Monday, May 11, 2009

ప్రజలు జోకర్లు - ఎన్నికలో జోక్!

మన ఘన ప్రజాస్వామ్యంలో ఓ ప్రముఖమైన ప్రహసనం - ఎన్నికలు ; దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. ప్రజలు తమ పక్షమేనని ఎవరికి వారు ధీమా ప్రకటిస్తున్నా, వీరికి పీఠం నుంచి పీకలదాకా టెన్షనుతో తడారిపోయిందనే విషయం తెలుస్తూనే ఉన్నది.

కాంగెస్ నేతృత్వంలో యు.పి.ఎ. (ఎన్.సి.పి., డి.ఎం.కె. తప్పించి మిగతా అంతా చిల్లర సరుకు పార్టీలు), భా.జ.పా. నేతృత్వంలో ఎన్.డి.ఎ., గంతకు తగ్గ బొంతగా మహా కూటమి, అతుకుల బొంతగా నాలుగో కూటమి, ఇవేవీ కాకుండా గోడ మీద కూర్చున్న చిల్లరమల్లర పార్టీలు మరికొన్ని - ఇవి మనకు ఉన్న రకరకాల ప్రత్యామ్నాయాలు!

ఈ ఎన్నికల వల్ల ఏం సాధించామనేది మే 16 తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా ఊహించటం కష్టమేమీ కాదు. ఓటు వేసిన ప్రజలు సాధించిందేమీ లేదు. అధికారం కోసమే అర్రులు చాచే ఈ పార్టీలు సాధించేదే బోల్డంత! ఏ ముసుగులో ఎవరి చాటున ఉంటే ఎంత లాభమో; అంతా చూసుకొని ప్రజలకు పోటు పొడిచే రోజు కోసమే పార్టీలన్నీ వేచి ఉన్నాయి.

మహాకూటమి ముసుగులో ఎన్నికల్లో పోటి చేసి, ఇప్పుడు ఎన్.డి.ఎ. అడుగులకు మడుగులొత్తే తె.రా.స. రేపు యు.పి.ఎ. చంకనెక్కి ఊరేగినా ఆశ్చర్యం లేదు. రాజకీయ విలువల్లో అంతకుమించి అడుసులో కూరుకుపోయిన లాలూలు, ములాయంలు, పాశ్వానులు రేపు ఎన్.డి.ఎ.కు మద్దతునిచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అంతా అధికారంపై మోజే.

యు.పి.ఎ. ప్రజా వ్యతిరేక విధానాలను, అమెరికా అనుకూల విధానాలను నిరసిస్తూ, ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని కమ్యూనిస్టు నేతలు వీధివీదినా చాటింపు వేసారు - ఎన్నికలకు ముందు. ఒకవేళ, అటూఇటూ కాని పరిస్థితి వస్తే, దేశప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి, ప్రజావ్యతిరేక విధానాలను, అమెరికా అనుకూల విధానాలను ఆచరించిన యు.పి.ఎ.కే మళ్ళీ పట్టం కడతామని నిస్సిగ్గుగా ప్రకటించారు! కె.సి.ఆర్.ను విమర్శించటానికి వీళ్ళకెలాంటి నైతికహక్కు ఉందో మరి!

నాకు అర్ధంకాని విషయమేమిటంటే, అసలు మనదేశంలోని పార్టీలకు సిద్ధాంతాలంటూ ఏవైనా ఉన్నాయా? ఉంటే అవేమిటి? కేవలమూ అధికారమే సిద్ధాంతమా? మొన్నటిదాకా బాబ్రీమసీదు విధ్వంసానికి కళ్యాణ్ సింగ్ కూడా కారణమే అన్న ములాయం, ఇప్పుడు అదే కళ్యాణ్ సింగ్ కు మద్దతు ఇస్తున్నాడు.

కొన్నాళ్ళ దాకా, సంఘ్ సిద్ధాంతాలతో మమేకమైన కళ్యాణ్ సింగ్, మసీదు విధ్వంసానికి తాను కారణం కాదనీ, భా.జ.పా. నే కారణమని ప్రచారం చేస్తున్నాడు. తప్పో ఒప్పో నమ్మి ఆచరించిన ఓ సిద్ధాంతాన్ని ఒప్పుకోటానికి ఇంత బెరుకు ఎందుకు మన నేతలకు? ఆయన సిద్ధాంతానికి విరుద్ధంగా భా.జ.పా. ఆరోజు ప్రవర్తించిందని అనిపిస్తే, ఆ వెంటనే పార్టీని ఎందుకు వీడలేదు? వీడిన తర్వాత మళ్ళీ చేరి, మళ్ళీ వదిలేయటంలోని పారమార్ధిక సిద్ధాంతమేమిటి?

మరోవైపు ఓడిపోనున్నామనే వార్తల మధ్య, ప్రజాస్వామ్యాన్ని సచివాలయంలో అగ్నికి ఆహుతి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం చేయాలి?

నిర్లజ్జగా ప్రజాస్వామ్యానికి పాతరవేసి తప్పించుకో చూస్తున్న ఈ నేతలు ఎవరికి, ఎప్పుడు జవాబుదారీ. అయిదు సంవత్సరాలకోసారి మాత్రమే వచ్చే ఎన్నికల్లోనేనా, అప్పుడే ప్రజలకు జవాబుదారీనా?

ఇష్టంలేని నేతను వెనక్కు పిలిపించే వ్యవస్థ కూడా కల్పించినప్పుడు అసలైన ప్రజాస్వామ్యానికో అర్ధం ఏర్పడుతుంది. అప్పటివరకూ ప్రజలు జోకర్లే, ఎన్నికలు మనమీది జోకులే!