Wednesday, August 26, 2009

భారతీయ జనతా పార్టీ - ఓ ప్రహసనం

మహాత్ముని అభీష్టానికి వ్యతిరేకంగా, ఎన్నికల రాజకీయాల్లో దిగాలనే నెహ్రూ తలంపుకు తలొగ్గిన కాంగ్రెస్, స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయాలను దాదాపు మూడు దశాబ్దాలపాటు అడ్డు లేకుండా శాసించింది. నామమాత్రపు ప్రతిపక్షాలతో కాంగ్రెస్ చెప్పిందే వేదమయ్యింది. పార్టీని బలోపేతం చేయాలనే తలంపుతో, ఉన్న వైరిపక్షాలను కూడా అణగదొక్కే ప్రక్రియలు కూడా ఆనాటి నుంచే కాంగ్రెస్ ప్రారంభించింది.

దేశంలోనే మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేయగలిగిన నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేసేంతవరకూ నెహ్రూ నిద్రపోలేదంటే నమ్మటానికి కష్టమే. కానీ, అది చారిత్రక సత్యం. ఆ పెడధోరణుల వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ దాదాపుగా కొనసాగించింది. ఈ రాజకీయ వికృతత్వం చివరికి దేశంలో అత్యవసర పరిస్థితికి కూడా దారి తీసింది. దాదాపుగా ప్రతిపక్షమనే మాటే వినబడకుండా దేశాన్ని ఏలాలనే ఇందిర నిరంకుశత్వ ధోరణి ఆ అత్యవసర పరిస్థితికి మూలకారణం.

సరే, ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీ ఏర్పాటు కావటం జరిగింది. అప్పటి జనసంఘ్ ఆ క్రమంలోనే జనతా పార్టీలో భాగమయ్యింది. అప్పటి ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసిన జనతా పార్టీ, సద్దుమణగని అంతర్గత వివాదాల, నేతల అధికార దాహాల మధ్య ఒక ప్రయోగంగానే విఫలమైంది. ఎవరు తెచ్చుకున్న కుంపట్లు వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ సొంత కాపురాలు పెట్టుకోవటం కూడా జరిగింది. అనాటి జనసంఘ్, అవే ఆదర్శాలతో ఇప్పటి 'భారతీయ జనతా పార్టీగా' రూపాంతరం చెందింది.

అరువు తెచ్చుకున్న ఆదర్శాలతో, వామపక్షాలు కూడా ఒకటి రెండు రాష్ట్రాలు మినహా కాంగ్రెస్ కు సరి అయిన ప్రత్యామ్నాయం కాలేకపోయారు. దానికితోడు వామపక్షాల మధ్య ఉన్న విభేదాలు కాంగ్రెస్ అనుకూలంగా మలచుకోవటంలోనూ కృతకృత్యమయ్యింది. నైతికవిలువలతో, నైతికాదర్శాలతో రాజకీయాల్లో దూసుకెళదామని వచ్చిన భా.జ.పా. కూడా ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.

జన్ సంఘ్ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న హిందువులను 'లౌకిక ఆదర్శాల' పేరుతో వంచిస్తున్న కాంగ్రెస్ కు ధీటైన ప్రతిపక్షంగా నిలవాలంటే, మెజారిటీ అభిప్రాయాలను గౌరవించాలని భా.జ.పా. గ్రహించేటప్పటికే దాదాపుగా ఒక దశాబ్దం పట్టింది. ఆ సమయంలో పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న అద్వాని హిందుత్వ ఏజెండాతో మొదలు పెట్టిన 'రామ్ రథ్ యాత్ర' కు దేశప్రజలు నీరాజనాలు అర్పించారు. అప్పటివరకూ నామమాత్రపు పార్టీగా ఉన్న భా.జ.పా. కొన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టటమే కాక, 1991 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది.

