Friday, March 5, 2010

"చివరకు మిగిలేది" - ఓ ఆక్రోశం


"చివరకు మిగిలేది" పురాణమూ కాదు, ఇతిహాసమూ కాదు. కాకమ్మ కథ, పిచ్చుకమ్మ కథ లాంటి బుచ్చిబాబు వ్రాసిన కథ. జీవితంలో ప్రేమించలేకపోవడమే ఒక విషాదంగా నమ్మి, దానికి తను నమ్మిన ఇతర తాత్వికచింతనలు జోడించి నలుగురితో తన బాధను పంచుకుందామని "బుచ్చిబాబు" చేసిన ప్రయత్నం "చివరికి మిగిలేది". 1952 లో జరిగిన మొదటి ముద్రణ నుంచి, 2006 వరకు జరిగిన ఆరవ ముద్రణ వరకు, యాభైనాలుగేళ్ళల్లో ఆరు ముద్రణలు పూర్తి చేసుకున్నదంటే నవల ఖచ్చితంగా క్లాసిక్కే. క్లాసిక్ కాకపోయినా, యాభై ఏళ్ళ తర్వాత కూడా పాఠకులు ఆదరిస్తున్నారు కాబట్టి, తెలుగు సాహిత్యంలో నవలకు, నవలకున్న అగ్రస్థాయికి వచ్చిన ఢోకా ఏమీలేదు.

విషయం పక్కనపెట్టి, స్థూలంగా "చివరికి మిగిలేది" ఒక కథలా మాత్రమే పరిగణించి పరికిస్తే, కథనంలో కవిత్వాత్మక వచనం, ఆత్మ సంశోధనా, సంవేదన భరితమైన కొన్ని రసవత్తర ఘట్టాలు తప్పించి, ఓ సామాన్యమైన కథే కనిపిస్తుంది. "కన్యాశుల్కం" లాంటి రచనలతో పోలిస్తే, అక్కడక్కడ స్త్రీస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించటం తప్పించి, ప్రత్యేకించి ఎన్నదగ్గ సామాజిక విలువలు కూడా లేవు.

చెప్పుకోదగ్గంతగా లేని సామాజిక విలువల కారణంగా పుస్తకానికి పట్టం కట్టలేని పరిస్థితి ఒకవైపైతే, పేలవమైన కథ కారణంగా, కథనంలోని అద్భుతమైన సాహితీ విలువలకు పట్టం కట్టలేని దుస్థితి మరో వైపు. నా ఆక్రోశం కూడా అదే!

* * *

సామాజిక ధృక్కోణాలు మారుతున్నాయి. అలానే, సామాజిక, సాహితీ విలువలు కూడా మారుతున్నాయి. ఆలోచనా పరిధుల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో గమనిస్తే, పుస్తకం.నెట్ లోని "హేలి" గారి సమీక్ష నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు, నెత్తి నోరు బాదుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. "

శరత్ సాహిత్యంలో తలమానికమై భాసించే "దేవదాస్" కు పట్టిన దుర్గతితో పోలిస్తే, హేలీ గారి వ్యాసం పెద్ద లెక్కలోది కూడా కాదు. ఈ రోజుల్లో కొద్దిగా గడ్డం పెంచితే, అమ్మాయిగాని హాండిచ్చిందా, దేవదాసయ్యావని పరామర్శించే మిత్రులకు కొదవలేదు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో "దేవదాస్" ను ఆదరించి ఉండవచ్చు. పరిస్థితులు ప్రస్తుతమైతే లేవు.

అదేవిధంగా, తెలుగులో అభ్యుదయ రచనలకు ఆద్యుడుగా గురజాడ అప్పారావుగారికి ఉన్న గౌరవం మరెవ్వరికీ లేదు. కానీ, ఆరోజుల్లో ఆయన వ్రాసినట్లుగా "దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని ఈరోజుల్లో వ్రాస్తే, సందేశాలాపి కవిత్వం చూపించమంటారు నేటితరం కవులు, విమర్శకులు.

మారుతున్న సామాజిక ధోరణికి అనుగుణంగా ప్రజలూ మారుతున్నారు. మారుతున్న ప్రజల ప్రామాణికాల కనుగుణంగా, ఆయా రచనలను బేరీజు వేస్తున్నారు. పురాణేతిహాసాలకే దిక్కులేని పరిస్థితుల్లో, అటువంటి సమీక్షలకు, విమర్శలకు ఆక్రోశించాల్సిన అవసరం లేదు.

* * *

పుస్తకంలోని పాత్రలు కల్పితమో కావో ఇతమిద్ధంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రచయితగా బుచ్చిబాబు చేసే తత్వ విచారణ మాత్రం, ఆయనని రచయితకన్నా కూడా తాత్వికునిగా మరో మెట్టుపైన నిలబెడుతుంది. నా వరకూ ఇందులో కథ ముఖ్యం కానేకాదు. ఆయా పాత్రల నేపథ్యంలో రచయిత వ్యక్తపరుస్తున్న తాత్విక చింతన ముఖ్యం. కోణంలో ఆలోచిస్తే, అద్భుతమైన వాక్యాలు గుట్టలు గుట్టలుగా ఇందులో కనిపిస్తాయి.

సాథారణమైన కథకు అసాథారణతను చేకూర్చింది రచయితలోని అభివ్యక్తే. అద్భుతమైన కవిత్వాత్మక వాక్యాలవల్లనే, పేలవమైన కథ కూడా చదివింపజేస్తుంది. అద్భుతమైన వాక్యాలతో, కావ్య సృష్టి జరిగుంటే, మన జ్ఞానపీఠాలకు ఖచ్చితంగా గౌరవం దక్కి ఉండేదని నా నిశ్చితాభిప్రాయం.

