Friday, May 7, 2010

నావి కాలేని నీవి - నానీలు మరో సమాలోచనం

గతంలో "నానీ"ల పై నేను వ్రాసిన వ్యాసం.


ఎన్ని గజాలు వ్రాసావన్నది కాదు ముఖ్యం
ఎన్ని నిజాలు చెప్పావన్నది ముఖ్యం
నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే
నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలు.

ఏ సందర్భంలో ఆరుద్రగారు వ్రాసారో కానీ, నానీల పేరుతో ఈమధ్యకాలంలో విశృంఖలంగా వస్తున్న కవితలనబడే సాహిత్యాన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చే పంక్తులవి.

పద్దెనిమిది పేజీలేమో కానీ, పది లైనులు కూడా వ్రాయలేని ప్రబుద్ధులందరూ ఒక ఇమేజరీతో ఒక ప్రకటనతో నాలుగులైనులు గిలికేసి,  దాన్నే కవిత్వంగా సరిపుచ్చే ధోరణి ప్రబలిపోతున్నది.

అసలు హైకులు, మినీకవితలు వంటి ప్రక్రియలు ప్రత్యేకించి ఉండగా ఈ నానీలని తవ్వి తలకెత్తుకోవలసిన విశేషం ఏమైఉంటుందనేది ఈ విమర్శనాత్మక వ్యాసపు ప్రధానోద్దేశ్యం.

ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నానీల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నానీల నాన్నగారి (ఈ వ్యాసంలో 'నా.నా. గారూ - ఎన్. గోపి గారు) తొలివారసుడుగా (ఈ వ్యాసంలో నా.వా.గారు) ఎస్. ఆర్.భల్లం గారు సంపుటీకరించిన వ్యాసాల, సమీక్షల,  జనవాక్యాల సమ్మేళనం 'నానీల సమాలోచనం'  అనే పుస్తకం.

"హైకూలు రాసే కవులు కూడా ఈ నానీని పోటీ కవితా ప్రక్రియగా భావించక, సహృదయతతో అక్కున చేర్చుకొన్నారు" అంటూ నా.వా.గారు వ్రాసిన సంపాదక వాక్యంలోనే నానీ ప్రక్రియకు దోహదంచేసిన కారణాలు అన్యాపదేశంగా ప్రకటీకృతమౌతున్నాయి.

"నానీల కవితా పరివ్యాప్తి" అనే వ్యాసంలో, నా.వా.గారు "హైకు రచన వేరు. నానీ నిర్మాణం వేరు! నానీ నిర్మాణానికి సామాజిక వాస్తవికత గొప్ప ఉత్ప్రేరకం" అంటారు.

అసలు "హైకు" అనేది అనుభవాన్ని అనుభవంగా ప్రకటించే కవితా ప్రక్రియ. అందులోనూ ముఖ్యంగా మార్మికత సంతరించుకున్న తాత్వికత హైకు ప్రక్రియకు జవజీవం. కానీ, ఈ రెంటికి మించి "సామాజికత" నానీలలో ముఖ్యమైన అంశం అని నా.వా.గారి ఉవాచ.

మూడు లైనుల్లో,  17 అక్షారాలలో చెప్పలేని సామాజిక వాస్తవాన్ని, నాలుగు లైనుల్లోను, 25 అక్షరాల నియతితో ఎలా చెప్పగలరని ఈయన ఉద్దేశం? ఇంత చెప్పిన ఈ పెద్దమనిషి తమకు తాము విధించుకున్న నియతిని ఖచ్చితంగా పాటించారా అంటే అదీలేదు. ఈ ఉదాహరణలు చూడండి.

వాడేంటి
ఇన్ని చక్కర్లు కొడుతున్నారు
అవును
వాడిది ఆషాఢభూతి అంశ (26 అక్షరాలు)

రైతుకీ
ధాన్యానికి బంధం తెగిపోయింది
మిల్లులో నలిగేవి
బతుకులు కూడా (27 అక్షరాలు)

మొదటి నానీలో ఏ సామాజికత దీన్ని కవిత్వం చేస్తున్నదో!! అలాగే, రెండో నానీ వార్తాపత్రికలో శీర్షికలా మాత్రమే నాకనిపిస్తున్నది కానీ, కవిత్వమైతే కనిపించటంలేదు.

ఏతావాతా తేలేదేమిటంటే, "సామాజికతను" క్లుప్తంగా కవిత్వంలో చొప్పించటానికి వీరికి ఓ నాలుగుకాళ్ళ వాహనం కావల్సివచ్చింది. దానికీ పాతిక అక్షరాల మెలికతో ఒక తోక.

ఈ పుస్తకంలోనే, డా. తలతోటి పృధ్వీరాజ్ గారు "నానీలు" అనే వ్యాసంలో యశశ్రీ రంగనాయకిగారు చెప్పినట్లుగా ఉటంకించిన వాక్యం చూడండి. "...యోగి వేమన పద్యాలు గన్ షాట్ లు అయితే, ఆ వేమన్న వాదం వినిపించిన గోపిగారి నానీలు పెన్ షాట్ లు".