ఇక అసలు ప్రహసనం మొదలయ్యింది 1996 ఎన్నికల తర్వాత. పదమూడు రోజుల ప్రధాని పదవి అనుభవించిన వాజ్ పేయి తదితర నాయకులు, ఆ స్థాయికి చేర్చిన హిందువులను మరచిపోయింది ఆ సమయంలోనే. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని పదవి పగ్గాలే ధ్యేయంగా అవకాశవాద పార్టీలతో అవకాశవాద పొత్తులు పెట్టుకొని మూల సిద్ధాంతాలను కాలదన్నింది 1998 ఎన్నికల సమయంలో.

అధికార దాహం, పదవీ లాలసత ఎంతటివారినైనా దుర్బలులని చేస్తుంది అనటానికి ప్రత్యక్ష తార్కాణం వాజ్ పేయి, అద్వానీ తదితర నేతలు. హిందుత్వ ఏజెండాతో అద్వానీ చేపట్టిన రామ్ రథ్ యాత్రకు అడ్డు చెప్పని వాజ్ పేయి ఆ తర్వాత అయోధ్య విషయంలోను, గోథ్రా మారణకాండ నేపథ్యంలోనూ కొనసాగించిన రాజకీయాలు కేవలం పదవిని నిలుపుకోటానికి పడిన తాపత్రయంగానే కనిపిస్తుంది. అటువంటి రాజకీయాలు చేసి 'లౌకికవాది'గా ముద్ర వేయించుకోవాలనే తపనే కనిపిస్తుంది.

అత్యధిక స్థానాలు గెలిపించిన హిందువులను కాదని, కొసరు పార్టీల సహకారంతో అధికారపు అందలం ఎక్కిన భా.జ.పా., హిందువులకు చేసింది శూన్యం. 1998లో తాకట్టు పెట్టిన సిద్ధాంతాలను 2004 ఎన్నికలకు బయటకు తీసినా హిందువులు నమ్మలేదు. హిందువులు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలనుకున్నారే కానీ, కాంగ్రెస్ కు కాంగ్రెస్ లాంటి పార్టీనే ప్రత్యామ్నాయం కావాలనుకోలేదు.

ఈ నీచ రాజకీయాలను ఛీత్కరిస్తూ తదుపరి ఎన్నికలలో కూడా హిందువులు భా.జ.పా.కు బానే బుద్ధి చెప్పారు. రక్తాన్ని మరిగిన పులిలా, అధికారానికి అయిదేళ్ళు అలవాటుపడ్డ భా.జ.పా. నేతలు ఆ అధికారం చేజిక్కించుకోటానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలలో భాగంగానే సిద్ధాంతాల రాద్ధాంతం మొదలయ్యింది. ఇదంతా ముసుగులో గుద్దులాటగానే సాగింది గత అయిదేళ్ళల్లో. ఇప్పుడు మాత్రం తెరపైనే ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ జన్మకోసారైనా ప్రధాని కావాలనుకునే అద్వాని, తన కోరిక తీర్చుకోటానికి తాను తీర్చిదిద్దిన పార్టీని, తనను తీర్చిదిద్దిన సిద్ధాంతాలనే రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వెన్నుదన్నుగా ఉన్న హిందువులను, కార్యకర్తలను కూడా బలిపశువులుగా చేసేందుకు వెనుకాడటంలేదు.

కాంగ్రెస్ బాపతు లౌకిక పార్టీలకు మన దేశంలో కొరతలేదు. ఉన్న పార్టీలన్నీ దాదాపుగా ఆ తాను గుడ్డలే. మైనారిటీల ప్రాపకం కోసం, భా.జ.పా.ను కూడా ఆ తానులో భాగంగా చేర్చే ప్రయత్నంలో, భా.జ.పా. నేతలు ఆ పార్టీకే సమాధి కడుతున్నామని గ్రహించలేకపోవటం విచారకరం. రంగు మార్పిడి రాజకీయాలను ప్రజలు, ముఖ్యంగా హిందువులు హర్షించలేదనటానికి గత రెండు సార్వత్రిక ఎన్నికలు ఉదాహరణ.

