కురుక్షేత్రాలు!
విషయం ఎక్కేయటంతోనే అయిపోదు. అందరికన్నా ముందుగా సీటు కోసం వెదుకులాట. అది లేకపోతే, సీట్లమధ్య నుంచోటానికి తోపులాట. పైన హాండిల్సు పట్టుకోటానికీ పెనుగులాట. పక్కవాడు పూసుకున్న పెర్ ఫ్యూం నుంచి, వాడు ఏం తినొచ్చాడనే విషయం వరకూ అన్నీ తెలిసిపోతాయి. మధ్యమధ్యలో గన్నాయిలుంటారు. పక్కవాడికి వాడెలా నుంచోవాలో, ఎలా పట్టుకోవాలో నేర్పుతుంటారు। విని ఊరుకునేవారికి ఫర్వాలేదు. కాదంటే, ఆ కాస్త జాగాలోనే మరో కదనరంగం తయారౌతుంది.
ప్రపంచంలోని హడావుడీ అంతా ఇక్కడే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ప్లాన్లు తెలిస్తే, ఆశ్చర్యపోవటం మనవంతౌతుంది. కొత్తల్లో ఎక్కడపడితే అక్కడ నుంచుని, కనిపించే డబ్బాలో ఎక్కేస్తారు జనాలు. కొన్నాళ్ళుపోతే, లోటుపాట్లు అర్ధమౌతాయి. ఎలానంటే, దిగే స్టేషనులో, బయటకు వెళ్ళే మెట్ల దగ్గరగా ఏ డబ్బా ఆగుతుందో, అదే ఎక్కుతారు చాలామంది. లేట్ కమింగ్ లతీఫ్ లు మాత్రం, చివరి డబ్బాల్లో వ్రేల్లాడుతూ ఉంటారు. ఎందుకంటే, పరుగెత్తుకొచ్చినప్పుడు ఈజీగా అందే డబ్బా అదే కాబట్టి. మరి కొందరికి హడావుడీని అనుభవించటం కన్నా, అందాన్ని ఆస్వాదించటం ముఖ్యం. ఎప్పుడు చూసినా అవే గబ్బిళాల్లా, వాళ్లేప్పుడూ లేడీస్ డబ్బాల దగ్గరే వ్రేల్లాడుతుంటారు.
నుంచొనే కునికిపాట్లు పడేవారు కొందరైతే, ఎక్కటం ఆలస్యం యోగనిద్రలో మునిగితేలేవాళ్ళు మరి కొందరు. చెవుల్లో మొబైలు సొద వింటూ, పక్క డబ్బాలో అమ్మాయిలను ఓరకంట చూస్తూ లైన్లేసేవారు కొందరైతే, పట్టాలవెంబడి వెళ్ళే వాళ్ళను వెకిలిగా పరామర్శించేవాళ్ళు మరి కొందరు.
ఆవేశకావేశాలకు ఇవి ఆలవాలమే. ఇవన్నీ పట్టించుకోకుండా స్థితప్రజ్ఞత సాధించాలనుకునేవారికీ ఇవి మంచి తర్ఫీదునూ ఇచ్చేవే. ఇవన్నీ ఏమోగానీ, పర్సులు, డబ్బులు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సందట్లో సడేమియాగాళ్ళు పొద్దున, సాయంత్రం హడావుడీ టైములో ఓటీ పనిచేస్తుంటారు.
మీరు రాసిన శైలి బాగుంది
ReplyDeleteమేమూ మూడేళ్ళు బొంబాయిలో ఉన్నామండి. వెళ్ళిన ఆర్నెల్ల తరువాత ఒక్కదాన్నీ లోకల్స్ లో ప్రయాణించటం అలవాటు చేసుకున్నాను. కానీ లేడీస్ డబ్బాలో కన్నా జెనరల్ డబ్బాల్లోనే ప్రయాణం సులువు. స్టేషన్ ఎటు వస్తుందో ఎలా చెప్పగలుగుతారా అని మొదట్లో ఆశ్చర్యం వేసేది. ముంబయ్ లోకల్స్ గురించి చెప్పాలంటే ఓ పుస్తకమే రాయచ్చు.
ReplyDelete