Monday, March 8, 2010

అనామిక డైరీలో ప్రతిరోజూ...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో.... మహిళల కోసం నా పాత కవిత....

యవ్వనం పొలిమేరల్లో ఉన్నప్పుడే
నాలుగు అక్షింతలు వేసి
ఆంజనేయులుకు కట్టబెట్టారు
ఉత్తేజంతో యవ్వనాన్ని
ఏతమేసి తోడేసరికి
రెండు ఇష్యూలు
ఆపైన, కరీనాలాంటిదాన్ని
కొక్కిరాయినైపోయాను
ఈ అమీర్ ఖాన్ కళ్ళకు!


పేస్టు బాలేదని మారిస్తే,
నా టేస్టు బాగుందన్నవాడే
ఇప్పుడు గీచి గీచి
ట్యూబు కోసిమరీ వాడమంటుంటే
తాజ్ మహల్ గుర్తుకొచ్చి
నవ్వొస్తుంది.
తాజ్ మహలంటే గుర్తొచ్చింది,
టీ పొడి తెమ్మని గుర్తుచేయాలి.


ఎదురెదురు గోడలకి
మేకులు కొట్టి
మంగళసూత్రాన్ని
దండెంగా కట్టి
నా జీవితాన్ని ఎండగట్టిన
పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
ఇద్దరాడపిల్లలను చూసి
గమ్మునుండాల్సి వస్తున్నది.


ఏంటో, నాకోసం నేను గడిపే
ఈ పావుగంటలోనూ
ఎన్నెన్నో ఆలోచనలు
సబ్బు కూడా అయిపోయింది
తెమ్మంటే ఏం తెగులో
ఈరోజుకు ఇలా తెమిలేస్తా.

6 comments:

  1. ## ఎదురెదురు గోడలకి
    మేకులు కొట్టి
    మంగళసూత్రాన్ని
    దండెంగా కట్టి
    నా జీవితాన్ని ఎండగట్టిన
    పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
    ##

    చాలా బాగుందండి

    ReplyDelete
  2. కిరణ్,
    వుమెన్స్ డే నాడు నాణేనికి ఒకవైపు బాగా చెప్పారు.
    ఇద్దరు పిల్లల భాధ్యత గల తల్లి ఇలా 'తాజ్ మహాల్ ' అదీ ఇదీ అని వాపోతుందా? పేస్టి గోకి వాడమని చెప్పే ఆ తండ్రి కూడా ఏదో కోల్పోయినట్టు అనిపించడం లేదూ? లేక కనపడనీకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నడేమో... అనిపిస్తోంది.

    శంకర్

    ReplyDelete
  3. "ఎదురెదురు గోడలకి
    మేకులు కొట్టి
    మంగళసూత్రాన్ని
    దండెంగా కట్టి
    నా జీవితాన్ని ఎండగట్టిన
    పెద్దవాళ్ళంటే"

    Bravo!

    ReplyDelete
  4. కిరణ్ గారు...బాగుంది బాగుంది...
    అవును చాలారోజుల తర్వాత...కొంచెం పెద్ద బ్రేక్ :-)
    ఇక తరచుగా మీ అందరిని కలవాలనే అనిపిస్తుంది

    ReplyDelete

మీ అభిప్రాయం :