ఓ రెండు ఆణిముత్యాల్లాంటి పంక్తులు చూద్దాం : 

* * *

గడ్డిపోచ విలువెంత?

చివరికి మిగలడం! పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్ఛిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు  భయంతో మెరుస్తున్నాయి. కాలవ తోకని త్రిప్పుకుంటున్న నల్లత్రాచులా వంకర తిరిగి అంతర్ధానమైంది. ఆకాశం కేసి చూస్తూ ఒడ్డున గడ్డిపోచల మధ్య దయానిధి నవ్వుకున్నాడు.

అంత భయపడాల్సిన అవసరం ఏమిటన్నట్లు దయానిధి నవ్వినట్లు అనిపిస్తుంది. అవసరం లేదంటూ, బుచ్చిబాబు తర్వాతి పంక్తుల్లో చెప్పే వాక్యాలు అనితరసాధ్యం.

శరీరాన్ని ఆవరించుకున్న గాలి అందమైన అల్పానుభవం. శరీరం దాహంతో వికసిస్తుంది. ...... కళ్ళు చూడడంమానుకుని దర్శిస్తాయి. పడమటి ఆకాశంలో పూడుకుంటున్న పుండు రాత్రి వెదకటం విరమించుకున్న మేఘాలు, భయం లేకుండా మెరుస్తున్న నక్షత్రాలు, ........ కదులుతున్న గడ్డిపోచలు, మూగ భక్తితో ప్రశాంతం చెందిన ప్రకృతి, తనూ - అన్నీ ఏకమైపోయి ఒక్కసారి చైతన్యం పోగొట్టుకొని, ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఉండిపోయాయి.

* * *

అలలు మెల్లగా గట్టు మీద ఊపిరి తీసుకుంటున్నాయి. మట్టిలో వేడిగాలి పైకి వెళ్ళలేక భూమినే ఆవరించుకుంది. పొడుస్తున్న చుక్కల ప్రతిబింబాలు చెరువులో పడ్డాయి.

* * *

చెప్పుకుంటూ పోతే, దాదాపు సగం పుస్తకాన్ని వ్రాయాల్సి ఉంటుంది. పేలవమైన కథ కారణంగా, కథనంలోనిఅద్భుతమైన సాహితీ విలువలు ఎలా నిరుపయోగమయ్యాయో అనేదే నా ఆక్రోశం.

బుచ్చిబాబు మాటల్లోనే నా ఆక్రోశం చెప్పాలంటే "పరిమళం బరువుకీ రంగు వొత్తిడికీ తట్టుకోలేక వూడి పడిపోయిన అడవి పువ్వు; పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచు ముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్నమంటలో నడిజ్వాల అర్ధరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగ బాధ."

4 comments:

  1. మీరిక్కడ చెప్పిన వాటితో నూటికి నూటి పాళ్ళు ఏకీభవిస్తాను. చివరకు మిగిలేది నేనెన్ని సార్లు చదివినా ఎప్పుడూ కథ కోసం చదవ లేదు. కథ చుట్టూ ఆయన రాసిన వ్యాక్యాల కోసమే చదువుతాను. జీవితం లోంచి కొన్ని కష్టమయిన సంధర్భాల్లోఒంచి వెళ్ళేప్పుడు రాత్రి అది చదువుకుంటూ, పడుకున్న రాత్రులు ఉన్నాయి.

    తాడేపల్లి గారెక్కడో చెప్పినట్లు, పుస్తకంలో ఎక్కడా కనపడని తల్లి పాత్ర ఇంపాక్ట్. నాకు బాగా దగ్గరగా తెలిసిన ఫామిలీ ఆ ట్రబుల్ లోంచి వెళ్ళింది, ఇంకా వెళ్తోంది. వాళ్ళని నేను దగ్గరగా చూసాను కాబట్టి చివరకు మిగిలేది లో కొన్ని రాతలు బాగా అర్ధం అవుతాయి.

    నాకు పుస్తకం చివరి భాగం(బహుశా చివరి నాలుగో వంతు అనుకుంటా) పెద్దగా నచ్చదు.

    ReplyDelete
  2. బుచ్చిబాబు బుచికి బుచికి రచన ఇది. నావంటి మూర్ఖులకు అర్థంకాదు. ఇది సాహితీ చర్చలకు, టైమ్ పాస్ చేయనికి బాగుంటుంది. అంత లావులావు పుస్తకాలు చదివేదానికి నాతోని కాదు అన్నట్టు.

    ReplyDelete
  3. చాలా బావుంది మీరు పరిచయం చేసిన కోణం.
    మన ఫిక్షను రచయితలు నాన్-ఫిక్షనుగా రాయాల్సిన సబ్జక్టుల్ని ఫిక్షనుగా రాయబూనుకోవడంతో వచ్చిన తంటా యిదని నాక్కొంచెం అనుమానం. గత పది యిరవయ్యేళ్ళలో లెఫ్టిస్టు భావజాలంతో కథలు రాస్తున్న వారు కూడా ఇదే బాపతు. చక్కటి వ్యాసం కావల్సిన దాన్ని కథగా రాసి మన దుంప తెంచుతారు.

    ReplyDelete
  4. Ouch! Ouch!I strongly disagree with kottapali! Story of chivaraku migiledi is quest of a guy, about life & confusion. I found Dayanidhi highly intriguing & believable character. It is very human to get confused, screw up, fix or just accept the status quo.

    ReplyDelete

మీ అభిప్రాయం :