నిన్న టీవీ వార్తల్లో చిరంజీవి గారు ఎంతో ఉదాత్తంగా ఉద్ఘాటించారు. ఏమనంటే, పేదల గుండెల నుంచి వచ్చిందిట ప్రజారాజ్యం పార్టీ. మొన్నామధ్య హరిరామజోగయ్య గారు తన ప్రోద్బలంతోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారంటూ పబ్లిగ్గా స్టేట్మెంటిచ్చారు. హరిరామజోగయ్య గారిదో పేద గుండె అని సరిపెట్టుకోవాలి గామోసు!
***
రాజకీయాల్లో బంధుత్వం లేదట, ఉండకూడదట! కారంచేడులో తొడగొట్టిమరీ ఆవేశంతో బాలకృష్ణగారు ప్రకటించారు. ఓ సామన్య కార్యకర్తగానే ఇప్పుడు సభలు సమావేశాలు నడుపుతున్నారనుకోవాలి? నిరుటి ఎన్నికల్లో ఈ సామన్య కార్యకర్త ఏమయ్యారని అడగకూడదు. అలానే మొన్నటిదాకా తారకరత్న, కళ్యాణ్ రామ్ లు. అప్పట్లో అవసరపడతాడనుకోని జూనియర్ ఎంటీయార్ ఇప్పుడు చేస్తున్న ప్రచారం బంధుత్వం వల్ల కాదనుకోవాలి. ప్రతి సభలోనూ 'తాతను' , 'నాన్నను' స్మరించుకోవటం కూడా పెద్దలయెడ గౌరవంగానే భావించాలి కానీ, బంధుత్వం మాత్రం కాదనే అనుకోవాలి.
***
పిల్ భిట్ లో వరుణ్ గాంధీ ఉపన్యాసం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నదట. ఓ మతానికి ప్రతికూలంగా మాట్లాడారని ఇప్పుడు ఆయన అభ్యర్ధిత్వాన్ని కూడా ఎన్నికల కమిషన్ కొట్టివేయనుందని వార్తలు.
మరి, ఎన్నికల సమయంలో మైనారిటీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించటం ఏమాత్రం సముచితం? అలా ప్రస్తావించేవారిని, మైనారిటీలకు రిజర్వేషన్ల హామీలిచ్చేవారిని మాత్రం వదిలివేయటంలోని ఔచిత్యం అర్ధం కాదు.
***
సుప్రీం కోర్టు మొట్టికాయలేస్తే కానీ, ఎన్నికల కమిషన్ దిగిరాలేదు. మొత్తానికి ప్రజారాజ్యానికి ఓ ఎన్నికల గుర్తు కేటాయించింది. కోట్ల మందిని ప్రభావితం చేయగల వ్యక్తి ఓ పార్టీ పెట్టి గుర్తు అడిగితే, నిర్ణయానికి రావటంలో ఈ ఆలస్యం దేనికి? ఆ వ్యక్తి పెట్టిన పార్టీ నియోజకవర్గానికో గుర్తుతో ఎన్నికల్లో పోరాడి ఓడిపోతే పరిస్థితి ఏమిటి? ఆ పార్టీకి అన్యాయం జరిగినట్లు కాదా! ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులపై ఎన్నోరకాల ఆంక్షలు (సముచితమైనవే) విధించే ఎన్నికల సంఘానికి ఈ విషయంలో ఎందుకని తాత్సారం చేసింది? ఈ జాప్యానికి జవాబుదారీ ఎవరు?
***
టిక్కెట్ల విషయంలో అందరికీ న్యాయం చేయలేకపోయామని పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బాధపడుతూ చెప్పారు. కొందరి (బొత్స , వైయస్సార్, తదితర) కుటుంబాలకు 'ఎక్కువ న్యాయం' ఎలా జరిగిందని ఎవ్వరూ అడగరే?
***
మొత్తానికి లోక్ సత్తా 'బిసి యునైటెడ్ ప్రంట్'తో సీట్ల సర్దుబాటు చేసేసుకుంది. అలానే, 'ముస్లీం యునైటెడ్ ఫ్రంట్'తో కూడా సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయని జయప్రకాష్ ప్రకటించారు. మునుపు నేను చెప్పింది నిజమే అని నిర్ధారణ అయ్యింది. లోక్ సత్తాతో భావసారూప్యం గల పార్టీలు దేశంలో చాలానే ఉన్నాయి. అవన్నీ కాదని జయప్రకాష్ కు ఎందుకు ఓటు వేయాలి? శతకోటి లింగాల్లో కొత్తగా వచ్చిన బోడిలింగానికి ఓటు ఎందుకు వేయాలి?
***
నామినేషన్ డిపాజిట్టు కూడా ప్రజల నుంచే సేకరించాలని జయప్రకాష్ పిలుపునిచ్చారు. తక్కిన పార్టీలు, వారి అభ్యర్ధులే నయం. ఎన్నికయ్యాక దోపిడీ మొదలేస్తారు. లోక్ సత్తా ఎన్నికల ముందే మొదలేయమంటుంది! డిపాజిట్లు గల్లంతైనా పార్టీకి నష్టం రాకూడదుగా! ఇదీ మరి కొత్త రాజకీయాలంటే.