అసలు విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఆ ఒక్క వాక్యంతో. ఈటెల్లాంటి ఆటవెలది పద్యాలతో వేమన స్పృశించని ఏ సామాజిక కోణాన్ని ఈ "నానీ ప్రక్రియ" స్పృశిస్తున్నదో!

ఆ మాటకొస్తే, "ఓ కూనలమ్మా" అనే మకుటాన్ని మినహాయిస్తే, ఆరుద్ర గారు మూడు లైనుల్లో "నానీ"ల కన్నా అద్భుతంగా కూనలమ్మ పదాలు వినిపించారు మరి. నిన్నగాక మొన్న జనార్ధన మహర్షి వ్రాసిన "వెన్నముద్దలు" దాదాపు ఈ కోవలోవే. వీళ్ళెవరూ పనిగట్టుకొని, అవో ప్రత్యేక కవితా రీతిగా దరువులు వేసుకోలేదే!

"ఒక ఉద్వేగభరితమైన నిరంతర సంవేద మూలం" నానీల ఆవిర్భావానికి కారణంగా నా.నా.గారి వివరణ. హైకూలైనా, మినీకవితలైనా, ఆఖరికి విశ్వంభరలాంటి కావ్యాలైనా, ఒకానొక ఉద్వేగం నుంచి జనించినవే. ఆ విషయంలో చిన్నకవులు వ్రాసినా, చితక కవులు వ్రాసినా ఆయా రాతలలో "ఉద్వేగానికి" మినహాయింపు ఉండదు. కాబట్టి, ఆయన నానీల ఆవిర్భావానికి ఇచ్చిన ఈ వివరణ తేలికగా కొట్టిపారేయదగ్గదే.

అసలు హైకు అంటే ఏమిటి?

మూడు పాదాలు ఉంటాయి.
ఒకటి మూడు పాదాలలో అయిదేసి అక్షారాలుంటాయి.
రెండవ పాదంలో ఏడు అక్షరాలుంటాయి.
మొత్తానికి మూడు లైనులతో, పదిహేడు అక్షరాలతో జపనీస్ భాషలో జెన్ బౌద్ధం స్ఫూర్తితో వచ్చిన ప్రక్రియ హైకు.

మన తెలుగు భాషలో ఈ ప్రక్రియలో వ్రాయటంలోని సావకాశం తక్కువే. నాలుగు పాదాలలో అక్షర నియమాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన హైకులు విదేశీ భాషలలోనూ ఉన్నాయి.  కాని అర్ధంకాని విషయం ఏమిటంటే, నాలుగు పాదాలు, 25 అక్షరాల వెసులుబాటు కల్పించుకొని, తానేదో కొత్త ప్రక్రియ కనిపెట్టానన్న ఢమరుకపు మోతలెందుకో ఈ నా.నా. గారికి, వారి వారసులకి!!

రెంటికీ చెడ్డ రేవడిలా, అటు హైకులకి ఎక్కువ, ఇటు మినీ కవితలకి తక్కువగా అసంబద్ధంగా నానీ కవిత్వం ఉన్నదనేది నిష్ఠూరమైనా నిజం. చాలా వరకు నానీలు ఉపదేశాలకో, ప్రకటనలకో పరిమితమైపోయాయి.

పిల్లి గుడ్డిదైతే, ఎలుకేదో చేసిందని, తెలుగు సాహితీ విమర్శకులు నానీల విషయంలో మిన్నకుండిపోవటం వల్లనే, ఇప్పుడు నానోల పేరుతో నాలుగు పదాల చిల్లర కొట్టు కవిత్వం విశ్వవ్యాప్తం చేసే ధోరణి మొదలయ్యింది.

ఏదేమైనా, నా.నా.గారు, వారి వారసులు నానీ కవిత్వం విషయంలో, తవ్వి తలకెత్తుకోదగ్గ కొత్త కవితా విశేషమేమీ కనిపెట్టకుండానే డప్పు వాయించుకోవటం విపరీతం!!

నా అభిప్రాయంలో :

ఛందోబంధాలు వద్దు అనుకున్నప్పుడు, దాదాపు అటువంటివే అయిన సరళీకరించబడిన బంధాలు మాత్రం దేనికి? హైకులని చూసి వాత పెట్టుకున్న బంధాలే అవి అని స్పష్టంగా తెలుస్తున్నది.

మకుటం వదిలేస్తే, మూడు పాదాల్లో వేమన వ్రాసిన పద్యాలకు కూడా నానీలు నకలే.

హైకూలనే మరో వాక్యంతో విస్తరింపచేసి, అందులో సామాజికతే ముఖ్యమని మభ్యపెట్టిన పసలేని ప్రయోగమే నానీలు.

నిజానికి, నాలుకు లైనులు కూడా సరిగ్గ వ్రాయలేని ప్రబుద్ధులను కవులుగా చలామణి చేసి, ఆధునిక కవిత్వాన్ని నాలుగు లైనులకు దిగజార్చటంలో నానీల బాధ్యత చాలా వరకు ఉంది.