గోథ్రా దారుణానికి ప్రతిచర్యగా కొనసాగిన గుజరాత్ మారణహోమానికి నరేంద్ర మోడిని సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వాజ్ పేయ్ బాధ్యుడిని చేయటం హిందువులనే కాదు, అందరినీ నివ్వెరపరచింది. ఆ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెత్తుమాట అనని వాజ్ పేయి ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రంగుమార్చిన వైనం ఆ పార్టీ నాయకత్వపు సందిగ్ధస్థితినే తెలుపుతుంది.

ఓటు బ్యాంకు రాజకీయాలాడే కాంగ్రెస్ కే పాఠాలు చెప్పే విధంగా భా.జ.పా. నేతలు ప్రవర్తించిన తీరు ఆ పార్టీపై హిందువులకున్న సానుభూతిని కూడా కోల్పోయేలా చేసింది. అందుకు జిన్నాపై అద్వాని చేసిన ప్రకటనలు ప్రబల సాక్ష్యం. ఇప్పుడు జస్వంత్ సింగ్.

ఏదేమైనా, అధికారం కోసం అర్రులు చాస్తున్న భా.జ.పా. నేతలు తమ మూలాలు మళ్ళీ వెతుక్కోవటం అవసరం. అధికారం కావాలంటే, మెజారిటీ ప్రజల మనసులు గెలుచుకోవటం అవసరం అని గ్రహించాలి. వస్తాయో రావో తెలీని మైనారిటీ ఓట్లకు వెంపర్లాడుతూ ఉన్నవి ఊడబెరుక్కునే వెర్రి నేతల తతంగానికి ఇకనైనా ముగింపు పలకాలి. అసలు ఇప్పటి పార్టీ స్వరూపస్వభావాలనే సంపూర్తిగా మార్చాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.

70 పైన వయసు పడ్డ నేతలను నిర్మొహమాటంగా తొలగించాలి. మూల సిద్ధాంతాలకు మసిపూస్తున్న నేతలను కూడా నిష్కర్షగా తొలగించాలి. అవసరమైతే, ఆరెస్సెస్సె ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలి.

3 comments:

  1. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం గా ఉన్న ఒక్క పార్టీ ని చూపించండి. సెంట్రల్ లో మరొక పార్టీ రావటానికి దిక్కేది, మన ఖర్మ కాలి దిక్కుమాలిన కాంగ్రెస్ నే ఎన్నుకునే దౌర్భాగ్యం మనది. ఎవరో అన్నట్టు "Indians neither have the capability nor the intentions to develop and change" That's all to it

    ReplyDelete
  2. Hi Kiran,

    I think it is hightime for BJP to merge with Muslim League OR Majlis Ittehadul Muslimeen! :))

    Congress is relieved! No opposition for them. Communists are shoe-lickers like Somnath. Kumari/Smt. Maya Kanshi Ram , Kumari/Smt. Jaya Shobanbabu are heavy-weights!

    RSS is useless. For Sudarsan, Jinnah is secular. Only RSS is communal and gaddar. Good, but why these guys are discovering Jinnah now?!! why never uttered a word before?! Are they getting enlightened all of a sudden after their seventies or loosing sense due to oldage. Vajpai is a crook who want to control even from his grave. He is behind all this.

    Sankar

    ReplyDelete
  3. ఎలా మొదలేయాలనేదే అసలు సమస్య...

    కనిపించిన ప్రతిరాయి
    రహస్యంగా నవ్వుతోందనే అనుమానం
    దూరతీరాలకు

    వాఆఆఆఆవ్....స్టటింగే ..లోనే..ఆకట్టుకొనేసారు...కిరణ్ గారు.....మీ కవితల BLOG ఇన్నాళ్ళకు చదువుతున్నాను!!!!
    ఆహా ఎంత భాగ్యం ఇవాళ నాకు....

    ReplyDelete

మీ అభిప్రాయం :