Monday, January 19, 2009

ముంబై దాడులు-అనిశ్చిత పరిస్థితులు

'రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి' అంటాడు టాల్ స్టాయ్. యుద్ధ వాతావరణాన్ని దాదాపుగా తలపిస్తున్న విరామంలో భారత్ పాక్ ల మధ్య ఉన్నది అశాంత వాతావరణమే. భారత్ సహనానికి పాక్ పరీక్ష పెడుతున్నదో లేక తన అసహాయతను పాక్ కప్పి పుచ్చుకునే ధోరణిలో ఉందో తెలుసుకోలేని వాజమ్మలు మన కేంద్రప్రభుత్వంలో ఉండటం ఆశ్చర్యం.

పాక్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వమనేది సైన్యం, ఐ.ఎస్.ఐ. ఏలుబడిలో ఉన్నదనేది కఠోరసత్యం. పొంతన లేని ప్రకటనలు, అర్ధంలేని వ్యాఖ్యానాలతో పాక్ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని, భారత్ ను పక్కదోవ పట్టిస్తున్నారనుకునే కన్నా, వారు తమ తమ పదవులను, ప్రాణాలను కాపాడుకుంటున్నారనేది గ్రహించాల్సిన విషయం. ఈ నేపధ్యంలో ముంబాయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులను పాకిస్తాన్ భారత్ కు అప్పగిస్తుందని నమ్మటంలో అర్ధం లేదు.

ఈ రకమైన ఒత్తిళ్ళతో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకి చేయగలమనుకోవటం కూడా మూర్ఖత్వమే. అదే నిజమైతే, ఈపాటికే పాకిస్తాన్ పాలకులు నిర్మాణాత్మక వైఖరితో తీవ్రావాదులపై సత్వర చర్యలు తీసుకుని ఉండేవారు. తమ పీఠానికి, తమ అవసరాలకు ఎటువంటి అపాయమూ లేనంతవరకూ అమెరికా ఏమీ చేయదనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

భారత ప్రజల సహనాన్ని, పాక్ పాలకుల కన్నా భారత పాలకులే పరీక్షిస్తున్నారు. తీవ్రవాదులు తెగబడి దాడులు చేస్తున్న ప్రతిసారి పాకిస్తాన్ ను వేలెత్తి చూపటం తప్పించి మరేరకమైన చర్యలు చేపడుతున్నట్లు కనిపించదు. నాలుగున్నరేళ్ళ అసమర్ధ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుంటూ 'జాతీయ దర్యాప్తు సంఘాన్ని' ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదించింది. జాతీయ దర్యాప్తు సంఘం మున్ముందు పోషించవలసిన పాత్రను దృష్టిలో ఉంచుకుంటే ఈ సంఘం రూపురేఖలను తీర్చిదిద్దడానికి కనీసం మూడు సంవత్సరాల సర్వీసు మిగిలిన సమర్థుణ్ణి నియమించాల్సింది పోయి కంటి తుడుపుగా మరో సంవత్సరంలో రిటైరవబోతున్న వ్యక్తిని ముఖ్యాధికారిగా ప్రకటించడం ఒక వింత.

ముంబాయి దాడిలో పాకిస్తాన్ తీవ్రవాదుల పాత్రపై భారత్ అందించిన సాక్ష్యాలను కేవలం సమాచరంగా మాత్రమే పాకిస్తాన్ ప్రకటించింది. అంటే, రోజు విడిచి రోజు ప్రణబ్ ముఖర్జీ, మన్ మోహన్ లు గొంతు చించుకుంటూ, దేబిరిస్తూ పాకిస్తాన్ కు చేస్తున్న అభర్ధనలు కూడా పాకిస్తాన్ 'ఛీ' కొడుతున్నది. మన ప్రభుత్వం మాత్రం సిగ్గెగ్గులు లేకుండా సాగతీత ధోరణి అవలంబిస్తూ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.

ఉదాహరణకు మన ఇంటి పక్కనే ఒక దుర్మార్గుడు ఉండి, రోజూ వేధిస్తుంటే ఏం చేస్తాం? శక్తి ఉంటే బల ప్రదర్శన చేసి మన జోలికి రాకుండా చేస్తాం. లేదంటే, పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అంతేగానీ, వాడితో క్రికెట్ ఆడి, వాడితో సినిమాలు చూసి, వాడితో వ్యాపారం చేసి మనని మనం మభ్య పెట్టుకుంటామా?

పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం. అడుగడుగునా భారత్ అభివృద్ధికి అడ్డుపడుతున్న దేశం. అందునా మన పక్క దేశం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏమాత్రమూ లేని ఆ దేశంతో అసలు ఏ సంబంధమైనా ఎందుకు? అసలు పాకిస్తాన్ తో ఉండే రాజకీయ, వాణిజ్య, క్రీడా, కళా, సాంస్కృతిక సంబంధాలవల్ల ఉపయోగం ఏమిటి? మన దేశ రాజకీయపార్టీల్లోనే, భారతీయ జనతా పార్టీని మతపరమైన పార్టీగా పరిగణించి దాదాపు వెలివేసే 'సెక్యులర్ పార్టీలు' పాకిస్తాన్ లాంటి మతపరమైన తీవ్రవాద దేశంతో సంబంధాలు కొనసాగించటానికే ప్రాముఖ్యాన్నెందుకు ఇస్తాయి?

దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇటువంటి విషమపరిస్థితులకు కారణాలు వెతకటం అనవసరం. ఇప్పుడు భారత ప్రజలు కోరుతున్నది అభద్రతాభావంతో కూడిన జీవనం కాదు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేని ప్రభుత్వాలు ఉండి నిరర్ధకం. కానీ, ఇటువంటి విషమపరిస్థితులను కూడా రాజకీయ మనుగడకు ఉపయోగించుకునే ప్రబుద్ధులు మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు. వీరి నాంచుడు ధోరణికి కారణం ఒక్కటే - రాబోయే సార్వత్రిక ఎన్నికలు.

ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు పాకిస్తాన్ తో అన్ని సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని ప్రకటిస్తారు. చివరికి యుద్ధానికీ సన్నద్ధమనే వాతావరణాన్ని దేశ సరిహద్దులో సృష్టిస్తారు. ప్రజల సెంటిమెంటును ఓట్ల పరంగా మలుచుకునే ప్రతి చర్యనూ అప్పుడు మాత్రమే చేపడుతారు. ఇలాంటి ఏలుబడిలో దేశ భద్రత, దేశప్రజల భద్రత గాలిలో దీపమే.

2 comments:

  1. చాలా సూటిగా చక్కగా విశ్లేషించారు.

    ReplyDelete

మీ అభిప్రాయం :