గతవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెల్చుకున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాపై చాలానే విమర్శలు వెల్లువెత్తాయి. ముంబాయి మురికివాడలు చూపి అవార్డులు గెలుచుకున్న విదేశీ దర్శకుడి తీరును అమితాబ్ బచ్చన్ నుండి చాలామంది ఖండించారు. సీనియర్ బచ్చన్ ఇంకా కొంత ముందుకు వెళ్ళి, దేశంలోని చీకటికోణాలను ఆవిష్కరించి పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవటం సత్యజిత్ రే తోనే మొదలయ్యిందని కూడా తన బ్లాగులో విమర్శించారు.
మన భారతీయులను మించిన 'హిపోక్రాట్స్' ఇంకెక్కడా ఉండరేమో! ప్రతి దేశాన్నే కాదు, ప్రతి విషయాన్ని అందరూ ఒకే కోణంలో చూడాలని లేదుగా? విభిన్న కోణాల్లో చూసి ఆవిష్కరింపబడిన ఆ చిత్రంపై అంత ఉలుకుపాటెందుకో మన అభినేతలకు, ఇతర ప్రజలకు.
ముంబాయ్ అంటే అమితాబ్ కు మలబార్ హిల్స్ గుర్తుకురావచ్చేమో కానీ, మురికివాడలు చాలామందికి గుర్తుకువస్తాయి. ఆ మాటకొస్తే, ముంబాయే ఓ పెద్ద మురికివాడ! గట్టిగా చెబితే, జాతీయవాదులు, దేశభక్తులు క్షమించరేమో కానీ, మన దేశమే పేద్ద మురికివాడ. ఇంట్లో ఈగల మోత వింటూ, బయట పల్లకి మోతలే వినాలి, వినిపించాలంటే ఎలా? మన దేశంలో ఒక్కటంటే ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రదేశంగా గొప్పగా చెప్పుకోగల పరిస్థితులున్నాయా?
కరెంటు ఉండదు. నీళ్ళు రావు. రోడ్ల మీద నడవలేము, వాహనాలు నడపలేము. మునిసిపాలిటి వారు పందుల్నో, కుక్కల్నో తమ వాహనాల్లో రవాణా చేసినట్లు, లోకల్ ట్రైన్లలో జనాలు కూరబడతారు. బస్సుల్లోనూ అదే పరిస్థితి. ఇళ్ళకు ఎలా చేరతామో తెలీదు. అసలు చేరతామో లేదో కూడా చెప్పలేం.
ఇది నూటికి దాదాపు తొంభై శాతం మంది ప్రజల పరిస్థితి. మిగతా పది శాతం ప్రజలకే 'స్లమ్ డాగ్ మిలియనీర్' వంటి చిత్రాలతో సమస్య! పన్నులు కట్టగానే, పనైపోయిందని దులపరించుకునే పెద్దలు వీళ్ళు. రైతులమని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్పి, వాటిని నిరూపించటానికి నానాగడ్డీ కరచి వందల ఎకరాలు నొక్కాలని చూసే అమితాబ్ బచ్చన్ లకి, అమీర్ ఖాన్ లకి ఇటువంటి సినిమాలంటే మంటే!
మురికివాడల ప్రస్తావన కాసేపు పక్కనబెట్టి, మిగతా విషయాలు, ముఖ్యంగా బాలల విషయం ఆలోచిద్దాం. గత నాలుగైదేళ్ళుగా దాదాపు ప్రతి పన్ను మీదా విద్యాశిస్తు వసూలు చేస్తున్నది ప్రభుత్వం. ఈ నాలుగైదేళ్ళలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు మన ప్రభుత్వం నిర్మించిందో పాఠకులు మీ మీ నివాసగృహాల పరిధిలో మీరే గమనించి చూడండి.
ప్రాధమిక విద్య బాలల ప్రాథమిక హక్కు. ఎంతమంది బాలలకు ఈ ప్రాథమిక హక్కు అందుబాటులో ఉంది? ఇప్పటికీ బాలకార్మిక వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేకపోతున్నది ప్రభుత్వం! చట్టాలు లేకనా? ఉన్న చట్టాలు ఉపయోగించలేకనా? ఒక మధ్యాహ్న భోజన పథకమో, ఉచిత పుస్తకాల పంపిణీయో చేసి దులపరించుకుంటే సరిపోతుందా? బాలబాలికల వసతిగృహాల నిర్వహణలో ఎంతగా అవినితి విస్తరించి ఉన్నదో అందరికీ తెల్సిందే. భావి భారత పౌరులంటూ సోనియా నుంచి చిరంజీవి దాకా ఎన్నికల ముందు వచ్చి ముద్దుచేస్తే సరిపోయిందా?
మాథ్యూ హేడెన్ ఏదో వాగాడని, అల్లల్లాడిపోతాం. అదే మాథ్యూ హేడెన్ ఫలనా డింకా ప్రకటనలో కనిపిస్తే, వెనుకాముందులు ఆలోచించకుండా ఆ డింకాను కొనేస్తాం. తాజ్ మహల్ ప్రపంచంలోకెల్లా అద్భుత కట్టడంగా ఎన్నికయ్యేలా ఇంటర్నెట్టు మీద ఓటింగ్ దండయాత్రలు చేస్తాం. అది కాకపోతే కూలబడిపోతాం. పక్కవాడు ప్రశంసిస్తే పొంగిపోతాం, విమర్శిస్తే విలవిల్లాడిపోతాం. నిజాన్ని నిర్భయంగా ఎదుర్కునే ధైర్యం క్రమక్రమేణా తగ్గిపోతున్నది. ఆదేశసూత్రాల్లో చెప్పిన విమర్శనాత్మక విచక్షణా జ్ణానం తగ్గిపోతున్నది.
