అద్వాని మొదలుకొని సోనియా వరకు, బుల్లి నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకూ తీవ్రవాదుల చర్యను వారి వారిసామర్ధ్యాన్ని బట్టి ఖండించారు. అదే సమైక్యత 'అఫ్జల్ గురు' కు సుప్రీంకోర్టు విధించిన ఉరి శిక్ష అమలులోకనిపించదెందుకని? ఆ విషయంపై తాత్సారం ఎందుకని సోనియా ప్రశ్నించదే?
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, తీవ్రవాదుల దాడి జరిగిన దాదాపు నెలరోజులకు 'అంతూలే'లకు నోరువస్తుంది. హేమంత్ కర్కరేను తుదముట్టించటానికి హిందూ తీవ్రవాదులు ఆడిన నాటకం ఆయనకు కనిపిస్తుంది! మూడు పొద్దులపాటు అడిగినవారికి అడగనివారికి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆనక పార్లమెంటులో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం తనకు తృప్తినిచ్చిందని అడ్డగోలుగా, సిగ్గులేకుండా ప్రకటిస్తాడు. ఈ మూడు రోజుల్లోఅంతూలేలకు తోడుగా దిగ్విజయ్ సింగ్ లు రావటం యధోచితంగా 'రాజకీయ నాటకానికి' తోడ్పాటు నివ్వటం సిగ్గెగ్గులులేకుండా సాగిపోతుంది.
మూడు రోజుల్లో అంతూలే ద్వారా ఆడిన నాటకానికి మైనారిటీలు ఉబ్బితబ్బిబ్బవుతారని కాంగ్రెస్ అనుకుంటే అంతకుమించిన దౌర్భాగ్యం ఈ దేశానికి మరొకటి ఉండదు.
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి పార్లమెంటుపై జరిగిన దాడికి కూడా చలించని ప్రభుత్వాలు, ముంబైలో తీవ్రవాదులదాడికి చలించి సమైక్యరాగాన్ని ఆలపించాయంటే నమ్మడానికి ఏమాత్రమూ ఆస్కారంలేదు. ఎన్నికలనుదృష్టిలో ఉంచుకొని వారు చేసిన కుప్పిగంతులుగానే వాటిని భావించాలి.
దేశంలో జరిగిన ప్రతి తీవ్రవాద ఘాతుకానికి పాకిస్తాన్ దే బాధ్యత అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయిప్రభుత్వాలు. సమైక్యరాగాన్ని ఆలపించిన ఈ నేతలకు నిజంగానే సిగ్గెగ్గులు ఉంటే, ఇజ్రాయిల్ తరహాలోసమాధానమెందుకు ఇవ్వరు? సంవత్సరానికి కొన్ని వేలమంది మరణిస్తున్నా, మన ప్రభుత్వాలు సరిహద్దులకావలితీవ్రవాదుల శిబిరాలపై దాడులు ఎందుకని చేయవు? ఒక ఇందిరాగాంధిని హత్య చేసారని, మొత్తం సిక్కు జాతినితుదముట్టించే విధంగా కత్తులు నూరి, దాడులు చేసిన కాంగ్రెసీయులకు దేశప్రజల విషయం పట్టదా?
ఈ కొసరు విషయాల మధ్య అసలు విషయం మరుగున పడిందనేది వాస్తవం. ఇంతకి ఈ తీవ్రవాదుల దాడికి బాధ్యతఎవరిది?
నైతికత గురించి నైతిక బాధ్యత గురించి, ముఖ్యంగా రాజకీయాల్లో నైతికబాధ్యత గురించి గత నెల రోజులుగా చాలానేరహస్యాలు తెలుస్తున్నాయి. మునుపటి రాజకీయ నాయకులకు నైతికబాధ్యత గురించి ఒక్కరోజులోనే తెలిసొచ్చేది. ఏదైనా ఘోరం జరిగినప్పుడు, వెంటనే స్పందించటమూ జరిగేది. ఇప్పుడు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడికొండకచో సంవత్సరాల తరబడి ఆలోచించిన తర్వాత అధిష్టానం చెప్పినప్పుడు మాత్రమే నైతికబాధ్యత గురించితెలుస్తున్నది.
