ఘనత వహించిన మన లౌకిక ప్రజాస్వామ్య దేశానికి కాబోయే ఏలికలెవరన్నది రాబోయే ఎన్నికల్లో తెలిసిపోతుంది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్సు అని, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్సు అని, మూడో ప్రత్యామ్నాయమని, నాలుగో ప్రత్యామ్నాయమని రకరకాల కూటములు ఏర్పడ్డాయి, ఎన్నికల తర్వాత మరిన్ని ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. ఎన్ని కూటములు ఏర్పడినా ఎవరికి వారు తమదే అసలైన లౌకిక కూటమిగా చెప్పుకుంటూ, ఓట్లు అడుక్కుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చూస్తారు. మరికొందరు, భా.జ.పా. లాంటి పార్టీలు ఎన్నెన్నో పిల్లిమొగ్గలు వేసి, తమను తాము లౌకికవాదులుగా ప్రజలు గుర్తించాలని తంటాలు పడుతుంటారు. అసలు ఏమిటి ఈ లౌకికవాదం?
కులమత ప్రమేయం లేకుండా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం మనది. అంటే, మన రాజ్యాంగానికి, మన దేశానికి ప్రత్యేకించి ఒక మతమని, కులమని, జాతి అని లేవు. అన్ని కులాలు, మతాలు, జాతులు సమానమే. అయినా, స్వాతంత్ర్యానికి పూర్వం అణగారిన కొన్ని వర్గాల కోసం చదువుల్లోనూ, ఉద్యోగావకాశాల్లోనూ, పదోన్నతుల్లోనూ, చివరికి చట్టసభల్లో ప్రవేశానికి కూడా రిజర్వేషనులు కల్పించాం. అంతవరకూ బానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలౌతుంది.
రిజర్వేషనులు అధికారికంగా జరిగేవి అయితే, అనధికారంగా జరిగే రిజర్వేషన్ల పాపం ఆయా పార్టీలదే. భా.జ.పా., కమ్యూనిస్టులతో సహా, ఎన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లోని కుల మత ప్రాతిపదికన అభ్యర్ధులను రంగంలోకి దింపుతున్నాయో గమనించి తీరాల్సిన విషయం. ఆదర్శవంతమైన ఒక వ్యక్తి కన్నా కూడా, సమూహంగా ఉన్న ఒక కులానికి చెందిన వ్యక్తే ప్రతిపార్టీకీ అభ్యర్ధి కాగలుగుతున్నాడు. బి.సి.ల ఓట్ల కోసం బి.సి. ఫ్రంటుతో ఎన్నికల ఒప్పందం చేసుకున్న లోక్ సత్తా కూడా ఈ తరహా లౌకిక వాదానికే ఊతమివ్వటం ఆశ్చర్యకరం!
ఆ అభ్యర్ధి ఎంత దుర్మార్గుడు కానీ, జైల్లో ఉన్నవాడైనా సరే, వాడి కుల లేదా మత సమూహానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాముఖ్యతను బట్టి, వాడికి టిక్కెట్ లభిస్తుంది. వాడు గెలుస్తాడు కూడా! నిజమైన 'లౌకికత్వాన్ని' పరిహాసాస్పదం చేస్తున్న ప్రతి పార్టీ తమనుతాము లౌకిక పార్టీగా చెప్పుకోవటం సిగ్గు చేటు.
ఈ రకమైన 'కుల, మత కసరత్తులతో' టిక్కెట్లు పంచుతున్న ఆయా పార్టీలు లౌకిక పార్టీలా? అవి ఏర్పాటు చేసే ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమా?
సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో నిందితుడుగా నిరూపించబడ్డాదు కాబట్టి, అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. బాగుంది. అబూ సలేం చేసిన నేరం నిరూపితమవ్వలేదు కాబట్టి, వాడు ఎన్నికల్లో నిలబడటానికి అడ్డంకేమీ ఉండదా? పోలీసు రిమాండులోనూ, జడ్జి ముందర తన నేరాన్ని అంగీకరించిన ముంబాయి పేలుళ్ళ నిందితుడు 'కసబ్' కు ఇప్పుడు ఓ లాయర్ ని కూడా అంటకడుతున్నది మన రాజ్యాంగం. బాగుంది. వాడు ఇప్పుడు పాట మార్చి, నేను భారతీయుడినే, నేనూ ఎన్నికల్లో నిలబడతాను అంటే అడ్డంకేమీ ఉండదా?
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు వరుణ్ గాంధీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ తాఖీదు పంపుతుంది. అతడిని అనర్హుడని ప్రకటిస్తుంది. కానీ, ఎన్నికల సమయంలో మైనారిటీ రిజర్వేషనులపై మాట్లాడే పార్టీలను, నేతలను ఎందుకని అనర్హులుగా ప్రకటించరు?
ఇన్ని లొసుగులతో జరుగుతున్న ఈ ఎన్నికలు 'ప్రజాస్వామ్య బద్ధమైనవనో, లౌకికమైనవనో' అనుకోటానికి ఎక్కడ ఆస్కారం ఉంది?