Monday, July 6, 2009

వెంగళప్పల చరిత్ర - ఓ 'అంగీకారత్మక' తప్పిదం

చాలా రోజుల తర్వాత మరో మాంచి కామెడీ పోస్టు చదవడం జరిగింది, అదే 'వామపక్ష చరిత్ర - ఒక చారిత్రాత్మక అవసరం'! చరిత్ర అంటే ఏమిటనే ఓ ప్రాధమికస్థాయి ప్రశ్నే వేసుకోవాల్సిన అగత్యం తప్పకుండా అందరికీ కలిగే ఉంటుంది, అయ్యవారి పైత్య ప్రకోపం చదివిన తర్వాత.

గతకాలంలో జరిగిన సంఘటనల సమాహారమే చరిత్ర అని సరళంగా భావించామే కానీ, అసలు 'చరిత్ర'లో కూడా, వామపక్ష చరిత్ర, దక్షిణపక్ష చరిత్ర, మధ్యమపక్ష చరిత్రలుంటాయని ఇప్పటిదాకా తెలీదు!

'దేశనిర్మాణం, ఏకత్వంలో సాధించాల్సిన సుస్థిరత' అనే ముఖ్య ఆశయాలను సాకారం చేసేందుకు ఏర్పడిన ఓ చారిత్రక అవసరంతో వామపక్షచరిత్ర వ్రాయటం జరిగిందట. ఇంకా అయ్యవారి దెప్పులు చూడండి. "అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా"!

మరో కొత్తచరిత్ర ఇక్కడ అయ్యవారు సృష్టించారు - అది 'మతచరిత్ర'! ఒక మొగలాయి రాజు 'జిజియాపన్ను' ప్రవేశపెట్టి హిందువుల మీద దౌష్ట్యాన్ని ప్రదర్శించాడు అని వ్రాస్తే అది 'మత చరిత్ర' అవుతుంది! అది నిజమైన చరిత్ర అని మాత్రం ఒప్పుకోరు!

గజనీలు, ఘోరీలు, బాబర్లు చేసిన దండయాత్రల్లో ఒకనాటి సాంస్కృతిక వారసత్వం మట్టికలిసిపోయిందంటే, అది 'మతచరిత్ర' అవుతుంది! అందుకని ఇది పనికిరాదు. ఎందుకు పనికిరాదు అనటానికి అయ్యవారు చూపే కారణం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

అయ్యవారి అభిప్రాయం చూడండి. "దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది."

అంటే, చరిత్రలోని ఒకానొక దుర్మార్గపు ముస్లీం నవాబు, హిందువులపై చేసిన దౌష్ట్యాన్ని చెబితే, ఇప్పటి ముస్లీములు బాధపడతారని, మత సంక్షోభం కలుగుతుందని అయ్యవారి అభిప్రాయం. కాబట్టి చరిత్రను ఎప్పుడూ యధాతథంగా వ్రాయకూడదు. ప్రజల మధ్య సామరస్యం పెంపొందించేందుకు చరిత్రను వక్రీకరించవచ్చు అని అయ్యవారి సూత్రీకరణ. మరి పురాణేతిహాసాలని, దేవుళ్ళను దూషిస్తున్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేకపోయిందో!

1857 సిపాయిల తిరుగుబాటు / ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి అయ్యవారి ఆరునొక్కరాగం వినండి.

బ్రిటిష్ వారి చరిత్రప్రకారం 1857 తిరుగుబాటు ఒక "సిపాయిల తిరుగుబాటు". వామపక్ష చరిత్రకారుల ప్రకారం అది "ప్రథమ స్వాతంత్ర్య సమరం". .......... మొట్టమెదటిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం సైనికులు"జిహాద్" జరిపిన పోరాటం. "హైందవధర్మాన్ని" కాపాడుకోవడానికి హిందూ సిపాయిలు ప్రాణాలొడ్డి పోరాడిన పోరాటం. ఈ జిహాదీలు ,దర్మ పరిరక్షులు తమ మతపరమైన నమ్మకాలకోసం కటికి కనబడిన బ్రిటిష్ జనాల్ని, పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఊచకోత కోసిన పోరాటం.

విప్లవకారులు బ్రిటీషు దేశస్థులను ఊచకోత కోసారని ఏ ఆధారంతో అయ్యవారు చెబుతున్నారు? ఆయన చూసారా? అప్పటి బ్రిటీషు ప్రభుత్వ రికార్డులు పరిశీలించారా? నిజానికి 1857 సంఘటనను 'సిపాయిల తిరుగుబాటు'గానే చదువుకున్నాం. దాన్నే ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనవచ్చు అనే సన్నాయినొక్కులు మాత్రమే వామపక్ష చరిత్రకారులు వినిపించారు.

ఇప్పుడు తన వాదనకు అనుకూలంగా ఉండాలని, వామపక్ష చరిత్రకారులపై ప్రజలకు సదభిప్రాయం ఏర్పడాలనే అయ్యవారు ఓ 'పాఠ్యాంశపు చరిత్ర'ను వక్రీకరిస్తున్నారు.

వకాల్తా పుచ్చుకొని ఇంకా ఏమంటున్నారో చూడండి.

"కానీ చరిత్ర కారుల ఆశయం ఒక గౌరవప్రదమైన భారతీయ చరిత్రను సృష్టించడం. భారతదేశ ప్రజల్లో ఒక గాఢమైన నమ్మకాన్ని రేకెత్తించే చరిత్రను లిఖించడం. వాటి దృష్ట్యా కొన్ని నిజాల్ని విస్మరించి చరిత్ర రాయాల్సి వచ్చింది."

ఇది అయ్యవారి వ్యక్తిగత అభిప్రాయమా లేక వామపక్ష చరిత్రకారులదా? సరే, ఏ వెంగళప్పదైనా, ఈ అభిప్రాయాన్ని గౌరవించేవారైతే, దేశప్రజల్లో గాఢమైన నమ్మకాన్ని రేకెత్తించే చరిత్రగా రామాయణంలోని ఆదర్శవంతమైన 'రామరాజ్యాన్నే' దేశచరిత్రగా చెప్పుకోవచ్చుగా! దానికోసం తమకు ఇష్టంలేని కొన్ని విషయాలు విస్మరించవచ్చుగా!

మంచైనా, చెడైనా, చరిత్రను 'జరిగిన సంఘటనల సమాహారం'గానే చూడాలి. ఎర్ర కళ్ళజోడో, పచ్చ కళ్ళజోడో పెట్టుకొని ఇదే చరిత్ర అంటే, అదో 'మాయదారి రోగం'లా పరిగణించాలి. నివారణ చర్యలు సత్వరమే చేపట్టాలి.

ఆ చర్యలు చేపట్టకే, ఔరంగజేబుల పేర్ల మీద రోడ్లు తయారు చేస్తారు. ఛత్రపతి శివాజీలను బందిపోట్లుగా అభివర్ణిస్తారు. రేపు పార్లమెంటుకు, రాష్ట్రపతి భవన్ కు గజనీ, ఘోరీల పేర్లూ తగిలిస్తారు.