కవిత్వంలో సామాజిక కోణం కొందరికి మింగుడు పడదేమో అనే ఆసక్తికరమైన అనుమానాన్ని వ్యాఖ్యగా ప్రకటించారు అఫ్సర్ గారు, నా బ్లాగులో. నిజమే, చాలామంది విమర్శకులకు, కవులకు కవిత్వంలో సామాజికత మింగుడుపడదు. నావరకు, కవిత్వంలో సామాజిక భావన అంతర్లీనమైతే బానే ఉంటుంది. కానీ, సో కాల్డ్ సామాజిక కవులు మాత్రం సామాజిక భావనలో అంతర్లీనంగా కూడా కవిత్వాన్ని ప్రవేశపెట్టలేకపోవటమే, ఆలాంటి కవిత్వం మింగుడుపడకపోవటానికి కారణం.
దానికి తోడు, ఓ సునామీనో, బాంబుదాడో, మరో దుర్ఘటనో జరిగినప్పుడు "రక్త మాంస దాహం" పేరిట బలవంతపు తంతు నడిపిస్తారు. ఆ తంతులో పాలుపంచుకోకపోయినా, లేదా విమర్శించినా సంఘీభావం ప్రకటించలేదనే ప్రతివిమర్శతోపాటు, సదరు కవినో, విమర్శకుడినో "అనిబద్ధుడు"గా వెలివేయటం కూడా కద్దు.
ప్రస్తుత తెలుగు కవిత్వంలో, ప్రముఖమైన సామాజిక కవిగా ప్రఖ్యాతి గడించిన శివారెడ్డిగారి కవితలు చాలావరకు, ఒకానొక పూనకంతో కవిత్వానికి హద్దులు చెరిపేసే ప్రయత్నాలే. అంతేకాదు, అతి విస్తరణ దోషాలు కూడా ఆయన కవిత్వంలో పరిపాటి. ఆయన ఆదర్శంతో కలం పట్టిన చాలామంది చిన్న, చితక కవులు కూడా అలా స్పందించగలిగితేనే కవులం కాగలమనే భ్రమల్లో ఉన్నారనేది వాస్తవం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఫ్సర్ గారి కొన్ని కవితలు అసంతృప్తి కలిగించాయని చెప్పటం జరిగింది. సామాజికతను అంతర్లీనంగా చొప్పించిన కొన్ని అద్భుతమైన కవితలు చూసాక, ఆ అసంతృప్తి మరికొంత ఎక్కువయ్యింది. అంతేకానీ, శివారెడ్డి ప్రభావం అఫ్సర్ గారి మీద ఉన్నదని చెప్పే తప్పు మాత్రం చేయలేదండోయ్.
ఒకానొక చోట అదేలాంటి ఆవేశం, మరికొన్ని చోట్ల అదేలాంటి విస్తరణ నాకు కనిపించింది ఈ సంకలనంలో. ఇక ఈ రాజకీయ, సామాజిక వాసనలని పక్కనపెట్టి, మరికొన్ని మంచి కవితలు ఆస్వాదించుకుందాం.
* * *
మరోసారి చదివిన తర్వాత, అద్భుతమనిపించే మరో విశేషమేమిటంటే, అనుభూతులను ఆస్వాదించటంలో పాఠకులకు కలిగే స్వేచ్ఛ. ఒకానొక అనుభూతికే, పాఠకులను పరిమితం చేసే కవిత్వం కాదు. ముఖ్యంగా కవిత్వాతీత స్థితిని ఆస్వాదించాలనుకునే నాలాంటి పాఠకులకు కొన్ని వాక్యాలు అనిర్వచనీయం.
నీటి కడుపులోకి వెళ్ళి
మళ్ళీ తీరమ్మీదకి
పసిపిల్లాడిలా పరుగెత్తుకుంటూ వచ్చే అల
బతుక్కి ఇంకో తలుపు - మరణం
* * *
చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజు తెలుస్తూనే వుంది
* * *
వొక సెలయేరు
పరిగెత్తుకుంటూ వెళ్తూ
కాసిన్ని నీటి బిందువుల్ని
పై మీద చిలకరించి వెళ్ళింది
తీరా చూస్తే
ఆ నీటి బిందువు నేనే
అచ్చంగా
* * *
లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరి మీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
* * *
బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం.
* * *
ఏదేమైనా, ఈ సంకలనంలో అద్భుతమైన కవిత్వం చాలా ఉన్నదనే విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు.
కానీ, సో కాల్డ్ సామాజిక కవులు మాత్రం సామాజిక భావనలో అంతర్లీనంగా కూడా కవిత్వాన్ని ప్రవేశపెట్టలేకపోవటమే,
ReplyDeleteకరక్టుగా చెప్పారు. సామాజిక కవిత్వంలో ఏ కొద్దిపాటి చమక్కో ఉన్నా కూడా చాలా బలంగా తాకగలదు. నిలవా ఉంటుంది. కానీ అలా కాకుండా ఉత్త వచనాన్ని, మరీ అన్యాయంగా స్టేట్ మెంట్లని కవిత్వపాదాలుగా విభజించి కవిత్వంగా చలామణీ చేయటం పట్లే నా అభియోగం కూడా. దానికి తోడు చంపండి నరకండి ధోరణి పోయిందబ్బా అనుకొంటూండగానే పులిమీద పుట్రలా ఇప్పుడీ ప్రాంతీయ పోరాట కవిత్వాలొకటి వచ్చి పడ్డాయి.
సుబ్బరంగా వ్యాసాలో, కరపత్రాలో వేసుకోక కవిత్వాన్నెందుకు చెరుపుతారో అర్ధంకాదు. ( చెరపటం అంటే తూ.గో. మాండలీకంలో వేరే అర్ధం - డిస్క్లైమర్: ప్రాంతీయతత్వం ఇక్కడ సార్వజనీనం)
అఫ్సర్ గారి కవిత్వం గురించి నేను చెప్పేదేముంటుంది. అదొక అనుభవం అంతే. అనుభవించాల్సిందే. ఆనందించాల్సిందే. అంతే.
మంచి పుస్తకానికి మంచి పరిచయం. మీరు కోట్ చేసిన పంక్తులు చాలా గొప్పగా ఉన్నాయి
బొల్లోజు బాబా