Wednesday, November 28, 2007

10 - నిద్రపోతూ ...

అరమరికలు లేవనుకున్న
ఆకాశానికే
అడ్డుతెరల్లా
వాన చినుకులు


పర్వతంలా పరుచుకున్న
విషాదపు నిషాలో
అశ్రునిక్షిప్తమైన
ఆకాశం నిండా
అన్నీ అపశబ్దాలే

అర్ధంకాని అలజడి మధ్య
ఆకాశం
నిద్రపోతున్నదంటే
నమ్మలేం!

ఆగుతూ, సాగుతూ
పారుతున్న ప్రవాహంలో
ఎవరి ఆత్మకథో
రాలిపోయిన పూలనవ్వులా
పలకరిస్తుంది।

నిర్ధారణ అవసరంలేని నిజాలు
నిలువెల్లా తడిసిన ఓ మొగ్గకు
నీతిబోధ చేస్తూ
నిండుగా నవ్వే
పూలకో నమస్కారం.

అర్ధం చేసుకోలేకే కానీ,
అర్ధం లేక కాదు.
చదవాల్సిన పాఠాలు
చెట్టుమీది కాకి
చెబుతూనే ఉంటుంది.

కాంతికిరణాలు
కూలబడుతాయి
పూసిన గులాబీల లెఖ్ఖ
పూటపూటకు మారుతుంది।

ముభావంగా ముడుచుకున్న
ఆకులపై
అక్షరాల తడి
దొర్లిపోయే క్షణాల మధ్య

ఇటువైపు నీడలో
నిద్రపోవటం నాకు అలవాటే!

1 comment:

  1. హృదయాన్ని ఆహ్లాదపరిచే కవిత్వం చదివి ఎన్నాళ్లయింది.
    కిరణ్ గారు మీ కవిత్వం చాలాబాగుంది.
    ధన్యవాదములు

    ReplyDelete

మీ అభిప్రాయం :