రంగుటద్దాలు వేసుకొని 'దేశం వెలిగిపోతున్నదని' సంబరపడిపోతాం. అలా వెలిగిపోతున్నది 10 శాతం దేశమే అని గ్రహించం. మన ప్రధానిని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని 'విరార్' నుంచి 'విక్టోరియా టర్మినస్' మీదుగా 'కర్జట్' వరకూ ఒక్కరోజు లోకల్ ట్రైనులో ప్రయాణించేట్లుగా చేయాలని అనిపిస్తుంది. పట్టాల వెంబడి గుడిసెల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో వీళ్ళకు తెలుస్తుంది. ట్రాకుల పక్కనే మరుగుదొడ్లు మొదలుకొని, క్రికెట్ ఆడేవరకూ అభంశుభం తెలియని పసిపిల్లలు ఎలాంటి అపాయకర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారో వీళ్ళకు తెలుస్తుంది. రైలు వచ్చే సమయానికి, సిగ్గుతో బిక్కచచ్చిపోయి లేచి నుంచునే దౌర్భాగ్యం మన ఆడపడుచులకు ఎలా కలిగిందో ఏలికలు ఎరుకకు వస్తుంది.
చాలా బాగా చెప్పారు.
ReplyDeleteఒక సారి మన పాసింజర్ రైళ్ల పరిస్థితి చూడాలి.
అసలు పాసింజర్ ట్రైన్లలో వెళ్లే వాళ్ళని మనుషులని అనుకుంటారో అనుకోరో. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఆపి పడెయ్యడం. సరిపడినన్ని బోగీలు లేకపోవడం. అబ్బో ఒకటి కాదు లెండి.
కావాలంటే ఒక సారి కాకినాడ తిరుపతి పాసింజర్ లో మన లాలూ గారిని మామూలు సెకండ్ క్లాస్ లో పంపించాలి అప్పుడు తెలుస్తుంది.
చాలా బాగా చెప్పారు..!
ReplyDeleteplease remove 'word verification' option.
బాగుంది టపా. దేశం వెలిగిపోతుందని మోత మోగించే 'అల్విద నా కెహనా' సినిమాలే బచ్చన్లకి నచ్చుతాయి. ఎన్నారైల కోసమంటూ అలాంటి సినిమాలు తీసి వదలటానికి లెక్కలేనందరు జోహార్లూ, వాటిలో నటించటానికి ఖాన్లూ, కపూర్లూ ఉన్నారు కదా. ఒక్కగానొక్క సినిమాలో కాస్త ఉన్నదున్నట్లు చూపిస్తే వాళ్లకి మంటెందుకో?
ReplyDeleteకరక్ట్ గా చెప్పారండి.అబ్రకదబ్రా గారి మాటలు కూడా నిజమే.
ReplyDeleteస్లమ్ము డాగ్గు స్లమ్ముడాగ్గు లానేఉండి పోయింది తీసినోళ్ళే మిలీనీర్లు అయిపోయారు
ReplyDeleteగిచ్చిన బిడ్డని కూడలిలో తిప్పి బిచ్చమడుక్కున్నట్లుంది.
చచ్చినోడి శవాన్ని టిక్కెట్టెట్టి జనాలకి చూపినట్టుంది
రెహమానుకి (వాళ్ళకి అతని పేరు చెప్పటానికేరాలేదు) అవార్డు రావటం మనం చంకలు కొట్టుకోవటం శవానికేసిన పూలనేరి జడలోకి తురిమినట్టుంది
స్లమ్ము లేను దేశమేది ? దేశమంతా స్లమ్ములా చూపారీ సినిమాలో. ఇలా దేశంలోని దరిద్రాన్ని పైసలు చేసుకున్న మహానుభావులు
చాలా మంది ఉన్నారు మన చరిత్రలో. వారికి మనమే వీరతాళ్ళు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
inshort: its a commercial movie. they exploited poverty in india. i am not arguing that it not there. but it was exploited for their advantage.
నాది ఆత్రేయ గారి మాటే.
ReplyDeleteదేశమంతా స్లమ్ములా చూపారీ సినిమాలో...Not TRUE. But they have shown the life in actual slums..
ReplyDeleteఓ సదుద్దేశ్యంతో, సామాజిక స్పౄహతో ఈ చిత్రం తీసివుంటే, మీరన్నది నిజమే. అలాకాకుండా శనిదేవుని ఫోటో చూపి బస్టాండుల్లో ముష్టెత్తేవాళ్ళలా , ఈ మురికి కుక్కలను వాడుకుని వుంటే , పిచ్చ పిచ్చగా కరవాల్సిందే, అంటాను. రహమానుడి బాదుడు విన్నాను, నేనుసైతం 'జై హో ' అని ఫోరంలలో అన్నాను (ఇది సంగీతమా! ఎది పాటా! అని అరచి గీ పెడుతున్న అంతరాత్మ పీక నొక్కి మరీ జై కొట్టాను లేండి, 'ఆహా ఓహో' అంటూ )
ReplyDeleteఏదైనా మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే శైలి నచ్చాను.
శంకర్