నైతిక బాధ్యతకు ప్రస్తుతం కొత్త భాష్యం చెబుతూ, కేంద్ర హోం మంత్రి, మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామాలుచేయటంలో చిత్తశుద్ధి కన్నా, రాజకీయాలే కనిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి విషయమే చూస్తే, అసలు ఆయనకునైతికత అన్నదే లేదు. ఎన్నికల్లో ఓడిపోయి, అధిష్టానం ఆశీర్వాదాలతో దొడ్డిదారిన పార్లమెంటులో ప్రవేశించటమేకాకుండా, మంత్రి పదవి - అందులోనూ హోం మంత్రి పదవి చేపట్టినప్పుడు ఈయనకి నైతికత ఎందుకు గుర్తుకురాలేదు?
మునుపు అహ్మదాబాద్, హైద్రాబాద్, బెంగుళూరు, జైపూర్, వారణాసి తదితర ప్రదేశాలలో తీవ్రవాదులు బాంబులుపేల్చినప్పుడు ఎందుకని నైతిక బాధ్యత తీసుకోలేదు? మొన్నటికి మొన్న, ఢిల్లీలో బాంబులు పేలినప్పుడు కూడా, ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా విమర్శించినా కూడా, అధిష్టానం కోరితేనే రాజీనామా చేస్తానన్న పెద్దమనిషికి అప్పుడు నైతికబాధ్యత ఎందుకు గుర్తుకు రాలేదు?
పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన రాజీనామా చేయాల్సివచ్చిందికానీ, నిజంగా నైతిక బాధ్యత వహించి మాత్రం కాదు.
సమాజంలో నైతికవిలువలు పతనమౌతున్నాయన్న నెపంతో మహారాష్ట్రలో డాన్సుబారులు రద్దుచేశాడు మహారాష్ట్రహోం మంత్రి. జుగుప్సాకర నృత్యాలతో యువతను పెడదోవ పట్టిస్తున్న బార్ గర్ల్స్ సమాజానికి ప్రమాదకరం అని కూడాఅభివర్ణించాడు. అప్పట్లో ఎన్నికలకు కావల్సిన ఫండ్సును డాన్సు బార్ యజమానులు తమ పార్టీకి ఇవ్వలేదన్నఅక్కసుతో డాన్సుబారులు మూసివేయించాడని అందరికీ తెల్సిన విషయమే. అదే పెద్దమనిషి మీడియా ముందుఅంతకన్నా జుగుప్సాకరంగా వాగిన వాగుడు చూస్తే, సభ్యసమాజం తలదించుకోవాల్సిందే! మహానగరాల్లో ఇటువంటితీవ్రవాదుల దుశ్చర్యలు చాలా సామాన్యమేనట!
ఇందులో మరోవిషయం ఉంది. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకో లేదంటే, అస్సలునిర్ణయాలే తీసుకోకుండా సమస్య జటిలమయ్యేందుకు దోహదపడినందువల్లనో నైతికబాధ్యత వహించి రాజీనామా చేస్తేసరిపోతుందా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పు చేసినందుకు శిక్ష ఎందుకు అనుభవించరు ఈ మంత్రులు.
ఒక ప్రభుత్వాధికారి తప్పు చేసి, నైతికబాధ్యత వహించి రాజీనామా చేస్తే, ఇక అతనిపై చర్యలేమీ తీసుకోరా? మరిమంత్రులకు మాత్రం మినహాయింపు దేనికి? లేదంటే, రాజీనామా చేసి, పదవికి దూరంగా ఉండటమే మనరాజకీయనాయకులకు శిక్షా?
పాకిస్తాన్ కన్నా ప్రమాదకరమైన అంతః శత్రువులు మన రాజకీయ నాయకులు. నైతిక బాధ్యత గురించి వారికి దేహశుద్ధిచేసి చెప్పే క్షణం కోసం దేశప్రజలు వేచి చూస్తున్నారు .